Showing posts with label త్యాగరాజు. Show all posts
Showing posts with label త్యాగరాజు. Show all posts

Wednesday, December 7, 2011

శ్రీరామరాజ్యం పాటలు - 1

(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)

శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి  పాట గురించి కూడా చెప్పాను.

శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.

1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!

ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
  • "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
  • "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
  • "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
  • "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
పాట మొదటి చరణం ముందు వచ్చే వాయిద్యాల సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇళయరాజకు తప్పితే ఇంత ఆర్ద్రత కలిగించే సంగీతం ఎవరికి సాధ్యపడుతుంది అనిపించేలాగ ఉంది.

2. శ్రీరామ లేరా ఓ రామ!
    ఈ పాటలో ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేసారు జొన్నవిత్తుల. వాల్మీకి రామాయణం చదివితే రాముడి గురించి ఏమనిపిస్తుందో అలాగే ఉంది ఈ వర్ణన. ఒక్కో వాక్యమూ కడిగిన ముత్యం.
    • "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి"  - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
    • "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
    • "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
    • "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
    • "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
    • "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
    • "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
    •  "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
    • "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.

    3. ఎవడున్నాడీ లోకంలో

    ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.

    వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.

    • "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
    • "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు. 
    • "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
    • "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
    4. గాలి నింగి నీరు

    "ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!

    "గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.

    "విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం"  అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).

    "అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!

    "సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?

    5. సీతా సీమంతం

    పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.

    ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.

    "ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.

    6. రామ రామ రామ అనే రాజమందిరం

    చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.

    నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.

    ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
    • "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
    • "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
    • "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
    • "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
    • "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
    • "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
    రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.


    ఇంకా ఉంది...

    Monday, August 22, 2011

    వ్యాజనింద అలంకారం

    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజనిందాలంకారం 



    లక్షణం: నిందయా నిందయా వ్యక్తిః వ్యాజనిందా ఇతి గీయతే
    వివరణ: నింద వలన వేఱొక నింద స్ఫురించినట్టైతే అది వ్యాజనింద అవుతుంది.వ్యాజస్తుతికీ వ్యాజనిందా ఉన్న ప్రథమమైన భేదం - వ్యాజస్తుతిలో నిందా, స్తుతి - రెండింటిలో ఒకటి ప్రత్యక్షంగా, మఱొకటి పరోక్షంగా ఉంటాయి. ఐతే వ్యాజనిందలో ప్రత్యక్షంగా ఒక నింద ఉంటే పరోక్షంగా మఱొక నింద ఉంటుంది.


    ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
    ఏమి అనవలె విధిని మున్నేకశిరము నలియఁజేసిన హరునెన్నవలయుఁ గాక
    సం:- ఒకాయనకు బ్రహ్మ మీద కోపం కలిగింది. ఆయనను నిందించడానికి బలమైన మాటలు వాడఁదలచి ఈ మాటలన్నాడు. శివపురాణంలో బ్రహ్మకు ఉన్న ఐదో శిరస్సును శివుడు ఖండించినట్టుగా చెప్పబడింది. అందుచేత దాని ఆధారంగా బ్రహ్మను నిందిస్తున్నాడు.
    భా:- ఐనా విధిని ఏమీ అనడానికి లేదు. అసలు (నీది) ఒకటే తలను ఖండించి వదిలిన శివుడిని అనాలి. (మిగతా నాలుగు తలలు కూడా నరికి ఉండవలెను, అంటే అంత ఘోరమైన పని చేశావు, అని భావం).
    వి:- ఇక్కడ వాక్యం చూస్తే శివుడిని నిందిస్తున్నట్టుగా ఉంది. కానీ, నిజానికి బ్రహ్మని నిందిస్తున్నాడు. శివుడిని నిందిస్తున్నట్టుగా వ్యాజం చూపించి, వేఱొకరిని నిందించినందుకు ఇది వ్యాజనిందాలంకారం అయ్యింది.



    ఉదా:- (కీర్తన: నగుమోము కనలేని, రచన: త్యాగరాజు)
    ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో
    గగనానికి బహుదూరంబనినాడో
    సం:- త్యాగరాజు శ్రీమహావిష్ణువుని "నీ ముఖం చూడాలనుకుంటున్న నాకు ఎందుకు కనిపించట్లేదు" అని అడుగుతున్నాడు.
    భా:- ఒకవేళ గరుత్మంతుడు (ఖగ రాజు) నీ ఆజ్ఞ విని త్వరగా రావట్లేదా? లేక ఆకాశానికి నేలకీ చాలా దూరం ఉంది, నేను అంత దూరం ఎగరలేను అంటున్నాడా?
    వి:- ఇక్కడ త్యాగరాజు గరుత్మంతుడి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నట్టుగా ఉన్నా, విష్ణువు ఆజ్ఞ గరుత్మంతుడు కాదనడు అని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత పైకి విష్ణువుని సమర్థిస్తున్నా, కావాలని బలం లేని వాదన చూపించడం ద్వారా నువ్వు రాకపోవడానికి ఇంతకు మించి మంచి కారణం ఏమీ తెలియట్లేదు అంటున్నాడు. అంటే విష్ణువుకే మనసు లేక రావట్లేదు. ఆయనకు తన భక్తుడి మీద జాలి లేదు అని నిందిస్తున్నాడు.


    నిజానికి ఇది వ్యాజనింద కాదు అని కూడా వాదించవచ్చును. ఎందుకంటే ఖగరాజుని సూటిగా నిందించట్లేదు, అలాగే విష్ణువుని నిందిస్తున్నాడు అనడానికి కూడా ఎంతో ఆలోచిస్తే తప్పితే ఆధారం లేదు. కాకపోతే నాకు ఇది వ్యాజనింద అనిపించింది. చదువర్లకు కాదు అనిపిస్తే తప్పక సవరించగలరు.



    ఉదా:- (నిత్యజీవితంలో అనుకునే మాట)
    అసలు నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ.
    వి:- ఇది మనం రోజూ అనుకునే మాటే. ఒకరు మనం చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోతే వారిని తిట్టాలనుకుని, అది మంచిది కాదనుకున్నప్పుడు మనల్ని మనం నిందించుకున్నట్టుగా అనుకుంటూ వాళ్ళని నిందించడానికి ఇలాగ అంటాం కదా!



    చదువర్లకు మఱిన్ని ఉదాహరణలు తెలిస్తే తప్పక చెప్పగలరు.

    Thursday, October 14, 2010

    రూపకాలంకారం (metaphor)

    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> రూపకాలంకారము

    లక్షణం: విషయ్యభేద తాద్రూప్య రంజనం విషయస్య యత్
    వివరణ: ఉపమేయమునకు, ఉపమానము తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం 'రూపకం' అవుతుంది. మొదటిది అభేదరూపకం, రెండవది తాద్రూప్యరూపకం.

    మనం దేన్ని పోల్చదలుచుకున్నామో అది ఉపమేయమని, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానమని ఇదివరకే మనం తెలుసుకున్నాము.

    ఉదా: (చంద్రాలోకం)
    ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే

    ఇక్కడ "మహారాజు" అన్నది ఉపమేయం. "ఈశ్వరుడు" అన్నది ఉపమానం. నిజానికి ఈశ్వరుడు, మహారాజు వేరు వేరు. అయినప్పటికీ "సాక్షాత్తు" అన్న పదం ద్వారా వీరిద్దరికీ అభేదం (తేడా లేకపోవడం) చెప్తున్నాడు కవి. అంటే ఈశ్వరుడిలోని ధర్మాలన్నీ ఈ మహారాజులో ఉన్నాయి అని కవి భావం. ఈశ్వరధర్మాన్ని మహారాజుకు ఆపాదించడం కోసం కవి వీరిద్దరికీ అభేదాన్ని చెప్పాడు కనుక ఇది అభేదరూపకం అవుతుంది.

    రూపకసమాసం విగ్రహవాక్యవిధానం తెలిస్తే తాద్రూప్యరూపకం గురించి తెలిసినట్టే. ఈ క్రింది ఉదాహరణ చూద్దాము.

    ఉదా: (సౌందరనందం, రచన: అశ్వఘోషుడు)
    కామవ్యాథుని చేత మనుష్యహరిణములు చంపబడుచున్నవి.

    ఈ ప్రయోగంలో రెండు రూపకాలంకారాలు ఉన్నాయి. మొదటిది: "కామవ్యాథుడు" అంటే "కామము అనెడి బోయవాడు" అని భావం. కామానికి, బోయవానికి ఉన్న తాద్రూప్యాన్ని (similarity) చెప్తోంది కాబట్టి ఇది రూపకలాంకారం అవుతుంది. ఇక రెండవది: "మనుష్యహరిణము" అంటే "మనిషి అనే లేడి". వేటాడబడటంలో (కామము చేత) మనిషికి, (బోయవాని చేత) లేడికి కల తాద్రూప్యాన్ని చెప్తోంది కనుక ఇది కూడా ప్యరూపకాలంకారం అవుతుంది.

    ఉదా: (మనుచరిత్ర, రచన: అల్లసాని పెద్దన)
    విలోకన ప్రభావీచికలన్ తదీయ పదవీకలశాంబుధి వెల్లి గొల్పచున్

    పద్యంలోని ఈ పాదానికి భావం, "చంద్రుని కిరణాల వలన సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడతాయో, అదే విధంగా వరూధిని చూపులు తాకి ప్రవరుని బాట పొంగిపొరలుతోంది", అని. ఇక్కడ "పదవీకలశాంబుధి" అనడంలో పదవికి, కలశాంబుధికి తాద్రూప్యాన్ని చెప్పడం ద్వారా ఇది రూపకాలంకారమైంది.

    ఉదా: (అంతర్యామి అలసితి సొలసితి, రచన: అన్నమాచార్యులు)
    కోరిన కోర్కెలు కోయని కట్లు
    భారపు పగ్గాలు పాపపుణ్యములు
    మదిలో చింతలు మయిలలు మణుగులు

    ఈ వాక్యాలన్నింటిలోనూ రెండు విషయాలకు అభేదాన్ని చెప్తున్నారు మహానుభావులు అన్నమాచార్యులు.

    ఉదా: (రఘువంశసుధాంబుధిచంద్ర, రచన:  పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్)
    రఘువంశసుధాంబుధిచంద్ర! శ్రీరామ రామ రాజరాజేశ్వర!

    రఘువంశసుధాంబుధి అంటే "రఘువంశము అనెడి అమృతం నిండిన సముద్రం" అని అర్థం. ఆ రెండింటికీ అభేదం చెప్పాడు. అక్కడితో ఆగక, చివరన "చంద్ర" అని చేర్చడంతో "రఘువంశమనే సముద్రానికి చంద్రుడవు" అని శ్రీరాముణ్ణి అనడంతో చంద్రుడి ధర్మాలను శ్రీరామచంద్రుడికి ఆపాదించి తాద్రూప్యరూపకాలంకారాన్ని సమర్పించుకున్నాడు కవి.


    మహామహులైన కవులు తమ భావనాబుభుక్షను చల్లార్చుకోవడానికి రూపకాలంకారాన్ని సేవించారు. వారందరి ప్రయోగాలనూ ఒకచోట చెప్పడానికి నాబోటి సామాన్యుడికి రెండుమూడు జన్మలు కూడా చాలకపోవచ్చును.ఇదే అలంకారాన్ని మన చలనచిత్రకవులు కూడా చాలా వాడారు. కొన్నిసార్లు ఉచితమైన సందర్భాలకు వాడితే కొన్ని చోట్ల ఈ అలంకారానికి అవమానం కలిగించే విధంగా వాడారు. మనం ఉచితమైనవే చెప్పుకుందాం.

    ఉదా: (పాట: ధన్యోహం ఓ శబరీశా, చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్మ్యం, రచన: వేటూరి)
    ఉత్తుంగ శబరిగిరిశృంగా, నిత్యనిస్సంగ, మంగళాంగ, పంపాతరంగపుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగా!

    "మునుల యొక్క హృదయములు అనెడి తామరపూవుల మీద వాలే తేనెటీగ" అనే లోతైన భావాన్ని వేటూరివారు సంస్కృతభూయిష్టంగా చెప్పారు.


    ఉదా: (పాట: సన్నజాజిమంచమెట్టి, చిత్రం: రాంబంటు, రచన: వేటూరి)
    చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వపెట్టి...




    చదువర్లకు తెలిసిన కావ్యాలు, కీర్తనలు, పాటల్లోని రూపకాలంకారాలను గుర్తించి చెప్పగలరని ఆశిస్తున్నాను.

    Sunday, April 13, 2008

    శ్రీరామనవమి సందర్భంగా...

    భారతదేశ చరిత్రకు, కవిత్వానికి, సంస్కృతికి శ్రీరాముడు ఆధారం. మన ఆదికవి వాల్మీకి, మన పరిభాషలో శ్రీరాముడు అనేవాడు నిజమైన, నికార్సైన, స్వచ్చమైన మనిషి. మానవాళికి మార్గదర్శకుడు.

    ఒక ఆంగ్లేయుడు రామాయణము చదివి "Burn all the libraries. Keep Ramayana", అన్నాడు. అదే నేను నమ్ముతాను కూడా. రామాయణం/రాముని గొప్పదనం హనుమంతుడు పట్టాభిషేకానికి ముందు చెప్తాడు. రాముడు రావణున్ని చంపి, సీతాదేవికి అగ్ని పరీక్ష ముగించిన తరువాత హనుమంతుడితో: "హనుమా, నువ్వు ఒక్క సారి అయోధ్యకు పోయి, నా తమ్ముడు రాజ్యకాంక్షతో ఉన్నాడా, లేక నా గురించి ఎదురు చూస్తున్నాడా అన్నది చూసి రా. నా తమ్ముడు దేనిపైనైనా ఆశపడితే అది నేను తీసుకోలేను. వాడు రాజ్యం చేస్తేనే నాకు సంతోషం.", అన్నాడు. హనుమంతుడు శరవేగంతో వెళ్లి అయోధ్యలో చూస్తే: భరతుడు రాముని పాదుకలు ఎదురుగ పెట్టుకుని "మా అన్నయ్య రాకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను", అని కూర్చున్నాడు. అది చూసి హనుమంతుడు వెనుదిరిగి వెళ్తూ ఒకటి అనుకున్నాడు: "ఆహా, ఏమి మానవనీతి, (వానరుడు) సుగ్రీవుడు రాజ్యం కోసం అన్నను చంపించాడు, వాలి తమ్ముడి మీద కోపం తో చంపేద్దాం అనుకున్నాడు, (రాక్షసుడు) విభీషణుడు సొంత అన్న గుట్టు రట్టు చేసి చంపించాడు. కానీ, తమ్ముడికి రాజ్యకాంక్ష ఉంది ఏమో అని అన్నయ్య, అన్నయ్య రాడేమోనని దుఃఖంతో తమ్ముడు ఇంత అభిమానంగా ఎదురు చూస్తున్నారు - వీరే ధన్యులు!" అనుకున్నాడు. అదే రామాయణము. రామాయణము అంటే "రామస్య అయనం", అంటే రాముని బాట. అది మన అందరికి బాట కావాలి. అప్పుడే మనం సన్మార్గంలో ఉన్నట్టు.

    రాముడు అంటే నాకు గుర్తోచ్చేవి కొన్ని ఉన్నాయి: లక్ష్మణుడు, హనుమంతుడు, త్యాగరాజు, ఋషులు, అరణ్యాలు, నారబట్టలు, శౌర్యం, అందం, గోదావరి సినిమా. ఇంకా చాల ఉన్నాయి. కానీ ఇక్కడితో ఆపుతాను.

    నేను ఈ బ్లాగ్ లో మొదట వ్రాసిన టపనే అది. "ఓడను జరిపే ముచ్చట గనారే వనితలారా మీరు...." అని. త్యాగరాజు, హనుమంతుడు, లక్ష్మణుడు భక్తికి పరాకాష్టలు. త్యాగరాజు తొంభై కోట్ల సార్లు రామ అన్నాడుట. మనం జీవితాంతం ఒక్క కొటి సార్లు అయినా రామ అంటామో లేదో! నన్ను అందరూ సందీప్ అని పిలిచేవారు. ఇప్పుడు నా ఆఫీసు లో వాళ్ళకి కొంచం పుణ్యం అందిద్దాం అని రామ అని పిలువమన్నాను. ఇక రామ అని ఎవరు అన్నా నా మనసు పలుకుతుంది. పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి.

    రామాయణంలో పిడకలవేట లాగా ఈ గోదావరి సినిమా గురించి ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారేమో! గోదావరి సినిమా లో నాకు నచ్చిన అంశం ఏమిటి అంటే వేటూరి ఆ సినిమాలో ప్రతి పాటలోనూ రాముణ్ణి గుర్తు చేసాడు. ఆ సినిమా నిజంగా రామాయణం దారిలో ఉంటుంది. నాకు నచ్చిన కొన్ని వాక్యాలు:

    • శబరీ కలిసిన గోదారి రామచరితకే పూదారి...
    • ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ? నది ఊరేగింపులో పడవ మీద లాగా...ప్రభువు తానూ కాగా...(ఓడను జరిపే...)
    • రాముడైనా దేవుడైనది ప్రేమ కోసం కదా...
    • ఎర్రజాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే...
    • ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే, ఎడమ చేతన శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే, ఎత్తగలడా సీతజడను తాళి కట్టే వేళలో...?
    • కన్నీరైన గౌతమి కన్నా (అహల్యను గుర్తు చేస్తూ)
    • గతమేదైనా స్వగాతమననా, నీ జతలోనే బ్రతుకనుకోనా...రాముని కోసం సీతలా...
    • రాములోరికేరుకలే
    ఇక సంస్కృతంలో నాకు నచ్చిన ఒక శ్లోకం:

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
    సహస్రనామ తత్+తుల్యం రామ నామ వరాననే ||

    దీని అర్థం రెండు విధాలగా ఉంది.

    ఒకటి శివుడు పార్వతీదేవికి చెప్తాడు:
    సం: "వరాననే, మనోరమే! శ్రీరామ రామ రామేతి రమే రామే. రామనామ సహస్రనామ తత్ తుల్యం!"
    తె: " వరములు చిలికే ముఖము కల నా హృదయేశ్వరీ, శ్రీరామ శ్రీరామా అంటూ నేను రాముని (రామ అనే పేరు) యందు పరవశిస్తూ ఉంటాను. ఒక్క పేరే వెయ్యి పేర్లకు సాటి!".

    మరొకటి నా బోటి సామాన్యుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ చెప్పుకునేది:
    సం: "శ్రీరామ, రామ, రామ ఇతి, రామే, మనోరమే, వరాననే రమే! రామనామ, సహస్రనామ తత్ తుల్యం!"
    తె: "శ్రీరామా రామ రామ అంటు నేను వరములు చిలికే వాడు, మనస్సును ఉల్లాసపరిచేవాడు ఐన రాముని యందు పరవశిస్తూ ఉంటాను. ఒక్క పేరే వెయ్యి పేర్లకు సాటి".

    సంస్కృతంలో " పుంలింగ సంబోధన ప్రథమ విభక్తి", "స్త్రీలింగ సప్తమీ విభక్తి" ఒకే మాదిరిగా ఉండుట చేత చేసిన విన్యాసం ఇది. కవి ఎవరో కచ్సితముగా తెలియదు కానీ, మహా గొప్పగా ఉంది కదూ.

    ఇక శ్రీరామ నవమిరోజు, ఏమైనా రామ అని ఒక్కసారి అనుకుందాం అని అనిపిస్తే: http://surasa.net లో ఉన్న "ఉషశ్రీ రామాయణము" లేక/మరియు "సామవేదం షణ్ముఖ శర్మ గారిచే చెప్పబడిన ఉపన్యాసములు" వినగలరు. ఇక్కడ ప్రస్తావించిన చాల విషయాలు అందులోనివే.

    ప్రస్తావములు:
    http://www.geocities.com/vayudevaru/summaryofWorks.htm