యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాసం పైన వ్రాసిన పుస్తకం పేరులాగున్నా ఈ వ్యాసంలో అలాంటివి ఏమీ ఉండవని ముందుగానే చెప్తున్నాను.
"ఎవరైనా కలిసుండటం ఎలాగ అని వ్రాస్తారు కానీ ఇలాగ విడిపోవడం ఎలాగ అని వ్రాస్తారా?" అని అడిగే చదువర్లకు వివరణ, ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం రెండూ ఒకటే.
మనిషి ఒక విచిత్రమైన జంతువు.
తను ఒక్కడూ ఉండలేడు, అలాగని మఱి కొందరితో ఉంటే వాళ్ళందరికంటే పై చేయి తనదవ్వాలని, తనకొక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. (ఈ గోలంతా మనం
ఇదివరకే ఒక సారి చెప్పుకున్నామనుకోండి. దానికి ఇది కొనసాగింపు వ్యాసం అనుకోవచ్చునేమో.) ఈ ప్రత్యేకతని సంపాదించుకోవడానికి మొదట తన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పరుచుకుని, ఆ బలగానికి తను నాయకుడై, ఆ బలగం బలం పెంచి మిగతావారిని ఓడిస్తాడు. ఓడిపోయినవారిలో గొప్ప ఎవరో పట్టించుకోరు, గెలిచినవాళ్ళలో నాయకుడి పేరే అందరికీ తెలుస్తుంది. ఫలితంగా అతడికి ప్రత్యేకత కలుగుతుంది.
భాషలో సవర్ణదీర్ఘసంధి సూత్రం, గణితంలో పైతాగరస్ సూత్రం, భౌతికశాస్త్రంలో న్యూటన్ సూత్రం లాగా మనిషి అనే జంతువు ఆడే, సాంఘిక క్రీడలో ఇది ఒక సూత్రం/ఎత్తు. దీన్నే ముద్దుగా కూడలి-విడుగడ సూత్రం అని పిలుచుకుందాం. చదువర్లెవరైనా ఇంకా మంచి పేరును సూచిస్తే చాలా సంతోషిస్తాను.
ఇదే సూత్రాన్ని తరతరాలుగా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు. సరే ఒకప్పుడు ఛాందసం, మూర్ఖత్వం, సమాచారమాధ్యమాల లేమి కారణం అనుకుందాము
. గొప్ప సూత్రం లక్షణం ఏమిటి అంటే అది కాలంతో పాటు మారిపోదు. సర్వకాల సర్వావస్థలలోనూ పని చేస్తుంది. కూడలి-విడుగడ సూత్రం కూడా ఒక గొప్ప సూత్రం. ప్రస్తుతకాలంలో కూడా ఈ సూత్రం వాడకంలో ఉందనడానికి సాక్ష్యాలను చెప్పడానికే ఈ వ్యాసం.
చైనీయులకు, మనకు చాలా సహస్రాబ్దాల నుండి వాణిజ్యసంబంధాలు ఉన్నాయి. చైనీయులకు చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నాయి. వాళ్ళ భాష, దేశం మొదలైన విషయాలపై వాళ్ళకు చాలా గౌరవం ఉంది. ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి. అది కాదు ఇక్కడ విషయం. 1940లలో ఒక చైనీయ శాస్త్రవేత్త ఒక గుహలో కొన్ని అస్తి పంజరాలను చూశాడు. అవి మానవరూపంలో ఉన్నప్పటికీ మానవులకు (Homo Sapiens) చెందినవి కావు. వారి (మన) పూర్వీకులైన Homo Erectus Pekinensis వి అని తెలుసుకున్నాడు. అంటే కోతిజాతిలో మన కంటే పూర్వం ఉన్న జంతువులవి అన్నమాట. వాటి ముఖాలు గుండ్రంగా, ముక్కు చప్పిడిగా ఉండటం గమనించి ఓహో, ఐతే మనందరం (చైనీయులు) వీరి సంతతి అన్నమాట అని "ఊహించాడు". అంతే రాజకీయనాయకులు వచ్చేశారు. దాన్ని దండోరా వేయించారు.
అది పెద్ద రాజకీయవిషయమైంది, చైనీయజాతి గౌరవానికి సంబంధించిన విషయమైంది.
చూసారా? మొదట
"మేము వేఱు" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి
వాళ్ళను కూడజేసారు. వారిని మిగతా జనాలనుండి విడదీశారు. చిటికెడంత ఆధారం దొరకగానే
"మేము మామూలు మనుషులం
కాఁవు, మేము మీ అందరికంటే ముందు పుట్టిన జాతినుండి వచ్చాము" అనే భ్రమలోకి ప్రజలను తోసి దాదాపు 50 ఏళ్ళు చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల ద్వారా అదే మప్పారు. అంతే! నాయకులకు గొప్ప ఆదరణ లభించింది. చివరికి 1999లో జన్యుపరిశోధన ద్వారా ఎంతో దృఢంగా, అసలు చైనీయులకీ Homo Erectus కి ఏమీ పెద్ద సంబంధం లేదు,
చైనీయులు కూడా అందరు మనుషులలాంటి వారే అని ఒక చైనీయ శాస్త్రవేత్తే తేల్చి చెప్పాడు. అతను చిన్నప్పటినుండి చదువుకున్న విషయం తప్పని తెలిసి ఎంతో బాధపడ్డానని స్వయంగా అతనే BBC కి ఇచ్చిన interview లో చెప్పాడు. అప్పటిదాకా "మేము వేఱు" అనే అబద్ధం పునాది గా నిర్మించుకున్న రాజకీయభవంతులన్నీ ఒక్క సారిగా చలించడం మొదలెట్టాయి.
సరే పొరుగు దేశంతో మొదలెట్టాము. ఇప్పుడు పొరుగు రాష్ట్రం.
తమిళనాడులో చాలా రోజులు ద్రవిడులు వేఱు, ఆర్యులు వేఱు -- ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది. దీనికి పాక్షికంగా కారణం ఆంగ్లేయులు. దక్షిణ, ఉత్తర భారతదేశ భాషలలో భేదాలను; పాశ్చాత్య, సంస్కృతభాషలలో సామ్యాన్ని వివరించడానికి వారికి ఈ ఆర్య-ద్రవిడ జాతిభేదం ఒకటే తోచింది. కానీ, అది కేవలం ఊహ. ఆ ఊహ EVR, కరుణానిధి మొదలైన వారికి ఉపయోగపడింది.
తమిళం భాషలన్నిటిలోకీ పురాతనమైనదని, సంస్కృతం ఈ మధ్యనే పుట్టిందని చాటింపేశారు. కాకపోతే వారికి ఎదురైన రెండు ప్రశ్నలు --
ఒకవేళ ఆర్యులు ద్రవిడులపై దండుకొస్తే అంత పెద్ద విషయం ఆ రెండు భాషలో చారిత్రాత్మక గ్రంథాలలోనూ ఎందుకు ప్రస్తావించలేదు అని. అప్పుడు మళ్ళీ సంస్కృతగ్రంథాలతో పని పడింది. వాటికి వక్రీకరించిన భాష్యాలతో వచ్చారు. రామాయణం కథ అంతా దక్షిణాది వాళ్ళను కోతులుగా, రాక్షసులుగా చూపించి కించపరచడానికి, ఉత్తరాది రాజు ఐన రాముడి ఆధిక్యతను చూపడానికి అని చెప్పారు. అలాగే అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి రావడం వేదాలలో ఉంది కాబట్టి అది కూడా ఉత్తరాది నుండి ఆర్యులు దక్షిణాదికి రావడాన్ని సూచిస్తోందని చెప్పారు.
ఇప్పుడే ఒక చిన్న మెలిక పడింది.
అగస్త్యుడు తమిళ వైయాకరణుడని అప్పటిదాకా చెప్పుకున్నవారు అగస్త్యుడు ఆర్యుడని, ఉత్తరం నుండి వచ్చాడని చెప్తే అప్పుడు సంస్కృతమే తమిళంగా కంటే పురాతనమైనది అవ్వాలి కదా? అబ్బే, తర్కం నిజాలపైన ఆధారపడాలి కుతర్కానికి నిజంతో పనేమిటి? పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ బ్రాహ్మలని (వీళ్ళే ఆర్యులట!) తిట్టి, వారిపైన సంఘంలోనే దురభిమానం కల్పించారు. అదిగో మళ్ళీ ద్రవిడులమంటూ కూడిక, ఆర్యులు వేఱంటూ విడతీయడం. ఉన్నట్టుండి EVR మహానేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ మున్నేట్ర కళగం పేరిట (DMK) అవే భాష్యాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఇక్కడ మఱి కొన్ని మెలికలు. "ద్రవిడ" అనే పదమే సంస్కృతపదం. భాగవతంలో ఆ పదం కనీసం మూడు సార్లు ఉంది.
దాని అర్థం "దక్షిణాది దేశం" అని -- అది వేఱే జాతి అని కాదు. (వైదీక గ్రంథాలలో ఎక్కడా ద్రవిడ దేశంలో వేఱే జాతి వారు ఉన్నారు అని లేదు.) ఆ పదాన్ని ఆది శంకరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. "నువ్వెవరు" అని ఉత్తరాదిలో ఎవరో అడిగితే,
"ద్రవిడశిశువును" అని చెప్పారట. సరే తీగె లాగితే డొంక కదులుతోంది. అసలు విషయానికి వస్తే
2009లో ఒక బృహత్పరిశోధనా ఫలితంగా తేలింది ఏమిటంటే ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు అని. జన్యుపరంగా భారతదేశంలో రెండు జాతులు 40,000 సంవత్సరాల క్రితం (అంటే Homo Floresiensis వంటి మానవసంబంధజాతులు ఇంకా బ్రతికి ఉండగానే, శాస్త్రీయ అంచనాల ప్రకారం అప్పటికి మానవుడు ఇంకా మట్టికుండలు కూడా తయారు చేసి ఉండడు!) ఉన్నాయి కానీ ఈ మధ్యన ఏమీ లేవు అనే నిర్ధారణకు వచ్చారు.
