Showing posts with label ప్రకృతి. Show all posts
Showing posts with label ప్రకృతి. Show all posts

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

Tuesday, October 9, 2012

అంతా మాయే, అన్నీ ఆమే/అమ్మే

 శా:-

స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్
మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్
కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్
సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే!

 భా:-

బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, మగవారిని దహించే కామాగ్నివీ నీవే. సన్యాసులు, భోగులు ప్రార్థించే శర్వాణివి నీవే.

శివుడు బ్రహ్మం, పార్వతి మాయ. ఆ రెండూ ఒక్కటే. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు: తడి, నీరు వేఱు వేఱుగా ఉంటాయా? తడి లేకపోతే అది నీరే కాదు. నీరే లేకపోతే అసలు తడే ఉండదు.

Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (3)

"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా వ్రాసారని ఆయనకు అనిపించిందేమో.

ఇక ప్రణయం, శృంగారం సందర్భంగా వేటూరి వ్రాసిన వానపాటలను చూద్దాము. ఇలాంటి పాటలు వేటూరి బోలెడు వ్రాసారు. ఒక్కో పాటకు శృంగారం పాళ్ళు ఒక్కోలా ఉంటాయి. కొన్ని పాటలలో వాక్యాలు ఇక్కడ వ్రాయడానికి కూడా ఇబ్బందిపెట్టేవి ఉన్నాయన్నమాట వాస్తవమే. అందుకని చర్చించే పాటలను శృంగారం మోతాదుని బట్టి వరుసపరిచాను.


వేటూరి వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన classic కే.వీ.మహాదేవన్ స్వరపరిచినది. ఇది కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "వేటగాడు" చిత్రంలో "ఆకు చాటు పిందె తడిసే" అనే పాట. పాట చిత్రీకరణ ఎంత శృంగారసూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంది అని నా అభిప్రాయం.
ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే
పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు. అందుకేనేమో పల్లవిలో నాయకుడు ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెప్తోంది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే
ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందట. మంచి భావుకత మాత్రమే కాదు అది వ్యక్తపరచడానికి పదాలపై పట్టూ ఉండాలి. వేటూరి వీలైనంతవరకు పదాల మధ్యన యతి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ముద్దిచ్చి, ముత్యం; చిగురాకు, సిరిమువ్వ; తాకి, డియారు గమనించండి. అలాగ వ్రాసిన పంక్తులు నాలుకపైన సులువుగా ఆడుతాయి.
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
నాయకుడు చినుకు గురించి చెప్తుంటే, నాయిక మెరుపు గురించి చెప్తోంది. మొదటి పంక్తిలో మెరుపు ఆమె చూపుల్లో తనపై ఉన్న ఆకర్షణకు చిహ్నం అని అనిపిస్తోంది. అలాగ జరుగుతుంటే ఆమె మనసులో ఒక కోఱిక మఱొక మెరుపైందట. ఇంతలో అబ్బాయి చూపు మఱొక మెరుపు, నవ్వు మఱొక మెరుపు అయ్యి అంతటా మెరుపులే కనిపిస్తున్నాయట.
నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి,
చలిని పెంచి, చెలిమి పంచి, తలలు వెచ్చంగా తడియార్చుకోవాలి
నాయిక పాటకు వర్షం మరింతగా పెరిగితే, ఆమె తన ఒళ్ళు జలదరించడంలో ఉన్న సోయగాన్ని అతడికి ముడుపు చెల్లించుకోవాలట. అది వారి నడుమ ప్రణయాన్ని బలపర్చి, వారిద్దరూ దగ్గరవ్వాలని అతడి కోఱిక. ఈ పంక్తిలో నాకు నచ్చింది "నీ విరుపులు ముడుపులిచ్చి" అనడంలో శృంగారమే కాక సౌందర్యం కూడా చాలా ఉందని నా అభిప్రాయం.


"కేక" చిత్రంలో చక్రి స్వరపరచిన పాటను చూద్దాము. ఒక యువకుడు, ఒక యువతి వానలో ఉన్నారు. పెద్దగా పరిచయం లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చి line వేస్తున్నాడు. ఈ సందర్భంలో శృంగారానికి ఎక్కువ తావు లేదు. అబ్బాయి అమ్మాయిని పదే పదే తమ మధ్యన కలిగిన ప్రణయభావాన్ని బయటపెట్టమన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి దానికి ఇంకా సమయం రాలేదన్నట్టు చెప్తుంది.
అ: మెరిసే మేఘం కురిసేదెప్పుడో
ఆ: కురిసే వర్షం వెలిసేటప్పుడే

అ: ముసురుకున్నది ఏదో చిలిపి కోరిక
ఆ: ముదరనివ్వకు కథలే చాలు చాలిక
వర్షం కురియాల్సినప్పుడు కురుస్తుంది కానీ, అడిగితే కురవదు కదా. అలాగే వలపు కూడా అంతేనని ఆమె భావం.
అ: మెరిసే తొలకరిలో నిను కనులారా చూసా
ఆ: చలిలో గిలిగిలిలో కొసమెరుపులు ఆరేసా
అబ్బాయి వానలో అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని చెప్తుంటే తను చూపించింది కేవలం కొసమెరుపులు మాత్రమేనని అమ్మాయి చమత్కరించింది. అంటే ఆ వాన స్వయంగా అందంగా ఉంటే దానికి చిగురున అమ్మాయి మరింత మెరుపు అద్దిందని అయి ఉండవచ్చును, లేక అమ్మాయి అందం తను ఇంకా కొస మాత్రమే చూసాడని అయి ఉండవచ్చును. బహుశా ఆయన శ్లేషనే ఉద్దేశించి ఉండవచ్చును. వేటూరి పాటకు "ఇదే" భావం అని ఆయన తప్పితే వేఱెవరూ చెప్పలేము.
అ: ముసిరే గాలివానలలో ముదిరే ముద్దుపిలుపులలో
ఆ: తడిసే వానచినుకులలో పడకు మత్తుకవితలలో
 ఇక్కడ కూడా అబ్బాయి ముందుకు మనసులోని ఆలోచనలకు అమ్మాయి కళ్ళాలను వేస్తోంది. ఇక్కడ ఏడు రంగులను చిలకడం అనే ప్రయోగం నాకు నచ్చింది.
అ: ఆడపిల్ల మాటలే అందమైన మాయలే, అర్థమైతే చాలులే అంతకంత హాయిలే
ఇది వేటూరి ముద్ర. ఆడపిల్ల మాటలు అందమైన మాయ. నిజమే "ఆడువారి మాటలకు అర్థాలు వేఱులే"  అనే ఎప్పుడో పింగళి చెప్పారుగా. ఆ మాటలు నిజంగా అర్థమైతే ఆ మాయ ఎంత లోతు అంతకంతా హాయి కలుగుతుందిట. అద్భుతం. నాలుగు ముక్కలలో అమ్మాయిల మాటల గురించి చెప్పారు.
ఆ: ఉడికే వయసులలో తొలి గిలిగింతల వాన
అ: చినుకే చిటపటగా దరువేసెను మదిలోన
గ్రీష్మమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షఋతువులో తొలకరి కురుస్తుంది. ఉడికే వయసులు అనడంలో యవ్వనాన్ని గ్రీష్మంగా వర్ణిస్తూ, వలపును వానగా చెప్తున్నారు. "టప్ టప్" అంటూ పడటాన్ని "దరువు" వేయడం అనడం సరదాగా ఉంది.


"ఆఖరి పోరాటం" లో వేటూరి-ఇళయరాజ-బాలు-లతా మంగేష్కర్ కలిసి చేసిన పాటలో రెండు వాక్యాలు అద్భుతంగా కుదిరాయి.. వాటి అర్థం లతా మంగేష్కర్ కి చెప్తే ఆవిడ చాలా సంబరపడి మెచ్చుకున్నారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయిలో చెప్పారు. ఆ రెండు వాక్యాలు కూడా వర్షానికి సంబంధించినవే.

ఆషాఢం ఉరుముతుంటే, నీ మెరుపే చిదుముకున్నా
హేమంతం కరుగుతుంటే, నీ అందం కడుగుతున్నా
ఈ పాటలో కూడా ("నిరంతరమూ వసంతములే" పాటలో లాగ) వేటూరి ఋతువులలో ప్రేమికుల భావాలను వర్ణించారు. కాకపోతే ఇందులో శృంగారాన్ని వర్ణించారు. కానీ, ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా వ్రాసారు. ఆషాఢ మాసంలో మేఘాము ఉరుముతుంటే మెరుపు మాత్రం అమ్మాయి ఒంట్లోనుండి వచ్చినట్టు అనిపిస్తోందట, అబ్బాయికి. హేమంతంలో మంచు కరుగుతూ ఉంటే దానితో అతడు ఆమె అందాన్ని కడుగుతున్నాడట. అద్భుతం!


"అడవి దొంగ"లో "వానా వానా వందనం" అనే పాటని చూద్దాము. ఈ పాట అంతా అంత్యప్రాసతో వ్రాసారు. కొన్ని చోట్ల పదాలు ఇరికించినట్టు అనిపించాయి కానీ కనీసం ఆ పదాలు రివాజు పదాలు కాదు. అందుచేత ఎబ్బెట్టుగా లేవు.
చలి పెంచే నీ చక్కదనం, కౌగిట దూరే గాలిగుణం
గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
(అ) మెరుపుని నీలో చూస్తుంటే, (ఆ) ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపు ఋణం
అమ్మాయిని అబ్బాయిని గాలివానతో పోల్చడం కొత్తగా ఉంది. అబ్బాయిని గంభీరమైన ఉరుముతోనూ, అమ్మాయిని అందమైన మెరుపుతోనూ పోల్చి వాటిని సృష్టించిన వానదేవుడి ఋణం తీర్చుకోవడానికి వాళ్ళు కౌగిలించుకోవాలని కవితాత్మకంగా చెప్పారు. ఇదే పాటలో రెండో చరణంలో అంత చెప్పుకోదగిన అంశాలు కనబడలేదు. ఎంతటి వేటూరైనా ఒక చిత్రంలో వానపాట hit అయిందని ప్రతీ చిత్రంలోనూ వ్రాయమంటే ఇదే జరుగుతుందేమో.


"యముడికి మొగుడు" చిత్రంలో రాజ్-కోటి సంగీతసారధ్యంలో చిరంజీవి, విజయశాంతుల నడుమ సాగే వానపాటలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చూద్దాము.
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా?
మళ్ళీ అబ్బాయి ఊపిరిని వర్షఋతు గాలులతో, అమ్మాయి వయసుని గ్రీష్మఋతు వేడ్మితో పోల్చారు. ఇందాకటి పోలికకి ఇప్పటికి పదాలన్నీ మారిపోయాయి గమనించారా? అది వేటూరి పదాల గారడీ.
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో
అమ్మాయిని వాన నుండి రక్షించడానికి అన్నట్టు అబ్బాయి ఆమెను వాటేసుకున్నాడట. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు. ఉన్న విషయాన్ని అబ్బాయి సరదాగా చెప్పడం బాగుంది.
ఆ: వడగట్టేసి బిడియాలనే వొడి చేరాను వాటేసుకో
"డ" అనుప్రాస కోసం, బిడియాలని వదిలిపెట్టడాన్ని "బిడియాలను వడగట్టాను" అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు లోతైనవి కాకపోవచ్చును. కానీ మామూలు భావాలని మళ్ళీ మళ్ళీ అవే పదాలతో వాడకుండా వేఱుగా చూపించడం చలనచిత్ర కవికి కావలసిన లక్షణం. వేటూరి ఈ పాటల్లో మనకు చూపించింది అదే.


వేటూరి చిరంజీవికి చాలా వాన పాటలు వ్రాసారు అని ఇప్పటికే చదువర్లు గమనించి ఉంటారు. ముచ్చటగా మూడో చిరంజీవి పాట. "అన్నయ్య" చిత్రంలో మణిశర్మ స్వరపరిచినది. వాన పాటలో కొన్ని ఎబ్బెట్టు వాక్యాలుండటం సహజమే కానీ ఇందులో పల్లవిలో మొదటి వాక్యం కొంచెం ఎబ్బెట్టుగా వ్రాసారు. అది పక్కన పెడితే ఇందులో కొత్తగా వాడిన ప్రయోగం ఏమిటంటే ప్రేమకు ప్రాసగా "తేమ"ను వాడారు.
ప్రేమ రాగం, తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మళ్ళీ వేటురికి నచ్చిన ఆషాఢం, మేఘాలు, దేశం, పదాలు వచ్చాయి. కాకపోతే ఇదివరకుటి వరసలో కాదు, ఆ భావంతో కాదు.
ఆషాఢ మాసంలో, నీటి అందాల ముసుగుల్లో
మేఘాలదేశంలో, కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డ ఒంటినిండా ఈడు కుంపట్లు రాజేస్తే
ఆషాఢ మాసం వర్షం ముసుగులో అమ్మాయికి అబ్బాయితో ఏర్పడిన బంధం (మెరుపు ఆకర్షణకు, కలలకు చిహ్నంగా వాడి ఉండవచ్చును)  ఆమెలో దాహాన్ని రేకెత్తించింది (అబ్బాయి వర్షం అన్నమాట).
పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించి ఒడుపుల్లో
చిత్రంలో అమ్మాయి దగ్గర గొడుగు లేక అబ్బాయి గొడుగులోకి వస్తుంది. ప్రణయానికి చిహ్నంగా ఆ గొడుగుని పూలంగి గొడుగు అంటున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే గొడుగుకి ప్రాసగా "ఒడుపు" అనడం. అంటే అమ్మాయికి తన మనసులో ఉన్న విషయం తెలియకుండా గొడుగులోకి లాక్కుంటున్నట్టుగా పట్టుకోవడం. ఇలాంటి చమత్కారాలు వేటూరి ప్రత్యేకత.


ఇప్పుడు "బంగారు బుల్లోడు" చిత్రంలో రాజ్-కోటి బాణీ వలన బాగా ప్రజాదరణ పొందిన పాటని చూద్దాము.
అ: స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన
ఆ: సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వచ్చే వానని స్వాతివాన అంటారు. ఈ సమయంలో నత్తచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది అని ఒక నుడి. అందుకే అబ్బాయి ఒక స్వాతీసాయంత్రం వేళ వాన తనని  "ముత్యమంత ముద్దు" లాగా ముట్టుకుంది అంటున్నాడు. అమ్మాయి వాన గురించి కాక, చీకటి తనలో సిగ్గు కలిపిస్తోంది అంటోంది. వాన పాటల్లో ఈ పల్లవి కొంచెం కొత్తగా అనిపించింది, నచ్చింది.  ఈ పాటలో వేటూరి మెరుపులకు, ఉరుములకు కొత్త అందాలను అద్దారు.
మేనక మెరుపులు, ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
మేనక మెరుపు అనడంలో ఆమె అందాలు అనే అర్థం ఉంది, ఊర్వశి ఉరుములు అనడంలో నాకు లోతైన అర్థమేమీ కనబడట్లేదు. కేవలం యతి కోసం వాడి ఉంటారు. రెండో చరణంలో వేటూరి కొంచెం శృంగారం పాళ్ళని పెంచారు.
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుముల కొమ్మల తొడిమలు వణికే వాన
ఇక్కడ అన్నిటికీ రెండు రెండు అర్థాలు ఉన్నాయి. మనం మామూలు అర్థాన్నే చూద్దాము. పూవులపై తుమ్మెదలు వాలి తేనె పీల్చుకోవడం వలన మిగిలిన మరకలను ఈ వాన కడుగుతోందిట. వాన ధాటికి వాలిపోతున్న తొడిమలు వణుకుతున్నాయట. వాన శృంగారాన్ని సూచిస్తోంది అని పూవులని, తేనెటీగలను అడ్డుపెట్టుకుని చెప్పారు. ఇంక వెతుక్కునవాళ్ళకు వెతుక్కున్నంత.
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఇక్కడ వేటూరి చిలిపిదనం నాకు బాగా నచ్చింది. వాన-వల్లప్ప పాటలో లాగానే గొడుగులో గుస-గుసని వర్ణిస్తూ నాలుగు అడుగుల గొడుగులో ఇద్దరు సర్దుకోవడానికి ఇబ్బంది పడటమే వాన (అందుకోసమే వాన) అంటున్నారు.
గాలివాన గుళ్ళోన ముద్దేలే జేగంట
గాలి-వాన వచ్చినప్పుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే జంట దగ్గరవ్వడమే మార్గమనడానికి పై వాక్యం. భావలకోసం కానీ, పదాల కోసం కానీ వేటూరి వెతుక్కోరు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఇది వినగానే, "కేక" చిత్రంలో ఇందాక మనం ప్రస్తావించుకున్న పాటలో "వానదేవుడొచ్చినప్పుడే వయసే మొక్కు తీర్చుకోక తప్పదు. చినుకు తేలు కుట్టినప్పుడే జతగా మంత్రమేసుకోక తప్పదు" అనే పంక్తులు గుర్తొచ్చాయి.


వేటూరి భావాల కంటే, ఆ మాటకొస్తే అర్థం కంటే లయకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్రాసిన పాటలు "అల్లరి అల్లుడు" చిత్రంలో కీరవాణి స్వరపరిచినవి. నాకు గుర్తున్న అన్ని పాటల్లోనూ వేటూరి భావాలకు కొంచెం అన్యాయమే చేసారు. ఇందులో "కమ్మని ఒడి బొమ్మని" అని ఒక వాన పాట ఉంది. అందులో రెండో మూడో వాక్యాలు బాగున్నాయి.
మిడిసిపడకె తొలిసొగసు మొగలిపూరేకా! కస బుస కస కసిగా
పడగ విడిచి విరిపడక పరుచుకున్నాగా పగ వగ ఇదే పదరా
అమ్మాయిని మొగలిపూవుతో పోల్చడం రివాజే. ఈ వాక్యాల్లో వేటూరి శృంగారంలో అబ్బాయి తగువుని, అమ్మాయి తెగువని కొంచెం భిన్నంగా చెప్పారు అని నా అభిప్రాయం.


ఇక చివరిగా వేటూరి వ్రాసిన వానపాటల్లోకల్లా అత్యంత బూతుగా అనిపించిన వాక్యాన్ని చెప్తున్నాను. అసలు ఇది వ్రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఎంత బూతునైనా వేటూరి పదాల మాయలో అందంగా కనబడేలాగా చేయగలరు అని చెప్పడానికే వ్రాస్తున్నాను. ఇది "నా అల్లుడు" చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన "పట్టుకో పట్టుకో" అనే పాటలోనుండి.
అందము తడిసిన వేళ, ఆడది ఒక జ్వాల
కూసం విడిచిన వేళ, కుదుపుల ఉయ్యాల
గమనిస్తే రెండు వాక్యాలలోనూ ఆది ప్రాస, అంత్యప్రాస కూడా కలిపారు.

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

Saturday, March 20, 2010

గురుచరణం శరణం - ఇళయరాజ

మలయాళంలో వచ్చిన "గురు" చిత్రం కథ వింటేనే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ కథ గురించి నేను గతంలో ఒక ఆంగ్లటప వ్రాశాను. ఈ చిత్రం ఎవరైనా మలయాళస్నేహితుడితో కలిసి చూడాలన్నది నా కోరిక. ఇందులో ఇళయరాజ  స్వరపరచిన "గురుచరణం శరణం" అనే పాట, నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈ పాటలో ప్రతీ స్వరం భక్తిని, దయని నింపుకుంది. ఈ పాటను ఎలాగైనా ఆంధ్రీకరించాలన్న నా తపన ఈ రోజు తీరింది.

నాకు వీలైనంతగా ఈ పాటలో భక్తిరసాన్ని, భగవత్తత్వాన్ని నింపాను. పల్లవిలో "గురుచరణం" అన్నది మార్చి "నీ చరణం",  అని వ్రాయడానికి కారణం బాణీలో ఉన్న భక్తితత్వానికి  తగ్గట్టుగా భావాలకు ఇంకా విశాలమైన ప్రాంగణాన్ని కల్పిద్దాము అని. గురువుని కంటే భగవంతుడిని పొగడటానికి అవధులు తక్కువ - అందుకని.

మొదటి చరణంలో పంచభూతాలు, ఆకాశం (గగనం), నీరు (వరుణం), నేల (భువనం), గాలి (పవనం), నిప్పు (సూర్యుడు) అన్నింటినీ భగవంతుడి సృష్టిగా వర్ణించాను. ఇందులో తిగ్మతేజం అనడంలో నా ఉద్దేశం "వేడి కలిగిన ప్రకాశం" అని. కొంచం సంస్కృతభూయిష్టంగా ఉన్నా సందర్భానికి తగినట్లు ఉందని వ్రాయాల్సివచ్చింది. రెండవ చరణంలో ప్రకృతిలో ఉన్న అన్ని విశేషాల వెనుకా ఉన్నది ఆ పరమాత్ముడే అనే భావాన్ని కలిగేలా ప్రయత్నించాను. చివరగా ఆ పరమాత్మకు నమస్కారాలను సమర్పించాను.

చిత్రం: గురు (1997- మలయాళం)
దర్శకుడు: రాజీవ్ ఆంచల్
సంగీతం: ఇళయరాజ
మలయాళంలో గీతకర్త: రమేశన్ నాయర్


నీ చరణం శరణం స్వామీ! భవభయహరణం
పరమాణువు మొదలు జగం, నీ వశమేగా సకలం
ఆధారమై గావరా!

గగనం, నీలిమేఘం, వరుణం, ఇంద్రచాపం,
భువనం, హరితచేలం, పవనం, పుష్పగంధం,
చలిని తొలచు తిగ్మతేజమై, కనులు వెతుకు కాంతిపుంజమై
వెలయు రవీ [ఓంకారరూప] నీ మహిమే! [ఓం శాంతి ఓం]

కులికే కోకిలైనా, ఉరికే జింకలైనా
కురిసే చినుకులైనా, మురిసే ఆకులైనా
వెనుకనున్న ఉనికి నీవుగా!
విశ్వమంత నీకు రూపుగా
వెలసితివే! [ఆనందరూప] ప్రణతులివే [ఓం శాంతి ఓం]

Wednesday, January 6, 2010

నిత్యజీవితంలో పద్యాలు!

ఈ మధ్యన మళ్ళీ చింతా రామకృష్ణారావుగారు, శైలజ గారు, ప్రియదర్శిని నా చేత కొన్ని పద్యాలు వ్రాయించారు. అవి ఇక్కడ వ్రాస్తున్నాను. విమర్శించ మనవి!

[ రామకృష్ణారావుగారు ఇచ్చట అడిగిన ప్రశ్నకు సమాధానం నేను "ఈగ" అనుకున్నాను. సమాధానం తప్పైనా, కవిత్వం బానె ఉంది అనిపించింది.]
ఆ:-
వంటలన్ని జుర్రి, మటుమాయమయ్యేను
కాని కిట్టమూర్తి కానె కాదు!
తేనెలూరు పెదవి, తెమ్మెరంటినడక
తమ్మితోన చెలిమి, తన్వి గాదు!

ఆ:-
ఇంటి మగువ పెదవి, యెరుపెక్కు చందాన
ముద్దులాడు గాని మొగుడు కాదు!
ఆవులించినంత ఆలపించును లాలి
అమ్మ కాదు జూడ, బదులు ఈగ!

[ముక్కుపుడక మీద పద్యం వ్రాయమని శైలజగారు అడుగగా]
కం:-
ముక్కెర తొడిగిన మానిని
చక్కని హాసము మనసున చల్లును మరులన్
ముక్కున పగడపు కాంతులు
పెక్కువ జేయవె కనుగవ వెండివెలుగలన్!

[పంచెకట్టు, నామం, జంధ్యం ఉండేట్టు ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగారు. నాకు వెంటనే మనసులో త్రివిక్రముడే (వామునుడు) మెదిలాడు. ఆయన నా చేత వ్రాయించుకున్న పద్యం.]
ఆ:-
పంచభూతములను పంచెగా ధరియించి
నుదుట నామమెట్టి వేదమెల్ల
ఉపనిషత్తులన్ని ఉపవీతముగ జేర
బలిని తుంచనరిగె వామనుండు

[సాంబారు వండాను అని చెప్తే ప్రియదర్శిని/శైలజగారు అది ఎలాగుంది అని అడుగగా చెప్పిన పద్యం]
కం:-
సాంబారని పిలిచి పెడితి
ఏం బావుళ్ళేదనుచును యెదుటనె మిత్రుల్
ఏం బాబూ! వంటెరుగని
సోంబేరిగ మిగిలితివని శోకించిరిటన్!

[అమ్మాయి కళ్ళ గురించి ప్రియదర్శిని చేత వ్రాయిద్దామనుకుని, ఆ భావావేశంలో నేనే వ్రాసిన పద్యం]
ఆ:-
వలపు కురియు వేళ నెలవంక చలువాయె
సిగ్గుపడగ లేతమొగ్గ మోడ్పు
కోపమొచ్చినంత కుంపట్ల సెగలాయె
పలికె భావమెల్ల భామ కనులె

[సన్నజాజి, మల్లె, సంపంగి, చామంతి - ఈ పూవులు ఉండేలాగ ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగితే వ్రాసినది]
తే:-
లేత బుగ్గలు చామంతులేమొ! కనగ
మృదులచంపకాలె సుదతి పెదవులేమొ!
సన్నజాజిరేకులవియె సఖియ పనులొ!
మల్లెమొగ్గలొ? మరులను చల్లు కనులొ!

[నాది "నూనుగు మీసాల నూత్నయవ్వనం", అని రామకృష్ణారావుగారు అభిప్రాయపడ్డప్పుడు]
కం;-
నూనుగుమీసములన్నియు
ఏనాడోపోయినాయి ఎన్నగనిపుడున్
ఏనుగు తొండము చందము
కానగ నా మీసకట్టు కవితాధారా!

[ఇక్కడ మీసాన్ని ఏనుగుతొండంతో కాకుండా తుమ్మెదతో పోల్చమని రామకృష్ణారావుగారు చెప్పగా, ఇలాగ మార్చాను. కొంచెం సరసం ఎక్కువున్న పద్యం చూసి తప్పుగా అనుకోరు కదా?]
నూనుగుమీసపు రోజుల?
ఏనాడో పోయినవవి యెన్నగనిపుడున్
పూనగవుల వేటాడగ
పూనిన తుమ్మెద కరణిని ముదిరెను మీసం!

Sunday, December 6, 2009

నిరంతరమూ వసంతములే

ప్రకృతిని వర్ణించని వాడు కవి కాడు. అసలు కళ అనేదే పరమాత్ముని స్త్రీత్వానికి చిహ్నం! అందుకే కళలకు తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తున్నాము. వాల్మీకి చిత్రకూటాన్ని వర్నీంచడం దగ్గరనుండి చందస్సుని ఛాందసంగా భావించి మన కృష్ణశాస్త్రి భావకవితలను రచించడం వరకూ అందరు కవులూ ప్రకృతిని వర్ణిస్తూ వచ్చారు. మరి వేటూరి ఏమైనా తక్కువ తిన్నాడా? అసలు ప్రకృతిని వర్ణించాలి అంటే దానికి ప్రకృతిని అంత చక్కగా చూపించగలిగిన దర్శకుడు కావాలి అని నా నమ్మకం. మరి తెలుగులో ప్రకృతి అందాన్ని చక్కగా చూపించగలిగిన వాళ్ళు బాపు, ఆ తరువాత వంశీనే కదా? అందుకే వంశీ, వేటూరి జతగా వచ్చిన చిత్రాలలో చక్కని భావకవిత్వంతో పాటు, పచ్చని ప్రకృతి ప్రతిబింబిస్తుంది.

ఇప్పుడు నేను చెప్పబోయే పాట "ప్రేమించు పెళ్ళాడు", అనే వంశీ చిత్రంలోనిది. ఇందులో వెటూరి ప్రేమికుల భావాలని, ప్రకృతిని/ఋతువులని, పోల్చి చక్కగా వర్ణించాడు. ఈ పాట ఇంత అందంగా రావడానికి ఇళయరాజా సంగీతం ఎంతో తోడ్పడింది అనటంలో ఆశ్చర్యం లేదు. ఇందులో నాకు నచ్చిన వాక్యాలు:

నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే

డ్యూయెట్ చిత్రంలో "కొడితే కోలాటం" అనే పాటలో వెన్నెలకంటి "పాటకు ఎస్.పి.బి, పల్లవికి వేటూరి", అని అన్నాడు. అది అక్షరాలా సత్యం. వేటూరి పల్లవి వ్రాస్తే అది నాలుకపైన నాట్యం చేస్తుంది. పల్లవి వ్రాయడం అనేది ఒక ప్రత్యేకమైన విద్య. ప్రతీ చరణం ముగియగానే, ఆ ముగింపు పల్లవికి మరొక మొదలు కావాలి. అది ఇక్కడ వేటూరి ఎంతో చక్కగా చేకూర్చాడు. చరణాల చివరి వక్యాలకు, "ఇంత చక్కని అందం మన చుట్టూ ఉంటే" అనే భావం వచ్చేలాగా వ్రాశాడు. అప్పుడు, తిరిగి పల్లవి పాడితే ఒక కంటిన్యూషన్ ఉంటుంది.

సర్వసామాన్యమైన యుగళగీతానికి సైతం చక్కని బాణీ అందించిన ఇళయరాజాకు, అంతే చక్కని పదాలు (ఉదా| మరందము అంటే తేనె) అల్లి తనేమీ తక్కువ తినలేదు అనిపించుకున్నాడు వేటూరి!

స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే

స్వరాలను సుమాలతో పోల్చడం విచిత్రమేమీ కాదు. కానీ, పదాలను ఫలాలతో పోల్చడం నేను ఇదే చూస్తున్నాను. "స్వరాలు, పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది", అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంది.

తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం

తేనెలో తానమాడే (స్నానము అనే పదానికి వికృతి తానము) తుమ్మెద అనడంలో, ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా (ఎక్ష్టాటిక్) ఉందో చెప్తున్నాడు. నదులపై ఉన్న అలలు (రిపుల్స్) ని వీణతీగెలతోనూ, వాటిని గాలి కదపటాన్ని వీణ మీటడంతోనూ పోల్చడానికి మన పిసినారు వేటూరికి నాలుగు పదాలు చాలు!

అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే

వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే, మెరుపుతో వర్షఋతువు వెళ్ళిపోయిందిట. హేమంతఋతువు (పౌషం) మంచుధాన్యాలు కొలిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కొలిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పాడు. అక్కడికి గ్రీష్మం, వర్షం, శరత్, హెమంతం అయ్యాయి. చివరగా, శిశిరం (మాఘ) దాహలు తీసుకువస్తే దానికి విరుగుడుగా అందాన్ని అత్తరు చేసుకుని చల్లుకున్నాడట మన ప్రేమికుడు. ఇంతకీ శిశిరంలో (చలికాలంలో) దాహమేమిటి? అని అనుకుంటున్నారా? చలికాలంలో చర్మం ఆరిపోవడం, అని సర్ది చెప్పేద్దామని ఉన్నా రసఙులకు అసలు విషయం తెలుస్తుంది :)

ఇవన్ని ఋతువులూ వచ్చి ప్రేమికులనూ ఏమీ చెయ్యలేకపోయాయిట. ఇంతలో మళ్ళి మన వసంతఋతువు వచ్చేసిందిట. అందుకే "నిరంతరమూ వసంతములే"!

చిత్రం: ప్రేమించు పెళ్ళాడు
దర్శకుడు: వంశీ
గానం: జానకి, ఎస్.పీ.బీ
సంగీతం: ఇళయరాజా

నిరంతరమూ వసంతములే, మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచెనులే పదాలు ఫలాలుగ పండెనులే

హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం
ఆకశానికవి తారలా? ఆశపూల విరిదారులా?
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే!

అగ్నిపత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగబోయే
మంచుధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహలలోన అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా?
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే!

Tuesday, November 24, 2009

ముద్దమందారం, ముగ్ధశృంగారం

కన్నెపిల్లను వర్ణించవయ్యా అంటే తన విశ్వరూపం చూపించని కవి ఉంటాడా? అందులోనూ వేటూరికి ఈ మాట చెపితే, కపి~నేనంటూ, కపినే~నంటూ వచ్చేస్తాడు. అప్పుడు యే జంధ్యాలవంటి మహానుభావుడో కాస్త "చూసి వస్తే చాలు స్వామీ, కాల్చి రావక్కరలేదు", అని చెప్పకపోతే ప్రమాదమాయె ఈ సర్వబూతాత్మకుడికి. (మీరు సరిగ్గానే చదివారు: "అన్నిటిలోనూ బూతును చూడగలిగే వ్యక్తి", అని వేటూరిని ముద్దుగా ఇలాగ పిలుచుకుంటూ ఉంటాను.

ఇప్పుడు నేను చెప్పబోయే పాట "తెలుగింటి అమ్మాయిని" వర్ణించడానికి వేటూరి పెట్టిన ఒక ప్రమాణం. ఆ తరువాత తన ప్రమాణానికి తగ్గట్టు, "మంచి తెలుగుదనం ఉన్న బాణీ ఇస్తే చక్కని తెలుగుపదాలు కూరుస్తాను", అనే ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ, "పూసింది పూసింది పున్నాగ" లాంటి ఎన్నో గొప్పపాటలను వ్రాశాడు. ఇతర సినీకవుల్లో సిరివెన్నెల వ్రాసిన "చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా", అనే పాట ఈ పాటకు తుల తూగుతుంది అని నా నమ్మకం.

ఈ పాట, "ముద్దమందారం", అనే జంధ్యాల సినిమాలోనిది. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ పాటకి వేటూరి ఎంతో చక్కని ఉపమానాలతో తెలుగు ఆడపడుచును పొగుడుతూ పదాలను అల్లాడు. నాకు నచ్చిన విశేషాలు:

అడుగులా అష్టపదులా, నడకలా జీవినదులా?

విన్న ఆడపడుచు, ఆడనే పడిపోవాలని వేటూరి వ్యూహం అనుకుంటాను :) మరీ, ఆమె అడుగులని జయదేవుడి అష్టపదులతో (రాధాకృష్ణుల ప్రణయకలాపాలను రమ్యంగా చెప్పే పాటలు) పోలిస్తే అమ్మాయి ఏ పొన్నచెట్టో (అంటే రాధ పొన్నచెట్టూ దగ్గర కదా కృష్ణుడి కోసం వేచి చూసేది. అందుకే కొంచం శైలి మార్చాను.) ఎక్కి పడిపోదు? కన్నెపిల్ల అలాగ నడుస్తూ ఉంటే, ఆ గజ్జలమ్రోత నదులు పారుతుంటే వచ్చే శబ్దతరంగాలను పోలి ఉంటుంది అని, వేటూరి అభిప్రాయం. నాది కూడాను!

పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల సందళ్ళు

(కొంచెం సిగ్గుతో కూడిన నవ్వుతో) ఈ వాక్యం ఎందుకు నచ్చింది అంటే ఏం చెప్పమంటారు. కొన్ని కొన్ని విని సంతోషించాలి అంతే అంటాను :) "పొట్టిజుట్టు పొలతలూ కుళ్ళుకోవద్దు, జీనుపాంటుల జేజెమ్మలు ఉడుక్కోవద్దూ", అని తరువాతి రెండు వాక్యాలూ పూర్తి చేస్తే బాగుండు :P

కన్నెపిల్లా కాదు కలలకాణాచి

మరి ఇదే వేటూరికీ సామాన్యులకీ తేడా. "కాణాచి" అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే "inherited right", అని బ్రౌహ్ణ్య నిఘంటువు అర్థం చెబుతోంది. అంటే, "మా కలలన్నింటి మీదా హక్కుదారివి నువ్వే", అని చెప్తున్నాడన్నమాట! అమ్మ బాబోయ్! వేటూరి ఒక్కో సారి ఇలాగ శరీరంలేని విశేషణాలకు కూడా వరసలు కలిపేస్తుంటాడు, ఆడపిల్లల్ని పడెయ్యటానికి. మొన్నటికి మొన్న "ఏయ్ చికిత్తా, సొంపుల సొంత మేనత్త", అని ఒక హీరోయిన్ని ["అర్జున్" సినిమాలో] పడేశాడు.

మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు

"మలిసంజ" అంటే సాయంత్రం సూర్యాస్తమయవేళ. ఆ వెలుగు నారింజపండు రంగు లో ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయి బుంగమూతి (ఎర్రని పగడాలతో పోల్చాడు) పెట్టుకుని వడగళ్ళు కురిపిస్తోంది అని అలకే ఉబ్బితబ్బిబ్బయ్యేలాగా వర్ణించాడు. ఈ నారింజరంగులని వేటూరి ఇంకా వదల్లేదు. ఈ మధ్యన "స్వాగతం" అనే సినిమాలో "సాయంకాలం నీరెండల్లో, సాయం కోరే నారింజల్లో", అని ఈ నారింజని మలిపొద్దు వర్ణానికో, చెలికాడి చిలిపిదనానికో, చినదాని అందాలకో తెలియకుండా వాడేశాడు!

మల్లెపువ్వా కాదు, మరుల మారాణి! బంతిపూవా పసుపు కాలిపారాణి!

పొరబాటున అందరినీ ఆకట్టుకుంటున్నది మల్లెపూవు తావి ఏమో అనుకునేరు, కాదు ఈ ప్రేమదేవత! ఎరుపు, పసుపు కలిపి బంతిపువ్వులాగా ఉంది ఏమిటొ అనుకుంటున్నారా? అది ఆమె పారాణి పెట్టిన కాలు. ఎంత దారుణం స్వామీ, ఈ అమ్మాయి కోసం మల్లెపూవుని, బంతిపూవినీ తక్కువ చేసేస్తావా!

ఇలాగ పొగిడితే ఏ అమ్మాయి ఎలాగ ఫీల్ అవుతుందో నాకు తెలియదు కానీ, ఈ పాట విన్నప్పుడల్లా నాకు చందమామ పుస్తకంలో చంద్రబింబంలాంటి ముఖారవిందంతో కనబడే అందగత్తె గుర్తుకొస్తుంది.

చిత్రం: ముద్దమందారం
దర్శకుడు: కీ.శే. జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
గానం: బాలు

ముద్దుకే ముద్దొచ్చే మందరం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం, ముగ్ధశృంగారం

అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా?
పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల్ల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలలకాణాచి, కలువకన్నులా కలలదోబూచి

పలుకులా రాచిలకలా?, అలకలా ప్రేమమొలకలా?
మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు, మరుల మారాణి, బంతిపూవా పసుపు కాలిపారాణి

Tuesday, May 5, 2009

చెంత లేకుంటివే...

ఎప్పుడో 2007-జూన్-6 న చినుకులు పడుతుంటే ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన కవిత. మొన్న వర్షం పడుతుంటే గుర్తు వచ్చింది.

సరసలేకుంటివే సఖియ
సరసమాడగ నాకు సరియైన వేళ

చల్లగాలులు మత్తు చల్లుచూ తాకంగ
నుల్లమెల్లను నీవెయూహలయ్యెనె సఖియ
పిల్లతెమ్మెర నిన్ను పిలువమంటున్నదె
చెల్లించ నా పలుకు చెంత చేరవె చెలియ

విల్లు ఎత్తిన మిన్ను విరహాల రేపంగ
విసిరెనే బాణాలు వేసారె ప్రాణాలు
జల్లు కురిసెడివేళ జవరాల రావటే
జాగుసేయుదువేల జతగూడరాదటే?

Monday, September 1, 2008

నవరససుమమాలికా...

మేఘసందేశం సినిమాకి చాలా నంది అవార్డ్లు, జాతీయ అవార్డు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం చక్కగా ఉన్నాయి. ఈ సినిమాలో వేటూరి వ్రాసిన పాటలలో కాస్త సంస్కృతపదాలు ఎక్కువ పడటంతో, కృష్ణశాస్త్రి గారి పాటల (ఆకులో ఆకునై) పక్కన కొంచం కష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఏదేమైనా రమేష్ నాయుడు గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం కలిసి రసికులకు మహదానందం కలిగిస్తాయి. వీటిలో నాకు నచ్చినది, జీవితాంతం మెచ్చుకునేది ఒక పాట ఉంది. అది "నవరస సుమ మాలికా..." అనే పాట. అందులో ఒక భావకవి ఎలాగ తన ప్రేయసిని వర్నిస్తాడో వేటూరిని చూసి తెలుసుకోవాలి సుమీ అనిపిస్తుంది.

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే - సంస్కృత పదాల వెల్లువ! భావుకత పెల్లుబిగి ప్రవహించింది! తనకు గురుతుల్యులైన త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలను తలుచుకుంటూ మొదలుపెట్టాడు మహానుభావుడు. ఎంతని చెప్పను, ఏమని చెప్పను ఈ పాట గురించి.


నవరససుమమాలికా, నా జీవనాధారనవరాగమాలికా...
త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయరసగీతికా

అందాలు అలలైన మందాకినీ, మందారమకరందరసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు, ఆమె నయనాలు నీలగగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమ ఇల వంక!

అందాలే అలలుగా సాగే గంగాదేవి అనే పోలిక నాకు బాగా నచ్చింది. "మందారమకరంద" అనే సమాసం మరే కవి వాడినా నేను కోప్పడేవాడిని , "ఇది పోతనకే చెల్లుతుంది. దానిని ఎవరూ తిరిగి వాడటానికి అర్హులు కారు", అని. కానీ వేటూరి మొత్తం సంస్కృతంలో వ్రాసి నా నోటికి తాళం వేసేసాడు.

కృష్ణశాస్త్రి కవిత్వానికి ఏ మాత్రం తీసిపోలేదు నేను అన్నట్టుగా - తన కవిత్వంతో ప్రకృతిని ప్రతిష్టిమ్పజేసాడు. నది-అలలు, పువ్వు - తేనె, సూర్యుడు - కిరణాలు, గగనం - నీలం ఇలాగ ప్రకృతి సౌందర్యాన్ని వర్నించుకుంటూ వచ్చాడు. అయ్యింది కదా - జవ్వననికి ప్రాస ఏమి పెడతాడురా అనుకునే సమయానికి - బహుశా, "నీకు అంత అవకాశం ఇవ్వను. నా స్థాయి వేరే ఉంది", అన్నట్టు: "నైరుతి ఋతుపవనాలను", గుర్తు చేసాడు (చల్లని గాలులు). ఇక జాబిల్లిని ఎందుకు వదుల్తాను అంటూ - చిరునవ్వుతోనే విసిరాడు చిరప్రయోగం (ఎప్పటినుండో ఉన్న, ఎప్పటికీ ఉండిపోయే ప్రయోగం).

శృంగారరసరాజకల్లోలినీ, కార్తీకపూర్ణేందు కల్హారినీ
ఆమె అధరాలు ప్రణయమధురాలు, ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందరసుఖతరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ!

ఇక్కడ మళ్ళీ సంస్కృతంలో చెడుగుడు. "శృంగారరసం ప్రవహించే మహానది", "కార్తీకపున్నమిలో కలువ", అంటూ తన ప్రియురాలిని ఉబ్బితబ్బిబ్బు చేసేసాడు. ఆమె పెదవులు మొహంతో నిండిన మధురాలు! ఆమె దర్శనం దొరికిన ప్రతిక్షణం అతని జన్మలో గుర్తుపెట్టుకోదగినంత గోప్పదిట! కనుచూపుతోనే ప్రేమలేఖలు వ్రాసేసి రాయబారాలు నడిపెస్తోందిట.

ఇలాటి పాట విన్న అమ్మాయి (తెలుగు పిల్ల ఐతే అనుకోండి) ఎవరైనా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అలాంటి పాటలు వేటూరి ఒకటో రెండో వ్రాయలేదు. అనేకానేకాలు వ్రాసాడు.

హడావుడిలో పడి రమేష్ నాయుడు గారిని మర్చిపోతే సరస్వతీ దేవి నన్ను క్షమించదు. (సరస్వతీ దేవి ప్రస్తావన తీసుకురావడానికి ఒక కారణం ఉంది - అది మళ్ళీ టప లో చెప్తాను). రమేష్ నాయుడు గారి సంగీతం లంగా-వోణీ వేసుకున్నతెలుగింటి పిల్లని గుర్తు చేస్తుంది!

Monday, January 21, 2008

జీవనవేణువులూదిన వేటూరి, మామ

వేటూరి అంటే నాకు ఎందుకు ఇష్టం అనే విషయం మీద నేను ఒక రెండువందల పేజీల పుస్తకం అచ్చువేయించవచ్చు. ఐతే, శ్రోతలకు రోత పుట్టించకుండా రెండు ముక్కల్లో చెబుతాను: "ఎంత హడావుడిలో ఉన్నా, ఎంత చికాకులో ఉన్నా - రెండు నిముషాల్లో చిరునవ్వు ప్రసాదించేవి తెలుగుచిత్రప్రపంచంలో కొన్ని ఉన్నాయి. వాటిల్లో నాకు బాగా దగ్గరైనవి: జంధ్యాల సినిమా లోని సన్నివేశం, వేటూరి పాట, బాపు బొమ్మ".

ఇప్పుడు ఒక కవితని వేర్వేరు భాషల్లో చెప్పచ్చు. ఉర్దూ, తమిళం, తెలుగు లాంటి భాషల్లో గొప్ప కవిత్వమే ఉంది. ఐతే -
    * భాష కవితకు ఒక వేదిక కావచ్చు
    * భాష-కవిత (కాళిదాసు చెప్పినట్టు) పదం-అర్థం లాగా కలిసిపోవచ్చు
    * భాషకి కవిత - కవితకు భాష అందం తేవచ్చు

చాలావరకు వేటూరి పాటలు మూడవ కోవకు చెందినవి అవుతాయి. భార్యాభర్తలుగానీ, తోబుట్టువులు కానీ, స్నేహితులు కానీ అన్యోన్యంగా ఉంటే చూసేవారికి ఎంత ముచ్చటగా ఉంటుందో అంత ముచ్చటేస్తుంది ఆయన పాట వింటుంటే! రెండు ముక్కల్లో చెప్పాలి అంటే తెలుగుతోటి అష్టాచమ్మా ఆడుకుంటాడు వేటూరి!

ఇప్పుడు నేను విశ్లేషిస్తున్న పాట శంకరాభరణం చిత్రంలో "సామజవరగమన" అనే త్యాగరాజు కృతిని పునాదిగా చేసుకుని సాగే యుగళగీతం.
 

ఆమని కోయిల, ఇలా నా జీవనవేణువులూదగా
మధురలాలసల, మధుపలాలనల
పెదవిలోని, మధువు వ్రాలు, వ్రతముబూని, జతకు చేరగా

జీవన వేణువులూదగా - అనే ప్రయోగం మామూలు (సినీ)కవులు ఊహించలేనిది. "ఆమనిలో కోయిల జీవన వేణువు ఊదటం" అంటే "జీవితాన్నే ఆమనిగా తీర్చిదిద్ది, కమ్మగా పలుకుతూ, వేణునాదాన్ని వింటున్న భావాన్ని కలిగించడం!". ఎంత లోతైన భావాన్ని, ఎంత చిన్నమాటల్లో చెప్పాడు?

"మధురలాలసల (నందు) మధుపలాలనల (నందు)", అనడంలో ప్రియుణ్ణి మధుపంతో (తుమ్మెద), ప్రేయసిని కుసుమంతో పోల్చి చూపాడు మహానుభావుడు. రెండు సమాసాలతో ఒక సమాగమనాన్ని ఇంత గొప్పగా వర్ణించడం లో "వేటూరి మితభాషి సుమా!" అనిపించే నైపుణ్యం కనబడుతోంది.

"పెదవిలోని మధువువ్రాలు వ్రతము", అనడంలో శృంగారరసానికి సాహిత్యపు ఆఛ్ఛాదన తొడిగి వినేవాడి పెదవులపై చిరునవ్వు పుట్టించే విధంగా వ్రాయగల్గే నేర్పు ఉంది. ఒక్కోసారి చిలిపిదనం అంటే ఆనాడు శ్రీనాథుడు, ఈనాడు వేటూరి అనేద్దామా అనిపిస్తుంది.

ఇక మామ (కే వీ మహదేవన్) గురించి చెప్పడానికి నాబోటి సంగీత-బికారికి (దుష్టసమాసం అని తెలిసి కూడా వాడాను) మాటల్లేవు