ఎక్కడివయ్యా నీకీ పదములు
చక్కగ అమరెను చక్రి పదములకు
ఏరి నా విభుని, ఏడు కొండలపై, కోరి కీర్తనలఁ కొలిచెడివారని
నారదుడే నీ నాలుకముంగిటఁ, బారఁగఁ జేసెనా మహతీఝరులను
ఎక్కడివయ్యా ||
ఎలకోకిలలా చిలుకగ పలుకులఁ, అలకల కులుకుల కలికి శ్రీరమణి
పలుకుతేనెలతల్లి పద్మావతియే, చిలికినదా నీ జిహ్వపై సిరుల?
ఎక్కడివయ్యా ||
అలమేల్మంగ అధరామృతమును, అలదుకొన్న శ్రీహరి పెదవులపై
పులకలు పొడమ పొంకపుమాటలఁ, తొలకాడిన స్వరధుని లోతులలో
ఎక్కడివయ్యా ||
నెలకొనె హరి నా నేలకు వచ్చి, కొలువుఁదీరెనే కొండలపైనని
తలచి పదములను దాచి పంపెనో, తెలుగుతల్లి నీ దివ్యహృదయమున
ఎక్కడివయ్యా ||
ఈ పాటలో అన్నమయ్య శైలిని సాధ్యమైనంతవరకు అనుసరించాను.ప్రాసాక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. యతి అక్షరాలను ముద్దగా (bold) దిద్దాను.