ఈ రోజు వేటూరి చేసిన ప్రయోగాల్లోకల్లా కాస్త సులువుగా అర్థమయ్యి, ద్వంద్వార్థాలు లేని ఒక్క పాట చూద్దాము.
ఒక అమ్మాయి తన మనసులో ఉన్నా సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపించింది. అతడు అది చదివి ఆ అమ్మాయికి బొక్కబోర్లా పడిపోయాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ పారే
ప్రణయరాసాన్ని వేటూరి ఎంతో సున్నితంగా మంచి భావుకతతో వ్రాసాడు. మొత్తం పాట గురించి నేను వ్యాఖ్యానించెంత టైం లేదు కానీ, నాకు నచ్చిన ప్రయోగాలు మాత్రమే చెప్తాను.
- మోహంలో ఉన్న అమ్మాయి కళ్లు మాట్లాడుతున్నాయి అనడానికి
"లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ" అని ఎంతో చిలిపిగా చెప్పాడు.
- తెలుగు పదాలతో గారడీ చెయ్యవయ్యా అని దరఖాస్తు పెట్టుకోకుండానే అవలీలగా చేసేసి మురిపించేయ్యడం వేటూరికి కొత్త కాదుగా.
"గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను", అని అమ్మాయి, "నువ్వు లేని జీవితం నాకు నచ్చలేదు", అని చెప్తే,
"గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను", అని అదే భావాన్ని మాటలు ముందుకూ, వెనక్కీ మార్చి అబ్బాయి చెప్పడం నా చేత ఐతే,
"సాహో వేటూరి, నీకు లేదు సాటి", అనిపించింది.
ఇక్కడ చెప్పుకోవలసింది ఒకటి ఉంది. వేటూరి కొందరు దర్శకులకు ఎప్పుడూ మంచి సాహిత్యాన్నీ అందిస్తూ ఉంటాడు. విశ్వనాథ్, జంధ్యాల, రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, దాసరి నారాయణ రావు వంటి వారికి గతంలో అద్భుతమైన పాటలు వ్రాసాడు.
(డబ్భైమూడేళ్ళ మనిషిని పట్టుకుని, "డు-కారం", వాడుతున్నాడు అని కారాలూ మిరియాలూ నూరేయ్యకండి. అదివేటూరిని "మమ" (సంస్కృతంలో "నా") అనుకున్న "మమకారం".)
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం: రమేష్ నాయుడు
గాయకులూ: బాలు, జానకి
దర్శకుడు: కీ. శే. జంధ్యాల
లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుకలేఖలలో, నీ సొగసుల కవితారేఖలలో
ఇలా... ఇలా... చదవనీ నీ లేఖని ప్రణయలేఖని
బదులైన లేని లేఖ, బ్రతుకైనా ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... వ్రాయనీ నా లేఖని ప్రనయరేఖనీ!
అమావాస్య నిశిలో కోటి తారలున్నా ఆకాశం
వెతుకుతూ ఉంది వేదన తానై విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలేన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతుంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదాలు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను
గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను.