Wednesday, April 7, 2010

విరహవేదన (మూడు పద్యాలు)

ఒక friend అడిగితే విరహవేదన గురించి మూడు పద్యాలు వ్రాశాను. ఈ పద్యాలు నాకు పెద్దగా సంతృప్తిని కలుగజేయలేదు. ఐనా కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారని బ్లాగుతున్నాను.

సీ:-
కాటుక దిద్దిన కలువకన్నులు నేడు తమ నెలరాజుకై తల్లడిల్లె
నిండుగ జడలోన నింపిన పువ్వులు తుమ్మెదకై వేచి సొమ్మసిల్లె
నీతోడు కోరుచు నిలువెల్ల వాడినా నీ ఊహతో మది నిదురపోదు
నువు జతలేకుండ నిండుపున్నమియైన వెన్నెలరేయిపై వెగటుఁబుట్టె

ఆ:-
దినములెన్నియైన తీరదు నా ప్రేమ
జీవమున్న వరకు చెదిరిపోదు
నింగిలోకి చూడ నెలరాజు ప్రతిరోజు
మారె కాని నేను మారలేదు

ఆ:-
మనసుపడిన నీవు కనులలోనుండగ
కలిమి,లేమి నన్ను కదుపలేవు
లేమి ఏమి? నీవు లేకుండుటే కద?
కలిమి ఏమి? నిన్ను కలియుట కద

P.S: అన్నీ సాధారణమైన తెలుగుపదాలే ఉన్నాయి కాబట్టి ఈ పద్యాలకు నేను ప్రత్యేకించి భావం వ్రాయలేదు.

5 comments:

Rao S Lakkaraju said...

నా ఉద్దేశం లో అచ్చ తెలుగు పదములతో చాల చక్కగా నవనీతం లా మృదువుగా భావాలు వ్యక్తికరించారు. మీకెందుకు సంతృప్తి గ లేవో నాకు అర్ధము కావటం లేదు.మీరు మరీ మొహమాటస్తు లుగా ఉన్నారు. ఈ మంచి పనిని కొనసాగించండి.

Alapati Ramesh Babu said...

ఆకలి,భయం లా కొన్ని భావాలు స్వయంగా అనుభవం లొ బాగా పండుతాయి అందువల్లె మీకు మీరు వ్రాసిన పద్యాలు నచ్చలెదు

పద్మ said...

చిన్న చిన్నవి అయినా అర్థవంతమైన పదాలతో బావున్నాయండి.

ముఖ్యంగా మూడో పద్యం చాలా బావుంది.

పద్మ said...

అవునూ మూడో పద్యం నాలుగో పాదంలో కలియుట బదులు పొందుట బావుండదంటారా? ఛందస్సు నాకు తెలీదనుకోండి. :(

Sandeep P said...

పద్మగారూ,

మంచి మాట చెప్పారు అండి. కాకపోతే, అక్కడ యతిమైత్రి తప్పుతుంది "పొందుట" అంటే. అందుకే "కలిమి" లో "క" కి కలియుట లో "క" కి మైత్రి కుదరడానికి అలాగ వ్రాశాను.