Showing posts with label పద్యాలు. Show all posts
Showing posts with label పద్యాలు. Show all posts

Tuesday, December 25, 2018

కార్తిక మాసం సందర్భంగా రాసిన పద్యాలు

కార్తిక మాసం సందర్భంగా నేను రాసిన కొన్ని కందపద్యాలను శాస్త్రీ బ్లాగులో రాసాను. అక్కడ చదువని వారి కోసం మనోనేత్రంలో కూడా రాస్తున్నాను.

మాటలు, చేతలు, డెందము
గాటపు త్రిపురాలు దురితకారకముల్ నీ
మేటి కరకు జ్ఞానేషువు
వేటునఁ నాయహముఁ జంపు వేదాంతనిధే!

భా:- "మనసు, వాక్కు, కర్మ" అనే మూడూ త్రిపురాలుగా అయ్యి నా చేత పాపములు చేయిస్తున్నాయి. నీ సుజ్ఞానం అనే బాణంతో నా అహాన్ని చంపు, (త్రిపురాలను నాశనం చేసిన) శివా!

చాపపు నేరిమి దేవర
పాపపు పులి నోట చిక్కి బడలితి, కరుణా
రోపము గురి చూసి విడుమ
మాపు జననమరణవనిని మారాంతకుడా!

భా:- ధనుర్విద్యకు దేవతా! కామాన్ని జయించినవాడా! పాపం అనే పులి నోట చిక్కి అలిసిపోయాను. నువ్వు దయ అనే బాణాన్ని గురి చూసి పంపి పులితోబాటు ఈ జననమరణాలు అని అడవినే నాశనం చెయ్యి. (కామం వలనే పాపం పుడుతుంది. ఆ కామాన్ని జయించినవాడు పాపాన్ని నాశనం చెయ్యగలడు).

ఒడిలో బిడ్డడి యెలుకను
మెడలో బుసగొట్టు పాము మింగగఁజూడున్
ఎడమన పసివాని నెమలి
మిడినాగునుఁత్రుంచనెగురు మీదకునెపుడున్

వింతగు కాపురమును నీ
ఇంతి నడుపుచున్ జగములనేలుచునుండన్
సుంతయు బాసటనీయక
చింతెరుగని భిక్షువగుట చెల్లెను నీకే!

భా:- గణపతి వాహనమైన ఎలుకని మింగడానికి నీ మెడలో పాము బుసగొడుతూ ఉంటే, ఆ పామును మింగడానికి నీ చిన్నకొడుకు వాహనం నెమలి ఎగురుతూ ఉంటుంది. నీ ఇల్లాలు ఈ వింతైన కాపురాన్ని నడుపుతూనే జగాలను కూడా ఏలుతోంది. నువ్వు మాత్రం కొంతైనా సాయం చెయ్యకుండా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నావు. ఈ వైభవం నీకే కుదిరింది.

ఎదలో కోర్కెలు ఎద్దుర
మదమొక గజముర చిలువర మత్సరమెల్లన్
పదునగు కోపము వ్యాఘ్రము
అదుపున పెట్టెడి కుశలతనందించు శివా!

భా:- ఎద్దులాగ ఎగిరిపడే కోర్కెలు, ఏనుగంత అహంభావం, పాములాగ బుస కొట్టే ఈర్ష్యా, పులి వంటి కోపం నాలో ఉన్నాయి.ఈ జంతువులని అదుపులో పెట్టిన నీవు నాకు కూడా ఆ దక్షతని అందించు, పశుపతీ! [నువ్వు ఎద్దుని (నందివాహనుడు), ఏనుగుని (గజచర్మాంబరుడు), పాములని (నాగాభరణుడు), పులిని (వ్యాఘ్రాజినాంబరుడు) అదుపులో పెట్టినవాడవు కదా.]

చలియించని యోగి, ఉమను
వలపించిన రాగి, కొలుచు వారికి ఱేడున్
కలచిన కీడున్ నటనకు
నెలవగు స్థాణువు శివుడిని నిత్యము తలతున్

భా:- స్థిరంగా ఉండే యోగి, అమ్మవారి మనసును ఆకర్షించిన అనురాగవంతుడు, కొలచిన వారిని ఆదుకొనేవాదు, చీకాకు పెట్టే వారికి శిక్షకుడు, కదులుతూ నాట్యం చేసే నటరాజు, అస్సలు కదలని స్థాణువు - అన్నీ అయిన శివుడిని ఎప్పుడూ తలుస్తూ ఉండెదను.

కైలాసంబున శైత్యము
మేలగు వినుదుస్తు నీది, మిన్నది తలలో
శైలజ కౌగిలి వీడవ
దేలన చలికోపలేక, ఇషణము మిషయే!

భా:- కైలాసంలో చలి, చక్కని ఆకాశాన్ని బట్టులుగా ధరిస్తావు, తలలో గంగమ్మ. పార్వతి కౌగిలి (పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం) వీడవంటే - చలికి తట్టుకోలేక. భార్య మీద ప్రేమ (ఇషణం) వత్తి సాకు (మిష).

పెక్కులఁ నిన్నును కలచెడి
రక్కసులకు వరములీయ రవ్వంతైనా
లెక్కించక, పెళ్లి జరుప
నక్కరఁ జూపిన వలదొర నణచుట పాడా!

భా:- నిన్ను, అనేకమందిని బాధపెట్టే రాక్షసులకు రవ్వంతైనా ఆలోచన లేకుండా వరాలిచ్చావు. నీకు పెళ్ళి జరుపుదామని ప్రయత్నించిన మన్మథుడిని మాత్రం దగ్ధం చేసావు. ఇది న్యాయమా?

ఆపవు కద భిక్షించుట
శ్రీపతి శ్రీదుల నడగక సెరబడియున్నన్
దాపున గంగను కలిగియు
ఆ పై యడిగేవు జనులనభిషేకముకై!

భా:- శివ! లక్ష్మీదేవి భర్త ఐన విష్ణువు, ధనవంతుడైన కుబేరుడూ నీకు మిత్రులైనా వాళ్ళని సాయం అడగక భిక్షమెత్తుకుంటావు. కానీ, నెత్తిపైన గంగను ఉంచుకుని జనాలను అభిషేకం చెయ్యమని అడుగుతావు. (ఇదేం విడ్డూరం!)

సిగలోనల్లరి విన్నది
రగిలే కన్నుయు నుదుటన, రాగలు మెడలో
నగుమోమునఁ మోసెడి దొర!
బెగడక మను పట్టు మదిన పెంచుము తండ్రీ!

భా:- జటాజూటంలో ఎగసిపడే గంగమ్మ, నుదుటిపైన నిప్పులు రగిలే కన్ను, మెడలో పాములు (అన్నీ ప్రమాదాలే అయినా) నవ్వుతూ వాటిని మోసేవాడా - భయపడకుండా ఉండే స్థైర్యాన్ని మా మనసుల్లో పెంచు తండ్రీ!

మాటకునూపిరి పోయగ
గాటపు శివసూత్రములను కల్పించితివే
నోటపలుకకుండ నిజము
తేటగ తెలిపెడి వలకడ దేవర ప్రణతుల్!

భా:- దక్షిణామూర్తి (వలకడ - దక్షిణదిక్కు) రూపంలో నోట మాట పలుకకుండా సత్యాన్ని (సత్) తెలుపగలిగిన యోగి, మనుషుల కోసం 14 శివ (మాహేశ్వర) సూత్రాలను పాణినికి ప్రసాదించి భాషను సృష్టించాడు. వానికి నమస్సులు.

కరిముఖమార్కండేయులఁ
మరణము దాటించినావు; మృత్యుంజయుడా!
గరళము మింగితివి నగుచు
కరుణను మముఁ గావుమయ్య కాలాంతకుడా!

భా:- శివ! నువ్వు నవ్వుతూ విషాన్ని తాగావు. మార్కండేయుణ్ణి యముడి (మృత్యువు) నుండి కాపాడావు. వినాయకుడికి ఏనుగు తలతో మరో జన్మను ప్రసాదించావు. యముడిని కూడా అంతం చేయగలవాడా - కరుణతో మమ్మల్ని కాపాడు.

ఒడలునఁ జతపడియుండిరి
విడరెట రాయిగ వెలసిన వేడుక మీరన్
గడుసరి భక్తుడడుగ సతి
నెడబాసిన వేల్పు కన్న హెచ్చును గలరే?

భా:- శివపార్వతులు లింగరూపమునైనా అర్థనారీశ్వరులుగానైనా ఒకటై అందంగా ఉన్నారు. అట్టిది, గజాసురుడు అడిగితే తన భార్యను విడిచి వెళ్ళిన శివుడి కంటె దైవం ఉందా?

తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?

భా:- భూమి మొత్తం వెతికినా కన్నబిడ్డను చూసి నవ్వినట్టి వాడిని నెత్తిన మోసుకు తిరిగే శివుడిని మించిన దయ కలిగినవాడు దొరుకుతాడా?

Sunday, February 11, 2018

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా! 
(దౌష్ట్యము = దుర్మార్గం, కాంచి = చూసి, దండన సేయు = దండించు, ఎంచు = నిర్ణయించు, హా = అయ్యో!)

భీముడు చేసిన దుర్మార్గాన్ని చూసి, రాముడు అతనిని దండించాలని నిర్ణయించుకున్నాడట. అది ఎలాగో ఉత్పలమాలలో చెప్పాలి. శ్రీచరణ్ గారు - ఇబ్బంది లేకుండా పూరించారు. ఆయన పూరణ:

​సృష్ట్యధినాథుడైన పరచిన్మయ విష్ణువు కృష్ణమూర్తియై
వృష్ట్యనృతాంబుదంబు వలె వీరరసంబును నూరిపోయగా
దృష్ట్యవహీనజాతుడగు దిట్టను కూల్చుట కోపభద్రుడై
దౌష్ట్యము గాంచి భీమునికి దండన చేయగ రాముడెంచె హా!


వారి పద్యంలో అన్వయం నాకు పూర్తిగా గోచరించలేదు. "అనృతాంబుదము" అని కృష్ణుడిని అనడం బాగుంది. అంబుదం అంటే మబ్బు. మబ్బులూ, కృష్ణుడూ నల్లగా ఉంటారు (నీలమేఘశ్యాముడు). ఆ కృష్ణుడు కల్లబొల్లి మాటలు చెప్పాడు అండానికి "అనృత + అంబుదం" అన్నారు.

