Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు.