Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

Saturday, August 2, 2014

చిల్లుగొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.

నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల

పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను

నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు

నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

Sunday, March 31, 2013

వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి...


నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.

You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?


అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.

మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి

తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు  (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (3)

"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా వ్రాసారని ఆయనకు అనిపించిందేమో.

ఇక ప్రణయం, శృంగారం సందర్భంగా వేటూరి వ్రాసిన వానపాటలను చూద్దాము. ఇలాంటి పాటలు వేటూరి బోలెడు వ్రాసారు. ఒక్కో పాటకు శృంగారం పాళ్ళు ఒక్కోలా ఉంటాయి. కొన్ని పాటలలో వాక్యాలు ఇక్కడ వ్రాయడానికి కూడా ఇబ్బందిపెట్టేవి ఉన్నాయన్నమాట వాస్తవమే. అందుకని చర్చించే పాటలను శృంగారం మోతాదుని బట్టి వరుసపరిచాను.


వేటూరి వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన classic కే.వీ.మహాదేవన్ స్వరపరిచినది. ఇది కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "వేటగాడు" చిత్రంలో "ఆకు చాటు పిందె తడిసే" అనే పాట. పాట చిత్రీకరణ ఎంత శృంగారసూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంది అని నా అభిప్రాయం.
ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే
పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు. అందుకేనేమో పల్లవిలో నాయకుడు ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెప్తోంది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే
ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందట. మంచి భావుకత మాత్రమే కాదు అది వ్యక్తపరచడానికి పదాలపై పట్టూ ఉండాలి. వేటూరి వీలైనంతవరకు పదాల మధ్యన యతి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ముద్దిచ్చి, ముత్యం; చిగురాకు, సిరిమువ్వ; తాకి, డియారు గమనించండి. అలాగ వ్రాసిన పంక్తులు నాలుకపైన సులువుగా ఆడుతాయి.
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
నాయకుడు చినుకు గురించి చెప్తుంటే, నాయిక మెరుపు గురించి చెప్తోంది. మొదటి పంక్తిలో మెరుపు ఆమె చూపుల్లో తనపై ఉన్న ఆకర్షణకు చిహ్నం అని అనిపిస్తోంది. అలాగ జరుగుతుంటే ఆమె మనసులో ఒక కోఱిక మఱొక మెరుపైందట. ఇంతలో అబ్బాయి చూపు మఱొక మెరుపు, నవ్వు మఱొక మెరుపు అయ్యి అంతటా మెరుపులే కనిపిస్తున్నాయట.
నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి,
చలిని పెంచి, చెలిమి పంచి, తలలు వెచ్చంగా తడియార్చుకోవాలి
నాయిక పాటకు వర్షం మరింతగా పెరిగితే, ఆమె తన ఒళ్ళు జలదరించడంలో ఉన్న సోయగాన్ని అతడికి ముడుపు చెల్లించుకోవాలట. అది వారి నడుమ ప్రణయాన్ని బలపర్చి, వారిద్దరూ దగ్గరవ్వాలని అతడి కోఱిక. ఈ పంక్తిలో నాకు నచ్చింది "నీ విరుపులు ముడుపులిచ్చి" అనడంలో శృంగారమే కాక సౌందర్యం కూడా చాలా ఉందని నా అభిప్రాయం.


"కేక" చిత్రంలో చక్రి స్వరపరచిన పాటను చూద్దాము. ఒక యువకుడు, ఒక యువతి వానలో ఉన్నారు. పెద్దగా పరిచయం లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చి line వేస్తున్నాడు. ఈ సందర్భంలో శృంగారానికి ఎక్కువ తావు లేదు. అబ్బాయి అమ్మాయిని పదే పదే తమ మధ్యన కలిగిన ప్రణయభావాన్ని బయటపెట్టమన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి దానికి ఇంకా సమయం రాలేదన్నట్టు చెప్తుంది.
అ: మెరిసే మేఘం కురిసేదెప్పుడో
ఆ: కురిసే వర్షం వెలిసేటప్పుడే

అ: ముసురుకున్నది ఏదో చిలిపి కోరిక
ఆ: ముదరనివ్వకు కథలే చాలు చాలిక
వర్షం కురియాల్సినప్పుడు కురుస్తుంది కానీ, అడిగితే కురవదు కదా. అలాగే వలపు కూడా అంతేనని ఆమె భావం.
అ: మెరిసే తొలకరిలో నిను కనులారా చూసా
ఆ: చలిలో గిలిగిలిలో కొసమెరుపులు ఆరేసా
అబ్బాయి వానలో అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని చెప్తుంటే తను చూపించింది కేవలం కొసమెరుపులు మాత్రమేనని అమ్మాయి చమత్కరించింది. అంటే ఆ వాన స్వయంగా అందంగా ఉంటే దానికి చిగురున అమ్మాయి మరింత మెరుపు అద్దిందని అయి ఉండవచ్చును, లేక అమ్మాయి అందం తను ఇంకా కొస మాత్రమే చూసాడని అయి ఉండవచ్చును. బహుశా ఆయన శ్లేషనే ఉద్దేశించి ఉండవచ్చును. వేటూరి పాటకు "ఇదే" భావం అని ఆయన తప్పితే వేఱెవరూ చెప్పలేము.
అ: ముసిరే గాలివానలలో ముదిరే ముద్దుపిలుపులలో
ఆ: తడిసే వానచినుకులలో పడకు మత్తుకవితలలో
 ఇక్కడ కూడా అబ్బాయి ముందుకు మనసులోని ఆలోచనలకు అమ్మాయి కళ్ళాలను వేస్తోంది. ఇక్కడ ఏడు రంగులను చిలకడం అనే ప్రయోగం నాకు నచ్చింది.
అ: ఆడపిల్ల మాటలే అందమైన మాయలే, అర్థమైతే చాలులే అంతకంత హాయిలే
ఇది వేటూరి ముద్ర. ఆడపిల్ల మాటలు అందమైన మాయ. నిజమే "ఆడువారి మాటలకు అర్థాలు వేఱులే"  అనే ఎప్పుడో పింగళి చెప్పారుగా. ఆ మాటలు నిజంగా అర్థమైతే ఆ మాయ ఎంత లోతు అంతకంతా హాయి కలుగుతుందిట. అద్భుతం. నాలుగు ముక్కలలో అమ్మాయిల మాటల గురించి చెప్పారు.
ఆ: ఉడికే వయసులలో తొలి గిలిగింతల వాన
అ: చినుకే చిటపటగా దరువేసెను మదిలోన
గ్రీష్మమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షఋతువులో తొలకరి కురుస్తుంది. ఉడికే వయసులు అనడంలో యవ్వనాన్ని గ్రీష్మంగా వర్ణిస్తూ, వలపును వానగా చెప్తున్నారు. "టప్ టప్" అంటూ పడటాన్ని "దరువు" వేయడం అనడం సరదాగా ఉంది.


"ఆఖరి పోరాటం" లో వేటూరి-ఇళయరాజ-బాలు-లతా మంగేష్కర్ కలిసి చేసిన పాటలో రెండు వాక్యాలు అద్భుతంగా కుదిరాయి.. వాటి అర్థం లతా మంగేష్కర్ కి చెప్తే ఆవిడ చాలా సంబరపడి మెచ్చుకున్నారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయిలో చెప్పారు. ఆ రెండు వాక్యాలు కూడా వర్షానికి సంబంధించినవే.

ఆషాఢం ఉరుముతుంటే, నీ మెరుపే చిదుముకున్నా
హేమంతం కరుగుతుంటే, నీ అందం కడుగుతున్నా
ఈ పాటలో కూడా ("నిరంతరమూ వసంతములే" పాటలో లాగ) వేటూరి ఋతువులలో ప్రేమికుల భావాలను వర్ణించారు. కాకపోతే ఇందులో శృంగారాన్ని వర్ణించారు. కానీ, ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా వ్రాసారు. ఆషాఢ మాసంలో మేఘాము ఉరుముతుంటే మెరుపు మాత్రం అమ్మాయి ఒంట్లోనుండి వచ్చినట్టు అనిపిస్తోందట, అబ్బాయికి. హేమంతంలో మంచు కరుగుతూ ఉంటే దానితో అతడు ఆమె అందాన్ని కడుగుతున్నాడట. అద్భుతం!


"అడవి దొంగ"లో "వానా వానా వందనం" అనే పాటని చూద్దాము. ఈ పాట అంతా అంత్యప్రాసతో వ్రాసారు. కొన్ని చోట్ల పదాలు ఇరికించినట్టు అనిపించాయి కానీ కనీసం ఆ పదాలు రివాజు పదాలు కాదు. అందుచేత ఎబ్బెట్టుగా లేవు.
చలి పెంచే నీ చక్కదనం, కౌగిట దూరే గాలిగుణం
గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
(అ) మెరుపుని నీలో చూస్తుంటే, (ఆ) ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపు ఋణం
అమ్మాయిని అబ్బాయిని గాలివానతో పోల్చడం కొత్తగా ఉంది. అబ్బాయిని గంభీరమైన ఉరుముతోనూ, అమ్మాయిని అందమైన మెరుపుతోనూ పోల్చి వాటిని సృష్టించిన వానదేవుడి ఋణం తీర్చుకోవడానికి వాళ్ళు కౌగిలించుకోవాలని కవితాత్మకంగా చెప్పారు. ఇదే పాటలో రెండో చరణంలో అంత చెప్పుకోదగిన అంశాలు కనబడలేదు. ఎంతటి వేటూరైనా ఒక చిత్రంలో వానపాట hit అయిందని ప్రతీ చిత్రంలోనూ వ్రాయమంటే ఇదే జరుగుతుందేమో.


"యముడికి మొగుడు" చిత్రంలో రాజ్-కోటి సంగీతసారధ్యంలో చిరంజీవి, విజయశాంతుల నడుమ సాగే వానపాటలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చూద్దాము.
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా?
మళ్ళీ అబ్బాయి ఊపిరిని వర్షఋతు గాలులతో, అమ్మాయి వయసుని గ్రీష్మఋతు వేడ్మితో పోల్చారు. ఇందాకటి పోలికకి ఇప్పటికి పదాలన్నీ మారిపోయాయి గమనించారా? అది వేటూరి పదాల గారడీ.
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో
అమ్మాయిని వాన నుండి రక్షించడానికి అన్నట్టు అబ్బాయి ఆమెను వాటేసుకున్నాడట. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు. ఉన్న విషయాన్ని అబ్బాయి సరదాగా చెప్పడం బాగుంది.
ఆ: వడగట్టేసి బిడియాలనే వొడి చేరాను వాటేసుకో
"డ" అనుప్రాస కోసం, బిడియాలని వదిలిపెట్టడాన్ని "బిడియాలను వడగట్టాను" అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు లోతైనవి కాకపోవచ్చును. కానీ మామూలు భావాలని మళ్ళీ మళ్ళీ అవే పదాలతో వాడకుండా వేఱుగా చూపించడం చలనచిత్ర కవికి కావలసిన లక్షణం. వేటూరి ఈ పాటల్లో మనకు చూపించింది అదే.


వేటూరి చిరంజీవికి చాలా వాన పాటలు వ్రాసారు అని ఇప్పటికే చదువర్లు గమనించి ఉంటారు. ముచ్చటగా మూడో చిరంజీవి పాట. "అన్నయ్య" చిత్రంలో మణిశర్మ స్వరపరిచినది. వాన పాటలో కొన్ని ఎబ్బెట్టు వాక్యాలుండటం సహజమే కానీ ఇందులో పల్లవిలో మొదటి వాక్యం కొంచెం ఎబ్బెట్టుగా వ్రాసారు. అది పక్కన పెడితే ఇందులో కొత్తగా వాడిన ప్రయోగం ఏమిటంటే ప్రేమకు ప్రాసగా "తేమ"ను వాడారు.
ప్రేమ రాగం, తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మళ్ళీ వేటురికి నచ్చిన ఆషాఢం, మేఘాలు, దేశం, పదాలు వచ్చాయి. కాకపోతే ఇదివరకుటి వరసలో కాదు, ఆ భావంతో కాదు.
ఆషాఢ మాసంలో, నీటి అందాల ముసుగుల్లో
మేఘాలదేశంలో, కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డ ఒంటినిండా ఈడు కుంపట్లు రాజేస్తే
ఆషాఢ మాసం వర్షం ముసుగులో అమ్మాయికి అబ్బాయితో ఏర్పడిన బంధం (మెరుపు ఆకర్షణకు, కలలకు చిహ్నంగా వాడి ఉండవచ్చును)  ఆమెలో దాహాన్ని రేకెత్తించింది (అబ్బాయి వర్షం అన్నమాట).
పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించి ఒడుపుల్లో
చిత్రంలో అమ్మాయి దగ్గర గొడుగు లేక అబ్బాయి గొడుగులోకి వస్తుంది. ప్రణయానికి చిహ్నంగా ఆ గొడుగుని పూలంగి గొడుగు అంటున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే గొడుగుకి ప్రాసగా "ఒడుపు" అనడం. అంటే అమ్మాయికి తన మనసులో ఉన్న విషయం తెలియకుండా గొడుగులోకి లాక్కుంటున్నట్టుగా పట్టుకోవడం. ఇలాంటి చమత్కారాలు వేటూరి ప్రత్యేకత.


ఇప్పుడు "బంగారు బుల్లోడు" చిత్రంలో రాజ్-కోటి బాణీ వలన బాగా ప్రజాదరణ పొందిన పాటని చూద్దాము.
అ: స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన
ఆ: సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వచ్చే వానని స్వాతివాన అంటారు. ఈ సమయంలో నత్తచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది అని ఒక నుడి. అందుకే అబ్బాయి ఒక స్వాతీసాయంత్రం వేళ వాన తనని  "ముత్యమంత ముద్దు" లాగా ముట్టుకుంది అంటున్నాడు. అమ్మాయి వాన గురించి కాక, చీకటి తనలో సిగ్గు కలిపిస్తోంది అంటోంది. వాన పాటల్లో ఈ పల్లవి కొంచెం కొత్తగా అనిపించింది, నచ్చింది.  ఈ పాటలో వేటూరి మెరుపులకు, ఉరుములకు కొత్త అందాలను అద్దారు.
మేనక మెరుపులు, ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
మేనక మెరుపు అనడంలో ఆమె అందాలు అనే అర్థం ఉంది, ఊర్వశి ఉరుములు అనడంలో నాకు లోతైన అర్థమేమీ కనబడట్లేదు. కేవలం యతి కోసం వాడి ఉంటారు. రెండో చరణంలో వేటూరి కొంచెం శృంగారం పాళ్ళని పెంచారు.
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుముల కొమ్మల తొడిమలు వణికే వాన
ఇక్కడ అన్నిటికీ రెండు రెండు అర్థాలు ఉన్నాయి. మనం మామూలు అర్థాన్నే చూద్దాము. పూవులపై తుమ్మెదలు వాలి తేనె పీల్చుకోవడం వలన మిగిలిన మరకలను ఈ వాన కడుగుతోందిట. వాన ధాటికి వాలిపోతున్న తొడిమలు వణుకుతున్నాయట. వాన శృంగారాన్ని సూచిస్తోంది అని పూవులని, తేనెటీగలను అడ్డుపెట్టుకుని చెప్పారు. ఇంక వెతుక్కునవాళ్ళకు వెతుక్కున్నంత.
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఇక్కడ వేటూరి చిలిపిదనం నాకు బాగా నచ్చింది. వాన-వల్లప్ప పాటలో లాగానే గొడుగులో గుస-గుసని వర్ణిస్తూ నాలుగు అడుగుల గొడుగులో ఇద్దరు సర్దుకోవడానికి ఇబ్బంది పడటమే వాన (అందుకోసమే వాన) అంటున్నారు.
గాలివాన గుళ్ళోన ముద్దేలే జేగంట
గాలి-వాన వచ్చినప్పుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే జంట దగ్గరవ్వడమే మార్గమనడానికి పై వాక్యం. భావలకోసం కానీ, పదాల కోసం కానీ వేటూరి వెతుక్కోరు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఇది వినగానే, "కేక" చిత్రంలో ఇందాక మనం ప్రస్తావించుకున్న పాటలో "వానదేవుడొచ్చినప్పుడే వయసే మొక్కు తీర్చుకోక తప్పదు. చినుకు తేలు కుట్టినప్పుడే జతగా మంత్రమేసుకోక తప్పదు" అనే పంక్తులు గుర్తొచ్చాయి.


వేటూరి భావాల కంటే, ఆ మాటకొస్తే అర్థం కంటే లయకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్రాసిన పాటలు "అల్లరి అల్లుడు" చిత్రంలో కీరవాణి స్వరపరిచినవి. నాకు గుర్తున్న అన్ని పాటల్లోనూ వేటూరి భావాలకు కొంచెం అన్యాయమే చేసారు. ఇందులో "కమ్మని ఒడి బొమ్మని" అని ఒక వాన పాట ఉంది. అందులో రెండో మూడో వాక్యాలు బాగున్నాయి.
మిడిసిపడకె తొలిసొగసు మొగలిపూరేకా! కస బుస కస కసిగా
పడగ విడిచి విరిపడక పరుచుకున్నాగా పగ వగ ఇదే పదరా
అమ్మాయిని మొగలిపూవుతో పోల్చడం రివాజే. ఈ వాక్యాల్లో వేటూరి శృంగారంలో అబ్బాయి తగువుని, అమ్మాయి తెగువని కొంచెం భిన్నంగా చెప్పారు అని నా అభిప్రాయం.


ఇక చివరిగా వేటూరి వ్రాసిన వానపాటల్లోకల్లా అత్యంత బూతుగా అనిపించిన వాక్యాన్ని చెప్తున్నాను. అసలు ఇది వ్రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఎంత బూతునైనా వేటూరి పదాల మాయలో అందంగా కనబడేలాగా చేయగలరు అని చెప్పడానికే వ్రాస్తున్నాను. ఇది "నా అల్లుడు" చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన "పట్టుకో పట్టుకో" అనే పాటలోనుండి.
అందము తడిసిన వేళ, ఆడది ఒక జ్వాల
కూసం విడిచిన వేళ, కుదుపుల ఉయ్యాల
గమనిస్తే రెండు వాక్యాలలోనూ ఆది ప్రాస, అంత్యప్రాస కూడా కలిపారు.

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

Saturday, October 22, 2011

ప్రియతమా, నను పలకరించి ప్రణయమా (వేటూరి)

ఇళయరాజ, వేటూరి అంటే నాకు ఎంత ఇష్టమో నన్నెరిగినవాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. వారిద్దరి కలయికలో వచిన పాటలన్నీ నాకు ఇష్టం. చిరంజీవి, శ్రీదేవి నటించిన, విజయవంతమైన చిత్రం "జగదేక వీరుడు, అతిలోక సుందరి" లో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. నాకు ప్రత్యేకించి నచ్చినది, "ప్రియతమా, నను పలకరించు ప్రణయమా" అనే పాట.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వేటూరి వ్రాసిన చాలా పాటలు (ముఖ్యంగా యుగళగీతాలు) అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే కథానాయిక దేవకన్య కావడం. ఆ విషయాన్ని వేటూరి పాటలో చాలా సార్లు ప్రస్తావించి, ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అని నాకు అనిపిస్తుంది.

ఇళయరాజా సంగీతం గురించి వర్ణించడానికి నేను అనర్హుణ్ణి. స్వరజ్ఞానం లేని నా వరకు ఇది ఒక అద్భుతమైన బాణీ, స్వరకల్పన. జానకమ్మ, బాలు గురించి నేను చెప్పేదేముంది -- ఈ పాటలో వారి ఉచ్చారణ కొత్త గాయనీగాయకులకు నిఘంటువు వంటిది అని నా అభిప్రాయం.

చిత్రంలో ఈ పాట సందర్భం ఏమిటి అంటే: రాజు (చిరంజీవి) అనే యువకుడు కొంతమంది అనాథలను పెంచుకుంటూ ఉంటాడు. అతడు ఒక పని నిమిత్తమై హిమాలయాలకు వెళ్తే అక్కడ ఇంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) చెలికత్తెలతో ఆడుకుంటూ పారవేసుకున్న ఉంగరం దొరుకుతుంది. ఇంద్రజకు ఆ ఉంగరం లేనిదే స్వర్గ ప్రవేశం లేదు. ఆ ఉంగరం సంగ్రహించడానికి భూమిపైకి వచ్చి రాజును ఏదో ఒక లాగ మభ్యపెట్టి అది తీసుకుని పోదామనుకుంటుంది. కాకపోతే రాజు మంచితనానికి, తనతో ఉన్న పిల్లలతో ఏర్పడిన అనుబంధానికి లొంగిపోయి ఉంగరం దొరికినా వెళ్ళలేక ఉండిపోతుంది.

ఈ లోపు రాజుకు నాయిక ఇంద్రుని కుమార్తె అని తెలిసి, పశ్చాత్తాపంతో ఉంటాడు. వారు ఇద్దరూ కలుసుకుని తమ వలపును తెలుపుకునే సమయంలో వచ్చే యుగళగీతం ఇది.


గానం: బాలు, జానకి
రచన: వేటూరి సుందరరామ మూర్తి
దర్శకత్వం: రాఘవేంద్ర రావు
సంగీతం: ఇళయరాజ

ప్రియతమా! నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా
మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా

నాయిక నాయికుణ్ణి "నను పలకరించు ప్రణయమా" అనడంలో "అతడు ప్రణయానికి మూర్తీభవించిన రూపం" అని భావం. అస్పృశ్యమైన ప్రణయానికి, స్పృశ్యమైన నాయకుడికి సామ్యాన్ని చూపడం వేటూరి ముద్ర.అతిథి అంటే చెప్పకుండా వచ్చేవాడు అని అర్థం (అ+తిథి). దేవకన్యలు మానవులను పెండ్లి చేసుకుందామని అనుకోరు కనుక నాయిక జీవితంలోకి నాయకుడు అనుకోకుండా వచ్చాడు అని కవి భావం.

పల్లవిలో మూడు ప్రయోగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాయిక నాయకుణ్ణి బ్రతుకులోని బంధం, పలుకలేని భావం, మరువలేని స్నేహం గా వర్ణించడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా "పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. అలాగే యువరాజు చిత్రంలో "తొలివలపే తీయనిది" అనే పల్లవి తో ఉన్న పాటలో "వేదం లాగా లిపి లేనిది" అని ప్రేమను వర్ణించడం ద్వారా వేటూరి ప్రేమను అనుభవించాలి కానీ, మాటల్లో వివరించలేము అని వర్ణించారు. ఇటీవల వచ్చిన "సూర్య S/O క్రిష్ణ" చిత్రంలో కూడా "అభిమానం అనేది మౌనం, పలకదులే పెదవులపై" అని వ్రాసారు.

ఇక్కడ ఒక విమర్శ ఏమిటంటే "నాయకుడు తన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, మరలి రాని నేస్తం ఎందుకయ్యాడు? మరలి పోని నేస్తం అయ్యాడంటే అర్థం ఉంది కానీ?". దీనికి సమాధానం ఆ మహానుభావుడికే తెలియాలి. ఇంత అద్భుతమైన పాటలో ఈ చిన్ని విషయాన్ని ఆయన విస్మరించారు అంటే నాకు నమ్మకం కుదరట్లేదు.

ప్రియతమా ||
ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా?

నాయకుడు ఇంద్రజని "ఎదుట ఉన్న స్వర్గం" అనడంలో శ్లేష ఉంది. స్వర్గంలో ఉన్న అందం అంతా తన కళ్ళ ఎదుట ఉంది అని ఒక అర్థం అయితే, తనతో ఉంటే అతనికి స్వర్గంలో ఉన్నట్టు (హాయిగా) ఉందని మఱొక అర్థం.

అందాన్ని కావ్యంతో పోల్చడం వేటూరికి కొత్త ఏమీ కాదు. ఛాలేంజ్ చిత్రంలో "ఓం శాంతి" అనే పాటలో, "కన్నె నడుమా కల్పనా? కవులు పాడే కావ్యమా" అని అనడం ద్వారా స్పృశ్యమైన (tangible) వస్తువులని అస్పృశ్యమైన వస్తువులతో పోల్చడం చేశారు. కౌగిలి విడితే ప్రాణాలు పోతున్నాయా అని చిలిపిగా అడగడం నాకు నచ్చింది. గుర్తు రావట్లేదు కానీ, ఇవే మాటలు మఱొక పాటలో కూడా వాడినట్టున్నారు.

నింగి వీణకేమొ నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి

వేటూరికి తెలుగు మీద ఉన్న అభిమానం గురించి నేను చెప్పక్కరలేదు. అందుకేనేమో ప్రత్యేకించి దేవకన్యకు కూడా తెలుగు నచ్చిందని చెప్తున్నారు :) నింగి వీణ సంగీతం ఆలపించాలి -- అలాంటిది నేల మీదటి తెలుగు పాటలు వచ్చాయట. పారిజాతం (చదువర్లకు పారిజాతాపహరణం గుర్తుంటే ఇంద్రుడికి, పారిజాతానికి ఉన్న సంబంధం గుర్తొస్తుంది) కాస్తా పచ్చి మల్లెమొగ్గ (సిగ్గు పడే ఆడపిల్ల) లాగా తనలో విరిసి (తనలో మెదిలి) ప్రేమను తెలిపిందట. రెండు వాక్యాలలోనూ స్వర్గాన్ని గురించి మాట్లాడారు.

మచ్చలెన్నొ ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మ  కన్న చీరకట్టుకున్న పడుచుదనమే నాలో మురిసే

దేవకన్యలో ఆకాశంలో కదా విహరించేది. ఇంద్రజకు (నాయికకు) మచ్చలున్న చందమామ కంటే (ఈ మాటల్లో కూడా శ్లేష ఉంది) మచ్చలేని (గుణవంతుడైన) నాయకుడే నచ్చాడట. తారల్లో ఒక దానిగా వెలగడం కంటే చీర కట్టుకొని ప్రియుడి కోసం వేచి ఉండటం బాగుందట. (ఇదే చిత్రంలో "యమహో నీ యమ యమ అందం" అనే పాటలో "తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి" అని అనడం కూడా నాకు నచ్చింది.) ఇందులో నాయిక కూడా ఆకాశం కంటే భూమే బాగుందని చెప్పింది.

మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం
తారలన్ని దాటగానె తగిలే గగనం, రగిలే విరహం

నాయిక తన ఉంగరాన్ని సంగ్రహించాక (తస్కరించాక) స్వర్గానికి వెళ్తూ ఉంటే తారలు దాటగానే విరహం మొదలైందట :) ఈ ప్రయోగం ఘాటు నాకు బాగా నచ్చింది. ఇక్కడ గగనం అంటే శూన్యం (ఏమీ లేకపోవడం) అనే ధ్వని కూడా వినబడుతోంది.

వ్రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

మొదటి రెండు వాక్యాలూ "పలుకలేని భావం" కి కొనసాగింపులు. కన్నుల మధ్యన సాగే రాయబారాలకు వ్రాతలెందుకు. గతంలో "లిపిలేని కంటి బాస" అనే పాట పల్లవిలో, తఱువాత "మాయాబజార్" (రాజ, భూమిక నటించిన కొత్తది) చిత్రంలో "ప్రేమే నేరమౌన బ్రోవ భారమా? మాట మౌనమైన రాయబారమా?" అనే పాటలో ఈ భావాలను వ్రాసారు వేటూరి.

రాయి లాంటి గొంతు అంటే నా గొంతు లాగా వినడానికి కంకర్రాళ్ళు రుబ్రోల్లో వేసి దంచినట్టు ధ్వనించే గొంతు కాదని, (సిగ్గుతో) చలనం లేని గొంతు అని చదువర్లు గుర్తించే ఉంటారు :)

ప్రాణవాయువేదొ వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంతా యెంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి

దేవతలకు మనకు కొన్ని భేదాలుంటాయి -- వారికి చమట పట్టదు, కళ్ళు రెప్పలు పడవు, పాదాలు నేలను తాకవు, శరీరానికి దుమ్ము అంటదు, వాళ్ళు ధరించిన పూమాలలు వాడవు. బహుశః వాళ్ళకు ప్రాణవాయువు (అదే మన oxygen) పీల్చుకోవలసిన అవసరం లేదు అని వేటూరి ఉద్దేశం అయి ఉండవచ్చును. ఆ ప్రాణవాయువు నాయకుడి శ్వాసతో తనది కలిపి, వేణుగానంలో (ప్రణయంలో) ముంచి పోయింది అని నాయిక భావం. అలాగే, వేటూరి ఎంకి పాటల గురించి ప్రస్తావించడంతో నాయికకు మఱింత తెలుగుదనాన్ని అద్దారు.

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వచ్చా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి

నాయిక వెన్నెల వలే (ఆకర్షించి) వేదమంత్రం (పెళ్ళి) గా మారిందట. ఇక్కడ "బహుశా" అనడం బహుశా ఖాళీ-పూరింపు చర్య అయ్యి ఉండవచ్చును. కానీ ఇంత అందంగా వ్రాసిన పాటకు ఇలాంటి ఒకటి రెండు మాటలు దిష్టి చుక్కలుగా భావిస్తాను. లేదా నా అజ్ఞానం అనుకుంటాను.

నాకు పాటలోకి శ్రేష్ఠమైన వాక్యంగా గోచరించింది పై రెండో వాక్యం. మేనకల్లే (నాయకుణ్ణి ముగ్గులోకి దింపడానికి) వచ్చి జానకల్లే (నిష్ఠగా, సహధర్మచారిణి గా) మారిందట నాయిక.
ఇక్కడ కులము, గుణము అనడంలో నాయకుడి అనుయాయులు, అలవాట్లు అని ధ్వని.

నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం, విధికే విలయం
నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం, మనసే మరణం

నాయికానాయకులు ఒకరు లేని మఱొకరికి వారి సొంత ప్రపంచం అంటే విరక్తిని చెప్తున్నారు. ఐతే, నాకు నచ్చిన ప్రయోగం "మనసే మరణం" -- మనసు ఉంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అనే భావం నాకు నచ్చింది.

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై రగిలే

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో -- తెలుగులో ఇది వేటూరి, సిరివెన్నెల మాత్రమే చేయగలిగిన ప్రయోగం అని నా అభిప్రాయం. వానవిల్లు ఏర్పడాలంటే సూర్యకాంతి మబ్బుల్లోని నీటి పొరల ద్వారా చీలి కనపడాలి. దేవలోకంలోని నాయికకు భూమి చేరగానే గుండెలో ఎన్నో భావాలు (ప్రణయం, సిగ్గు, అభిమానం మొ.) పుడుతున్నాయని పరోక్షమైన ఉపమానంగా నాకు నచ్చింది. నాయకుడు చిలిపిగా "అమృతం పంచేటప్పుడు (సరసంలో) హద్దులు దేనికి?" అని తిరిగి అడిగాడు.

Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

Saturday, February 26, 2011

తొలివలపే తీయనిది... (వేటూరి పాట)

సామాన్యజనులకు అర్థమయ్యే విధంగా లోతైన భావాలను వ్రాయగలగడం సినీకవులకు ఉపయోగపడే లక్షణం. వేటూరి వ్రాసిన భావాలను అర్థం చేసుకోవడానికి ఒక్కోసారి భాషలో కానీ, చరిత్ర వంటి విషయాలలో కానీ పట్టు అవసరమౌతుంది. అది ఆయన లేఖినిలోని గాంభీర్యం ఐతే, అలాగ అవసరం లేకుండా వ్రాసిన పాటలు ఆయన కలంలోని లాలిత్యాన్ని ప్రదర్శిస్తాయి. దేని అందం దానిది.

వేటూరి లలితంగా వ్రాసిన పాటల్లో యువరాజు చిత్రంలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. తొలివలపు గురించి ఎంతో లోతుగా చెప్పారు వేటూరి, కానీ ఎక్కడా గ్రాంధికమైన పదాలు కనబడవు. ఒక్కో వాక్యంలోనూ ఒక్కో ఉపమానంతో ఆకట్టుకున్నారు. ఈ పాటకు స్వరకల్పన చేసింది రమణ గోగుల, పాడింది హరిహరన్, చిత్ర.. ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిటో అర్థం కాదేమో...

తొలివలపే తీయనిది, ఆ దాహం తీరనిది
కాలంలా కరిగిపోనిది, తానంలా(?) తిరిగిపోనిది
తొలివలపు ఒక దాహం. మనసులో ఉన్న వ్యక్తిని ఎంతసేపు చూసినా, తనతో ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఒక సారి ప్రేమభంగం అయ్యాక మళ్ళీ ప్రేమించడంలో  "ఇదివరకు చూసినదే" అనే ఒక రకమైన నిర్లిప్తత ఉంటుంది. కాలంతో కరిగిపోకుండా చివరివరకు గుర్తుండే ఒక తీయని జ్ఞాపకం అది.

వేదంలాగా లిపిలేనిది, వేధిస్తున్నా సుఖమైనది
పూర్వం వేదాన్ని ఎవరూ వ్రాసి ఎఱుగరు. అది గురుముఖతః విని కంఠస్థం చేయడమే మార్గం. అందుకే వేదం లిపి లేనిది అంటారు. తొలివలపు కూడా మాటల్లో వివరించలేని ఒక తీయని అనుభూతి అనడానికి దాన్ని వేదంతో పోల్చడం జరిగింది. తొలివలపు వలన చలించినంతగా మనసు మళ్ళీ చలించదు. ఎప్పుడూ అవే ఆలోచనలతో కలవరపెడుతున్నా తీయగా ఉంటుంది. ఇక్కడ "వేదానికి", "వేధిస్తున్నా" కి యతిమైత్రి, ప్రాస కుదరడం గమనార్హం.

ఓడిస్తున్నా గెలుపే అది, ఓదార్చే ఓ పిలుపైనది
ఈ చిత్రంలో తను ప్రేమించిన మనిషి మఱొక అమ్మాయిని పెళ్ళిచేసుకుంటుంటే చూస్తూ సిమ్రన్ ఈ మాటలంటుంది. తనకిష్టమైన వ్యక్తి తనకు దక్కకపోయినా అందులో అతనికి మంచి ఉంటుంది అని తెలిసి ఆ ఓటమిని అంగీకరిస్తూ, తన ప్రేమను గెలిపించుకుంటోంది కాబట్టి "ఓడిస్తున్నా గెలుపే అది". కథానాయకుడు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయాక తనకు మిగిలేవి తొలివలపు జ్ఞాపకాలే కాబట్టి అవే తనకు ఓదార్పు అని భావన.

చుక్కలనే నిలుపునది, దిక్కులనే కలుపునది -- ఆకశం తానై ఉన్నది
ఆకాశానికి ప్రేమకు సామ్యం చెప్తున్నారు వేటూరి. చుక్కలవంటి ఆశలను/జ్ఞాపకాలను ధరించేది, ఎక్కడెక్కడో పుట్టీ పెరిగిన ఇద్దరు మనుషులను కలిపేది, ప్రపంచమంతా ఉండేది ప్రేమ/ఆకాశం.

ఇద్దరిలో ఒక్కటది, ఒక్కరిలో ఇద్దరది -- నీకోసం నేనై ఉన్నది
ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఇద్దరిలోనూ ఉన్న ఒకే భావం తొలివలపు. ఒక్కరే ఉన్నా తమతో మఱొకరు కూడా ఉన్నట్టు అనిపించేటువంటి భావన ప్రేమ. ఒకరి కోసం ఒకరై జీవించేటువంటి అనుబంధం ప్రేమ.

గుండెల్లోన గూడే ఇది, గుచ్చే రోజామాలైనది
తొలివలపుకు మనసులో శాస్వతంగా ఒక స్థానం ఉంటుంది కనుక, "గుండెల్లోన గూడు" అది. వేధిస్తున్నా సుఖమైనది కనుక గుచ్చేటువంటి రోజాపూల మాల కూడా.

మాటల్లోన మౌనం అది, మనసుల్లోన ధ్యానం అది
సిమ్రన్ మనసులో బాధను పెట్టుకుని మాట్లాడుతున్నా అందులో తన ప్రేమ ఒక మౌనవేదనగా దాగి ఉంది. మనసులోని తమ ప్రేమను నిరంతరం తలుచుకునే ఇద్దరు ప్రేమికుల తపస్సు అది.

ఏ ఋణమో తెలియనిది, ఏ వరమూ అడగనిది, ఏ మజిలీ చేరేనో అది
కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఏదో ఋణం ఉండటం వలనే ఒక్క చూపులో ఇద్దరు మనుష్లు అంత దగ్గర అవుతారు అని కవి భావన. తొలివలపే ఒక వరం, అందులో స్వార్థం ఉండకూడదు. అలాంటి నిస్స్వార్థమైన ప్రేమ ఏ గమ్యం చేరుతుందో అనే ప్రశ్నతో నాయకుడు సందిగ్ధంలో పడ్డాడు.

ఎప్పటిదో తెలియనిది, ఎప్పటికీ మరువనిది, ఓ కథలా చేరే కంచికి
ఎవరు వ్రాశారో తెలియకుండానే "అనగనగనగనగా" అంటూ కథలు చెప్పుకుంటాను. చివరకు కథ కంచికి వెళ్ళింది అని నిద్రలోకి జారుకుంటాము. అలాగే ప్రేమ కూడా. ఎక్కడ మొదలౌతుందో తెలియదు కానీ, కొన్నాళ్ళుండి వెళ్ళిపోయినా జీవితాంతం గుర్తుంటుంది.

ఎద కన్నా లోతుగుంటది, బ్రతుకల్లే తోడు ఉంటది
ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి. మనసు ఎంతో లోతైనది, అందులో ఎన్నో భావాలు ఉంటాయి. ఆ మనసు కూడా అర్థం చేసుకోలేని ఒక రకమైన ఆరాధనా భావం ప్రేమ. ఎందుకు కలుగుతోందో తెలియని ఒక ఆర్ద్రత ప్రేమ. అది బ్రతికున్నంతకాలం గుర్తుంటుంది...

ఈ పాటను క్రింది వీడియోలో చూడవచ్చును.

Friday, January 28, 2011

వేటూరి గారి జయంతి

జనవరి వస్తోంది అనగానే మా ఇంట్లో పుట్టినరోజు పండుగల హడావుడి. ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య -- అందరూ ఇదే నెలలో పుట్టారు. అలాగే నేను గుర్తుంచుకున్న మఱొక పుట్టినరోజు వేటూరిది -- జనవరి 29. నా బంధువులందరూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. మఱి వేటూరో? లేదు. ఆయనకు ఫలానా సందీప్ అనే అభిమాని ఉన్నాడనే తెలియదు. మఱి వేటూరి పుట్టినరోజుతో నాకేమిటి సంబంధం? ఇది పరోక్షమైనది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా, ఆయన పాట నన్ను పట్టుకుంది. బహుశః దీన్ని పాటిచ్చుకోవడం అనాలేమో. నా కష్టసుఖాల్లో నా ఆత్మీయులందరితో పాటు ఆయన పాటలు కూడా తోడున్నాయి. అందుకే ఆయన పాటంటే నాకు ప్రాణం. ఆ పాట ఇచ్చిన మనసు అంటే నాకు అభిమానం.

మొన్న ఒక నాలుగు రోజులు అనారోగ్యం చేసి పక్క దిగలేదు. తత్ఫలితంగా నా mp3 player లో పాటల్ని కూడా వినలేదు. నయమయ్యాక ఒక్క రోజు నాలోనే నాకు తెలియని గొంతు ఒకటి మేలుకొని,  "వేటూరిని మరిచిపోతున్నావా సందీప్?" అని అడిగింది. ఒక్క నిముషం నివ్వెరపోయి చూశాను - "ఎన్నాళ్ళైంది వేటూరి పాట విని - వారం దాట వస్తోందా?", అనిపించింది. సరిగ్గా ఆలోచిస్తే - "లేదే - మొన్ననే వేటూరిని తలుచుకున్నాముగా", అని గుర్తొచ్చింది. ఏదో రెహ్మాన్ సంగీతం గురించి చర్చిస్తూ, "మెరుపు కలలు చిత్రంలోని గీతాలు బాగుంటాయి కదా?", అంటే నా స్నేహితురాలు - "అమ్మో, అందులో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు", అంది. నిజమే! నేను కూడా రెండుమూడు పదాలకు అర్థాలు నిఘంటువులో చూసుకోవలసివచ్చింది. మఱి భాష మీద ఆయన పట్టు అది. "తల్లో తామర మడిచే ఓ చిలకా...అట్టిట్టాయెను మనమే ఓ థళుకా! చెలి ఒడిలో కాగెను హృదయం, నా కంఠం వరకూ ఆశలు వచ్చే వేళాయె, నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టే కొత్తగా, పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖం, గలబా కప్పలు జతకై చేరే ఆషాఢం, ఎడారి కోకిల పెంటిని వెతికే గాంధారం, విరాళిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కలం, నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ? ఇదే సుమా కౌగిలి భాష" -- ఇలాంటి పదాలను వాడితే సగటు తెలుగు చిత్రవీక్షకుడికి ఏమర్థమవుతుంది. "నువ్వసలు నచ్చలే అనో నీ బలుపు ఇష్టం అనో అంత లేదె అంత లేదె అనో if you gonna love me, i gonna love you" అనో అంటే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక సారి గుర్తొచ్చింది, "అయ్యో...మళ్ళీ ఇలాంటి కొత్తపాట వినలేమా?" అనిపించి నా మీద నాకే జాలేసింది. "ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది" అని ఆయన చెప్పిన మాటలే మళ్ళీ తలుచుకోనా?

అదే రోజు రాత్రి ముగ్గురం స్నేహితులం కూర్చుని కర్నాటిక సంగీతం గురించి చర్చించుకుంటున్నాము. ఇంతలో రాగాల పేర్ల గురించి వస్తే, వేటూరి రాగాల పేర్లను ఎలాగ పాటల్లో వాడేవారో చెప్తూ అన్నాను - "వేటూరి రాగాల పేర్లని ఊరికెనే వాడరండీ... అక్కడ ఆ రాగం బాణీలో కూడా ఉండాలి" అని. డబ్బు మీద ఆశ వదులుకొమ్మని చెప్పేటప్పుడు, "శ్రీరాగమందు కీర్తనలు మానర" అనడం గొప్ప ప్రయోగమే. కానీ, అప్పుడు బాణీలో కూడా అదే ఉంటే అప్పుడు అది మహాద్భుతం. అలాగే, "నాలో రేగే హంసానందీరాగాలై", "అరవిచ్చేటి ఆభేరిరాగాలు" అన్నీను.

ఇంతలో వాళ్ళు "మధురాష్టకం" పెట్టారు. అందులో "అధరం మధురం, వదనం మధురం" అని పల్లవి. వెంటనే నాకు వేటూరివి రెండు పాటలు గుర్తొచ్చాయి -- shock చిత్రంలో "మధురం మధురం" అనే పాట దాదాపు ఇలాంటి ప్రయోగాలతోనే సాగుతుంది,  "యువరాజు" చిత్రంలో "మనసేమో చెప్పిన మాటే వినదు" పాటలో పల్లవికి, మొదటి చరణానికి మధ్యలో కూడా ఈ పాట ఉంటుంది. ఈ రెండూ వేటూరికి మధురాష్టకం పైన ఉన్న అభిమానానికి ఋజువులేమో. ఒక సామాన్యమైన యుగళగీతం వ్రాయమంటే కృష్ణభక్తిభరితమైన వల్లభాచార్యుని పాటను తీసుకురావడాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

ఉఫ్...లేదు ఇంకా నేను వేటూరిని మరిచిపోలేదు. అది సంభవం కూడా కాదు. తొలిప్రేమను ఎవరూ మరిచిపోరంటారు. మరి వేటూరి పాట మీద నాకున్న ఈ ప్రేమ తొలిప్రేమే కాదు, మలిప్రేమ కూడానేమో. మళ్ళీ ఇంకొకరి పాటలు వేటూరి పాటలలాగ నన్ను ఆకర్షించవేమో...

వేటూరి వాక్కులనే నేను సామెతలుగా వాడుకుంటూ ఉన్నాను. పిల్లకాయలు ప్రేమ ప్రేమ అని తెగ ఉత్సాహపడిపోతుంటే వారిని చూసిన విరక్తిలో, "పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు" అని, ఏళ్ళ తరబడి పెళ్ళి చేసుకోకపోతే, "ఉలకడూ పలకడూ ముదురుబెండడు" అని, పని చెయ్యాలని నన్ను నేనే ఉత్తేజపరుచుకోవడానికి, "మనసు ఉంటే మార్సు దాక మార్గముంది ఛలో" అని, జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు "అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే" అని, అందమైన అమ్మాయిని చూస్తే "కిన్నెరసాని వచ్చిందమ్మ, వెన్నెల పైటేసి" అని...ఇంక ఇలాగ చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఆఖరికి నా పెళ్ళి గురించి నేను ఇప్పటి దాకా ఆలోచించిన ఏకైక విషయం ఏమిటి అంటే, "పెళ్ళి cassette లో ఏమేం వేటూరి పాటలు పెట్టించవచ్చును?", అని. బహుశః నాది పిచ్చేమో. కానీ, నాకు అందులో తృప్తి ఉంది.

వేటూరి పుట్టినరోజును ఆయన అభిమానులు చాలామందే గుర్తుంచుకోకపోవచ్చును. కానీ, ఆయన పాటలను ఇంకా తమ సొంతవాటిలాగే అభిమానిస్తున్నారు. ఇంతకంటే ఏ కవి మాత్రం కోరుకునేది ఏముంది?..."ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలుక. మిగిలింది వేలిపై అది వాలిన మరక..."

Sunday, November 7, 2010

కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి (జొన్నవిత్తుల రచన)

"దేవి" చిత్రం తో దేవిశ్రీప్రసాద్ చలనచిత్రసంగీతరంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రం అంటే ఏ సంగీతదర్శకుడైనా చాలా కష్టపడి మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఉదాహరణకి ఇప్పటికీ రోజ వంటి అద్భుతమైన పాటలను మళ్ళీ రెహ్మాన్ చెయ్యనేలేదు అనే వారున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంతో ఉత్సాహంగా కనబడి నేటి తరం యువకుడు లాగా కనబడే ఈయన, ఎంతో పొందికైన, శ్రావ్యమైన గీతాలని ఈ చిత్రానికి అందించారు. పాటల మధ్యలో వేణువు (ఈ పాట), వీణ (తొట్టిగ్యాంగ్ చిత్రంలో "నువ్వే కావాలి" అనే పాట), సన్నాయి (ఆనందం చిత్రంలో "చికిచికిచం") వంటి సంప్రదాయవాయిద్యాలను వాడటంలో ఈయన సిద్ధహస్తుడు. ఈ పాట బాణీ చక్కని తెలుగుదనంతో ఉంటుంది.

జొన్నవిత్తులకి అపారమైన లాఘవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం. దేవుడు, దేవి మొదలైన చిత్రాలలో ఆయన అందించిన సాహిత్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అచ్చతెలుగు పదాలను వాడి అందరినీ మెప్పిస్తారు. ఈ పాటతో సరసగీతాలలో ఆయనకు ఉన్న పట్టుని ప్రదర్శించారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చును.


చిత్రం: దేవి
రచన: జొన్నవిత్తుల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
పాడింది: చిత్ర, బాలు
సంగీతం: దేవిశ్రీప్రసాద్

కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమిబంగరు  చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి

ఇక్కడ గమనించవలసినది యతినియమాన్ని - కుంకుమ, కులికే; మేలిమి మెరిసే - పల్లవిని పాడుకోవడానికి హాయిగా మలచాయి. కుంకుమపూలతోట, మేలిమిబంగరు చీర వంటి పదాలు తెలుగుపాటల్లో వినిపించడం చాలా అరుదు. అవకాశం దక్కినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు జొన్నవిత్తుల. "మరాళి" అంటే హంస అనే అర్థం ఉంది. తన గుండెకొలనులో సంచరించే హంసగా, మల్లెల తావిని నింపుకున్న గాలిగా తన ప్రేయసిని వర్ణించడం చక్కగా కుదిరింది.

శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి

"శంఖములూదిన ప్రేమ" అనేది గొప్ప ప్రయోగం. శంఖారావం విన్నప్పటికి మల్లే, ప్రేమ మనసును తట్టగానే గుండె ఝల్లుమంటోంది అనే లోతైన భావాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు కవి. "సమాళించడం"అంటే అనుకూలంగా చేర్చడం - ఈ పదం కూడా చలనచిత్రగీతాల్లో విన్నది తక్కువే! చంద్రకాంతిని వెతికే చకోరంగా తనను, యవ్వనమనే వనానికి కాపరి గా ప్రియుణ్ణి సంబోధించడం కూడా చాలా నవ్యంగా ఉంది.

మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం 

తామరమొగ్గ, కాముని సవాసం -శృంగారానికి కూడా ఎంతో సాత్వికతను అలది చెప్పగలిగారు కవి.

హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం

"చ్చ" తో అనుప్రాస కలిపడం ఒక ఎత్తైతే, "హెచ్చెను హేమంతం" అనడంతో "హె"-కు యతి కలిసింది - అలాగే హేమంతానికి ఉత్సాహం కలిగింది అనే కొంగొత్త ప్రయోగం కుదిరింది.

ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా

"విరిసిన పరువాల పిలిచెను మధుబాల" -- స్త్రీని విరిసిన పువ్వుతో పోల్చడం గతంలో చాలా పాటల్లో జరిగినా ఇది కొత్త మాటలతో వినూత్నంగా ఉంది. ఆ వాక్యానికి "వేసే పూబంధాలు" అంటూ మరింత సౌందర్యాన్ని అలిదారు కవి.

అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం

పుష్యమి నక్షత్రం అనడంలో కవి ఆంతర్యం పరిపూర్ణంగా అర్థం కాకపోయినా -- పుష్యం అంటే ఒక నవరత్నాలలో ఒకటి. "ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చిన తాంబూలం ఆమె చెక్కిలిపై పుష్యంగా చేరి నక్షత్రం వలే మెరుస్తోంది" అన్నది కవి భావమనిపిస్తోంది. ఇక్కడ కూడా జొన్నవిత్తుల వారు వేటూరిని తలపించారు. నక్షత్రాలను, తిథులను పాటల్లోకి తీసుకురావడం ఇదివరకు వేటూరి చాలా సార్లు చేశారు. (ఉదా:- కొండవీటి రాజ చిత్రంలో "గన్నవరం సిద్ధాంతి అన్నారు - వలపుల్లో వర్జ్యాలు ఉండబోవని").అలాగే, ఒక ప్రయోగానికి రెండుమూడు భావాలు కుదిరేలాగా వ్రాయగలగడం కూడా వేటూరి పాటల్లో రివాజు.

ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం

ఇది నా చేత, "ఆహా" అనిపించిన వాక్యం. "పంచదారవిల్లు" (అంటే "చెరుకువిల్లు", మన్మథుడి విల్లు) చేసిన గాయం అంటే ప్రేమ పెట్టిన తొందర - ఎంత కొత్తగా చెప్పారు కవి! ఆ విల్లు వదిలిన బాణం తగలకపోతే వయసు మోమాటం తీరదుట - మహాచిలిపిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది.

నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి

"రసమయరహదారి" (ప్రేమరసం నిండిన త్రోవ) - ఇటువంటి మాటను నేను తెలుగుపాటల్లో వినలేదు. అదొకటే కాక "శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి" అనడంలో ఎంతో శృంగారం నిక్షిప్తం చేశాడు కవి.

మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై...

నింగీనేలా ఏలే రాగాలు అంటే సాయంసంధ్య గా నాకు అర్థమయ్యింది. అంటే సందెవేళలో ప్రేయసీప్రియులు ఏకమై ప్రేమభావంలో పొంగిపోతున్నారు...అని.

Saturday, September 25, 2010

నిదుర రాని నిట్టూర్పుల జోల పాటలు

ఈ మధ్యన నాకు ఒకదాని తఱువాత మఱొకటి పనులు వచ్చి పడుతున్నాయి. ఇన్ని పనుల మధ్యలో తీరిగ్గా కూర్చుని ఒక పద్యం వ్రాద్దామన్నా, ఒక పాట వ్రాద్దమన్నా, ఒక హాస్యభరితమైన టప వ్రాద్దమన్నా కుదరట్లేదు (ఇదేదో డబ్బా కొట్టుకోవడం కాదు. ఇలాగ పనులు వచ్చిపడటానికి కారణం నాకు క్రమశిక్షణ తక్కువవ్వడమే!).

ఈ పరిస్థితుల నడుమ పడుకునే ముందు రెండు నిముషాలు మనసుని ప్రశాంతపరుచుకుని రెండు మూడు వాక్యాలు వ్రాసి ఆ సంతృప్తితో పడుకుందామని అనిపించినప్పుడల్లా ఏవో వ్రాస్తున్నాను. వాటిల్లో కొన్ని మిత్రులకు నచ్చాయి. అవి ఇక్కడ కూడా వ్రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇవి పాటలా అంటే నాలుగైదు వాక్యాలకు మించి ఉండవు, పద్యాలా అంటే ఛందస్సును అనుసరించవు, వాక్యాలా అంటే లయ ఉంటుంది, తవికలా అంటే మరీ అంత తేడాగా ఉండవనే అనిపించింది. వీటినేమనాలో నాకు తెలియదు. అందుకే ఈ టప శీర్షవాక్యం (title) అలాగ వ్రాశాను.

నేను వ్రాసినవాటిల్లో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. వాటికి సందర్భాలు అంటూ ప్రత్యేకించి ఉంటే వివరిస్తాను. వాక్యం చివరన $ పెడితే నాకు నచ్చిందని :-D. 


"ఎబ్బే, ఛ ఛ" మొదలైన భావాలేమైనా ఉంటే వ్యాఖ్యల ద్వారా చెప్పండి - ఇకపైన ఈ బ్లాగ్పొల్యూషణ్ని నివారిస్తాను. మనోనేత్రంలో ఇలాంటి నలుసులు మళ్ళీ పడకుండా జాగ్రత్తపడతాను :)

సం:- పడుకోబోతుంటే ఒక అమ్మాయి చిత్రం (photo) చూశాను. లక్ష్మీదేవి లాగా కళగా ఉంది.

ఈ సిగ్గు ఏ ముంగిలి ముగ్గో
ఈ నవ్వు ఏ వాకిలి పువ్వో
ఈ వలపు ఏ గడపల పసుపో $
ఈ సొగసు ఏ రాముడి సగమో $

సం:- ఒకమ్మాయి తిరుపతి మీదుగా బస్సులో వెళ్తోంది. ఏదో భయంలో ఉంది. కాస్త చల్లబడేలాగా రెండు మాటలు చెప్దామనిపించింది. అప్పుడు పంపిన SMS.

వీచేటి ఈ గాలితో పంపాను, నీ మోవిపై చిరునవ్వుపూలన్ని చిరకాలముండేట్టు శ్రీరస్తుభావాలని
పూసేటి సిరివెన్నెల జోలాలి అంటుండగా, ఏ చింతలూ లేక ఈ బంతి నిదురమ్మ ఒడిలోన ఒదగాలని
"జాబిల్లి నీ చెల్లిలాగుందె ఓ బుల్లి, ఏ పల్లె మారాణివే?", అనుకున్న దోవెళ్ళి వెంకన్ననడగాలి ఎవరని

సం:- వేటూరి పూనేశాడు. కొంచెం శృంగారరసం కలపాలనిపించింది. తప్పుగా అనిపిస్తే చదువర్లు క్షమించాలి.

వయసు వాయనాలడుగగ వచ్చానే మగువా!
నా వలపునోము చెల్లించగ నీకెందుకు బిగువ?
జాబిలమ్మ పందిరేసి పిలిచాక తగువా? $
పెదవిగంధమద్దుతాను* మడిపీట దిగవా? $

సం:- మధ్యమధ్యలో నాకు పిల్లరాతాలు వ్రాయలనిపిస్తుంది. అంటే కొత్త ప్రేమకొడుకు భావాలు. అలాగ అనిపించినప్పుడు:

ఆ రోజున నిను చూసిన నన్ను, ఏనాడూ నే మరువగలేను
ఆ నిముషంలోనే జీవిస్తున్నాను $

నువు లేకనె నా పైనే నాకు, కలిగిందే ఈ వింతచిరాకు
ఇటు రాకని నేనే చెబుతున్నా నాకు $


* దుష్టసమాసానికి క్షంతవ్యుణ్ణి.

# ఈ టప శీర్షవాక్యం "నేను" చిత్రంలో వేటూరి వ్రాసిన "దేవతలా నిను చూస్తున్నా" పాటలోని వాక్యం. ఈ పాటకు సందర్భం ఒక కుఱ్ఱాడు తన తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతనితో స్నేహంగా ఉన్నా, మఱొకరిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ఈ కుఱ్ఱాడి ముందు తిరుగుతుంటే అతనికి కలిగే ఆవేదనని, తన ప్రేయసి వేరొకరిని ప్రేమిస్తోంది అని తెలిసినా తనని మరచిపోవడం వీలు కాని అసహాయతనీ వ్యక్తం చేసే పాట అది. ఈ పాటను ఇక్కడ చూడవచ్చును, దాన్ని విశ్లేషిస్తూ సోదరుడు ఫణీంద్ర వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ చదువవచ్చును. ఆ పాటలో దాదాపు అన్ని వాక్యాలూ నాకు నచ్చినా, ఈ వాక్యంలో ఇంకా లోతు కనబడింది. అందుకే దీన్ని నా టపకు శీర్షవాక్యం గా చేశాను.

Saturday, July 31, 2010

ఆపరా నీ ఫియాన్సే గోల

నాకు ఒక తమిష్జస్నేహితుడు ఉన్నాడు. వాడు ఒకమ్మాయిని ప్రేమించాడు. పెద్దల అంగీకారాన్ని సంపాదించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ పరిస్థితుల మధ్య వాడితో వచ్చిన తంట విచిత్రంగా ఉంది. అదే ఈ టపలో మూలవిషయం.

మేమిద్దరం బెంగుళూరులో ఉన్నప్పుడు వారానికో సాయంత్రం కలుసుకుని ఒక రెండు గంటలు cinema చూసి, కృష్ణా cafe లో దోశలు లాగించి, Corner Houseలో హిమక్రీములనారగించి, ఊరు నిదరోయే సమయంలో తీరిగ్గా, కుక్కలు తిరగని వీధుల్లో నడుచుకుంటూ, ఇందిరా గాంధి పెళ్ళి వెనుక రహస్యాల నుండి "జంతువులకు బట్లేసుకోవాలని ఎందుకు అనిపించదు?" వంటివాటి వరకు అన్ని విషయాలనూ సమగ్రంగా చర్చించుకునేవాళ్ళం. అమెరికా వచ్చాక కూడా అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము. కాకపోతే agenda మారిపోయింది. అలాటి సాయంత్రాలలో ఒకటి నిన్నటిది...

సాయంత్రం ఆరు గంటలకు నేను బస్సు దిగి అక్కడే వాడి గురించి నిరీక్షిస్తూ ఉన్నాను. వాడు చెవులో phone పెట్టుకుని మాట్లాడుకుంటూ, "ఇల్లెడీ, నాన్ ఒణ్ణుమే సాపిడల్లె, నెజమా సొల్రేన్ [నేనేమీ తినలేదు. నిజంగా చెప్తున్నాను]", అనుకుంటూ వచ్చాడు. నేను "నిజంగా సొల్లే" అనుకున్నాను. భుజం తట్టి "పద పోదాం" అన్నట్టు సైగ చేశాడు. పది నిముషాలు నడిచాము. ఇంకా phone అవ్వలేదు. ఇంతలో Walmart (departmental store) వచ్చింది. వాడు phone లో, "ఇరు ఇరు, నా అప్ప్రమా కాల్ పణ్ణువేఁ [ఉండు, తరువాత కాల్ చేస్తాను]"  అని పెట్టేశాడు. "మళ్ళీ call చేస్తే, తుపాకితో నిన్ను కాల్చేస్తాను", అనుకున్నాను. నాకేసి తిరిగి, సాంబార్ వాసన వచ్చే యాసతో, "ఎలా వున్నావు?" అని అడిగాడు. "అఘోరించావులే తెలుగులో", అనుకుని; "Walmart లో ఏమైనా కొనాలా?", అని అడిగాను. "చాలా కొనాలి. అసలే నా పెళ్ళి దగ్గరకొస్తోంది. అన్నీ చక్కబెట్టుకోవాలి", అన్నాడు. సరే అని Walmart లోకి వెళ్ళాము.

"ఏం కొనాలి", అని అడగగానే, Leather case లోంచి ఒక phone తీశాడు. వాడికి office లో ఒక blackberry phone ఇచ్చారు. అందులో వాడు కొనాల్సినవాటి జాబితా వ్రాసుకున్నాడు. అది నాకు చూపించాలని తాపత్రయం. నేను ఒక విరక్తియుక్తమైన నవ్వు నవ్వాను. "మొదట ఒక దుప్పటి కొనాలి. చలిగా ఉంటోంది", అన్నాడు. దుప్పట్ల section కి తీసుకెళ్ళాను. అక్కడ వాడు అన్ని దుప్పట్లూ, వాటి ధరలూ చూశాడు. చూసి, "నిజం చెప్పాలంటే, దుప్పట్లు, కర్టెన్లు సంగతి ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. ఈ సారి నా ఫియాన్సేని తీసుకొచ్చినప్పుడు కొనుక్కుంటాను", అన్నాడు. సరే అని, "ఇంకేం కొనాలి", అన్నాను. "Mixer కొనాలి", అన్నాడు. వాడిని తీసుకుని Mixers section కి వెళ్ళాను. నా అనుభవం మేరకు అన్నీ చూపించాను. వాడు "Phone a friend" option వాడుకున్నాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఒక పావుగంట సేపు: మధ్యనం sandwichలో ఎంత cheese వాడారు, Inception cinema చూస్తున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయారు వంటి అత్యవసరవిషయాలను చర్చించి, చివరకి నా మీద దయతో "ఏ mixer కొనాలి" అన్న ప్రశ్నపై దృష్టి పెట్టారు. వీడు restaurant లో waiter లాగా అన్ని mixer ల ధరలు, ప్రత్యేకతలు చెప్పాడు. చివరికి, "నేను చూడందే నిశ్చయించుకోలేను", అంది. వాడు నాకేసి తిరిగి, "మాఁవ, తను చూస్తే కానీ చెప్పలేను అందిరా", అన్నాడు. సరేనని అదే విధంగా ముందుకుపోయాము. "నా structure పాడైపోతోంది, running చెయ్యాలి కద, మాఁవ!", అన్నాడు. వెంటనే విషయం అర్థమైంది. ఉన్నట్టుండి మగవాడికి అంత సద్బుద్ధి ఎలాగ వస్తుంది మరి? "సరే, ఇప్పుడేం కావాలి?" అన్నాను. socks కొనాలి అన్నాడు. సరే పద అన్నాను. అక్కడా scene repeat.

చివరికి నా మటుక్కు నేను biscuits కొనుక్కున్నాను. నేను vegan ని కాబట్టి పాలు లేనివి కొనుక్కున్నాను. అవి అంత రుచికరంగా ఉండవు. "నీకూ కావాలా?", అన్నాను. దానికి వాడు, "ఓ! sorry. నేను junk food (చిరుతిళ్ళు) తినడం మానేశాను. ఇందులో అన్నీ carbs ఏ తెలుసునా?", అన్నాడు. మళ్ళీ విషయం అర్థమైంది. "మాఁవ, నాకు అంతటి పరిజ్ఞానం, జిజ్ఞాస - రెండూ లేవు", అన్నాను. Credit card అంటగడదామని ప్రయత్నిస్తున్న ఏజెంటుని చూసినట్టు ఒక చూపు చూశాడు. ఇంటికి వచ్చాము.

"Dinner కి ఏం వండుతున్నావు", అన్నాడు. "నాకు వంట రాదని తెలుసుగా? Sandwich చేస్తాను", అన్నాను. "అందులో ఏం వేస్తావు?" అన్నాడు. "పనీర్ మసాల, ఆలూగోబీ, భెండీ fry - ఏది better అంటావు?", అని వ్యంగ్యంగా అడుగుదామనుకుని, "సరే పెళ్ళి చేసుకుంటున్నాడు వెధవాయ్. పెద్దరికం వహిద్దాము", అని నిర్ణయించుకుని "Garlic sauce, Hummus, Onions, Tomatoes, Peppers", అన్నాను. "Hummus అనగానేమి?", అన్నాడు. Hummus అంటే మన వేరుశనగ చట్నీ లాంటిదే" అని చెప్పాను. "సరే try చేస్తాను", అన్నాడు. నా మానాన వెళ్ళి కూరలు తరగడం మొదలెట్టాక వచ్చి, "నాకు hummus నచ్చదు మాఁవ", అన్నాడు. "నువ్వెప్పుడూ తినలేదు కదా?', అన్నాను. "ఆ అమ్మాయికి నచ్చలేదుట", అన్నాడు. నేను లేని రెండు నిముషాల్లో phone చేసి మరీ కనుక్కున్నాడు అని అర్థం చేసుకున్నాను. Hummus తీస్తున్న చెంచాతో రెండు ముద్దలు తీసి వాడి నోట్లో కుక్కేద్దామనిపించింది. ఆపుకుని, "ఒక ముక్క తిను. నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాము", అన్నాను. తన ముప్ఫై ఏళ్ళ career లో, ఎల్లపుడూనిజాయితీగా ఉన్న government officer, మొదటి సారి, పై అధికారి ఒత్తిడి వలన తప్పు చేయాల్సొస్తే ఎంత బాధపడతాడొ అంత బాధగా మొహం పెట్టాడు. తరువాత, పళ్ళాలు కడగటం మొదలెట్టాను. వెనుకనుండి వచ్చి, "ఈ brush బాగా రుద్దదు మాఁవ. ఆ అమ్మాయికి ఇది నచ్చదు. పీచైతే better.", అన్నాడు. ఆ brush తో వాడి నాలుకని తోఁవేద్దామనిపించింది. ఊరుకున్నాను.

Sandwich చేశాను. తిన్నాడు. ఒక ముక్క తినగానే లేచాడు. "ఏం, నచ్చలేదా?", అన్నాను. నవుల్తూనే, "బాగుంది" అన్నట్టు తలూపాడు. మంచినీళ్ళకు లేచాడనుకున్నాను. తిన్నగా వెళ్ళి phone తెచ్చాడు. అప్పుడు అర్థమైంది, TV9 updates లాగా, బీవీ-1 updates మొదలెట్టాడని. "ఎన్నడీ, hummus ఒణక్కు ఎదుక్కు పుడికిల? సెమ్మదాఁరుక్కే? [ఏమే? నీకు hummus ఎందుకు నచ్చలేదు? బానే ఉందిగా?]", అంటూ మొదలు. పెట్టినవాణ్ణి నాకు "బాగుంది" అని చెప్పడం మానేసి అదేదో బావిలో పడిపోయిన పిల్లాడి గురించి NDTV update లాగా చెప్పడంతో నాకు నవ్వాలో, చిఱాకు పడాలో అర్థం కాలేదు.

భోజనలయ్యాయి, అరాయించుకోవడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక పాట అందుకున్నాను. వెంటనే, "ఏయ్, నీకూ ఇదే పాట ఇష్టమా?", అన్నాడు. "అదేఁవిటి? వీడికీ పాట ఇష్టం లేదే? నీకూ అని సాగదీస్తాడేంటి?", అనుకున్నాను. వెంటనే, "ఆ అమ్మాయికీ ఇదే ఇష్టం తెలుసునా", అన్నాడు. "దేఁవుడా!" అనుకున్నాను. ఇంతలో వాడి phone మ్రోగింది. వాడికి బాగా పరిచయం ఉన్న, నాకు కేవలం ముఖపరిచయం ఉన్న ఒక స్నేహితుడు phone చేశాడు. వాడు phone మాట్లాడటం మొదలెట్టాడు. వాడి ధోరణిలోనే "అవును మాఁవ. ఆ అమ్మాయి కూడా..." అనుకుంటూ మాట్లాడాడు. ఇంతలో అదే phone లో ఆ అమ్మాయినుండి call వచ్చింది. మాట్లాడుతున్న phone ని నా చేతిలో పెట్టేసి "నా friendతో నువ్వు మాట్లాడు మాఁవ", అన్నాడు.

నాకు ఆ friendతో ముఖపరిచయం అయ్యి ఆరేళ్ళు దాటింది. మేము మాట్లాడుకుని నాలుగున్నరేళ్ళు అయ్యింది. నేను phone తీసుకుని, "హేయ్, ఎప్పిడి ఇరుక్కే? [ఎలాగున్నావు?]", అన్నాను. వాడు దానికి "సందీప్, నేను బాగున్నాను. మీ అక్కకి కఁవలపిల్లలంటగా", అన్నాడు. "స్వామీ, నాకు అక్కాలేదు, ఆవిడ పురుడోసుకోనూ లేదు, కఁవలపిల్లలూ పుట్టనూలేదు. నేను ఆ సందీప్ ని కాను. పీ.ఆర్.కే ని ", అన్నాను. వాడు "ఆఁ, పీ.ఆర్.కే. ఎలాగున్నావు? మీ కుటుంబం బాగుందా?", అన్నాడు. అలాగ రెండు నిముషాలు వరకూ మాట్లాడుకున్నాము. నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడా? అని చూస్తే నా phone లోంచి ఫియాన్సేకి phone చేసి: తన phone వెంటనే ఎందుకు ఎత్తలేకపోయాడు, ఆ phone చేసిన ఫ్రెండ్ ఎవరు? వాడికి అక్కచెల్లెళ్ళున్నారా వంటి ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నాడు. ఇంతలో ఈ phone లోని friend, "ఇంగ్లండ్ ఎలాగుంది", అన్నాడు. "నేను ఇంగ్లండు ఎప్పుడూ వెళ్ళలేదు మహప్రభో", అనగానే "ఐతే నువ్వు శాండీవి కావా?", అన్నాడు. "వామ్మోవ్, నేను నువ్వనుకునే శాండీనైతే కాదు బాబు. ఉండు నాయనా, నువ్వు మన కాలేజీలో ఉన్న అందరు సందీపులనీ cover చేసేలోపుల నా biodata చెప్తాను.", అని మొత్తమంతా చెప్పుకుంటూ వెళ్తే, చివరికి వాడు నన్ను గుర్తుపట్టకపోగా, "ఆఁ! గుర్తొచ్చావు. బాగుంది బాగుంది. నీతో మాట్లాడి చాలా రోజులైంది. సరే phone వాడికియ్యి", అన్నాడు. అది తీసుకెళ్ళి నా friend చేతుల్లో పెట్టగానే వాడు కళ్ళెర్రజేసి ఇంకో చేతులోని phone నా చేతులో పెట్టాడు. అది ఎత్తితే అందులో వాడి ఫియాన్సే. "సందీప్, ఎలాగున్నావు? Hummus మావాడికి నచ్చిందిట. అది చాలా ఆశ్చర్యం తెలుసునా!", అంటూ మొదలెట్టింది. అర్ధరాత్రిలో మద్దెల దరువంటే ఏమిటా అనుకున్నాను. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. కాసేపటికి రెండు phone లూ పెట్టేశాము.

నేను కాస్త ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టను. ఇంతలో cassette ని side-B కి మార్చాడు. అంటే: వాళ్ళు ఎప్పుడెప్పుడు తగువాడుకున్నారు, మళ్ళీ ఎప్పుడు గొడవాడుకునే అవకాశం ఉంది, అసలు problem అంతా ఎక్కడుంది - ఇత్యాది విషయాలపై ఏకపాత్రాభినయం చేశాడు. రాయబారం సీన్లో రెండోకృష్ణుడి కోసం వేచియున్న ప్రేక్షకుడిలాగా నేను నోరెళ్ళబెట్టుకుని కూర్చున్నాను. అప్పుడు కాసేపాగి, "ఏమిటి మాఁవ, నువ్వేమీ మాట్లాడట్లేదు. ఈ మధ్యన బాగా సైలెంటైపోయావు", అన్నాడు. Question paper లో ఐదే ప్రశ్నలిచ్చి, ఆరో సమాధానం వ్రాయలేదని మార్కులు cut  చేసినంత దారుణమైన ఈ మాట విన్న నేను, బ్రహ్మానందం లాగా ఒకసారి నిట్టూర్చి, "హుఁ, నీకలాగ అనిపిస్తించిందా మహాశయా! ఓ మహర్షీ, ఓ మహానుభావా! అసలు నువ్వు నన్నెక్కడ మాట్లాడనించావు? ఏమైనా అంటే నేను, నా ఫియాన్సే, మా పెళ్ళి, ఆ తరువాత కొనుక్కోవల్సిన వెచ్చాల లెక్కలు, నా బొచ్చు. ఆ అమ్మాయికి ఇష్టమైన Tea brand నుండి TV brand వరకూ అన్నీ చెప్తూ ఉంటే నేనింకేమి మాట్లాడతాను? నువ్వు ఫ్రెండువా, చెవులో పుండువా? నిన్ను భరించడం నా యొక్క వల్ల కాదు బాబూ. త్వరగా నిదురించి నన్ను విముక్తుణ్ణి చెయ్యి.", అని మనసులో అనుకున్నాను. వీటిల్లో ఏ మాట నేను బయటికి అన్నా, వాడికి కోపమొస్తుంది. కాబట్టి "నువ్వు చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందుకే వింటున్నాను.", అని చెప్పి తప్పించుకున్నాను. వాడు మాట్లాడుతూనే పడుకున్నాడు. సహజంగా నా పక్కన ఉన్నవాళ్ళని మాట్లాడనివ్వకుండా లొడలొడా వాగే నాకు తలనొప్పొచ్చేలాగా మాట్లాడిన వాడి వాగ్శక్తికి జోహార్లు చెప్పుకుంటూ నేనూ పడుకున్నాను.

నాకు పరిచయం ఉన్న చాలా మంది అమ్మాయిలు, పెళ్ళి తరువాత నన్ను పలకరించడం తగ్గించేశారు/మానేశారు. వారి వారి పనుల్లో busy అయ్యారులే అని ఊరుకున్నా, అప్పుడప్పుడు "మరీ అసలు పుట్టినరోజుకు కూడా wish చెయ్యట్లేదు ఏమిటి?", అనుకునేవాణ్ణి. నిన్న అర్థమైంది, అదే నయమని.

PS: ఉన్న విషయానికి కొంచెం నా ఊహాశక్తిని జోడించినా, అసలంటూ విషయం మాత్రం ఉందండోయ్!