Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.