పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.
నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల
పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను
నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు
నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న
నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల
పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను
నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు
నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న