Monday, April 19, 2010

ఆపరేషన్ నామకరణం

ఈ టప ఉద్దేశం పిల్లలకు నామకరణం చేసేటప్పుడు ఆలోచించే విషయాలను హాస్యభరితంగా చెప్పాలనే కానీ, ఎవరినో బాధపెట్టాలనో, ఏదో పేరును కించపరచాలనో కాదు. ఒకవేళ ఎవరికైనా అలాగ అనిపిస్తే పెద్దమనసు చేసుకుని క్షమించాలని నా మనవి!

మా వదినమ్మ తను ఆరోనెలలో అడుగుపెట్టగానే తనకు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని తెగ ఆలోచించేసింది. కాసేపు గూగులిన తరువాత, "ఇదంత అర్రీబుర్రీగా తేలే యెవ్వారం కాదు. మా సెగట్రీతో సెర్చించి (searchఇంచి) ఆలోసిత్తాను", అని నిర్ణయించుకుంది. ఈ విషయానికి నన్ను సెగట్రీగా నియమించింది. తనకు నా గురించి తెలియదు పాపం. అందుకే, "నాకు ఈ ప్రపంచంలో ఏదీ నచ్చదు, అన్నిటిలోనూ లోపాలు వెతకడం నా ప్రథమకర్తవ్యంగా భావిస్తాను", అని చెప్పాను. ఐనా సరే నన్నే సెగట్రీగా నియమించింది. అంతే, చర్చ అనుకున్నది కాస్తా, లెక్చర్ అయ్యింది. అదే ఈ రోజు నా టప.

మా వదినమ్మ నాకు ఇచ్చిన సూచనలు (specification) ఏమిటంటే:
  • సంస్కృతపదం అవ్వాలి 
  • రెండు/మూడు అక్షరాలుండాలి
  • మరీ పాతపదాలు, మరీ కొత్తపదాలు (posh పదాలు) వద్దు 
  • పేరులో negative-తనం ఉండకూడదు
  • వినగానే "ఆహా, కొత్తగా ఉంది. హాయిగా ఉంది ఈ పేరు." అనిపించాలి. 
అంతే, ఇంక సెగట్రీ, చెవులు వాచేలా e-mail లో ఉవాచ:

వదినమ్మా!

నువ్వు పేరు పెట్టడం అనేది ఏదో చాలా సులువైన పనిలాగా మాట్లాడుతున్నావు. అసలు ఈ పేరు పెట్టడం అనే ప్రక్రియే చాలా దీర్ఘమైనది, సునిశితమైన బుద్ధితో కానీ సాధించలేనిది. అందుకే ఈ నామకరణం అనే ప్రాజెక్టుకు పేరు పెట్టడం చాలా ముఖ్యం. నన్నడిగితే దీనికి "ఆపరేషణ్ నామకరణం" (ON) అని పేరు పెడదాము. నీ తొలిబిడ్డ గనుక ఈ సారి version-1 అనచ్చు. అంటే ON-1. రెండో బిడ్డకు ON-2 అలాగ పెంచుకుంటూ పోవచ్చు. ఏమంటావ్? బేమ్మర్ల పెళ్ళిళ్ళల్లో పంతులుగారు అందరి పేర్లకీ చివర్లో శర్మ తగిలించినట్లు సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతీ పనికి "ప్రాజెక్టు" అనే పదాన్ని తగిలిస్తారు. లేకపోతే motivation రాదాయె!

విషయానికి వస్తే పని చెయ్యడం కంటే సలహా ఇవ్వడం చాలా సులువు అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా? ("ఎన్నో అధ్యాయంలో? నాకు గుర్తులేదే?" అనకు. నిజంగా గీతలో ఉందో లేదో నాకూ తెలియదు కానీ, భారీ కొటేషన్ల వెనుక భగవద్గీత backing ఉండటం మంచిది అని అలాగ అంటున్నాను, ఈ మధ్యన.) అందుకే ఇప్పటికి నీకు పేర్లు-వాటితో ఉండే తంటాలు అనే విషయం పైన కొంచం జ్ఞానోదయం చేస్తాను చూడు.

మొదటగా చెప్పాల్సింది ఏమిటంటే, నీ specificationలో "కొత్తదనం" అనే అంశం నాకు కొంచెం అనవసరమనిపించినది. ఆ మధ్యన మా దూరబ్బంధువుల అబ్బాయికి శ్రేయస్ అనే పేరు పెడితే దానికి బంధువర్గంలో "చాలా కొత్తగా ఉంది, చక్కని పేరు", అని మాంచి talk వచ్చి హిట్టయ్యింది. ఆ తరువాత నేను సాఫ్ట్వేర్ ధర్మానుసారం రెండేళ్ళ తరువాత ఉద్యోగం మారాను. అక్కడికి వెళ్తే కేవలం మా teamలోనే నలుగురు శ్రేయస్లు ఉన్నారు. మా officeలో, confusion ఎందుకని వాళ్ళను సొంతపేర్లతో కాక, ఇంటి పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు, అంత కష్టపడి పెట్టిన పేరూ release కాకుండానే drop అయిన ప్రాజెక్ట్లాగా అయిపోయింది. ఇందులో నీతేమిటంటే, నీకు నచ్చిన పేర్లు చాలా చోట్ల చాలామందికి పిచ్చపిచ్చగా, విచ్చలవిడిగా నచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళపాటు ఒక పేరుకు మంచి talk ఉండి, అదే పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాందరూ ఒక చోట చేరితే ఇంక variety ఏముంది?

ఒకసారి ఇలాగే ఒక చెల్లెమ్మ నన్ను పేరు select చెయ్యమని అడిగితే కే. విశ్వనాథ్ చిత్రాల్లో అమ్మవారిపైన పాటలు వింటే నీకు ఏమైనా నచ్చచ్చు అన్నాను. చివరికి ఆమె "సప్తపది" చిత్రంలో పాట విందో లేదో తెలియదు కానీ, వాళ్ళ పాపకు "శశిహాసిని" అనే పేరు పెట్టుకున్నారు. నాకు "హాసిని" అనే పేరు బాగా నచ్చింది. అందులోనూ సరస్వతీదేవి పేరంటే నాకు మక్కువాయే! అక్కడికి OK. ఇంతలో బొమ్మరిల్లు సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా చూసినప్పటినుండీ నాకు హాసిని అనగానే పెదాలు జిడ్డుగారేలాగా lip-stick పూసుకుని, ఆ పెదాలు కలవనివ్వకుండా మాట్లాడుతూ, తెలుగు సరిగ్గా పలకడం చేతకాని; ఎవరితో ఎలాగ behave చెయ్యాలో తెలియని ఒక immature కోతిపిల్ల గుర్తొస్తోంది :-( నేను చెప్పే point ఏమిటంటే మనకు "హాయిగా" అనిపించే పేరు రేపు మరొకరివల్ల చెత్తగా గా అనిపించవచ్చును.

ఇంక నీకు ఇచ్చే కొన్ని సామాన్యమైన సూచనలు:
  • పిల్లలకు మనం పెట్టే పేర్లను పెద్దయ్యాక వాళ్ళ friends కుదించడం, కుదిపెయ్యడం సహజం. ఉదాహరణకి మా స్నేహితురాలి పేరు "కౌస్తుభ" - ఎంత చక్కనైన పేరు! ఐతే ఆమెని స్నేహితురళ్ళందరూ, "Hi Cow, How are you?" అంటుంటే, మొదట్లో, "ప్రకృతిధర్మానికి విరుద్ధంగా మానవులకు గోసంతతి కలిగింది", అనిపించింది.
  • ఇందాకటి పాయింటుకో జాయింటు. పేరులో రెండు మూడు పదాలు ఉన్నప్పుడు ఆ పదాల మొదటి అక్షరాలు కలిపి కొత్త పేరు సృష్టించి దానితో పిలుస్తూ ఉంటారు స్నేహితులు. నా స్నేహితుడి పేరు కార్తీక్చంద్ర - ఎంత చక్కనైన పేరు! దాన్ని స్నేహితులని చెప్పుకునేవాళ్ళందరూ కలిసి "కాచా" అని మార్చారు. అదేదో కొండాజాతివాళ్ళ బండ పేరులాగా లేదు? ఇంకొకరి పేరు గోపాలరావు. అతనిని ముద్దుగా గోరా అని పిలిచారు. ఇంకా నయం వాళ్ళింటి పేరు ఏ ఆదిభట్లో అయితే అతని పేరు అగోరా అని ఘోరంగా అయ్యేది. పద్మని పద్దు అని (చాకలిపద్దు లాగా), లలితని లల్లి అని పిలువడం నువ్వూ గమనించే ఉంటావు! అందుచేత ఇలాంటి కంకర్రాళ్ళు nicknames గా రాని పేర్లను ఎంచుకోవడం మంచిది.
  • మళ్ళీ పై పాయింటుకో జాయింటు. మొత్తం పేరులోని పదాలలో మొదటి ఆంగ్లాక్షరాలను కలిపి nickname ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రక్రియకు బలైపోయిన కొన్ని పేర్లు: పిసుపాటి-చంద్రశేఖర-కుమార్ , అరుముగం-శివ-సామి. తస్మాత్ జాగ్రత్త!
  • తెలుగు ఉచ్చారణ తెలియని English-medium స్నేహితుల దౌష్ట్యాన్ని కూడా మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి: పేరులో "శ" లేకుండా చూసుకో! ఎందుకంటే కొంతమంది "శంకర్" ని "సంకర్" (అదే, వర్ణసంకరంలో సంకర్) అని గానీ, "షంకర్" అని గానీ పిలుస్తున్నారు. వింటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంటోంది.
  • ఇంటి పేర్లతో ఉండే తంటా కొంత ఉంటుంది. మా దూరబ్బంధువు ఇంటిపేరు "కొట్రా". అతడు లవ్వాడి, ఇంట్లోవాళ్ళతో గొడవాడి, ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళాడాడు. అంతవరకూ బానే ఉంది. ఆ అమ్మాయి పేరు "బెట్టి". ఇంటిపేరుతో కలసి, "కొట్రా బెట్టి" అయ్యింది. పేరు వింటే violins విన్న feeling రావాలి కానీ, violence కనబడకూడదు కదా?
  • పేరులో కాస్త లింగభేదం ఉంచడం మంచిది. చైతన్య, ప్రసన్న లాంటి పేర్లు పెడితే e-mails వ్రాసేటప్పుడు లింగభేదం తెలియక ఎవరైనా "Prasanna is a nice girl" అంటే nice అన్నందుకు ఆనందించాలో, girl అన్నందుకు దుఃఖించాలో తెలియక పిల్లలు బాధపడతారు.
  • ఇంక ప్రాస కోసం ప్రయాస పడుతూ, శ్వాస విడిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పిల్లలపేర్లన్నిటికీ ప్రాస కుదర్చాలని ప్రయత్నిస్తారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ప్రాసతో పాటు కాస్త భావం, అర్థం బాగుంటే సొంపుగా ఉంటుంది. ఈ ప్రాసపై ఆశకు ప్రతిరూపలుగా ప్రతాప్-ప్రేలాప్, పురుష్-పరుష్, అభిషేక్-అరబ్ షేక్ వంటి నామద్వయాలు ఉద్భవిస్తున్నాయి.
  • సంస్కృతంలో బాగుండే కొన్ని పదాలు జంట లేకపోతే నిరర్థకాలవుతాయి. ఉదాహరణకి చరణ్ అనే పేరు వాడుకలో ఉంది. ఆ చరణానికి ఒక మొండెం, తలకాయ కూడా ప్రసాదిస్తే బాగుంటుంది. వాడు విష్ణుచరణ్ ఆ? సాయిచరణ్ ఆ? శివచరణ్ ఆ? అలాగే ప్రతీక్ అంటే "ఓహో!" అనిపిస్తున్నా దాని అర్థం "గుర్తు" అని. ప్రేమకు ప్రతీకా? మంచితనానికి ప్రతీకా? ఏమిటి అన్నది ఆ బిడ్డకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగేదాకా ఆగకుండా ముందే చెప్తే సంతోషిస్తాడు. ఏమంటావ్?
  • సంస్కృతం అంటే గుర్తొచ్చింది. కొంతమంది సంస్కృతం కంటే ఆంగ్లాన్ని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అందుకని కొన్ని పేర్లను ఆంగ్లీకరిస్తున్నారు. ఉదాహరణకు లవకుశుల పేర్లను ఈ మధ్యన love, khush గా మార్చి పెట్టుకోవడం నేను గమనించాను. ఒక idea పిల్లల జీవితాన్నే మార్చేయగలదు!
  • ఈ మధ్యన పేర్లకు prefixలు, suffixలు తగిలించడం రివాజు అయ్యింది. సాయి వాడుకలోనున్న ఒక prefix. సాయిచరణ్, సాయికిరణ్, సాయికరుణ్, సాయిశరణ్ మొదలైనవి మనం వింటూనే ఉన్నాము. ఐతే దీనితో వచ్చిన బాధేమిటి అంటే ముద్దుగా కొడుకుని సాయి అని పిలుచుకోలేము. "సాయ్" అనగానే "ఓయ్" అనేవాళ్ళు బోళ్ళుమంది ఉంటారు. అప్పుడు సాయిని వదిలేసి, "కిరణ్", "తరుణ్", "చరణ్" వంటి తాడుతెగిన గాలిపటాలలాంటి పేర్లు వాడుకోవాలి. కుమార్ మనకు తెలిసిన ఒక suffix. మా friend ఒకడి పేరు "రవికుమార్". వాడిని ఒకడు "రవికి ఇద్దరు కుమారులు. శని, యముడు - నువ్వెవరు నాయినా?" అని అడిగాడు. వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. అందుచేత కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కూడా!
  • కొన్ని పేర్లకు అర్థం వెతికితే నాకు ఏమీ తోచదు. ఉదాహరణకి "సతీశ్" (*) అనే పేరుకు అర్థం నాకు తెలియదు. "సతి + ఈశ్" అనుకుందాము అంటే "సతికి అధిపతి" అని అర్థం వస్తుంది. ఎవడు మాత్రం పెళ్ళానికి మొగుడు కాకుండా పోతాడు చెప్పు? ఒకవేళ నేను సంధిని విడదీయడంలో తప్పు చేసి ఉంటే సవరించు సుమీ! అలాగే ఇదివరకు నేను పని చేసే చోట ఒకడి పేరు "అల్పేశ్". "అల్పంగా ఉండే ఈశుడా" అనుకుని ముక్కున వేలేసుకున్నాను.
  • కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు కొడుక్కి పెట్టుకుందాం అనుకుంటారు. దీనివల్ల పూజల్లోనూ, తతంగాలలోనూ తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్పుకోవడం సులువవుతుంది! అలాగే కొడుకును పిలిచినప్పుడల్లా తండ్రిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడిదాకా బాగుంది కదా అనుకునేవాణ్ణి. ఇదే పద్ధతి కొన్ని తరాలు పాటించిన మా teacher ఒకాయన వంశవృక్షం చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. ఆయన పేరు అరుముగం శివసామి. అరుముగం ఆయన తండ్రి పేరు, శివసామి ఆయన పేరు. ఈయనకి వీళ్ళ తాతగారి పేరు పెట్టారుట. అంటే తాత పేరు శివసామి. ఇప్పుడు తండ్రి పూర్తి పేరు "శివసామి అరుముగం". అరుముగం తండ్రి పేరు, శివసామి ఆయన తండ్రి పేరు. ఇలాగ మూడు నాలుగు తరాలు ముందుదాకా వెళ్తే అందరూ శివసామి అరుముగం, అరుముగం శివసామి అనే రెండు పేర్లను audio cassette A-side, B-side లాగా మార్చి మార్చి పెట్టుకుంటూనే ఉన్నారు. పాపం, అల్పసంతోషులు అనిపించింది. మీ వాడు తండ్రి పేరు చివర్లో తగిలించుకుందాం అంటే ఇబ్బంది కాకుండా చూసుకోండమ్మోవ్!
  • అన్నట్టు ఈ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు పెట్టుకోవాడానికి మన ఆంధ్రులకు ఇంకో మార్గం ఉంది వదినమ్మోయ్! ఏంటంటే కొడుకు పేరులో "శివ, వీర, వేంకట, నాగ, కనక, ఫణి" వంటి పదాలు కొన్ని తగిలిస్తే అందులో ఏదో ఒకటి తాతకో, తండ్రికో ఉండకపోతుందా? ఆ విధంగా వాళ్ళ పేరు పేరు కూడా కొడుక్కి పెట్టినట్టు ఉంటుంది కదా?
  • అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. "అంకిత" లాంటి పేర్లు పెట్టద్దు. ఎందుకంటే వెంటనే మనసులోకి వచ్చే ప్రశ్న, "ఎవరికి అంకితం చేశావు? ఏం అంకితం చేసేశావు?". అలాగే అన్వేషిత, ఆకాంక్షిత వంటివి కూడా అలాంటి అర్థాలే వస్తాయి. 
  • "ప్రియలలిత", "ప్రియదర్శిని", ప్రియమణి" లాంటి పేర్లు కూడా పెట్టద్దు. ఎందుకంటే నీ ఎదురుగుండానే ప్రతీ తలకు మాసిన వెధవా ఆమెని "ప్రియా..ప్రియా..." అని పిలుస్తాడు. అది వినలేక మనం ఏడవాలి. ఆమె మొగుడికి అనవసరమైన అనుమానాలు కూడా వస్తాయి. అన్నట్టు, ఆ ప్రియదర్శిని అనే పేరుకు అర్థమే నాకు తోచలేదు ఇప్పటికీ!
  • పైన చెప్పినదానికి కొంచం reverse చేసుకుంటే తరువాతి సూత్రం వస్తుంది. ఏమిటంటే, "జననీ", "జగదంబ" వంటి పేర్లు బయటవాళ్ళు పిలుస్తుంటే ఆమె మొగుడికీ ఒక sense of security ఇచ్చినా, స్వయంగా నోరారా పెళ్ళాన్ని పూర్తి పేరుతో పిలుద్దాము అనుకుంటే ఘోరాలు జరిగిపోతాయి.
  • ఈ మధ్యన numerlogyతో ఒక చిక్కు వచ్చి పడింది. పాప(డు) పుట్టిన తేదీ బట్టి పేరు decide చేస్తామంటారు. దీని కోసం ఎంతో చక్కని పేర్లను ఖూనీ చేస్తారు. ప్రేమ (Prema) అనే పదాన్ని ప్రేమా (Praemaa) గా వ్రాయడం లాంటి పైత్యాలు గమనించాను. వెంటనే నాకు "దీని అసాధ్యం కూల. ఇంకా నయం పేరు శ్రద్ధ (Sraddha) అయ్యి, numerologist ఇంకో రెండు అచ్చులు (vowels) కలపమన్నాడని శ్రాద్ధా (Sraaddhaa) అని వ్రాసింది కాదు!", అనుకున్నాను. చెప్పొచ్చేదేమిటంటే మనం ఎంతో ప్రేమగా పెట్టుకునే పేరు రేపు పిల్లలు numerology అని మార్చుకోగలరు. అలాగ మార్చుకుంటే తప్పుడర్థాలు రాని పేరైతే మంచిది అనుకుంటున్నాను. (+)
అదీ సంగతి! ఇంక నువ్వాలోచించు!

(*) సతీశ్ అనే పదం గురించి శిశిర గారు వివరించడంతో నాకర్థమైంది. సతి అంటే అమ్మవారు (దక్షుని పుత్రి), సతీశ్ అంటే శివుడు. నేను చిన్నప్పుడు తునిలో పెరిగాను. అక్కడికి అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు. అందుచేత అక్కడ సత్యనారాయణ స్వామి భక్తులు ఎక్కువ. వాళ్ళు సత్యనారయణ అనే పేరుకు మారుగా సతీశ్ అని వాడటం గుర్తు. అందుకే నాకు సతీదేవి సంగతే గుర్తురాలేదు.

(+) ఈ పాయింటు శ్రీదేవి గారి కామెంటు చూసి చేర్చడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు!




ఈ టపకు సహకరించిన వదినమ్మ హరితకి, సోదరుడు ఫణీంద్రకి, మిత్రుడు కిరణ్‌కి నా మనఃపూర్వక ధన్యవాదాలు!  అన్నట్టు ఇతని పేరు (నల్లాన్ చక్రవర్తుల కిరణ్) కూడా ఇందాక చెప్పిన ఆధునికనామవ్యాకరణసూత్రాలకు లోబడి, "నచకి" గా మారింది. 

Wednesday, April 7, 2010

విరహవేదన (మూడు పద్యాలు)

ఒక friend అడిగితే విరహవేదన గురించి మూడు పద్యాలు వ్రాశాను. ఈ పద్యాలు నాకు పెద్దగా సంతృప్తిని కలుగజేయలేదు. ఐనా కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారని బ్లాగుతున్నాను.

సీ:-
కాటుక దిద్దిన కలువకన్నులు నేడు తమ నెలరాజుకై తల్లడిల్లె
నిండుగ జడలోన నింపిన పువ్వులు తుమ్మెదకై వేచి సొమ్మసిల్లె
నీతోడు కోరుచు నిలువెల్ల వాడినా నీ ఊహతో మది నిదురపోదు
నువు జతలేకుండ నిండుపున్నమియైన వెన్నెలరేయిపై వెగటుఁబుట్టె

ఆ:-
దినములెన్నియైన తీరదు నా ప్రేమ
జీవమున్న వరకు చెదిరిపోదు
నింగిలోకి చూడ నెలరాజు ప్రతిరోజు
మారె కాని నేను మారలేదు

ఆ:-
మనసుపడిన నీవు కనులలోనుండగ
కలిమి,లేమి నన్ను కదుపలేవు
లేమి ఏమి? నీవు లేకుండుటే కద?
కలిమి ఏమి? నిన్ను కలియుట కద

P.S: అన్నీ సాధారణమైన తెలుగుపదాలే ఉన్నాయి కాబట్టి ఈ పద్యాలకు నేను ప్రత్యేకించి భావం వ్రాయలేదు.

Monday, April 5, 2010

నిత్యజీవితంలో పద్యాలు

ఈ మధ్యన నాకు పద్యాలు వ్రాయటానికి సందర్భాలు/సమస్యలు దొరకలేదు. మొత్తానికి స్రవంతి గారు, శైలజ గారు, బాబాయ్ కొన్ని సమస్యలు ఇచ్చారు.

సమస్య (దత్తపది):- పూలజడ, క్రోధం, బుట్ట, వేపపువ్వు.
ఇచ్చింది: స్రవంతి గారు
పూరణ (ఆటవెలది):-
క్రోధమయ్యెనేమొ కొమ్మకు ఈవేళ
బుసలుగొట్టసాగె పూలజడదె
నాగసరమునూది కౌగిలిబుట్టలో
పెట్ట వేపపువ్వు పట్టుతేనె!
భావం:-
అమ్మాయికి ఈరోజు కోపం కలిగినట్టుంది, ఆమె పూలజడ బుసగొడుతోంది. నాగసరం ఊది (నాలుగు మంచిమాటలు చెప్పి) కౌగిలి అనే బుట్టలో పెడితే ఇప్పటిదాకా వేపపువ్వులాగా చేదునొలికిస్తున్న ఆమె, పట్టుతేనెలాగా తీయగా మారిపోతుంది. [[ మొదటి మూడూ చూసి నాకు అభినవశ్రీనాథుడైన వేటూరి పూనాడు. ఐతే ఆఖరిది చూడగానే "ఐస్క్రీం లో ఆవకాయముక్కలాగా" అనిపించింది. ఎప్పుడైనా అలాగ ఉంటేనే కదా పద్యాలు కాస్త తమాషాగా ఉంటాయి :) ]]


