Monday, August 22, 2011

వ్యాజనింద అలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజనిందాలంకారం 



లక్షణం: నిందయా నిందయా వ్యక్తిః వ్యాజనిందా ఇతి గీయతే
వివరణ: నింద వలన వేఱొక నింద స్ఫురించినట్టైతే అది వ్యాజనింద అవుతుంది.వ్యాజస్తుతికీ వ్యాజనిందా ఉన్న ప్రథమమైన భేదం - వ్యాజస్తుతిలో నిందా, స్తుతి - రెండింటిలో ఒకటి ప్రత్యక్షంగా, మఱొకటి పరోక్షంగా ఉంటాయి. ఐతే వ్యాజనిందలో ప్రత్యక్షంగా ఒక నింద ఉంటే పరోక్షంగా మఱొక నింద ఉంటుంది.


ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
ఏమి అనవలె విధిని మున్నేకశిరము నలియఁజేసిన హరునెన్నవలయుఁ గాక
సం:- ఒకాయనకు బ్రహ్మ మీద కోపం కలిగింది. ఆయనను నిందించడానికి బలమైన మాటలు వాడఁదలచి ఈ మాటలన్నాడు. శివపురాణంలో బ్రహ్మకు ఉన్న ఐదో శిరస్సును శివుడు ఖండించినట్టుగా చెప్పబడింది. అందుచేత దాని ఆధారంగా బ్రహ్మను నిందిస్తున్నాడు.
భా:- ఐనా విధిని ఏమీ అనడానికి లేదు. అసలు (నీది) ఒకటే తలను ఖండించి వదిలిన శివుడిని అనాలి. (మిగతా నాలుగు తలలు కూడా నరికి ఉండవలెను, అంటే అంత ఘోరమైన పని చేశావు, అని భావం).
వి:- ఇక్కడ వాక్యం చూస్తే శివుడిని నిందిస్తున్నట్టుగా ఉంది. కానీ, నిజానికి బ్రహ్మని నిందిస్తున్నాడు. శివుడిని నిందిస్తున్నట్టుగా వ్యాజం చూపించి, వేఱొకరిని నిందించినందుకు ఇది వ్యాజనిందాలంకారం అయ్యింది.



ఉదా:- (కీర్తన: నగుమోము కనలేని, రచన: త్యాగరాజు)
ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో
గగనానికి బహుదూరంబనినాడో
సం:- త్యాగరాజు శ్రీమహావిష్ణువుని "నీ ముఖం చూడాలనుకుంటున్న నాకు ఎందుకు కనిపించట్లేదు" అని అడుగుతున్నాడు.
భా:- ఒకవేళ గరుత్మంతుడు (ఖగ రాజు) నీ ఆజ్ఞ విని త్వరగా రావట్లేదా? లేక ఆకాశానికి నేలకీ చాలా దూరం ఉంది, నేను అంత దూరం ఎగరలేను అంటున్నాడా?
వి:- ఇక్కడ త్యాగరాజు గరుత్మంతుడి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నట్టుగా ఉన్నా, విష్ణువు ఆజ్ఞ గరుత్మంతుడు కాదనడు అని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత పైకి విష్ణువుని సమర్థిస్తున్నా, కావాలని బలం లేని వాదన చూపించడం ద్వారా నువ్వు రాకపోవడానికి ఇంతకు మించి మంచి కారణం ఏమీ తెలియట్లేదు అంటున్నాడు. అంటే విష్ణువుకే మనసు లేక రావట్లేదు. ఆయనకు తన భక్తుడి మీద జాలి లేదు అని నిందిస్తున్నాడు.


నిజానికి ఇది వ్యాజనింద కాదు అని కూడా వాదించవచ్చును. ఎందుకంటే ఖగరాజుని సూటిగా నిందించట్లేదు, అలాగే విష్ణువుని నిందిస్తున్నాడు అనడానికి కూడా ఎంతో ఆలోచిస్తే తప్పితే ఆధారం లేదు. కాకపోతే నాకు ఇది వ్యాజనింద అనిపించింది. చదువర్లకు కాదు అనిపిస్తే తప్పక సవరించగలరు.



ఉదా:- (నిత్యజీవితంలో అనుకునే మాట)
అసలు నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ.
వి:- ఇది మనం రోజూ అనుకునే మాటే. ఒకరు మనం చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోతే వారిని తిట్టాలనుకుని, అది మంచిది కాదనుకున్నప్పుడు మనల్ని మనం నిందించుకున్నట్టుగా అనుకుంటూ వాళ్ళని నిందించడానికి ఇలాగ అంటాం కదా!



చదువర్లకు మఱిన్ని ఉదాహరణలు తెలిస్తే తప్పక చెప్పగలరు.

2 comments:

కథా మంజరి said...

చక్కగా అలంకార వివరణలు ఇస్తున్నారు. మీరు చంద్రాలోకం లక్షణం ఇస్తున్నారు. లక్ష్యం కూడా అదే గ్రంధం నుండి ఇవ్వవచ్చును కదా . అంటే శ్లోక పాద రూపమయిన లక్ష్యం అన్న మాట. సూర కవి పద్యాలు ఎలానూ ఉన్నాయి.

Sandeep P said...

@జోగారావు గారు

నమస్కారం గురువు గారు. మీ గురించి చింతావారి ద్వారా విన్నాను. మీరు నా బ్లాగుపైన దృష్టి పెట్టడం ఎంతో సంతోషంగా.

ఇన్నాళ్ళూ చదివే వారు సంస్కృతం/పద్యాలు చూసి కంగారు పడతారు అని కొంచెం గంభీరంగా ఉన్న ఉదాహరణలు చెప్పలేదు. మీ సలహా ఇంక నుండి పాటిస్తాను. చంద్రాలోకం నుండి పూర్తి శ్లోకాన్ని వ్రాసి, సూరకవి గారి తెలుగు పద్యాన్ని కూడా వ్రాస్తాను. వీలు చూసుకుని పాత టపలు కూడా సవరిస్తాను.

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :)