Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.