మొత్తం రెండు జాతుల భూటకం అంతా కూలిపోయే సమయం ఆసన్నమైంది.
సరే పొరుగు దేశం, పొరుగు రాష్ట్రం అయ్యాయి. ఇప్పుడు వేఱుబడదాం అనుకునే మన రాష్ట్రం వారి గురించి మాట్లాడుకుందాం. చైనీయులు "మేము మనుషులమే కాఁవు" అన్నారు, తమిళులు "మీరు మా జాతి మనుషులు కారు", అన్నారు. అదేదో చిత్రంలో చెప్పినట్టు, "కొట్టుకోవడానికి కారణం ఎందుకు? నిర్ణయించుకున్నాక కొట్టేసుకోవడమే" అన్నట్టు, ఆఖరికి భాష పేరు చెప్పి కొట్టేసుకుందాం అని తెలంగాణలో కొంతమంది సిద్ధమౌతున్నారు. అయ్యా, తెలంగాణాకు అన్యాయం జరిగి ఉండవచ్చును, తెలంగాణను ఆంధ్రనాయకులు దోచుకునీ ఉండవచ్చును, తెలంగాణ వేఱ్పాటు ప్రస్తుతం అత్యవసరం కూడా కావచ్చును -- నాకివేవీ తెలియవు. కానీ, తెలంగాణ అనేది వేఱే భాష అనడం, తెలుగు కవుల విగ్రహాలు పడగొట్టడం, హన్నన్న! ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకోని ఆలోచించండి. రాజకీయాలకు భాషకు ముడి ఏముంది? శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, తూర్పు గోదావరి యాస -- వీటన్నిటినీ మనం చూస్తూనే ఉంటాము, చలనచిత్రాలలో హాస్యానికి వాడుకుంటూనే ఉంటారు. ఉన్నట్టుండి భాష వేఱనడం కొంచెం విడ్డూరంగా లేదు? మళ్ళీ చెప్తున్నాను -- నాకు తెలంగాణా వేఱ్పడాలా వద్దా అన్నది తెలియదు. కానీ, భాష వేఱు అనడం మాత్రం నాకే కాదు, పరరాష్ట్రీయులైన నా మిత్రులకు కూడా విచిత్రంగా తోచింది.
కూడలి-విడుగడ సూత్రానికి ఎంత చిన్న కీలు సరిపోతుందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.
ప్రఖ్యాత విదూషకుడు George Carlin,
"గర్వం అనేది నాకు కేవలం నా వ్యక్తిగత పురోగతి, సమర్థత, కార్యసిద్ధి వలనే కలుగుతుంది. నా పుట్టుక చేత పొందేది ఏదైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, గర్వాన్ని కాదు" అని అన్నాడు. అమెరికాలాంటి సంపన్నమైన దేశంలో అతడు, "I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America.", అని చెప్పాడు. అదే మనమూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను, తమిళనాడులో పెరిగినందుకు గర్విస్తున్నాను, మొదలైనవి కూడా పరుల కార్యసిద్ధిని దోచుకోవడంతోనే సమానం. మాట వరసకు అనవచ్చునేమో కానీ, అదే పట్టుకుని వేళ్ళాడితే బావిలో కప్పలలాగా ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గర్వపడాలి అనుకుంటే ఆ భారతదేశచరిత్రకి, సంస్కృతికి నీవు ఏమైనా గొప్ప విషయాన్ని చేర్చి అప్పుడు గర్వపడాలి కానీ,
ఊరికెనే మా తాతలు వేదాలు చదివారు -- మాకు వేదాలెన్నో కూడా తెలియవు -- అయినా మేము గొప్ప అనుకోవడం కేవలం మూర్ఖత్వం అని నా అభిప్రాయం.
PS:
1. చదువర్లు నా తెలుగు పదాల వాడుకలో ఏమైనా తప్పులుంటే తప్పక సవరించగలరని మనవి. ముఖ్యంగా
"ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది.
2. తెలంగాణ గురించి మాట్లాడితే కోపించి వ్యాఖ్యాస్థలిని రణరంగంగా మార్చేసే కొందరు ఔత్సాహికులు ఉన్నారు అని తెలుసును. సరైన పదాలు, సరైన ఉద్దేశం లేని వ్యాఖ్యలు తొలగించబడతాయి.