సమస్య (దత్తపది):- త్రివిక్రముడు, విక్రమార్కుడు, మూడు, మూర్ఖుడు
ఇచ్చింది: శైలజ గారు
పూరణలు:-
(ఆటవెలది) 
భార్గవ ఉవాచ:-
సాహసాన యినుడి సరి విక్రమార్కుడౌ
గనుకయట్లు బలినియనగఁదగును
మూడడుగులనిచ్చె మూర్ఖుడై నామాట
వినక ఏలనోత్రివిక్రమునకు
భావం:-
(వామనావతారం ముగిసిన తరువాత శుక్రుడనుకుంటున్నాడుట)
విక్రమార్కుడు అంటే విక్రమంలో అర్కుడితో (సూర్యుడు) సమానమైనవాడు అని అర్థం కాబట్టి, ఆ పేరు బలికి సరిపోతుంది. అట్టి (నా శిష్యుడైన) బలి నా మాటలను వినకుండా, ఆ మూడు అడుగులను త్రివిక్రముడికి (వామనుడికి) ఎందుకు ఇచ్చాడు? అహో!
(తేటగీతి)
సందీప ఉవాచ:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మంచి పేర్లు
కలిగి కూడ చెత్తగనుండు గదర మూడు!
ఇడియటనగమూర్ఖుడెయైన ఇంపుగుండు
వినగ మాటలు తోచు త్రివిక్రముండు
భావం:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మూడూ మంచి పేర్లు ఉన్నా కూడా చెత్తగా ఉంటాయి. అదే మూర్ఖుడు అనే అర్థం ఉన్న ఇడియట్ చిత్రం మాత్రం చాలా బాగుంటుంది. అందులోని మాటలు వింటే నాకు త్రివిక్రముడు (త్రివిక్రం శ్రీనివస్) గుర్తుకొస్తాడు.


సమస్య (దత్తపది):- మనసు, మాట, మౌనం, మనువు
ఇచ్చింది:- శైలజ
పూరణ (కందం):-
మునుపుటి మాటలనడిగిన
మనసుకు మిగిలిన బదులది మౌనంబేనా?
చనువుగ పలుకుమ! యంటిని
మనికితమును చూపి నేను మనువడిగితినా?
భావం:-
ఇదివరకుటిలాగా మాట్లాడమని అడిగిన నా మనసుకు నువ్వు ఇచ్చే సమాధానం మౌనమేమా? చనువుగా మాట్లాడమన్నానే కానీ, నా మనసులోని బాధ తెలిపి పెళ్ళిచేసుకోమని అడిగానా?



సమస్య (వర్ణన):- పల్లవి గారు గీసిన ఈ చిత్రాన్ని వర్ణించాలి.
ఇచ్చింది:- బాబాయ్ (రవీంద్ర)
పూరణ:-

సీసం:-
సూర్యునికిరణాలు సోకి చంద్రునివోలె అద్దంబు మెరిసె నీ అందమునకు
జడబిళ్ళ తొడిగిన పొడవైన నీ వేణి మణియున్న ఫణివోలె మదికి తోచు
బొమవింట బాణమై పొడిచెను తిలకంబు, సంపంగిముక్కుపై సరఘ నత్తు
ఆడజన్మఁగొనిన సౌందర్యమా! నీదు సొగసుచూడతరమా? శోభనాంగి?
ఆటవెలది:-
కోటిసిరుల మోము కొలను చందమునుండ
కళలు చల్లు కనులు కలువలౌన?
రాజసాన మెలగ రాజహంసలెయౌన?
రూపసామ్యమునకు చేపలౌన?
భావం:-
సూర్యుడి కిరణాలు తగిలి చంద్రుడు ఏ విధంగా వెలుగుతాడో, అదే విధంగా నీ అందం తగిలి అద్దం కూడా మెరిసిపోతోంది. జడబిళ్ళ తగిలించిన నీ అందమైన జడ పడగపై మణి ఉన్న నాగుపామును గుర్తుచేస్తోంది. నీ రెండు కనుబొమలూ చూస్తే ఒక ధనుస్సులాగా ఆ మధ్యన ఉన్న తిలకం బాణం లాగా అనిపిస్తున్నాయి. నీ ముక్కు సంపెంగపువ్వులాగా ఉంటే, దానిపైన ముక్కెర తుమ్మెద లాగా ఉంది. సౌందర్యమ ఆడజన్మ ఎత్తితే అది నువ్వేనేమో? నీ సొగసు చూడతరమా?
ఎన్నో కళలున్న నీ ముఖం, కొలనైతే - మృదువుగా ఉన్న నీ కళ్ళు కలువలవుతాయా? రాజసంగా అటూ ఇటూ కులుకుతున్నందుకు రాజహంసలవుతాయా? లేక, చూడటానికి చేప ఆకారంలో ఉన్నాయి కాబట్టి చేపలవుతాయా? (చెప్పవూ?) [[ ఈ పద్యాలకు స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఇంత అందంగా ఎవరైనా బొమ్మ గీస్తే కవిత్వం పొంగకుండా ఉంటుందా? ]]