Saturday, August 20, 2011

వ్యాజస్తుత్యలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజస్తుతి అలంకారం




లక్షణం: ఉక్తిర్వ్యాజస్తుతిర్నిందా స్తుతిభ్యాం స్తుతి నిందయోః
వివరణ: పైకి నిందిస్తున్నట్టు అనిపిస్తున్నా తరచి చూస్తే పొగుడుతున్నట్టు అనిపించడాన్ని వ్యాజస్తుతి అంటారు. అలాగే పైకి పొగుడుతున్నట్టు ఉన్నా, భావంలో నింద ఉంటే అది కూడా వ్యాజస్తితే అవుతుంది. వ్యాజము అంటే నెపము (excuse), స్తుతి అంటే పొగడ్త. వ్యాజనింద అనే అలంకారానికి వ్యాజస్తుతికి మధ్య భేదం వ్యాజనింద టపలో చర్చించుకుందాము.


ఉదా:-(గ్రంథం: చంద్రాలోకం, కవి: ఆడిదము సూరకవి)
తే:- గంగ! నీకు వివేకమెక్కడిది? స్వర్గ మందఁజేసెదు పాపాత్ములైన జనుల
భా:- ఓ గంగా, నీకు తెలివి ఉందా? ఎన్నో తప్పులు చేసినవారిని కూడా (నీలో స్నానం చేస్తే) స్వర్గానికి పంపుతున్నావు.
వి:- కవి, గంగ పాపాత్ములను స్వర్గంలోనికి తీసుకువెళ్తోంది అంటుండడం నిందగా గోచరిస్తోంది. కాకపోతే, ఎన్ని పాపాలు చేసినవారైనా నీలో ఒక్క మునక వేస్తే స్వర్గానికి పంపే ఉదారత, దైవత్వం నీలో ఉన్నాయి అనే భావం కూడా నిక్షిప్తమై ఉంది. కనుక ఇది వ్యాజస్తుతి.

ఉదా:-(చాటువు, కవి: శ్రీనాథుడు)
కం:- సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగఁ విడుము పార్వతి చాలున్
సం:- ఇది బహుశా చదువర్లందరికీ తెలిసిన పద్యమే. శ్రీనాథుడికి ఒక ఊరిలో నీరు కనబడకుంటే పరమేశ్వరుని విగ్రహాన్ని చూసి వ్యంగ్యంగా గంగను (నీటిని)) ప్రసాదించమని అడిగాడు.
భా:- డబ్బున్నవాడికి పదహారు వేల మందిని పెళ్ళాడినా ఫరవాలేదు, నువ్వు భిక్షువువి (దానం అడిగి తినేవాడు). నీకు ఇద్దరు పెళ్ళాలు ఎందుకయ్యా? పార్వతి సరిపోతుంది, గంగను ఇటు విడిచిపెట్టు.
వి:- పైపైన శివుడిని భిక్షువు అనడం, నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని ప్రశ్నించడం -- రెండూ నిందలుగా కనిపిస్తున్నా, శివుడు సన్న్యాసి, నిష్కామి, గంగను శిరస్సుపై మోసి నేలకు పంపిస్తున్నవాడు అనే ధ్వని ఉండటం చేత ఇది వ్యాజస్తుతి అవుతోంది.



ఉదా:- (చిత్రం: సిరివెన్నెల, రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చేవాడినేమి అడిగేది?
భా:- ఆదిభిక్షువువి (అంటే మొదటి బిచ్చగాడు - తనకంటూ ఏదీ ఉంచుకోకుండా ఉండేవాడు), బూడిదిచ్చేవాడివి (వైరాగ్యానికి, మోక్షానికి చిహ్నంగా బూడిద ఇస్తాడు) - నిన్నేమి కోరుకోనయ్యా?
వి:- ఈ పాట మొత్తం, ప్రతి వాక్యంలోనూ, శివుడిని ఉద్దేశించి, కవి నిందిస్తున్నట్టుగా పొగుడుతాడు. సమస్తాన్ని సృష్టించినది శివుడని, కామాన్ని (మన్మథుడిని) దహించినవాడు శివుడని, తనను ఆశ్రయిస్తే యాచించినవాడి పూర్వోత్తరాలను చూడకుండా వరాలని ఇచ్చే భోళాశంకరుడని పొగుడుతున్నాడు కవి. కాకపోతే పాట వింటే నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.



ఉదా:- (చిత్రం: శుభోదయం, రచన: వేటూరి)
రాయైతేనేమిరా దేవుడు? హాయిగా ఉంటాడు జీవుడు.
ఉన్న చోటే గోపురం, ఉసురు లేని కాపురం, అన్నీ ఉన్న మహానుభావుడు
భా:- దేవుడు రాయైతేనేమిటి? ఆయనకు ఏ సమస్యా లేదు. ఎక్కడ ఉంటే అక్కడే గోపురం ఉంటుంది. సుఖంగా ఉంటాడు. 
వి: ఒక పక్కన దేవుడిని రాయంటూ, మఱో ప్రక్కన ఆయన వైభోగాన్ని పొగుడుతూ ఉండటం వలన ఇది వ్యాజస్తుతి అనుకోవచ్చును అని నా అభిప్రాయం.



ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
తే:-
మంచిదానవు, దూతిక! మంచిదాన
వింతకంటెను గర్తవ్యమేమి కలదు?
అతని శిఖ, నఖ, దంత లూనాంగి వైతి
వెందువలన మదర్థము నందు నహహ!
సం:- ఒక అమ్మాయి నాయకుడిపై తనకున్న ప్రేమను తెలుపమని ఒక దూతిక (messenger) ని పంపింది. నాయకుడు దూతికనే ప్రేయసి అనుకుని ఆమెతో సరసమాడాడట. దూతిక చక్కగా అతనితో ఆడుకుని వెనక్కి వచ్చిందట. అప్పుడు నాయిక చెప్తున్న మాటలు.
భా:- ఎంత మంచిదానవే దూతికా! నా కోసం నువ్వు ఇన్ని (పంటి, గోటి) గాట్లు వేయించుకుని వచ్చావా? నీకు ఎంత కర్తవ్యదీక్ష? (లూనము -- కొయ్యబడినది)
వి:- నిజానికి తన ప్రియుడితో క్రీడించిన దూతిక పైన ఒళ్ళు మండినా నాయిక డొంకతిరుగుడుగా/పొగుడుతున్నట్టుగా నిందించడం వలన ఇది వ్యాజస్తుతి అలంకారం అయ్యింది.

7 comments:

Phanindra said...

Thanks for the post. Good writeup

కొత్త పాళీ said...

శ్రీకాకుళాంధ్రదేవ శతకం మొత్తమూ ఇదే పద్ధతి.
ఇంకా రామదాసు కీర్తనలు కొన్ని.

కృష్ణప్రియ said...

బాగుంది. కొత్త విషయం తెలుసుకున్నాను.

www.apuroopam.blogspot.com said...

వ్యాజస్తుతిలో ఎవరినుద్దేశించి చెబుతున్నారో వారిపై గౌరవం ఉండాలి.లేకపోతే అది స్తుతి కాదు కదా? మీ ఆఖరి ఉదాహరణని వ్యాజస్తుతి అనడం సమంజసం కాబోదు.వ్యంగ్యం అనిపించుకుంటుంది.స్పష్టంగా చెప్పాలంటే దెప్పిపొడుపు అనిపించుకుంటుంది.Am I right

Sandeep P said...

@గోపాల కృష్ణ గారు

మీరన్నదే ఒకప్పటి నా అభిప్రాయం కూడాను. కాకపోతే ఆడిదము సూరకవి వ్రాసిన చంద్రాలోకంలో ఈ విధంగా చెప్పారు. ఆయన చెప్తే నిజమే అయి ఉండాలని నా నమ్మకం.

కామేశ్వరరావు said...

నాకూ చాలారోజులు యిదే తికమక ఉండేది. వ్యాజస్తుతి అంటే తెగుడుతూ పొగడడమనీ, వ్యాజనింద అంటే పొగుడుతూ తెగడటమనీ అనుకొనే వాడిని. తర్వాత తెలిసింది ఆ రెండూ కూడా వ్యాజస్తుతే అని! సూరకవే కాదు సంస్కృత మూలంలో కూడా జయదేవుడు ఇదే చెప్పాడు కదా - "ఉక్తిర్వ్యాజస్తుతి ర్నిందాస్తుతిభ్యాం స్తుతినిందయోః" అని. నిందాస్తుతి, స్తుతినిందా రెండూ వ్యాజస్తుతి అలంకారమే.

kota said...

ilanti blogula kosam enno rojuluga eduru chustunna.