Sunday, January 2, 2011

భ్రాంతిమదలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> భ్రాంతిమదలంకారము

లక్షణం: ఒక వస్తువును చూచి మఱొక వస్తువు అని భ్రమించినట్లుగా వర్ణించడాన్ని భ్రాంతిమదలంకారం అంటారు.

ఉదా:- (మనుచరిత్ర - అల్లసాని పెద్దన)
అంకముఁజేరి శైలతనయా-స్తన-దుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపబోయి యా
వంక కుచంబుఁగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
లాంకుర శకనంటెడు గజాస్యుని గొల్తునభీష్టసిద్ధికిన్

భా:- అర్థనారీశ్ర్వరరూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరుల ఒడిలో కూర్చున్న గజాననుడు తల్లి స్తన్యమును త్రాగుతూ రెండవవైపు చన్ను కనిపించక శివుడి మెడలో ఉన్న పామును చూచి దానిని లేత తామరతూడుగా భావించి ఆడుకుంటున్నాడు. (అట్టి గజాననుడిని కోర్కెలు తీర్చమని నేను ప్రార్థించెదను).

వివరణ: ఇక్కడ వినాయకుడు శివుడి మెడలోని పామును తామరతూడు అని భ్రమించాడని కవి వర్ణించడంతో ఇది భ్రాంతిమదలంకారం అయ్యింది.

ఉదా:- (శశాంకవిజయం - శేషము వేంకటపతి)
ఇది మనోహర కాంతి నింపైన బింబంబు
బింబంబు గా దిది బెఁడగు కెంపు
(పూర్తిపద్యాన్ని భావాన్ని, ఇక్కడ చూడవచ్చును)

భా:- తార సౌందర్యాన్ని చూసి చంద్రుడు "ఇది పెదవి కాదు, నా ప్రతిబింబమా? లేక కెంపా?" అని ఆశ్చర్యపోయాడు.

వి: చంద్రుడు తార పెదవిని ఏ వస్తువో సరిపోల్చుకోలేక భ్రమిస్తున్నాడు కాబట్టి ఇది భ్రాంతిమదలంకారం. ఇది సందేహాలంకారం కూడా అవుతుందేమోనని నా సందేహం. ఆ విషయం పెద్దలు ఎవరైనా వివరించాలి.


చలనచిత్రసాహిత్యంలో ఈ అలంకారం చూసిన గుర్తు లేదు నాకు. కానీ వేటూరి మాత్రం పదే పదే తుమ్మెదలు అమ్మాయి సౌందర్యాన్ని చూసి తామర అనుకోవడాన్ని ప్రరోక్షంగా ప్రస్తావించారు. ఉదాహరణకి విలన్ 2010 చిత్రంలో "తుమ్మెదలంటని కమ్మని మోముని కన్న వనాలే హాయ్ హాయ్" అనడంలో "తుమ్మెదలు ఈమె తామరవంటి ముఖాన్ని ఇంకా గుర్తించలేకపోయాయి" అనే ధ్వని కనబడుతోంది.

3 comments:

కొత్త పాళీ said...

ఈ అలంకారం పేరు ఇంతకు మునుపు వినలేదు. ఆసక్తికరంగా ఉన్నది. పెద్దనగారి పద్యం సుప్రసిద్ధమే. ఈ భ్రాంతి, సందేహం, ఇవన్నీ రూపకానికి స్థాయీ భేదాల్లాగా ఉన్నాయి. పాతకాలపు సినిమా ప్రేమపాటల్లో అమ్మాయి జడనీ నడుమునీ మొహాన్నీ చూసీ ఇంకేదో అనుకున్నానే అనుకుంటూ అబ్బాయి పాడే పాటలు చాలానే ఉన్నాయి కానీ చప్పున ఏదీ గుర్తు రావట్లేదు.

Sandeep P said...

@కొత్తపాళి గారు
భ్రాంతిమదలంకారం, స్మృత్యలంకారం, సందేహాలంకారం మూడూ ఒక చోటనే వివరించారు చంద్రాలోకంలో వాటిని వివరించినపుడు ఇంకా లోతుగా అర్థమవుతుందేమో ఈ అలంకారము. సూరకవి చాలా అలంకారాలకి రూపకాన్ని జోడించి చూపించాడు. ఇకనుండి అవి కూడా వ్రాస్తాను.

Unknown said...

ఈ రోజే మీ బ్లాగును ప్రప్రథమంగా చూస్తున్నాను.శశాంక విజయములోని పద్యానికి నేను వ్రాసిన పుస్తక పరిచయాన్ని లింకుగా ఇచ్చినందులకు మీకు నా ధన్యవాదాలు.