ఎవరినైనా పలకరించేటప్పుడు
"హలో" అనడం సాధారణం.
"నమస్కారం, బాగున్నారా?" అనడం గౌరవసూచకం. కొంతమంది పలకరింపు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు హాస్యానికి, కొన్ని సార్లు వ్యంగ్యానికి మఱికొన్ని సార్లు ఎలాగ మాట్లాడాలో తెలియక ఇబ్బంది వలన, ఇంకొన్ని సార్లు... ఆ వ్యక్తి తీరే అంత. ఎందుకో ఈ రోజు అవన్నీ గుర్తొచ్చాయి.
మా ఊరు విశాఖ జిల్లా తాండవ జంక్షన్ (తునికి, నర్సీపట్నానికి మధ్యలో) దగ్గర "ఎఱ్ఱవరం" లోపల సీతారామపురం. అక్కడ దాదాపు రెండు వందల ఎకరాల మామిడి, జీడి తోటల మధ్యలో ఐదారు కుటుంబాలుండేవి. ఉప్పు కావాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. మేము తునిలో ఉండి చదువుకునే రోజుల్లో ఒక్కోసారి రెండు మూడు రోజులు సెలవలు వస్తే మా ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎఱ్ఱవరంలో దిగి కబుర్లు చెప్పుకుంటూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరైనా తెలిసినవాళ్ళు ఎడ్లబండి మీదనో, సైకిల్ మీదనో వెళ్తూ చూసి ఎక్కించుకుని తీసుకుపోయేవారు.
ఒక సారి ఏడో తఱగతిలోననుకుంటా, నేను ఒక్కడినే వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండలో తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా తెలిసినవాళ్ళు తగలకపోతారా అని మధ్యమధ్యలో వెనక్కి చూస్తూ నడుస్తూ ఉంటే, నాకు తెలిసిన ఒక తాతగారు Luna మీద వస్తూ కనబడ్డారు. మా ఊళ్ళో ఉండే ఐదు కుటుంబాలలో ఆయన ఒక కుటుంబానికి పెద్ద. సరే ఆయన పెద్ద మనిషి, నేను చిన్న పిల్లాణ్ణి, ఇది మిట్టమధ్యాహ్నం -- ఈ సమీకరణంలో ఎలాగ చూసుకున్నా ఆయన నాకు "lift" ఇచ్చే తీరాలి అనుకుని సూర్యుడి కంటే వెలిగిపోతున్న మొహంతో
"బాగున్నారా?" అని అడిగాను. ఆయన గంటకు ఇరువై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ, నన్ను గమనించి, దాటి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కన్నడ కంఠీరవ రాజ్కుమార్ లాగా ఒక ముసిముసి నవ్వు నవ్వి
"వస్తున్నావా? రా రా..." అంటూ వెళ్ళిపోయారు.
నాకు మహాకోపం వచ్చింది. పొఱబాట్న ఆయన ఊళ్ళో కనబడితే
"నువ్వేం పెద్దమనిషివయ్యా? చిన్నపిల్లాడు ఎండలో నడుస్తున్నాడు? కాస్త ఎక్కించుకుని తీసుకెళ్ళలేవు? పోనీ నీ షష్టిపూర్తైన బండికి అంత ఓపిక లేకపోతే ఒక్క నిముషం ఆగి, ఆ విషయం చెప్పి పోకూడదు? పైగా ఆ ప్రశ్నేమిటి, "వస్తున్నావా? రా రా!", అని. నేను ఇక్కడిదాక వచ్చి ఊరు చివర అత్తిపత్తి మొక్కలతో (touch-me-not) ఆడుకుని, బోరింగు పంపులో కిలుం పట్టిన నీళ్ళు తాగేసి, bus stand లో పడుకుని తిరిగి రేతిరికి తుని వెళ్ళిపోతాననుకున్నావా? (బ్రహ్మానందం styleలో) అసలు మాట్లాడితే meaning ఉండాలి. ఈ ఊళ్ళో నువ్వు తద్దినం పెట్టినప్పుడల్లా వచ్చే ఏకైక భోక్త మా నాన్నగారే. ఆ విషయం మరిచిపోకు.", అందాం అనుకున్నాను. మహానుభావుడు ఆ రెండుమూడు రోజులూ మళ్ళీ కనబడలేదు.
ఇదేదో పల్లెటూరు, అందుకే ఇలాగ జరిగింది అనుకోవడానికి లేదు. ఇది పెద్ద నగరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నీ మధ్యన నా స్నేహితుణ్ణి కలవడానికి California వెళ్ళాను. వాడు నన్ను విమానాశ్రయం నుండి తన బండిలో ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ దిగుతూనే ఒక అమ్మాయి ఎదురొచ్చింది. ఆమె వీడిని చూసి సిగ్గుతో నవ్వుతూ తల దించుకుని తన car వైపు వెళ్ళింది. వీడు ఆమెను చూసి ఒక విరక్తిభరితమైన నవ్వు నవ్వాడు. సరేలే
"ఆళ్ళిద్దరికీ ఏఁవండర్ష్టాండింగుందో మనకేటి తెలుసు", అనుకుని మా వాడితోటి నడిచాను.
మరునాడు apartment basement లో lift లో మాతో పాటు ఒకాయన ఎక్కాడు. అప్పుడు జరిగిన సంభాషణ నాకు విచిత్రంగా తోచింది. అందరం భారతీయులమేనని గమనించి ఆయన నా మిత్రుడికి shake-hand ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. మా వాడు
"హలో, నా పేరు ప్రసాద్" అని నా మిత్రుడు చెప్తే, అదేదో ఇళయరాజ అని చెప్పినట్టు అతడు కళ్ళు పెద్దవి చేసి,
"ఓ, ప్రసాదా? అంటే మీరూ, మా ఆవిడా - ఆఁ, ఆఁ, ఆఁ", అని
కనుబొమలెగరేసి సిగ్గుతో కూడిన ఆశ్చర్యం వలన కలిగిన నవ్వును ప్రసరింపజేశాడు. వెంటనే నా మిత్రుడు విజయోత్సాహంతో కూడిన జాలి వలన కలిగిన నవ్వు ఒకటి విసిరాడు. ఇద్దరూ నవ్వుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాము.
అనకూడదు కానీ, ఎంతటి పత్నీవ్రతుడి గురించి అయినా సందేహం కలిగేలాగ ఉన్నాయి వాళ్ళ సంభాషణ, మొహాలలో హావభావాలు. నా కుతూహలం కట్టలు తెంచుకుని గొంతులోంచి
"ఒరేయ్, ఏం జరుగుతోందిరా? నాకు తెలియాలి...నాకు తెలియాలి...నాకు తెలియాలి! " అని అడిగేలాగ చేసింది. వాడు నవ్వుకుని అసలు కథ చెప్పాడు,
"మా ఆవిడ parking లో car నడుపుతుంటే, వాళ్ళావిడ చూసుకోకుండా car reverse చేసి accident చేసింది. మొదట్లో వాళ్ళావిడ మా ఆవిడదే తప్పని వాదిస్తే నేను వెళ్ళి తగులుకున్నాను. ఆ సమయంలో వీడు ఊళ్ళో లేడనుకుంటాను. చివరికి ఆవిడ ఒప్పుకుని insurance వాళ్ళ చేత డబ్బులు ఇప్పించింది", అన్నాడు.
"ఓహో, వాడి మొహంలో సిగ్గు, ఆశ్చర్యం ఏమిటో, నీ మొహంలో విజయోత్సాహం, జాలి ఏమిటో ఇప్పుడు అర్థమయ్యాయి. నాయనా, ఇలాంటి దిక్కుమాలిన expressions తో పలకరించుకోవడం చూడటం ఇదే మొదటి సారి.", అనుకున్నాను.
పెద్దయ్యాక ఈ పలకరింపులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఎదురౌతాయి. కానీ బాల్యంలో (సరదాగా) ఇబ్బంది కలిగించడానికి ఇలాంటి పలకరింపులు ఎదురౌతూ ఉంటాయి. చిన్నప్పుడు మేము ఏటా వేసవి సెలవులకు విజయవాడ వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మమ్మల్ని ఉడికించడానికి ఎప్పుడూ వెటకారంగానే ఆహ్వానించేవారు.
"ఒసేయ్ అమ్మాయ్, మాఁవిడి పళ్ళన్నీ దాచెయ్ వే. తూర్పోళ్ళొచ్చారు. దొరికితే పరకలు పరకలు లాగించేస్తారు.", అని గట్టిగా అరవడం.
"బాబు, ఎందుకొచ్చారు నాయనా? మా ఇంట్లో ఏమీ లేవు. మీ సీతారాంపురం వెళ్ళి జీడిపిక్కలేరుకోండి", అనడం. మేము అది విని పౌరుషపడటం -- ఇది రివాజు. చాలా గంభీరంగా,
"అమ్మ, వెనక్కెళ్ళిపోదాం పద!" అన్నా అందరూ నవ్వడం చూసి చాలా కోపం కలిగేది.
అదేమిటో ఎప్పుడు మా అన్నయ్య విజయవాడ వెళ్ళినా అదో రకం పలకరింపే ఎదురయ్యేది. ఒక సారి ఆత్రంగా మధ్యాహ్నం పన్నెండికి వెళ్ళి తలుపు కొడితే, మా అమ్మమ్మ వచ్చి తలుపు తెరిచి, తీక్ష్ణంగా చూసి,
"ఆయనిప్పుడే భోజనానికి కూర్చున్నారండి. కాస్త చల్లబడ్డాక రండి.", అని చెప్పి తలుపు వేసేసింది. మా అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకోవడం మరిచిపోయిందన్నమాట. దానికి తోడు అంతకు ముందు వేసవి మా అన్నయ్య విజయవాడ వెళ్ళలేదు. ఎదిగే వయసు కద! ఉన్నట్టుండి ఒక అడుగు ఎదిగేసరికి మా అమ్మమ్మకు కనీసం "
వీడు మనవాడేమో", అని అనుమానం కూడా కలగలేదు.
ఒక సారి మా అన్నయ్య వెళ్తూనే మా అమ్మమ్మ కనబడింది.
"అమ్మమ్మ, నాకూ బియ్యం పెట్టేయ్" అన్నాడు. (మా వైపు
"నాకూ అన్నం వండు", అనడానికి అలాగ అంటారు. సరిగ్గా అన్నం వండే సమయానికి ఇంటికి వచ్చాడు కాబట్టి వంట చేసేవాళ్ళకు మళ్ళీ రెండు ఎసర్లు పెట్టడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రాగానే తన రాకను declare చేసాడు.). పక్కనే అలమర తలుపు మూసి వెలుగులోకి వచ్చిన మా తాతయ్య,
"ఏఁవిటి నాయనా? మిట్టమధ్యనం వచ్చి బియ్యం పెట్టమంటున్నావు? సన్న్యాసమేమైనా పుచ్చుకున్నావా?", అన్నారు. వెంటనే మా అన్నయ్య ఒక వంకర నవ్వు నవ్వితే,
"వేద్ధవ, బావున్నావా? తాతయ్యేడి అని అడగడం మానేసి అదేం పలకరింపు" అన్నారు. ఇంక అప్పటినుండి మా అన్నయ్య రావడం చూసినప్పుడల్లా మా తాతయ్య,
"ఒసేవ్, చిన్నాడొచ్చాడు. బియ్యం పెట్టేయ్", అని చెప్తుంటారు.
మఱొక సారి మా తాతయ్యకి ఒంట్లో బాగోక వైద్యశాలలో చేర్పిస్తే మా అన్నయ్య కంగారుగా వెళ్ళాడు. ఆయాస పడుతూ తలుపు తెరిచి చూస్తే మా తాతయ్య నిబ్బరంగా పరుపు మీద కూర్చుని, వెటకారంగా,
"ఏరా? అంతలా పరిగెట్టుకుని వచ్చావు, ఏఁవౌతుందనుకునావేంటి?", అన్నారు. అప్పటి దాక కంగారు పడ్డ మా అన్నయ్యకు అప్పుడు మనసు కుదుటపడింది.
వ్యంగ్యమైన పలకరింపులకి వయసుతో పనేమీ లేదు, వెటకారం చెయ్యడానికి అవతల వ్యక్తి బలహీనత, అలవాట్లనే వాడుకోవక్కరలేదు అని నా బాల్యస్నేహితుడొకడు నిరూపించాడు. వాడు ఆదివారం వాళ్ళ నాన్నకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అది నా ఎనిమిదో తఱగతి అనుకుంటాను. ఒక సారి pen తెచ్చుకోవడం మరిచిపోయాను. వాడు ఎప్పుడూ మూడు నాలుగు రంగుల pen లు compass box లో పెట్టుకుని తిరిగేవాడు. వాడిని అడుగుదామని విరామంలో
"ఒరేయ్", అన్నాను. వాడు వెనక్కి తిరిగి చాలా నిర్లిప్తమైన చూపుతో,
"ఆఁ, చెప్పమ్మా" అన్నాడు. ఇదేం పలకరింపురా నాయనా అనుకుని,
"నాకు ఒక pen కావాలి - సాయంత్రం ఇచ్చేస్తాను", అన్నాను. వాడు
"ఏ color అమ్మ, blue ఆ, black ఆ, red ఆ?", అని అడిగాడు. నేను
"blue ఐతే better" అన్నాను. దానికి వాడు,
"blue stockలో లేదమ్మ. రేపొచ్చి కనబడు. black ఐతే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఐనా black తో ఉన్న look blue కి రాదమ్మ", అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక అలాగ ఉండిపోయాను. వాడు వెంటనే నవ్వి,
"black ఏ ఉందిరా. ఇదిగో", అని ఇచ్చాడు.
సరే అందరి గురించి చెప్పి నా గురించి చెప్పుకోకపోతే ఎలాగ? నా వంతు విచిత్రమైన పలకరింపులు నేనూ చేసాను. చిన్నప్పుడు మా ఉపాధ్యాయుడికి నేనంటే చాలా అభిమానం ఉండేది. ఆయన అంటే నాకూ చాలా గౌరవం ఉండేది. నాలుగో తఱగతిలోనో ఎప్పుడో, ఒక రోజు ఆయన
"ఎవరైనా పెద్దలు కనబడితే Good Morning/Afternoon/Evening." చెప్పాలి అన్నారు.
చిన్న hint ఇస్తే చెలరేగిపోతాను అని మా పాఠశాలలో నా గురించి మంచి talk ఉండేది. అది నిరూపించుకోవాలన్నట్టు, ఆ రోజు సాయంత్రం పాఠశాల నుండి విడిచిపెట్టాక నడుస్తూంటే రెండు వీధుల అవతల ఆయన్ని చూసి
"సార్ సార్" అని అరుచుకుంటూ పరిగెట్టాను. ఆయన ఏదో ఉపద్రవం వచ్చినందుకుని కంగారుగా వెనక్కి తిరిగి
"What happened Sandeep?" అంటూ ఆత్రంగా అడిగారు. నేను ఆయసంతో ఊపిరి ఎగబీలుస్తూ,
"Good Morning ఛి ఛి... Good Evening sir" అన్నాను. ఆయనకు నవ్వాలో ఏడవాలో తెలియక "OK" అని చెప్పి వెళ్ళిపోయారు.
"ఆయన చెప్పింది మనం practical గా చేసి చూపించినా ఈయనకెందుకు ముచ్చటెయ్యలేదు చెప్మా", అనుకుంటూ నేనూ ఇంటికి వెళ్ళిపోయాను.
నా జీవితంలోనే మరిచిపోలేని ఘోరమైన పలకరింపు చేసింది నా మిత్రుడు కిట్టు. వాడికి intermediate పరీక్షలలో చక్కని marks వచ్చినందుకు విజయవాడ నుండి వాళ్ళ దూరబ్బంధువు ఒకాయన ప్రత్యేకించి phone చేసి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వాడి తల మీద తన చెయ్యి పెట్టి దువ్వుతూ ఉంది. వాడికా చదువు తప్పితే ఏఁవీ తెలిసేది కాదు. ఆయన గురించి అసలేమీ తెలియదు. వాళ్ళ అమ్మ చద్దన్నం పెఱుగులో కలిపి పెట్టినప్పుడల్లా వాడు చిఱాకు పడుతుంటే,
"నాన్న, రావు తాతయ్య గారు లేరు? ఆయనకు బోళ్ళు డబ్బులున్నా ఇప్పటికీ రోజూ చద్దన్నమే తింటారు. ఆయన్ని చూడు ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యం గా ఉంటారో. చద్దన్నం బలం.", అనేది. కర్మ కాలి వాడికప్పుడు ఆ విషయమే గుర్తొచ్చి,
"రావు తాతగారు! మీ గురించి మా అమ్మ చెప్తూ ఉంటుందండి. మీరు ఇప్పటికీ చద్దన్నం తింటూనే ఉంటారుట కదా.", అన్నాడు. వాళ్ళమ్మ ఒక్క సారిగా దువ్వడం మానేసి నెత్తి మీద మొట్టింది. ఎందుకు మొట్టిందో అప్పట్లో వాడికి ఎంతకీ అర్థం కాలేదు.
ఇలాంటి పలకరింపులు తలుచుకున్నప్పుడల్లా నవ్వాగదు.