Showing posts with label భగవద్గీత. Show all posts
Showing posts with label భగవద్గీత. Show all posts

Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".

Sunday, March 31, 2013

వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి...


నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.

You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?


అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.

మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి

తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు  (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

Sunday, October 2, 2011

వివేక చూడామణి - 2

శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పారు. ఉత్తుత్తి వాదాల కోసం బ్రహ్మాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం అని అదే విషయాన్ని మఱొక్క సారి చెప్తున్నారు.

వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా

భా:- వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.

సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలం ఉండి విద్యలభ్యసించారు. అలాంటిది మామూలు మనుషులెంత? అందుకే శంకరాచార్యులు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళమన్నారు.

అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం

భా:- ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి.

ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి నాలుగు లక్షణాలు ఉండాలి. వీటిని శంకరాచార్యులు లక్షణాలు అనలేదు, సాధనాలు అన్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మన కర్తవ్యం (అద్వైతభావం) పూర్తి చేసుకోవాలి.

ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరం
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


ఈ సాధనాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

1. నిత్యం, అనిత్యం -- ఈ రెండిటి మధ్యనా భేదాన్ని గుర్తించగలగడం

నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి. 

2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి

ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.

దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం

భా:- "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.

దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం -- ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.

వైరాగ్యాన్ని శంకరుడు వర్ణించిన తీరు:

తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః
దేహాదిబ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని

భా:- దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.

మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.

3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)

శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.

3.1. శమం

విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే

భా:- మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).

3.2. దమం

విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః

భా:- రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.

3.3. ఉపరతిః

బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా

భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.

3.4. తితిక్ష

సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే

భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.

3.5. శ్రద్ధ

శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే

భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.

3.6. సమాధానం

సర్వదా స్థాపనం బుద్ధః  శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం

భా:- ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.

4. ముముక్షుత్వం

అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్
స్వస్వరూపావబోధేన మోక్తుమిఛ్ఛా ముముక్షుతా

భా:- అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

"బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని నాకు అర్థమనది.


చిలక మనం నేర్పిన మాటలనే (ఆ పదాలు అర్థం కాకపోయినా) మళ్ళీ మాట్లాడుతుంది. అలాగే పైన చెప్పినవన్నీ శంకరాచార్యులు చెప్పినవి నేను (నాకర్థమైనంతలో) మళ్ళీ చెప్పాను. ఇవన్నీ జీర్ణించుకోవడానికి నాకు సంవత్సరాలు పడతాయి. ఇలాగ వ్రాయడం వలన కేవలం నాకు మననం చేసుకోవడం సులువౌతుంది, ఈ గ్రంథాన్ని చదువని వారికి పరిచయం ఏర్పడుతుంది.

Thursday, September 29, 2011

వివేక చూడామణి - 1

సనాతన ధర్మానికి వేదాలు మూలం. వేదాలు తిరుగు లేనివన్నది సనాతనధర్మంలో మొదటి సూత్రం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు తరతరాలుగా సనాతనధర్మంలో గురుముఖతః ప్రచారం ఔతూ, పరంపర ద్వారా కొనసాగుతూ వచ్చాయి.

భారతంలోనే చార్వాకం, బౌద్ధం, జైనధర్మం మొదలైన మతాలు ఉన్నాయి. ఇవన్నీ వేదాల యొక్క పరమోత్కృష్టతని ఉల్లంఘించిన మతాలు. శంకరాచార్యుడు జన్మించిన సమయానికి ఇవన్నీ భారతదేశంలో బలంగా పాతుకుపోయాయి. సనాతనధర్మానికి విలువ లేక, నాస్తికత ప్రజ్వలించింది. అటువంటి సమయంలో శంకరాచార్యులు వాటన్నిటినీ తిరస్కరించి తిరిగి భారతదేశంలో సనాతనధర్మాన్ని పునఃస్థాపించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి, వారి గురువులైన గోవిందభగవత్పాదుల అనుగ్రహంతో అద్వైతాన్ని జగత్తుకు అందించారు. ముప్పై రెండేళ్ళ జీవితంలో ఆయన సాధించిన విజయాలను, ఆయన అందించిన భాష్యాలను, స్తోత్రరత్నాలను పరిశీలిస్తే ఆయన దైవాంశసంభూతులనడంలో, ఆత్మవంచన చేసుకోని ఏ ఒక్కరికీ, సందేహం ఉండదు.

శంకరాచార్యుల గురించి చెప్పడానికి ఒక జీవితం సరిపోదు. కానీ, ఆయన ఆశించినది, ఆయన గురించి మనం చెప్పుకోవడం కాదు, మనం అద్వైతానుభవాన్ని పొంది విముక్తులమవ్వాలని. అందుకే ఆయన ఆలోచనల సారాన్ని మనకు వివేకచూడామణి గా అందించారు. ఆ వివేకచూడామణి శ్లోకాలను, స్వామీ తురియానంద వ్రాసిన అనువాదాన్ని ఈ మధ్యనే నేను చదివాను.

వివేకచూడామణికి, భగవద్గీతకి చాలా దగ్గర సంబంధం ఉన్నా వివేకచూడామణి అధ్యాత్మికంగా చాలా పురోగమించినవాళ్ళకు తప్ప జీర్ణం కాదు. భగవద్గీతలో పిల్ల, పెద్ద, పండితుడు, పామరుడు అందరూ అర్థం చేసుకోగలిగిన ఘట్టాలు ఉంటాయి. కృష్ణపరమాత్మ కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలను సూచించి వీటిల్లో భక్తియోగం సులభమైనదని, అందరికీ ఆచరణయోగ్యమైనది అని నిర్దేశించాడు. అది మనందరికీ శిరోధార్యం. ఆది శంకరుడు భారతదేశాన్ని చుట్టినప్పుడు బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధమతం వేదాలను, ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తుంది. మఱొక్క అడుగు ముందుకేసి ఏకంగా "ఆత్మ" అనేదే లేదు అంటుంది. అటువంటి వారితో వాదించి సనాతనధర్మ వైశిష్ట్యాన్ని చూపడానికి శంకరుడు కూడా అదే స్థాయి abstraction ని ఉపయోగించి, వారి వాదనాపద్ధతులను కూడా అనుసరించి వారిని ఓడించారు. స్వయంగా భక్తిమార్గాన్ని కూడా అనుసరిస్తూనే, జ్ఞానమార్గంలో వెళ్ళి ఉపనిషత్తులను ఎంతో లోతుగా అధ్యయనం చేసి, వాటి సారం జీవాత్మ-పరమాత్మల యొక్క ఏకత్వమని, ఆ అద్వైతాన్ని ప్రబోధించారు.

అధ్యాత్మవిద్యను అధ్యయనం చేయడం చాలా కష్టం, దాన్ని ఆచరించడం మరింత కష్టం. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు:

మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే
యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః

దీని భావం, "వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

కృష్ణుడు చెప్పిన యోగాలన్నీ కూడా, "అనుసరిస్తున్నాము" అనుకుని ఆత్మవంచన చేసుకునేవారు నిత్యజీవితంలో కనిపిస్తూ ఉంటారు. జీవితాంతం తన సంతృప్తి కోసం కర్మలని ఆచరిస్తూ, ఫలితాలను చూసి మురిసిపోతూ చివరికి అంతా భగవంతుడికి అర్పిస్తున్నాను అనుకుంటారు. అది కర్మయోగమని వారు అనుకున్నా, ఒక రకంగా చెప్పాలి అంటే ఎంగిలే. మఱి కొందరు జ్ఞానయోగంలో ఉన్నాము అనుకుంటూ పుస్తకాలు తిరగేస్తూ వాదించుకుంటూ ఉంటారు. పఠనం, వాదన రెండూ తప్పు కావు కానీ, ఆ వాదనలో ఎంత వరకు మోక్షప్రయాస ఉందో కూడా గమనించుకోకుంటే అది పాండిత్యం కాదు, శబ్దప్రచ్చన్నపామరత్వం అవుతుంది. ధ్యానయోగం పేరుతో అంతర్యానం చేసుకోకపోతే అది నిద్రతోనే సమానం. అందుకే అర్జునుడు కూడా ధ్యానయోగాన్ని కృష్ణపరమాత్మ సూచించగానే "నా వల్ల కాదు", అన్నాడు. చివరిగా భక్తియోగం అనుసరిస్తున్నాము అనుకునే వారు కూడా సమదర్శిత్వాన్ని, స్థితప్రజ్ఞని, అనన్యచింతనని ఇవ్వకపోతే భగవంతుడికి కొంచెం దగ్గరవ్వడం, పుణ్యార్జన జరుగుతాయి కానీ, మోక్షాణికి ఒకడుగు ఇటు ప్రక్కన వదిలేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా భక్తిని సరిగ్గా అర్థం చేసుకోని వారు ఆ మార్గంలో వెళ్తున్నాము అనుకుంటారే కానీ పరమాత్ముణ్ణి కూడా తమ దైనందినజీవితంలో ఒక వస్తువు లాగా భావించే ప్రమాదంలో ఉంటారు. భక్తి పేరుతో కొందరు, ప్రజల సొమ్ము దోచుకున్నదంతా దోచుకుని, దేవాలయాలకు కిరీటాలు విరాళంగా ఇచ్చి వారి పాపాలు తొలగిపోయాయి అనుకుంటారు. కొందరు రోజూ పొద్దున్న దణ్ణం పెడుతూనే దేవుడు వారికేదో ఋణపడిపోయినట్టు భావిస్తుంటారు. అడిగితే, "He is my best friend." అంటారు. మఱి కొందరు నామమాత్రంగా పూజలు, జపాలు చేస్తూ ఉంటారు. పూజ, జపం చేసినప్పుడల్లా దృష్టి ఫలితం మీదనే. ఆ ఫలితం ప్రసాదం కావచ్చును, కార్యసిద్ధి కావచ్చును. కొందరు మాత్రమే దైవాన్ని తలుచుకున్నప్పుడు ఆ దైవం సామీప్యతను అనుభవించగలుగుతారు. 

ఈ విషయాన్ని గుర్తించో ఏమో శంకరులు నిర్ద్వంద్వంగా ఈ విధంగా అన్నారు:

5. పఠంతు శాస్త్రాణి, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవతాః
ఆత్మైకబోధేన వినాపి ముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేऽపి

13. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః
న స్నానేన, న దానేన, న ప్రాణాయామశతేన వా

ఈ శ్లోకాల భావం "శాస్త్రాలు చదివినా, దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేసినా, దేవతలను భజించినా, మనిషి తాను ఆత్మ అన్న విషయం తెలుసుకోకపోతే కోటి-కోటి సంవత్సరాలైనా ముక్తిని పొందలేడు. పుణ్యనదీస్నానాలు, దానాలు, ప్రాణాయామాదులు సత్యం తెలుసుకోవడానికి దోహదపడవు. కేవలం గురూక్తులపైన దృష్టిని ఉంచి అర్థం చేసుకోవడం వలనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ", అని.

భక్తియోగాన్ని నమ్మినవారికి ఈ రెండు పద్యాలూ కర్కశంగా తోచవచ్చును. స్వయంగా కృష్ణపరమాత్ముడే "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని చెప్పాడు కదా? మఱి దేవుడు మోక్షాన్ని ఇవ్వడంటారేమిటి అని. శంకరాచార్యులు చెప్తోన్నది ఈ దేహంలోని వాసనలు నీకు ఉన్నంత కాలం, "నేను" అన్నప్పుడు "దేహాన్ని" కూడా కలుపుకొంటున్నంత కాలం నీకు ముక్తి లేదు అని. భక్తిమార్గంలో కూడా సరిగ్గా పయనిస్తున్నవారికి ఆత్మైక భావం కలుగుతుంది. అది కలగకుంటే ఎక్కడో పొరబాటు ఉంది అని.

శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు. కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

(ఇంకా ఉంది...)