సూత్రం: బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే
అర్థం: ఒకే వస్తువు పలువురికి పలు విధములుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది.
ఉదా:- (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనోబాణుడని స్త్రీలు, నరసిమ్హరాయలును తలంచెదరుఇక్కడ కవితావస్తువు ఒకటే - నరసిమ్హరాయులు. ఆయన కవులకు బాణుడిగా, రాజులకు మురారిగా, స్త్రీలకు మన్మథుడిగా కనిపిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కవి ఒకే వ్యక్తికి ఎన్నో స్వరూపాలను తెలియజేశాడు. కనుక ఇది ఉల్లేఖాలంకారము. ఇందులోనే శబ్దాలంకారం కూడా ఉంది - బాణుడు అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తోంది - ఇది అనుప్రాస అవుతుందని నా నమ్మకం.
ఒకే వస్తువుకు వేర్వేరు గుణాలను బట్టి వేర్వేరు వస్తువులకు అభేదాన్ని తెలుపడం కూడా ఉల్లేఖాలంకారమే.
ఉదా:- (చంద్రాలోకం)
అతడు వ్యక్తిత్వమందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడుఇక్కడ ఒకే వ్యక్తికి బృహస్పతి, అర్జునుడు, భీష్ముడు - ఈ ముగ్గురితో అభేదం చెప్పబడింది. కాకపోతే ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో సమానం అని చెప్పారు. కనుక ఇది ఉల్లేఖాలంకారము.
ఉదా:- (అప్పకవీయం, రచన: అప్పకవి)
తిరమగు త్రిప్రాసము సుందరమగు మురవైరిరూపు తరుణులకు మనో
హరమగు, దానవులకు భీ
కరమగు, 'దపసులకూ ముక్తికరమగునవనిన్
"మురవైరి (కృష్ణుడి) రూపము స్త్రీలకు మనసు దోచుకునే విధంగా, దానవులకు భయం కలిగించే విధంగా, తాపసులకు ముక్తి మార్గంగా గోచరిస్తోంది" అని భావం. కృష్ణుడికి ఉన్న ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యక్షమవుతోంది అని చెప్పటంతో ఇది ఉల్లేఖనాలంకారం అయ్యింది.
ఉదా:- (శ్రీమద్భాగవతం, రచన: పోతన)
రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుఁదా బ్రహ్మాండమున్ నిండుచోన్
వామనావతారఘట్టంలోని ఈ పద్యం బహుశః అందరికీ తెలిసిన ఉదాహరణ. పోతనామాత్యుడి ఊహాశక్తికి నిదర్శనం. వామనుడు తన శరీదైర్ఘ్యాన్ని పెంచుకుంటూపోతుంటే అతని పక్కన ఉన్న సూర్యుడు చిన్నవాడైపోతున్నట్టుగా అనిపిస్తోందని కవి భావం.
బ్రహ్మచారికి పట్టిన గొడుగుగా, అతడి తల మీద ధరించిన రత్నంగా, చెవుల కుండలాలుగా, మెడలో నగగా, భుజాలపై బంగారు కేయూరంగా, మణికట్టుపైన కంకణంగా, నడుముకు కట్టిన గంటగా, కాలికి ఉంచిన పట్టీలుగా, చివరికి వటుని పాదాలకు పీటగా అనిపిస్తున్నాడుట సూర్యుడు. అంటే పోల్చి చూస్తుంటే వటుడి పరిమాణం పెద్దదైపోతోంది, సూర్యుడు చిన్నవాడైపోయి శిరస్సు పైనుండి, పాదాలకు చేరినట్టనిపిస్తోంది - అని కవి భావం. కవితావస్తువు సూర్యబింబం - ఒక్కో తరుణంలో ఒక్కోలాగా కనిపించడం ఉల్లేఖాలంకారానికి ఆధారమైంది.
ఉదా:- (పాట: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ముక్కుపుడక లాగ, చెవులకు చుట్టూ ఝూక లాగ, చేతికి రంగులగాజుల్లాగా, కాలికి మువ్వలపట్టీ లాగా, మెడలో పచ్చని పతకం లాగా ఉండిపోవే వానచినుకచినుకును వేర్వేరు వస్తువులతో సమంగా పోల్చడం ద్వారా కవి ఉల్లేఖాలంకారాన్ని ప్రయోగించారు.