నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.
You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?
అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.
మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి
తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి
సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి