Tuesday, December 25, 2018

కార్తిక మాసం సందర్భంగా రాసిన పద్యాలు

కార్తిక మాసం సందర్భంగా నేను రాసిన కొన్ని కందపద్యాలను శాస్త్రీ బ్లాగులో రాసాను. అక్కడ చదువని వారి కోసం మనోనేత్రంలో కూడా రాస్తున్నాను.

మాటలు, చేతలు, డెందము
గాటపు త్రిపురాలు దురితకారకముల్ నీ
మేటి కరకు జ్ఞానేషువు
వేటునఁ నాయహముఁ జంపు వేదాంతనిధే!

భా:- "మనసు, వాక్కు, కర్మ" అనే మూడూ త్రిపురాలుగా అయ్యి నా చేత పాపములు చేయిస్తున్నాయి. నీ సుజ్ఞానం అనే బాణంతో నా అహాన్ని చంపు, (త్రిపురాలను నాశనం చేసిన) శివా!

చాపపు నేరిమి దేవర
పాపపు పులి నోట చిక్కి బడలితి, కరుణా
రోపము గురి చూసి విడుమ
మాపు జననమరణవనిని మారాంతకుడా!

భా:- ధనుర్విద్యకు దేవతా! కామాన్ని జయించినవాడా! పాపం అనే పులి నోట చిక్కి అలిసిపోయాను. నువ్వు దయ అనే బాణాన్ని గురి చూసి పంపి పులితోబాటు ఈ జననమరణాలు అని అడవినే నాశనం చెయ్యి. (కామం వలనే పాపం పుడుతుంది. ఆ కామాన్ని జయించినవాడు పాపాన్ని నాశనం చెయ్యగలడు).

ఒడిలో బిడ్డడి యెలుకను
మెడలో బుసగొట్టు పాము మింగగఁజూడున్
ఎడమన పసివాని నెమలి
మిడినాగునుఁత్రుంచనెగురు మీదకునెపుడున్

వింతగు కాపురమును నీ
ఇంతి నడుపుచున్ జగములనేలుచునుండన్
సుంతయు బాసటనీయక
చింతెరుగని భిక్షువగుట చెల్లెను నీకే!

భా:- గణపతి వాహనమైన ఎలుకని మింగడానికి నీ మెడలో పాము బుసగొడుతూ ఉంటే, ఆ పామును మింగడానికి నీ చిన్నకొడుకు వాహనం నెమలి ఎగురుతూ ఉంటుంది. నీ ఇల్లాలు ఈ వింతైన కాపురాన్ని నడుపుతూనే జగాలను కూడా ఏలుతోంది. నువ్వు మాత్రం కొంతైనా సాయం చెయ్యకుండా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నావు. ఈ వైభవం నీకే కుదిరింది.

ఎదలో కోర్కెలు ఎద్దుర
మదమొక గజముర చిలువర మత్సరమెల్లన్
పదునగు కోపము వ్యాఘ్రము
అదుపున పెట్టెడి కుశలతనందించు శివా!

భా:- ఎద్దులాగ ఎగిరిపడే కోర్కెలు, ఏనుగంత అహంభావం, పాములాగ బుస కొట్టే ఈర్ష్యా, పులి వంటి కోపం నాలో ఉన్నాయి.ఈ జంతువులని అదుపులో పెట్టిన నీవు నాకు కూడా ఆ దక్షతని అందించు, పశుపతీ! [నువ్వు ఎద్దుని (నందివాహనుడు), ఏనుగుని (గజచర్మాంబరుడు), పాములని (నాగాభరణుడు), పులిని (వ్యాఘ్రాజినాంబరుడు) అదుపులో పెట్టినవాడవు కదా.]

చలియించని యోగి, ఉమను
వలపించిన రాగి, కొలుచు వారికి ఱేడున్
కలచిన కీడున్ నటనకు
నెలవగు స్థాణువు శివుడిని నిత్యము తలతున్

భా:- స్థిరంగా ఉండే యోగి, అమ్మవారి మనసును ఆకర్షించిన అనురాగవంతుడు, కొలచిన వారిని ఆదుకొనేవాదు, చీకాకు పెట్టే వారికి శిక్షకుడు, కదులుతూ నాట్యం చేసే నటరాజు, అస్సలు కదలని స్థాణువు - అన్నీ అయిన శివుడిని ఎప్పుడూ తలుస్తూ ఉండెదను.

కైలాసంబున శైత్యము
మేలగు వినుదుస్తు నీది, మిన్నది తలలో
శైలజ కౌగిలి వీడవ
దేలన చలికోపలేక, ఇషణము మిషయే!

భా:- కైలాసంలో చలి, చక్కని ఆకాశాన్ని బట్టులుగా ధరిస్తావు, తలలో గంగమ్మ. పార్వతి కౌగిలి (పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం) వీడవంటే - చలికి తట్టుకోలేక. భార్య మీద ప్రేమ (ఇషణం) వత్తి సాకు (మిష).

పెక్కులఁ నిన్నును కలచెడి
రక్కసులకు వరములీయ రవ్వంతైనా
లెక్కించక, పెళ్లి జరుప
నక్కరఁ జూపిన వలదొర నణచుట పాడా!

భా:- నిన్ను, అనేకమందిని బాధపెట్టే రాక్షసులకు రవ్వంతైనా ఆలోచన లేకుండా వరాలిచ్చావు. నీకు పెళ్ళి జరుపుదామని ప్రయత్నించిన మన్మథుడిని మాత్రం దగ్ధం చేసావు. ఇది న్యాయమా?

ఆపవు కద భిక్షించుట
శ్రీపతి శ్రీదుల నడగక సెరబడియున్నన్
దాపున గంగను కలిగియు
ఆ పై యడిగేవు జనులనభిషేకముకై!

భా:- శివ! లక్ష్మీదేవి భర్త ఐన విష్ణువు, ధనవంతుడైన కుబేరుడూ నీకు మిత్రులైనా వాళ్ళని సాయం అడగక భిక్షమెత్తుకుంటావు. కానీ, నెత్తిపైన గంగను ఉంచుకుని జనాలను అభిషేకం చెయ్యమని అడుగుతావు. (ఇదేం విడ్డూరం!)

సిగలోనల్లరి విన్నది
రగిలే కన్నుయు నుదుటన, రాగలు మెడలో
నగుమోమునఁ మోసెడి దొర!
బెగడక మను పట్టు మదిన పెంచుము తండ్రీ!

భా:- జటాజూటంలో ఎగసిపడే గంగమ్మ, నుదుటిపైన నిప్పులు రగిలే కన్ను, మెడలో పాములు (అన్నీ ప్రమాదాలే అయినా) నవ్వుతూ వాటిని మోసేవాడా - భయపడకుండా ఉండే స్థైర్యాన్ని మా మనసుల్లో పెంచు తండ్రీ!

మాటకునూపిరి పోయగ
గాటపు శివసూత్రములను కల్పించితివే
నోటపలుకకుండ నిజము
తేటగ తెలిపెడి వలకడ దేవర ప్రణతుల్!

భా:- దక్షిణామూర్తి (వలకడ - దక్షిణదిక్కు) రూపంలో నోట మాట పలుకకుండా సత్యాన్ని (సత్) తెలుపగలిగిన యోగి, మనుషుల కోసం 14 శివ (మాహేశ్వర) సూత్రాలను పాణినికి ప్రసాదించి భాషను సృష్టించాడు. వానికి నమస్సులు.

కరిముఖమార్కండేయులఁ
మరణము దాటించినావు; మృత్యుంజయుడా!
గరళము మింగితివి నగుచు
కరుణను మముఁ గావుమయ్య కాలాంతకుడా!

భా:- శివ! నువ్వు నవ్వుతూ విషాన్ని తాగావు. మార్కండేయుణ్ణి యముడి (మృత్యువు) నుండి కాపాడావు. వినాయకుడికి ఏనుగు తలతో మరో జన్మను ప్రసాదించావు. యముడిని కూడా అంతం చేయగలవాడా - కరుణతో మమ్మల్ని కాపాడు.

ఒడలునఁ జతపడియుండిరి
విడరెట రాయిగ వెలసిన వేడుక మీరన్
గడుసరి భక్తుడడుగ సతి
నెడబాసిన వేల్పు కన్న హెచ్చును గలరే?

భా:- శివపార్వతులు లింగరూపమునైనా అర్థనారీశ్వరులుగానైనా ఒకటై అందంగా ఉన్నారు. అట్టిది, గజాసురుడు అడిగితే తన భార్యను విడిచి వెళ్ళిన శివుడి కంటె దైవం ఉందా?

తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?

భా:- భూమి మొత్తం వెతికినా కన్నబిడ్డను చూసి నవ్వినట్టి వాడిని నెత్తిన మోసుకు తిరిగే శివుడిని మించిన దయ కలిగినవాడు దొరుకుతాడా?