అవధానం రేపనగా ఇది మరీ కష్టమేమోనని కొంచెం సందేహించాను. అదే విషయం నిద్రబోయే ముందు నా సతీమణితో అంటే "మీరు పూరించలేనిది ఆయనని అడగడం సబబా" అంది. సరే, చేతిలో కాగితం, కలం లేకుండా నేను పూరించగలనో లేదొ చూద్దాం అని పూరించాను. దాదాపు 40 నిముషాలు పట్టింది. ఇలాగ పూరించాను.

సృష్ట్యనునిత్యముంగనెడి సాధుకుఁ నీచుకుఁ మధ్య స్పర్థలో
దృష్ట్యనుసారమే తెలియు ర్మమెటో మురవైరియన్నకున్
తుష్ట్యరి కాడె శిష్యుఁ తొడ తుంచిన దుండగుడెవ్వడయ్యినన్ 
దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

సృష్టి ఎప్పుడూ మంచివాడికీ, చెడ్డవాడికీ మధ్య తగువును చూస్తూనే ఉంటుంది. అందులో ఎవరివైపు ధర్మముందో చెప్పడం కష్టం. ఎవరి దృష్టిని బట్టి వారికి అలాగ అనిపిస్తుంది. ఇందులో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడి అన్న, అవతారమూర్తి అయిన బలరాముడికి కూడా మినహాయింపు లేదు. తన శిష్యుడైన దుర్యోధనుడిని తొడ చీల్చి చంపినవాడు ఎవరైనా తన సంతోషానికి విరోధియే కదా. అందులోనూ భీముడు కూడా బలరాముడి శిష్యుడే. అందుచేత, బలరాముడికి చెడ్డ పేరు వస్తుంది. ఈ దుర్మార్గాన్ని చూసి భీముడిని దండించాలి అని (బల)రాముడు నిర్ణయించుకున్నాడు.

ఒక వేళ ఈ సమస్యతో అనుకోని చిక్కు ఏమైనా వస్తే ఉంటాయి అని మరి కొన్ని సమస్యలను కూడా సిద్ధపరిచాను. అవి మీకు నచ్చి, పూరించాలి అనిపిస్తే - ప్రయత్నించగలరు.

పలువురు మెచ్చెఁ పాలడుగు బాలుడె భామనుఁ గాసిచేయగన్
రావణుఁ నెగ్గియర్జునుడు రాముని వేటుకు నేలకూలెనే
పొట్టేలెంచెను చేప పొందు యెదుటన్ పుష్పాంగి చూస్తుండగా
తామరఁ గని యేవపడని తరుణియుఁ గలదే!
పాడెడి వారి పాలఁ బడి పాలక సైన్యము పారిపోయె హా!

Thursday, November 23, 2017

పోతన భాగవతం

మొన్న బోతల్ నగరంలో జరిగిన "మన దీపావళి" కార్యక్రమానికి వ్యాఖ్యానం (MC) చేసాను. కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం - "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటిక. వందకు పైగా పిల్లలు అందరూ అద్భుతంగా నటించటమే కాక పద్యాలను కూడా వినిపించారు. పద్మలత గారి రచనలో నాకు ముఖ్యంగా నచ్చింది - పోతనకై ప్రత్యేకంగా ఉంచిన సన్నివేశం. పోతనలోని లోతుని తెలిపేలాగ "శారద నీరదేందు", "బాల రసాల", "పలికెడిది భాగవతమట" మొదలైన పద్యాలను చిన్నారుల చేత చక్కగా చెప్పించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలగడం నా భాగ్యం.

ప్రేక్షకులకు కృష్ణతత్త్వాన్ని, పోతన తత్త్వాన్ని తెలిపేందుకు సిద్ధపడుతూ పోతన తీయని పద్యాలను మళ్ళీ గుర్తుచేసుకున్నాను. "కేళీ లోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్, మహా నందాంగనా డింభకున్" అని చదువుతుంటే పోతనలోని ఔన్నత్యం నా కళ్ళు చమర్చేలాగా చేసింది. "సృష్టి అనే ఒక ఆటను నడపుతూ ప్రకాశించే చూపుల వల నుండి పుట్టిన అనేక బ్రహ్మాండాలను తనలో ఇముడ్చుకున్న వాడు" అంటూ విష్ణువుని (అంతటా వ్యాపించినవాడిని) స్తుతిస్తూ పక్కనే "మహా నందాంగనా డింభకున్" (నందుడి భార్య ఐన యశోద బిడ్డ) అనడంలో - యశోదని, అమ్మని ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడో అనిపించింది. ఇక "కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడనేల ఏడ్చెదో" అని ఆయన అమ్మ శారదను ఓదారుస్తుంటే - ఎవరు తల్లో, ఎవరు బిడ్డో తెలియని ఆత్మీయత కనబడుతోంది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించిన మహా యోగి పోతన. ఆయన మన తెలుగువాడు అవ్వడం మన జాతి అదృష్టం.

భాగవతం అంతటా సీసపద్యాలు మల్లెతీగెల లాగా కనబడుతూ ఉంటాయి. "మందార మకరంద మాధుర్యమునఁదేలు" అన్న పద్యంలోని అనుభూతి పాడుకుంటే గానీ తెలియదు. "నల్లనివాడు పద్మనయనంబులవాడు" అంటూ గోపికలు పాడే పద్యంలోని ప్రణయమే నిజమైన ప్రణయం. నేను కుచేలోపాఖ్యానం పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటే, ఎనుబది ఏళ్ళ వయసులో మా తాతయ్య అనర్గళంగా ఆర్ద్రతతో "ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ గరుణాలవాలు, భాసురకపోలుఁ" అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయిన సంగతి నా కళ్ళ ముందు మెదిలింది. పద్యం చదివితే అలాగ చదవాలి కదా అనిపించింది. "విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు" అని పోతన తేటగీతిని ముగిస్తే "అబ్బా, ఏం వేసాడురా అనుప్రాస" అని ఇప్పటికీ అనుకుంటాను. "అడిగెదనని కడు వడిఁ జను" అనే పద్యం కంఠస్థం చేయడానికి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కాదు. "అమ్మలగన్నయమ్మ" అని అచ్చ తెలుగు మాటలతోనూ, "శారద నీరదేందు" అని సంస్కృతపదాలతోనూ అమ్మను స్తుతించిన కావ్యసవ్యసాచి పోతన గొప్పదనం చెప్పడం నాబోంట్లకు వీలు కాదు.

పదేళ్ళ క్రితం మొదట అమెరికా వచ్చిన రోజుల్లో surasa.net లో ఉషశ్రీ సువర్ణకంఠంలో విన్న భాగవతం గుర్తుకు వచ్చి మళ్ళీ విన్నాను. Law of Diminishing Marginal Utility అని అర్థశాస్త్రజ్ఞులు చెప్పిన చట్టం తప్పు కదా అనిపించింది. ఎన్ని సార్లు విన్నా ఇంకా తియ్యగానే ఉంటుంది. ఈ మధ్యన మఱొక అద్భుతమైన అంతర్జాలవిషయం తెలుసుకున్నాను. http://telugubhagavatam.org లో పోతనభాగవతాన్ని పూర్తిగా, టీకాతాత్పర్యసహితంగా ఉంచారు. అంతేగాక బంగారునగలోని ముత్యాలలాగా ఉండేటువంటి పద్యాలను ప్రత్యేకంగా క్రమపరిచారు. ఈ మహోపకారం చేసిన మహానుభావులకు ఆ శారదా దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని నా నమ్మకం.

ఏ దేశంలో ఉన్నా మన తెలుగువాళ్ళు కచ్చితంగా తినవలసిన, నెమరేసుకోవలసిన పనసతొనలు పోతన పద్యాలు. వాటిని మళ్ళీ గుర్తుచేసుకుని పాడుకోవడం వలన దైనందినతాపాలతో ఎండిపోయిన నా మనోవనంపైన తొలకరి జల్లులు పడినట్టైంది. మహాకవి పోతనకు అనంతకోటి వందనాలు.

Sunday, June 21, 2015

సియాటల్ లో మన్మథ నామ నూతన సంవత్సర యుగాది కవి సమ్మేళణం

2014 ఉగాదికి సియాటల్ లో జరిగిన కవి సమ్మేళణానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా జరుపుదామనుకున్నాము. ఈ సారి శ్రీరామ నవమి, ఉగాది కలిపి జరపాలని "మన సంస్కృతి" సంస్థ నిర్ణయించింది. శ్రీ సీతారాముల కల్యాణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది. కొంచం ఆలస్యం అవ్వడంతో కవి సమ్మేళణానికి సమయం లేకపోయింది. అయినప్పటికి ప్రశ్నలను, ప్రోత్సాహాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, కొత్తపాళి గారికి కృతజ్ఞులము. కవిసమ్మేళనానికి గానూ వ్రాసిన పద్యాలలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సీతా రామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

ఇస్సీ అనే పదం మనకు ప్రస్తుతం వాడుకలో లేదు. ఇస్సీ అంటే "అయ్యో, అక్కట" అనే అర్థంలో వాడతారు(ట). దీన్ని చాలా అద్భుతంగా పూరించినవారు లంకా సూర్య రవీంద్ర.

నా త్రాణంబును, నాదు బ్రాణములు, నా దార్ఢ్యంబు శ్రీ రాముడే!
నా తండ్రిన్, నన జానకీతనయ నే దావాలకంపింపనే?
నీతిన్ దప్పక నీకు జేసినటి వాగ్ద్విత్వంబు జెల్లింప, నా
సీతారామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

సామాన్యంగా మనం సమస్యను "సీతా! రామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని చదువుతాము. సీతాదేవి రామునికి ద్రోహం ఎప్పుడు చేసిందా అనుకుంటాము. ఐతే పూరకులు దాన్ని "సీతారామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని అర్థం వచ్చేలాగా వ్రాసారు. పై పద్యంలో భావం: దశరథుడు కైకేయతో "నా మాటను నెపంగా పెట్టుకుని నా సర్వస్వమైన సీతారాముణ్ణి, సీతని అడవులకు పంపించి అతనికి ద్రోహం చేస్తావా?" అని అంటున్నాడట.

మారా మారాము మానుమా రామునితో

ఇది సులభమైనదే. మన్మథుడు రామునితో మారాం చేస్తున్నాడట. దీనికి పూరణ:

శారదమయ ఘనచంద్రిక
తారావళి తోడ గూడి తాపము బెంచన్,
భారమె, సీతా విరహము!
మారా! మారాము మాను మా రామునితో!

సీత అశోకవనంలో ఉన్నప్పుడు రాముడు విరహంతో బాధపడుతున్న విషయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు బులుసు మల్లిక్. ఐతే వసంతంలో సీతారాములు వేఱ్వేఱు చోట్లలో ఉన్నారు అని ఆధారమేమిటి? కిష్కింధ కాండలో దీనికి ఆధారాలు ఉన్నాయి.

దత్తపది: బీర, వంగ, కంద, కాకర - ఉగాది పచ్చడి

ఇది పరిపరి విధాలుగా ఆలోచించాను. పెద్ద పెద్ద పద్యాలు వ్రాసి కిట్టించవచ్చునేమో కానీ, నాకు చిన్న పద్యం వ్రాస్తేనే శ్రోతలకు కాస్త ఆసక్తి ఉంటుంది అనిపించి చివరకు నన్ను ఆదరించిన కందాన్ని ఆశ్రయించాను.

మనసు కందనీక మనియేమి ఫలితంబు
బీరముండ కుండ పేలవంగ
మలగమంది చూడు మనుగాది పచ్చడి
రాతి రీతి కాక రసమయంగ

ఎప్పుడూ సుఖాన్ని (తీపిని) మాత్రమే కోఱుకుంటూ వెళ్ళకుండా కాస్త నాలుగు రుచులూ చూడమని ఉగాది పచ్చడి సందేశం అని భావం. ఉదాహరణకు చిన్నతనంలో చెయ్యాలనుకుని చెయ్యలేని పని ఇప్పుడూ చెయ్యడం పులుపు. వ్యాయామం చెయ్యడం చేదు. ఇలాగ ఆరు రుచులూ కలిస్తేనే జీవితం రసమయం అవుతుంది. లేకపోతే రాయి లాగ బ్రతుకుతున్నట్టే.


దత్తపది: మలైక, సన్నీ, కరీన, ప్రియాంక - మన్మథవత్సరానికి స్వాగతం

ఇది కొంచం కష్టమైనదే. అన్నీ అందమైన అమ్మాయిల పేర్లతో మన్మథ నామ సంవత్సరానికి స్వాగతం పలకాలి. కానీ ఎక్కడా అసభ్యత కనిపించకూడదు. ఇది పూరించడంలో బులుసు మల్లిక్ గారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వచ్చెను మన్మథుండు నవవత్సరమై - విమలైకదృశ్యమై
విచ్చెను పద్మినుల్ గుబురు వెన్నెల వోలిన సన్నివేశమై
నచ్చిన శాంకరీ నగవు నాచిన మోహన పుష్పధన్వి తా
తెచ్చెను రాగదీపికల తేనియలొల్కెడి విష్ణుసూనుడున్

ఇందులో భావం: "మన్మథుడు ఒక సంవత్సరంగా వచ్చాడు. దానితో ఎంతో అందమైన దృశ్యం ఏర్పడింది. తామరపువ్వులు గుబురుగా ఏర్పడి వెన్నెల విరిసినట్టు ఉన్నాయి. ఆ పరమేశ్వరి తేనెలొలికే నవ్వును దోచుకుని మన్మథుడు సౌందర్యదీపికలను తీసుకుని వచ్చాడు." అని. అమ్మవారి నవ్వు మన్మథుడు దోచుకోవడం ఏమిటి అంటే సౌందర్యలహరిలో దీనికి సంకేతంగా ఒక శ్లోకం (86 వ ది) ఉంది.

దత్తపది: రంభ, మేనక, ఘృతాచి, మనోరమ - సీతారామ కల్యాణం

అప్సరసల పేర్లతో సీతారామ కల్యాణం వర్ణించమన్నారు. వీళ్ళందరూ వచ్చి సీతమ్మ అందాన్ని చూచి చిన్నబోయారనో, దంపతులను చూచి సంతోషించారనో పూరించవచ్చును. అప్పుడు పృచ్ఛకుని శ్రమను అవమానించినట్టు అవుతుంది. అందుకని మంచి స్ఫూర్తితో పూరించడం జరిగింది. ఘృతాచి ఒక అప్సరస. అదే పదానికి "ఆజ్యాన్ని (నెయ్యిని) హోమాగ్నిలో పోసే గరిటె" అని కూడా అర్థం ఉంది. అది ఆధారంగా దొరికింది. అందుకని ఇలాగ పూరించాను.

అనలం రేగె ఘృతాచి నుండి పడగా ఆజ్యంబు, ఆ రీతినే
ఇనవంశీయుని సొంపు మేనఁ కళలున్, హెచ్చయ్యె సీతమ్మఁవా 
కొనచూపుల్ పడగా మనోరమముగా, కోలాహలంబంతటా
కనువారందరి సంబరం భళి భళీ గానాలుఁ, కేరింతలై

(శ్రీ సీతారాముల కల్యాణంలో జరుగుతున్న హోమంలో) ఘృతాచి నుండి పడిన నెయ్యి తగిలి అగ్ని రేగింది. అలాగనే సీతమ్మ కొనచూపులు పడి శ్రీరాముడి ఒంటి వెలుగు కూడా హెచ్చైందిట. ఇది చూసినవారందరి కబుర్లు, కేరింతలూ చేరి అంతటా కోలాహలంగా ఉందిట.

భైరవభట్ల కామేశ్వర రావు, బులుసు మల్లిక్, లంకా సూర్య రవీంద్ర గార్లకు కృతజ్ఞలు.

Saturday, August 2, 2014

చిల్లుగొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.

నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల

పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను

నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు

నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

Wednesday, July 23, 2014

సరస్వతీ స్తుతి

ఈ రోజు ఏకాదశి అని కాసేపు కూర్చుని దైవచింతన చేద్దామని, శారదా దేవి గురించి కొన్ని పద్యాలు వ్రాసాను.పద్యరచన చేసి చాలా రోజులైంది. తప్పులుంటే చదువర్లు సరిచేయగలరు అని మనవి.

నిముషంబైనను చిక్కదే దినమునన్ నీ దివ్యరూపంబు, హే
విమలా! చిత్తమునందుఁ దల్చి రుచిగా గానంబుఁ గావించగన్
విమలాలై విలసిల్లు నీ గుణములన్, వేదాంత సందీపనీ!
క్షమియింపమ్మ, కృపాసముద్రహృదయా! కారుణ్య భావమ్మునన్

భ్రమలో చిక్కితి నీదు భిక్షయిన నా ప్రావిణ్యతన్ క్రొవ్వునన్
శ్రమతో పొందితినంచు తల్తునొకొ నా శౌర్యంబదే పాటిదో
గమనించన్ చననీదవిద్య, జననీ! జ్ఞానాగ్నితేజోమయీ!
తమముంద్రుంచవె మాయ వైదొలగి నీ ధామంబుఁ నేఁ జేరగన్

విలువేమున్నది వేల సంపదకు నే వేదాంతముందెల్వకన్
తెలివేమున్నది వేదశాస్త్రములలో దీనుల్ని చేపట్టకన్
బలమేమున్నది రాజస్నేహములలో వైరాగ్యమేతెంచకన్
మలగన్ కోర్కెలు నీ యనుజ్ఞనిడుమా మాయాత్మికా, యీశ్వరీ!

Sunday, February 24, 2013

అమ్మవారి పైన కొన్ని పద్యాలు



ఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. 

తోటకం
కలుషారికి మంగళకారిణికిన్
కలితామృతకావ్యవికాసినికిన్
కలకంఠికి శ్రావ్యసుగానఝరీ
జలదాయినికిన్ నమ (నతి) శారదకున్


అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు దిద్దిన శక్తి. ఆవిడ వలనే మనకు ఈ ప్రపంచం ఇన్ని హంగులతో కనిపించి ఆకర్షిస్తోంది. ఆవిడ తలుచుకుంటే ఈ చిక్కునుండి ఒక్క చిటికలో విడిపించగలదు. అలాగ చేస్తే మఱి సృష్టి ఎలాగ కొనసాగుతుంది?

మత్తేభం
తగునా ఈ నలుసంటి జీవి మదిలో దట్టంపు చీకట్లిలా
ఎగదోయన్? దిశ కానకున్నది గదా! ఏ వైపుకుంజూచినా
పగిలే నమ్మిక గాదు నాది జననీ, బ్రహ్మైక్యసంధాయినీ
దిగులొందన్ తిమిరాపహా! ఎరుగనే దీపాంధముల్ నీవుగా?

మత్తకోకిల
చెల్లు దాగుడుమూతలాడుట చిట్టిపాపడి ఖేలకున్
తల్లిగానక పాపయేడ్వగ తానుగా దరిఁజేరదే?
తల్లడిల్లితి నిన్నుఁజూడక దర్శనంబుకుఁ జాలనే?
ఒల్లకుంటివి నాదు ప్రార్థననొందవా దయ శంకరీ!

మన దేశంలో గొప్ప గొప్ప ఋషులు, మునులు, కవులు కూడా స్త్రీని ఎంత శృంగారవతిగా వర్ణించినా తల్లిగానే భావించారు. అది మన సంస్కృతి. రమణ మహర్షీ, రామకృష్ణ పరమహంస ప్రభృతులు వేశ్యలలో కూడా అమ్మవారిని చూసారు. అలాంటి ద్రష్టలు, మహానుభావులు నడిచిన ఈ దేశంలో స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలను గురించి విన్నప్పుడల్లా మనసు రగిలిపోతుంది. మొన్న డిసంబర్లో ఢిల్లీ జరిగిన ఘోరాని గురించి విని వ్రాసిన పద్యాలు. 

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తహ్ ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

శంకరాచార్యుల సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోని తొలి రెండు పాదాలు ఇవు. వీటి భావం "అమ్మవారు లేకుండా శివుడు కొంచెం కూడా స్పందించలేడు" అని. ఈ భావానికి "శివాజ్ఞ లేక చీమైనా కదలదు" అనే నానుడికి కలిపి వ్రాసిన మొదటి రెండు పాదాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినవి. చివరి రెండు వాక్యాలలో కొమ్మ అనే పదంలో శ్లేష వేటూరి ప్రభావం.

ఆటవెలది

శివునియాజ్ఞ లేక చీమయు కదలదు
శక్తి లేక శివుడు జరుగలేడు
మగువ లేక జగతి మనలేదు క్షణమైన
ననిన ధర్మభూమి మనది గాదె?

అట్టి మాటలన్ని వట్టివాయెను నేడు
ఆడుదాని బ్రతుకు మోడు బారె
కామరోగులైరి కర్కోటకులునైరి
పుణ్యభూమిలోని పురుషులెల్ల

ఇట్టి మనుషులున్న మట్టిలో నే రీతి
సుఖము, శాంతి, కీర్తి, శొభలుండు?
అధములెల్ల జేరి యాధారమౌ కొమ్మ
నెంత క్రుంగదీయనంత హాని

తెలుగులో వెలది అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. తత్ఫలితంగా ఆట-వెలది అంటే ఒక చెడ్డ అర్థం కూడా ఉంది. స్త్రీల పట్ల మన సంస్కృతికి ఉన్న గౌరవాన్ని ఆ పద్యరీతిలో చెప్పడం వలన ఆ అర్థం వ్యర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇదే విషయమై వేటూరి చేసిన ఒక చిన్న ప్రయోగం చెప్పాలి. "సిరికాకొలను చిన్నది" నాటికలో ఒకడు ఒక దేవదాసిని (కథానాయిక) చూసి "ఆ వెలది ఆట-వెలదా?" అంటాడు. దానికి మఱొకడు "ఆట-వెలదో కోవెలదో" అంటాడు. పరమాత్మ విగ్రహరూపుడై గుడిలో ఎలాగ కొలువుతీరతాడో, ప్రతి మనిషీ దేహరూపాన్ని ఒక స్త్రీ గర్భంలోనే పొందుతాడు. అందుకే ప్రతి స్త్రీ ఒక కోవెల వంటిది. ఈ మాట ఆమె నడవడి, వ్యక్తిత్వం, మంచి/చెడుకి సంబంధం లేకుండా వర్తిస్తుంది. దానికి రమణ మహర్షి వంటివారే నిదర్శనం. 

కొన్ని పద్యాలు



మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.


Tuesday, November 20, 2012

పేరులోని తీపి

చం:-

శివయను మాట బిందువయి జిహ్వను తాకినయంత తానుగా
అవిరళమైన తీపి చని ఆవలి సంగతులెల్ల మాయమౌ
దివిధుని పాపరాశులను తీర్చినయట్టుల నాదు హృత్తునన్
భవలవభావతాపములు భంజనమొందును భక్తివాహినిన్


Tuesday, October 9, 2012

అంతా మాయే, అన్నీ ఆమే/అమ్మే

 శా:-

స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్
మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్
కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్
సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే!

 భా:-

బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, మగవారిని దహించే కామాగ్నివీ నీవే. సన్యాసులు, భోగులు ప్రార్థించే శర్వాణివి నీవే.

శివుడు బ్రహ్మం, పార్వతి మాయ. ఆ రెండూ ఒక్కటే. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు: తడి, నీరు వేఱు వేఱుగా ఉంటాయా? తడి లేకపోతే అది నీరే కాదు. నీరే లేకపోతే అసలు తడే ఉండదు.

Monday, September 17, 2012

కారణమాలాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారం



లక్షణం:
(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైః
నయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాలయగును
నీతిచే సిరి సిరి చేత దాతృతయును
దాతృతను భూరియశమన్నరీతి శర్వ

భావం: కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు, "నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి" అన్నప్పుడు నీతి సంపదకు కారణం, సంపద దానగుణానికి కారణం, దానగుణం కీర్తికి కారణం. ఇది కారణ-మాల-అలంకారం.



(గ్రంథం: భగవద్గీత, రచన: కృష్ణ పరమాత్ముడు/వ్యాసభగవానుడు)
ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామో, కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి

భావం: మనిషి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండగా, తనకు వాటిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన కోఱిక జనిస్తుంది, కోఱిక వలన (అనుకున్నది దక్కకపోతే) కోపం, కోపం వలన సమ్మోహితుడౌతాడు, సమ్మోహం వలన ఆలోచనను కోల్పోతాడు, ఆలోచనను కోల్పోవడం వలన బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వలన నాశనమౌతాడు.



(చిత్రం: నాలుగు స్తంభాలాట, రచన: వేటూరి సుందరరామమూర్తి)
చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయి, కడలిగా పొంగు నీ ప్రేమ

వివరణ: ఇది సూటిగా కారణమాలాలంకారం కాకపోయినా చినుకు నదికి కారణం, నది వరదకు కారణం, వరద కడలి పొంగుకు కారణం గా చెప్పుకుంటూ పోవడం వలన ఇది కారణ మాలాలంకారం అని చెప్పుకోవచ్చును అని నా అభిప్రాయం.



(చిత్రం: నువ్వే కావాలి రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది,
కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది

వివరణ: ఈ పంక్తిలో పరిణామాలంకారం, కారణమాలాలంకారం కలిపి ఉన్నాయని నా అభిప్రాయం. "విశాలనయన ప్రసన్నమై నేత్రపద్మాలతో చూచినది" అన్నామనుకోండి, దాని శబ్దార్థం (literal meaning) ఆమె పద్మాలతో చూచింది అని. కానీ పద్మాలతో ఎవరైనా చూడగలరా? లేదు కదా! అందుచేత ఆమె కళ్ళే పద్మాలయ్యాయి అని వాస్తవార్థం (real meaning). ఇక్కడ "చినుకు పాటయ్యింది" అంటే చినుకు అక్షరాలగానో, రాగం గానో అయ్యింది అని కాదు. చినుకులు చేసే శబ్దం పాటలా వినబడింది (పరిణమించింది) అని. అలాగే పాట తాకిన నేల "చిలకలు వాలే చెట్టయ్యింది" అంటే "పాట చేసే సవ్వడి చిలకపలుకుల లాగా తీయగా ఉన్నాయి" అని భావం. ఇవన్నీ పరిణామలంకారమే. కాకపోతే ఇవి వరుసగా పేర్చుకుంటూ ఒకదానికి మఱొకటి కారణంగా చెప్పారు కవి. నింగి చినుకైంది, చినుకు పాటైంది, నేల చెట్టైంది.



కారణమాలాలంకారానికి మఱొక పద్ధతి ఉంది. అది చూద్దాము.

(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
భవంతి నరకాః పాపాత్ పాపం దారిద్ర్యసంభవం
దారిద్ర్యం అప్రదానేన తస్మాత్ దానపరో భవ

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
నరకములు పాపమునఁ జే
కుఱుఁబాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మ!

భావం: నరకములు పాపము చేత, పాపము లేమి చేత, లేమి దానమీయకుండుట చేత వచ్చును. కాబట్టి దానము చేయవలెను.

వివరణ: ఇందాకటి ఉదాహరణలలో కారణం వెనుక కార్యం, వెనుక మఱొక కార్యం అలాగ వచ్చాయి. ఈ ఉదాహరణలో కార్యం వెనుక కారణం వచ్చింది. ఇది కూడా కారణమాలాలంకారమే.




(గ్రంథం: భగవద్గీత రచన: కృష్ణపరమాత్ముడు/వ్యాసభగవానుడు)
అన్నాత్ భవతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవః
యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞః కర్మసముద్భవః

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షరసముద్భవం,
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం

భావం: అన్నం నుణ్డి జీవులు వస్తున్నారు, అన్నం వర్షం నుండి వస్తోంది, వర్షం యజ్ఞం నుండి వస్తోంది, యజ్ఞం విధ్యుక్త కర్మల చేత వస్తోంది, కర్మలు వేదాలనుండి పుట్టాయి, వేదాలు బ్రహ్మం నుండి పుట్టాయి. అందుచేత సర్వత్రా ఉన్న బ్రహ్మ యజ్ఞంలో ప్రతిష్ఠింపబడినాడని గ్రహించు.

వివరణ: ఇదివరకు కోపం వలన సమ్మోహం, సమ్మోహం వలన స్మృతిభ్రంశం అంటుంటే ముందు భాగంలో  కార్యం (సమ్మోహం) తఱువాతి భాగంలో కారణం అవుతోంది. ఇప్పుడు జీవులు అన్నం వలన, అన్నం వర్షం వలన అంటుంటే ముందు భాగంలో కారణం (అన్నం) తఱువాతి భాగంలో కార్యం అవుతోంది. అంతే తేడా.



ఈ పద్ధతికి మఱొక ఉదాహరణ కాకపోయిన ఒక అచ్చు (blue-print) లాగా చెప్పవలసినది అందరికీ తెలిసిన ఏడు చేపల కథ.

అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ ఏటికి వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?”  అని అడిగితే, “గడ్డిమోపు అడ్డం వచ్చింది” అని అంది చేప. “గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగితే, “ఆవు  మేయలేదు” అని చెప్పింది గడ్డిమోపు.  “ఆవూ, ఆవూ గడ్డి ఎందుకు మేయలేదు?”  అని అడిగితే, “పశువుల కాపరి  విప్పలేదు” అంది. “పశువుల కాపరీ, ఆవును ఎందుకు విప్పలేదు?”  అని అడిగితే, “అమ్మ గారు అన్నం  పెట్టలేదు” అన్నాడు పశువుల కాపరి. “అమ్మ గారు అమ్మ గారు ఎందుకు అన్నం పెట్టలేదు?”  అని అడిగితే, “పాప  ఏడ్చింది” అంది. “పాప పాప ఎందుకు ఏడ్చావు?” అని అడిగితే, “చీమ కుట్టింది” అంది పాప. “చీమా చీమా ఎందుకు కుట్టావు?” అని అడిగితే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?”

అంది చీమ. ఇక్కడ కూడా కార్యం ముందు తెలుస్తోంది, కారణం తఱువాత తెలుస్తోంది.

Friday, September 7, 2012

అలంకారాలు - చంద్రాలోకం

దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.

భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు దొరికిన ఆధారాల వరకు, వీరిలో ప్రథముడు భరతుడు (భరతముని అని కూడా అంటారు). ఈయన ఏ కాలంలో జీవించారు అనే దానికి క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300 వరకు సమాధానాలు వినవస్తున్నాయి కానీ కచ్చితమైన నిర్ణయం ఇంకా లేదు. ఈయన "నాట్యశాస్త్రం" రచయితగా ప్రసిద్ధులు. ముఖ్యంగా ఈయన నటనలో రసాలను గుర్తించి వర్ణించారు. అది అటుంచితే, ఈయన 4 అలంకారాలను గుర్తించారు. ఈయన ప్రత్యేకత, ఆసక్తి నాట్యం పైన ఉండటంతో ఆ శాస్త్రాన్ని గురించి చెప్తూ అలంకారాల గురించి అంటీ-అంటనట్టుగానే కొంత వర్ణించారు. అవి ఏ అలంకారాలు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.

విష్ణుధర్మోత్తరపురాణంలో 18 అలంకారాలను వర్ణించారు. ఈ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాలలో చెప్పింది బృహద్ధర్మపురాణం. ఈ పురాణంలో పిపీలికాదిబ్రహ్మపర్యంతం అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలుకొని సూర్యవంశం, చంద్రవంశం, యక్షులు, రాక్షసులు, పాతాళలోకం, పితృకర్మలు, వాస్తు, జ్యోతిషం, వేదాంతం, సంగీతం, సాహిత్యం అన్నిటి గురించీ 3 భాగాలలో, 1345 పర్వాలలో వర్ణింపబడ్డాయి. దీని రచయిత ఎవరు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది భరతముని కాలం తఱువాతనే వ్రాసి ఉండాలి.

సుమారు క్రీ. శ. 6వ శతాబ్దం చిగురులో దండి అనే మహాకవి "కావ్యదర్శం" అనే గ్రంథంలో 38 అలంకారాలను గురించి వ్రాసారు. ఈయన రచించిన దశకుమారచరిత చాలా ప్రసిద్ధమైనది. "కావ్యదర్శం" పైన "భట్టికావ్యం" అనే రచన ప్రభావం చాలా ఉంది అని కొందరి అభిప్రాయం.

క్రీ.శ. 7వ శతాబ్దంలో లో భామహుడు "కావ్యాలంకారం" అనే గ్రంథం వ్రాసారు. ఇందులోని రెండు, మూడు అధ్యయాలలో అలంకారాల 35 గురించి చెప్పారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే దండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దండి వ్రాసిన దండి కావ్యదర్శాన్ని విమర్శించారు. సూటిగా ఫలాన ఆయన ఇలాగన్నాడు అని అనకుండా అపరే, అన్యే  (వేఱే వారు), కేచిత్ (కొంతమంది), అమేధసః (తెలివితక్కువ వాళ్ళు), కేచిత్ మహాత్మాః (కొందరు మహాత్ములు) వంటి సంబోధనలతో దండి రచనని విమర్శించారు. కాకపోతే కొన్ని చోట్ల పూర్తిగా ఏకీభవించారు కూడా.

దండి యమకం, అనుప్రాస అనే శబ్దాలంకారాలను అలంకారాలుగా గుర్తిస్తే భామహుడు వీటిని వేఱుగా శబ్దచిత్రాలు అన్నారు. వచనకవిత్వంలో కథ, ఆఖ్యానం అనేవి రెండుగా వర్ణించినా నిజానికి ఒకటేనని దండి చెప్తే, భామహుడు దాన్ని ఆక్షేపించారు. ఏది ఏమైనా, దండి భామహుడు సమకాలీనులైనా అవ్వాలి లేక దండి భామహుడి కంటే ముందు ఉండి ఉండాలి అని ఒక అభిప్రాయం. కొందరు అది తప్పంటారు.

ఉద్భాత అనే క్రీ.శ. 8వ శతాబ్దపు కాశ్మీర్ కవి భామహుడు కావ్యాలంకారానికి "భామహవివరణ" అనే పేరుతో దీనికి వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన స్వయంగా "కావ్యాలంకార సంగ్రహం" పేరిట 41 అలంకారాలను వివరించారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రుద్రత అనే కాశ్మీరీ కవి "కావ్యాలంకారం" అనే పేరుతో వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమైనది. ఇందులో 16 అధ్యాయాలలో సుమారు 700 శ్లోకాలలో 68 అలంకారాలను వర్ణించారు. 11వ శతాబ్దంలో మమ్మట అనే ఆయన "కావ్యప్రకాశం" లో 67 అలంకారాలను గుర్తించారు. 12 వ శతాబ్దంలో రుయ్యకుడు "అలంకారసర్వస్వం" లో 79 అలంకారాలను చెప్తే, వాగ్భాత 69టి ని సూచించారు. 13వ శతాబ్దంలో జయదేవుడు 100 అలంకారాలతో వ్రాసిన పుస్తకం "చంద్రాలోకం". దాన్నే ఆధరంగా నేను అలంకారాలను చెప్తున్నాను. ఆ తఱువాత 14 వ శతాబ్దంలో కలింగదేశపు విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో 84టిని గుర్తించారు. 16వ శతాబ్దంలో తమిళనాడులో జన్మించిన అప్పయ్యదీక్షితుడనే ఒక అద్వైత వేదాంతి "కువలయానందం" లో 124 అలంకారాలను గుర్తించారు.

ఇప్పటిదాక నేను చెప్పినది కేవలం భారతసాహిత్యగగనంలో ఎక్కువ వెలుగు కలిగిన తారలనే. వీరు కాక అనేకానేకులు కావ్యం ఎలాగ వ్రాస్తే రక్తి కడుతుంది అనే అంశం మీద పుంఖానుపుంఖాలు వ్రాసారు. ఇంత చరిత్ర కలిగిన మనం చివరకు అర్థం పర్థం లేని పిచ్చి మాటలను పాటలుగా పాడుకుంటున్నామంటే అది మన దోషమేనని చెప్పుకోవాలి.  ఇక చంద్రాలోకం గురించి చెప్పుకుందాము.

చంద్రాలోకం రచించిన జయదేవుడు, గీతగోవిందం రచించిన జయదేవుడూ ఒకరే అని కొంతమంది వాదన. ఇద్దరూ దాదాపు 12 లేక 13 వ శతాబ్దానికి చెందిన వారే. ఇద్దరూ సంస్కృత పండితులే. ఇద్దరూ ఒరిస్సా నుండి వచ్చినవారే. ఇంత సామ్యం ఉన్నా వారు ఒక్కరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గీతగోవిందంలోని పాటల్లో జయదేవుడు తాను భోజదేవుడు, వామదేవీ ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. పైగా ఆయన పరమవైష్ణవుడు. (గీతగోవిందమంతా శ్రీకృష్ణప్రేమామృతమే కదా!) కానీ చంద్రాలోకం రచయిత జయదేవుడు తాను రచించిన "ప్రసన్న రాఘవం" అనే నాటకంలో మహదేవుడు, సుమిత్రా ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. ఈ నాటక శివుడికి సంబంధించిన పండుగ సందర్భంగా మొదట నటింపబడింది అని చెప్పాడు. అప్పట్లో వైష్ణవులకు, శైవులకు ఉన్న పోటీని బట్టి చూస్తే గీతగోవిందం రచయిత ఈతడు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రాలోకాన్ని తెలుగులోకి ఆడిదము సూరకవి అనువదించాడు. ఈయన 18వ శతాబ్దం చివరి భాగానికి చెందిన వాడు. ఆంధ్రనామశెషము, కవిజనరంజనము, రామలింగేశ శతకం వీరి ఇతరరచనలు. సంస్కృత చంద్రాలోకంలో ఒక్కో అలంకారం ఒక్కో శ్లోకంలో వివరింపబడి ఉంది. శ్లోకంలో మొదటి పంక్తి అలంకారం లక్షణాన్ని వివరిస్తే రెండవ పంక్తి ఒక ఉదాహరణను చెప్తుంది.  ఆంధ్ర చంద్రాలోకంలో సూరకవి కూడా అదే శైలిని అవలంబించారు. సంస్కృతశ్లోకాలను ఒకటికి ఒకటిగా తెనిగించారు. తెలుగులో అన్నీ గీతాపద్యాలయ్యాయి. దీని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. వీటిలో అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, పరవస్తు వేంకటరంగాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను ఆధారంగా డా. బులుసు వెంకటసత్యనారాయణ మూర్తి గారు వ్రాసిన పుస్తకం చదువుతూ నేను అలంకారాలను వివరిస్తున్నాను.

Monday, September 3, 2012

హేత్వలంకారము


వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం


లక్షణం:

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)
హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతే
అసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||

అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)
కార్యకారణములు రెండు గలియఁబలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీ శశి మదవతీ క
దంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకు

వివరణ: హేతువు అంటే కారణం. హేతుమంతం అంటే కార్యం. ఉదాహరణకు సూర్యుడు రావడం హేతువు, పద్మాలు విచ్చుకోవడం కార్యం. హేతువు, హేతుమంతం ఒకే వాక్యంలో చెప్తే అది హేత్వలంకారం (హేతు + అలంకారం) అవుతుంది.

సూర్యుడు ఉదయించడం వలన జరిగే కార్యాలేమిటి? చెట్లు వికసించడం, సముద్రంలోని నీళ్ళు ఆవిరవ్వడం మొదలుకొని ఒడియాలు ఆరడం వరకు అనేకఫలితాలు ఉన్నాయి. కానీ, సూర్యుడు ఉదయించినది కేవలం పద్మాలు విచ్చుకోవడం కోసమేనన్నామనుకోండి, మిగతావి అంత ముఖ్యమైనవి కావు, పద్మాలు వికసించడమే అసలు విషయం అనే ధ్వని వచ్చి పద్మాలను పొగిడినట్టు అవుతుంది. అదే హేత్వలంకారం.

పై శ్లోకంలో (అనువాదంలోనూ) రెండొ భాగంలో కవి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఈ అందమైన భామల అలుక తీర్చడానికే చంద్రుడు ఉదయిస్తున్నాడు" అని ఆ వాక్యం భావం. నిజానికి చంద్రుడు రావడం వలన అనేకకార్యాలు జరుగుతాయి. మచ్చుకు కలువలు విచ్చుకుంటాయి. కానీ కవి వాటన్నిటినీ త్రోసిపుచ్చి అలిగిన అమ్మాయిలు అలుక వీడి ప్రియులకు లొంగడానికే వచ్చాడు అంటున్నాడు.


హేత్వలంకారం మఱొక లాగా కూడా సమకూరచ్చును. దానికి కవి ఇచ్చిన లక్షణం, ఉదాహరణ చూద్దాము.

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం)
హేతు హేతుమతోరైక్యం హేతుం కేచిత్ ప్రచక్షతే
లక్ష్మీ విలాస విదుషాం కటాక్షా వేంకట ప్రభోః

అనువాదం: (ఆడిదము సూరకవి)
కార్యకారణములకు నైక్యమగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రమావిలాసములు వేంక
టేశ్వర కటాక్షము లనంగ నిందు మౌళి

వివరణ: కొంతమంది హేతువు, హేతుమంతం ఒకటేనని చెప్పడం హేత్వలంకారం అంటారు. ఉదాహరణకు "సత్కవులకు లభించే సిరిసంపదలు శ్రీ వేంకటేశ్వరుని కటాక్షం" అన్నామనుకోండి. నిజానికి వెంకటేశ్వరుని అనుగ్రహం "వలన" మనకు సిరిసంపదలు లభిస్తాయి అని ఉద్దేశం. కానీ, ఆ "వలన" అనే పదం విడిచిపెట్టేసి రెండిటికీ అభేదం చెప్తున్నాము. ఇదీ హేత్వలంకారమే.


ఈ అలంకారం చాలా తెలుగు పాటలలో విన్న గుర్తు. గుర్తుకు వచ్చినప్పుడు అవీ కలుపుతాను. ఈ లోపల చదువర్లకు ఏమైనా ఉదాహరణలు తెలిస్తే చెప్పగలరు.

Saturday, September 1, 2012

వ్యతిరేకాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారం


లక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోః

వివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.


ఉదా:- (చంద్రాలోకం)
సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి కోమలాః
భావం: (మీరు) కొండలవలే ఎత్తుగానున్న వారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది.
వివరణ: కొండలకు, ఒక వ్యక్తికి సామ్యం చెప్పారు (ఎత్తుగా ఉండటం). కాకపోతే వెంటనే కొండలకు లేని, ఆ వ్యక్తికి ఉన్న ఒక విశేషాన్ని చెప్పారు -- సహజ కోమలత్వం. కనుక కొండలకంటే ఆ వ్యక్తే మెరుగు అని తెలుస్తోంది. ఈ వ్యతిరేక విషయం చెప్పడం వలన ఆ వ్యక్తిని మరింత పొగిడినట్టైంది. కనుక ఇది వ్యతిరేకాలంకారం.


ఉదా:- (కావ్యం: భామినీ విలాసం, రచన: జగన్నాథ పండితరాయలు)
పంక్తి:
ఓ ప్రియా, ఇలాటి నీ ముఖముతో రాత్రులందు ముకుళించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము?
వివరణ: పద్మాలు పొద్దున్న పూటల విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు ముడుచుకుపోతాయి. కానీ వక్త ప్రేయసి ముఖం రాత్రుళ్ళు ముకుళించుకోవట్లేదు కనుక (నే) పద్మాలతో పోలిక న్యాయం కాదంటున్నాడు (పొద్దున్న విచ్చుకునే విషయంలో రెండూ సమానమే అని ఉద్దేశం).


ఈ అలంకారాన్ని కూడా మన సినీకవులు అంతగా వాడుకోలేదు అనుకుంటున్నాను. నా మాటను ఉదాహరణలతో సవరిస్తే సంతోషపడతాను.



పొడిగింపు:

మందాకిని/లక్ష్మీదేవి గారు వ్యాఖ్యలో చెప్పిన పాటనుండి:

చిత్రం: స్వప్న, రచన: ఆత్రేయ, సంగీతం: సత్యం, పాట: ఇదే నా మొదటి ప్రేమ లేఖ
మెరుపని పిలువాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవని పిలువాలంటే ఆ సొగసు ఒక్క దినం

Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.

Monday, January 2, 2012

అందమైన అమ్మాయి (పద్యాలు)

రాత్రి రెండు దాటాక నేను మాట్లాడేదానికే అర్థం ఉండదు (అప్పుడప్పుడు పగలు కూడా). అలాంటిది జాలపౌరులు అందరూ చూడగలిగే బ్లాగు వ్రాస్తున్నాను. ఏమైనా అర్థరహితంగా (అదే, పిచ్చి పిచ్చిగా) అనిపిస్తే క్షమించాలి.

అసలు విషయానికి వస్తే: మొన్న ఒక పూటకూళ్ళయింటికి (restaurant) వెళ్ళాను. అక్కడ తిండిని అందించే ఒక అమ్మాయి వర్ణించలేనంత అందంగా క/అనిపించింది. సరే, ఈ మధ్య మనం కాస్త సృజనాత్మకంగా వ్రాసినది ఏమీ లేదు కదా! "బొత్తిగా తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటదీ?" అనుకుని, డిక్కీలో తొంగున్న నా కవిహృదయాన్ని కాస్త బయటకు తీసి, దుమ్ము దులిపి, బ్రౌహ్ణ్య నిఘంటువుని ఊతగా ఇచ్చి పద్యాలు వ్రాయమన్నాను.  ఇవిగో, ఈ క్రిందివి రాలాయి. చదువర్లకు నా తవికలు నచ్చినా నచ్చకపోయినా, నా ప్రయోగాలకు వారి మనసులు నొచ్చుకోకుండా ఉంటే అదే పదివేలు.

గమనికలు:-

పై వాక్యంలో నచ్చు, నొచ్చు -- ఇది అనుకుని వేసిన ప్రాస కాదు. ఎంత డిక్కీలో ఉన్నా నా కవిహృదయానికి ఇంత డొక్కు భావనలు లేవు అని నా నమ్మకం. డిక్కీ, డొక్కు...హ్మ్...రాత్రి రెండు దాటింది! కంగారు పడకండి, ఈ పద్యాలు రోజూ పడుకునే ముందు ఒక్కొక్కటి చప్పున వ్రాసుకుంటూ వచ్చాను. రెండు దాటాక వ్రాసిన పద్యం సివరాకరి కంద పద్యం ఒకటే.

ఔత్సాహిక కవిని కాబట్టి నా పద్యాలలో ఉత్సాహం కనిపించినట్టు భావం కనిపించకపోవచ్చును. పెద్దలు పద్యాలను సవరించడానికి, ఔత్సాహికపాఠకులకు నా బాధేంటో చెప్పడానికి పద్యాల క్రింద (నేను అనుకున్న) భావాన్ని వ్రాస్తున్నాను.

శా:-
దేవీ యెవ్వరివీవు? యీ పురమునన్ దేవాంగనల్ జొచ్చిరే?
ఏ వైజ్ఞానికుడైన శిల్పములలోనెక్కించెనా ప్రాణముల్?
భావావేశము గల్గి బ్రహ్మ రుచితో భావించి నిర్మించెనా?
నీ విభ్రాజితమూర్తి కీర్తి నుడువన్ నేనెంత వాడన్, కొమా!

భా:- ఓ దేవి, నువ్వు ఎవరివి? ఈ మధ్యన మా ఊళ్ళోకి దేవతలు ప్రవేశించారా? ఎవరైనా శాస్త్రజ్ఞుడు శిల్పాలకు ప్రాణం పోయడం నేర్చుకున్నాడా? భావావేశం కలిగి బ్రహ్మ ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను మలిచాడా? నీ వెలుగులీనే రూపాన్ని కీర్తించడానికి నేను సరిపోను.

చం:-
సుమములఁ బోలు నీ యధరశోభకు లొంగని వారునుందురే?
తమిగొను వారికిన్ మిగులు దాహము తీరగ దారి యున్నదే?
ప్రమదము కల్గి భంగపడు ప్రాణులలో మగవారి తోటివై
భ్రమపడి యెన్ని తుమ్మెదలు భ్రామరమొందగ వాలె నీ యెడన్

భా:- పువ్వులలా మెరిసే నీ పెదవుల శొభకు లొంగనివాళ్ళుంటారా? నీ మోహంలో పడినవారికి కలిగే పిపాస తీరే మార్గం ఉన్నదా? నీ మాయలో పడి (అనుకున్నది దక్కక) చిన్నబోయిన ప్రాణులలో మగవాళ్ళతో పాటు (నీ పెదవులను పూవులనుకుని మోసపోయిన) తేనెటీగలెన్నున్నాయి?

మ:-
ఎవరా ఈశ్వరుడంచు ప్రేలు మొరకుల్ హెచ్చైన నీ పొంకమున్
అవలోకించిన తత్క్షణంబు మదిలోనజ్ఞానమున్ వీడరే?
స్తవముంజేయరె హేతువాదిగణముల్ సర్వేశుఁ గుర్తించి, సం
భవమే కూర్చగ నిన్ను ఈ ప్రకృతికిన్ పైవాడు లేకుండగన్?

భా:- "ఈశ్వరుడు ఎవరు?" అని పొగరుగా అడిగే మూర్ఖులు ఇంత గొప్ప అందాన్ని చూసి వెంటనే తమకున్న అజ్ఞానాన్ని వదిలేసి, దేవుడున్నాడు అని గుర్తించి ఆయనను స్తుతించడం మొదలెడతారు. పైవాడు లేకపోతే, ఇంత అందమైన నిన్ను తయారుచేయడం (ఆలోచనలు లేని) ఈ ప్రకృతికి వీలౌతుందా?

గ:- చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో గుఱ్ఱం జాషువా వ్రాసిన "గిజిగాడు" పద్యాలు చదివిన స్ఫూర్తి ఇంకా ఉందేమో! అందులో ఒక పద్యంలోని "నాస్తికులు నిన్ను చూసి మనసు మార్చుకుంటారు" అనే భావనని పైన జాతీయం చేసాను.

నిజానికి ఆమెను చూసిన వెంటనే, నా పక్కనే ఉన్న నా నాస్తిక మిత్రుడి వైపు తిరిగి, "ఎవఱ్ఱా దేవుడు లేదన్నది? ఆ అమ్మాయిని చూడు. ఇంత అందగత్తె కేవలం by chance తయారైందా? ఎవరో చెక్కినట్టు లేదు?" అన్నాను :)

ఉ:-
మోహిని చెన్నుకున్ మురిసి మూర్ఛిలినారని దానవాళికిన్
సాహసమున్న రీతి తగు సంయమమేదని యన్నవాడనే!
వ్యాహతునైతి నీ యెదుట, వైఖరి మార్చిన నాదు గుండెపై
ద్రోహము జేసెనంచు మతి దోషము లెంచక నూరకుండె, హా!

భా:- మోహిని అందానికి మురిసిపోయి, మూర్ఛపోయిన రాక్షసులకు సాహసం ఉన్నంతగా సంయమం (మనసును అదుపులో ఉంచుకోవడం) లేదు అన్నవాణ్ణి, నీ అందం ముందు ఓడిపోయి నిలిచాను. నా బుద్ధి మనసు తనకు ద్రోహం చేసిందని చిఱాకు పడకుండా ఉండిపోయింది (మనసు, బుద్ధి ఆమె అందానికి దాసోహం అన్నాయి).

త:-
ఒడలు స్పందన లేకనున్నది ఉన్నపాటుగ మైకమా?
ఘడియ మారక గిపోయెను కాలమాగెన? నా భ్రమా?
ఉడుకు నెత్తురు మంచు ముద్దయెనూడి మేఘము రాలెనా?
నొడవనీయక డ్డుతున్నది నువ్వు వేసిన మంత్రమా?

భా:- ఒళ్ళు తెలియట్లేదు, ఉన్నట్టుండి నాకు మైకం కలిగిందా? గడియలు మారుతున్నట్టు అనిపించట్లేదు - కాలమాగిపోయిందా? లేక ఉత్త భ్రమా? ఎప్పుడూ దూకుడు గా ఉండే నా నెత్తురు చల్లబడిపోయింది. ఆకశంలోంచి మబ్బేమైనా ఊడు నా మీద పడిందా? నేను మాట్లాడ లేకపోతున్నాను -- నువ్వు ఏమైనా మంత్రం వేసావా?

సీ:-
దీపపు కాంతికి తెలినవ్వు మెరిసెనో? 
                          నవ్వుకు వెలిగెనో దివ్వెలెల్ల?
చెక్కిలి వెలుగుకు దిక్కులు రంజిలె
                          ఎవ్విధి పొందితివింత సొగసు?
కనురెప్పలున్నట్టి గండెలు లేవని
                          వింటిని యిన్నేళ్ళు వేయినోళ్ళ!
నీ నీలికన్నుల మీనాలఁ గాచేటి
                          కందెర్లఁ గమనించి కంటి నిజము

భా:- ఈ దీపాల వెలుగుకు నీ నవ్వు మెరుస్తోందో, నీ నవ్వుకే ఈ దీపాలు మెరుస్తున్నాయో తెలియట్లేదు. నీ బుగ్గల ఎఱుపుకు దిక్కులన్నీ వెలుగుతున్నాయి. ఇంత అందం నీకు ఎక్కడిది?

కనురెప్పలున్న చేపలు లేవు అని ఇన్నాళ్ళు అందరూ అంటుండగా విన్నాను. కానీ నీ నల్లని కళ్ళనే చేపలను కాస్తున్న, కను-తెరలు (కనురెప్పలు) గమనించాక నిజం తెలిసింది.

గ:- గండెలు, కందెర్లు -- జై బ్రౌన్ దొర!

ఆ:-
నీవు రెప్ప మోడ్చు నింపాది తాళంబు
నేర్చి నాదు గుండె మార్చె లయను
నడుచు వేళ నీదు నడుమును చూడగ
నటుయిటు కదలాడి యలిసె కనులు

భా:- నీవు నెమ్మదిగా రెప్పలు వేసే "నింపాది తాళం" (ఆది తాళం మీద pun :) ) నచ్చి నా గుండె దానితో పాటుగా కొట్టుకుంటోంది. నువ్వు నడుస్తుంటే కదులుతున్న నడుమును చూడటానికి అటూ ఇటూ ఊగి కళ్ళు అలిసిపోయాయి.

కం:-
కలరే నీయందమునకు
తులతూగే పురుషులిలను? దొరకరె లలనా!
అల వైకుంఠపురములో
కొలువైన హరి సరిజోడు కోమలి నీకున్!

భా:- నీ అందానికి సరితూగే మగవాడు ఈ ప్రపంచంలో దొరకరే అమ్మాయి! వైకుంఠంలో కొలువైన శ్రీహరే నీకు సరిజోడీ.

గ:- పోతన భాగవతం స్ఫూర్తి సుస్పష్టంగా కనబడుతోంది. ప్రత్యేకించి చెప్పక్కరలేదు అనుకుంటాను :)

అమ్మాయి అందాన్ని మెచ్చుకుంటున్నాను కానీ  పిచ్చి పిచ్చి మాటలు, థాటులు (thoughts) లేవనే విషయాన్ని తేటపరచడానికే ముగింపు పద్యంలో "శ్రీమద్రమారమణ గోవిందో హరి!".

Saturday, August 20, 2011

వ్యాజస్తుత్యలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యాజస్తుతి అలంకారం




లక్షణం: ఉక్తిర్వ్యాజస్తుతిర్నిందా స్తుతిభ్యాం స్తుతి నిందయోః
వివరణ: పైకి నిందిస్తున్నట్టు అనిపిస్తున్నా తరచి చూస్తే పొగుడుతున్నట్టు అనిపించడాన్ని వ్యాజస్తుతి అంటారు. అలాగే పైకి పొగుడుతున్నట్టు ఉన్నా, భావంలో నింద ఉంటే అది కూడా వ్యాజస్తితే అవుతుంది. వ్యాజము అంటే నెపము (excuse), స్తుతి అంటే పొగడ్త. వ్యాజనింద అనే అలంకారానికి వ్యాజస్తుతికి మధ్య భేదం వ్యాజనింద టపలో చర్చించుకుందాము.


ఉదా:-(గ్రంథం: చంద్రాలోకం, కవి: ఆడిదము సూరకవి)
తే:- గంగ! నీకు వివేకమెక్కడిది? స్వర్గ మందఁజేసెదు పాపాత్ములైన జనుల
భా:- ఓ గంగా, నీకు తెలివి ఉందా? ఎన్నో తప్పులు చేసినవారిని కూడా (నీలో స్నానం చేస్తే) స్వర్గానికి పంపుతున్నావు.
వి:- కవి, గంగ పాపాత్ములను స్వర్గంలోనికి తీసుకువెళ్తోంది అంటుండడం నిందగా గోచరిస్తోంది. కాకపోతే, ఎన్ని పాపాలు చేసినవారైనా నీలో ఒక్క మునక వేస్తే స్వర్గానికి పంపే ఉదారత, దైవత్వం నీలో ఉన్నాయి అనే భావం కూడా నిక్షిప్తమై ఉంది. కనుక ఇది వ్యాజస్తుతి.

ఉదా:-(చాటువు, కవి: శ్రీనాథుడు)
కం:- సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగఁ విడుము పార్వతి చాలున్
సం:- ఇది బహుశా చదువర్లందరికీ తెలిసిన పద్యమే. శ్రీనాథుడికి ఒక ఊరిలో నీరు కనబడకుంటే పరమేశ్వరుని విగ్రహాన్ని చూసి వ్యంగ్యంగా గంగను (నీటిని)) ప్రసాదించమని అడిగాడు.
భా:- డబ్బున్నవాడికి పదహారు వేల మందిని పెళ్ళాడినా ఫరవాలేదు, నువ్వు భిక్షువువి (దానం అడిగి తినేవాడు). నీకు ఇద్దరు పెళ్ళాలు ఎందుకయ్యా? పార్వతి సరిపోతుంది, గంగను ఇటు విడిచిపెట్టు.
వి:- పైపైన శివుడిని భిక్షువు అనడం, నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని ప్రశ్నించడం -- రెండూ నిందలుగా కనిపిస్తున్నా, శివుడు సన్న్యాసి, నిష్కామి, గంగను శిరస్సుపై మోసి నేలకు పంపిస్తున్నవాడు అనే ధ్వని ఉండటం చేత ఇది వ్యాజస్తుతి అవుతోంది.



ఉదా:- (చిత్రం: సిరివెన్నెల, రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చేవాడినేమి అడిగేది?
భా:- ఆదిభిక్షువువి (అంటే మొదటి బిచ్చగాడు - తనకంటూ ఏదీ ఉంచుకోకుండా ఉండేవాడు), బూడిదిచ్చేవాడివి (వైరాగ్యానికి, మోక్షానికి చిహ్నంగా బూడిద ఇస్తాడు) - నిన్నేమి కోరుకోనయ్యా?
వి:- ఈ పాట మొత్తం, ప్రతి వాక్యంలోనూ, శివుడిని ఉద్దేశించి, కవి నిందిస్తున్నట్టుగా పొగుడుతాడు. సమస్తాన్ని సృష్టించినది శివుడని, కామాన్ని (మన్మథుడిని) దహించినవాడు శివుడని, తనను ఆశ్రయిస్తే యాచించినవాడి పూర్వోత్తరాలను చూడకుండా వరాలని ఇచ్చే భోళాశంకరుడని పొగుడుతున్నాడు కవి. కాకపోతే పాట వింటే నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.



ఉదా:- (చిత్రం: శుభోదయం, రచన: వేటూరి)
రాయైతేనేమిరా దేవుడు? హాయిగా ఉంటాడు జీవుడు.
ఉన్న చోటే గోపురం, ఉసురు లేని కాపురం, అన్నీ ఉన్న మహానుభావుడు
భా:- దేవుడు రాయైతేనేమిటి? ఆయనకు ఏ సమస్యా లేదు. ఎక్కడ ఉంటే అక్కడే గోపురం ఉంటుంది. సుఖంగా ఉంటాడు. 
వి: ఒక పక్కన దేవుడిని రాయంటూ, మఱో ప్రక్కన ఆయన వైభోగాన్ని పొగుడుతూ ఉండటం వలన ఇది వ్యాజస్తుతి అనుకోవచ్చును అని నా అభిప్రాయం.



ఉదా:- (గ్రంథం: చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
తే:-
మంచిదానవు, దూతిక! మంచిదాన
వింతకంటెను గర్తవ్యమేమి కలదు?
అతని శిఖ, నఖ, దంత లూనాంగి వైతి
వెందువలన మదర్థము నందు నహహ!
సం:- ఒక అమ్మాయి నాయకుడిపై తనకున్న ప్రేమను తెలుపమని ఒక దూతిక (messenger) ని పంపింది. నాయకుడు దూతికనే ప్రేయసి అనుకుని ఆమెతో సరసమాడాడట. దూతిక చక్కగా అతనితో ఆడుకుని వెనక్కి వచ్చిందట. అప్పుడు నాయిక చెప్తున్న మాటలు.
భా:- ఎంత మంచిదానవే దూతికా! నా కోసం నువ్వు ఇన్ని (పంటి, గోటి) గాట్లు వేయించుకుని వచ్చావా? నీకు ఎంత కర్తవ్యదీక్ష? (లూనము -- కొయ్యబడినది)
వి:- నిజానికి తన ప్రియుడితో క్రీడించిన దూతిక పైన ఒళ్ళు మండినా నాయిక డొంకతిరుగుడుగా/పొగుడుతున్నట్టుగా నిందించడం వలన ఇది వ్యాజస్తుతి అలంకారం అయ్యింది.

Thursday, March 3, 2011

శివరాత్రి సందర్భంగా పద్యాలు

శివరాత్రి గురించి బహుశః పాఠకులందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పనికట్టుకుని కొత్తగా చెప్పేది ఏముంది?  శివతత్త్వం ఒక్క మాటలో చెప్పాలంటే "ప్రాణులన్నింటినీ ప్రేమించడం. అహాన్ని జయించడం." -- అంతే.  భగవంతుని కృప చేత మనందరిలోనూ దాగున్న అరిషడ్వర్గాలు నశించాలని ఆశిస్తున్నాను. ఇదే విషయాన్ని పద్యాల రూపంలో ఉంచాను. తప్పులేమైనా కనబడితే సవరించగలరని ప్రార్థన.

ఉ:-
ధ్యానములోనిమగ్నమయి ధారుణిలో మను పాపకర్ములన్
కానకనుంటివో? తగదు! కాదిది ధర్మము నీలకంధరా!
ఆనక నేత్రముల్ దెరువ అంధము రాజ్యము జేయుఁభూమిపై
మానవజాతి దానవుల మారణహోమపు యజ్ఞధేనువై

భా:-
శివా! ధ్యానంలో ఉండిపోయి భూమిపైనున్న పాపులను చూడటం మానేశావా? ఇది నీకు ధర్మం కాదు. నువ్వు కొంచెం ఆలస్యం చేసి కళ్ళు తెరచినా ఇక్కడ మిగిలేది - మానవరూపరాక్షసుల మారణహోమానికి దేవతైన అంధకారం మాత్రమే.

మ:-
తలపై శీతలగంగ భూతలముపై తానెట్టి దౌర్భాగ్యమున్
గలదై నిత్యము శోకసాగరములో గాసిల్లి వేసారెనో
తెలుపన్ చూడదె? ఆమె బాధ గనవా? తీర్చంగ సర్వేశ్వరా!
తలమే ఆమెను ఏపరించు తెగులై తారాడు కాలుష్యమున్

భా:-
నీ తలపైన ఉన్న గంగ తను భూమిపై ఎంత దౌర్భాగ్యానికి లోనౌతోందో, శోకసాగరంలో తపిస్తోందో (అన్ని నదులు సాగరంలో కలిస్తే గంగ శోకసాగరంలో కలుస్తోంది) చెప్పలేదా? భార్య బాధను చూసి ఆమెను వేధిస్తున్న కాలుష్యం అనే రోగాన్ని నువ్వు నయం చెయ్యలేవా?

శా:-
కైలాసంబున కాపురంబదెటులో కాశ్మీరు యుద్ధాలతో?
కాలాకారుడవంచు వేదములలో కైవారముంజేసిరే?
కాలే జీవుల సాక్షిగానెఱుగుమా కాదంచునీ సత్యమున్
కాలేవయ్య నవీనమానవతకున్ కాసింత పోటీ హరా!

భా:-
కాశ్మీర్లో నిత్యం యుద్ధాలు జరుగుతుంటే కైలాసంలో నువ్వు కాపురమెలాగ ఉంటున్నావయ్యా? ఐనా వేదాలలో నిన్ను కాలరూపుడు (మృత్యురూపుడు) అన్నారు కానీ మా మానవజాతి సృష్టిస్తున్న విధ్వంసం సాక్షిగా తెలుసుకోవయ్యా - నువ్వు మాకు ఏ మాత్రం పోటే రాలేవు.

కం:-
అవలక్షణదాసులగుచు
అవధులునెఱుగక యెగబడి యావజ్జనులున్
అవనిని నాశము జేసిరి
శివునాజ్ఞకు భయము లేదు చీమలకైనన్

భా:-
మనుషులు ధర్మాన్ని విడచి ఎవరికి నచ్చినట్టు వారి ఈ భూమిని నాశనం చేస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేక చీమైనా కదలదంటారు కానీ, నిజానికి ఈ ప్రపంచంలో చీమకు కూడా నీ ఆజ్ఞపైన గౌరవం లేదు.

సీ:-
సాగరాల తుదల సంగతులేలయ్య? నగరంబు నరకమై నలిగె గోవు
పచ్చగడ్డిని మేసి పాలిచ్చు గోమాతరొమ్ము చీల్చి రుధిరమమ్ముకొనుచు
వాలము చేబట్టి వైతరణినిఁద్రోయ, తనయాడపడుచుల తాపమెఱిగి
ధరణిపై జరిగేటి దారుణాలను నీకు వర్ణించి చెప్పడే వృషభరాజు?

భా:-
"చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు" అంటారు కదా? ఆ సాగరాల చివరిదాక ఎందుకు పట్టణాలే గోవులకు నరకమైపోతున్నాయి. ఎవ్వరూ ఆశించని గడ్డిని తీసుకొని కమ్మని పాలనిచ్చే ఆ గోమాతని హింసించి ఆమె రొమ్ము చీల్చుకుని మరీ రక్తంతో కూడిన పాలను అమ్ముకునేటువంటి మనుషులు తయారయ్యారు. ఆవు తోక పట్టుకుని వైతరణి దాటడం కాదు, బ్రతికున్న ఆవునే తోకతో లాగి వైతరణిలోకి తోసేస్తున్న దుఃస్థితి ఇది. తన ఆడపడుచుల కష్టం చూసి నందీశ్వరుడైనా నీకు మానవుల దౌష్ట్యాన్ని గురించి చెప్పలేదా?

ఆ:-
భూమి చాలదంచు వ్యోమయానముఁ జేసి
చందమామ తలమునందుకొనిరి
తనకు భూమి స్థితియె తప్పదేమోనంచు
విధువు చేయలేద విన్నపములు?

భా:-
భూమి చాల్లేదని చివరకు చంద్రమండలం మీద కూడా జెండా పాతాము. తనకు కూడా భూమి స్థితే పట్టి కాలుష్యంతో, దుష్టులతో నిండిపోతాడేమోనని భయపడి చంద్రుడు నిన్ను ఏమీ అడగలేదా?

చం:-
గరళము త్రాగి దేవతలఁ గాసితివందురు సత్యమా శివా?
మరణము లెక్కజేయక ప్రమాదముఁదెచ్చెడి రాక్షసాళికిన్
వరములనిచ్చు దానగుణవంతుడవందురు నమ్మవచ్చునా?
కరుణకు రూపమన్న నుడి కల్పన కాదుగ, శైలమందిరా?

భా:-
విషం తాగి దేవతలను కాశావు అంటారు? మరణాన్ని సైతం లెక్కచేయకుండా రాక్షసులకు వరాలిచ్చిన దానవీరుడవంటారు? కరుణకు నీవు నిలువెత్తు రూపం అంటారు. ఇవన్నీ నిజమేనా? లేక మా అపోహలా?

శా:-
బోళాశంకరుడన్న మాట రుజువై, భూమాత హర్షించగన్!
కైలాసంబున ధ్యానయోగతపముల్ కాసేపు చాలించుమా
మా లోకంబున ధర్మరక్షకుడవై మాలిన్యమున్ తెంచుమా
నీలో పేర్మిని మానవాళి మఱగన్ నేర్పించఁ రా దైవమా!

భా:-
ఇవన్నీ నిజమని, నువ్వు బోళామనిషివి అని రుజువయ్యే లాగా -- భూమాత ఆనందించేలాగా కొన్నాళ్ళు కైలాసంలో ధ్యానం మాని మా లోకంలో ధర్మాన్ని రక్షించు. నీలో ఉన్న గొప్ప గుణాలన్నీ మానవజాతికి మప్పు.

Wednesday, December 29, 2010

నిత్యజీవితంలో పద్యాలు - శారదాదేవి

ఉ:-
శ్రీకరపాదపద్మముల చేతులఁ దాకగఁజాల లేక యీ
చీకటి కోటలోనిరికి చిత్తము చంచలమై భ్రమించుచున్
వేకువ కోరి వేడితిని వేదముఁబట్టిన దివ్యహస్త! ఈ
నా కనుదోయిలో నిలిచి నాటకమున్ కడతేర్చుమా భువిన్

చం:-
కరణములన్ని ప్రాణహరకాంతికి మ్రొగ్గెడి మూఢమక్షికల్
తరణము చేతఁగాక భవతామససాగరమందు చిక్కితిన్
శరణను నన్ను గావగ ప్రసన్నతనొందుమ, హంసవాహినీ!
కరుణను చూచుమా జనని! కామితదాయిని! లోకపావనీ!

చాలా రోజులు పద్యాలకు దూరంగా ఉన్నాను అని ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకుని రెండు పద్యాలు వ్రాశాను. తప్పులుంటే సవరించగలరు.

Monday, November 8, 2010

ఉల్లేఖాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉల్లేఖాలంకారము


సూత్రం: బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే
అర్థం: ఒకే వస్తువు పలువురికి పలు విధములుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది.

ఉదా:- (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనోబాణుడని స్త్రీలు, నరసిమ్హరాయలును తలంచెదరు

ఇక్కడ కవితావస్తువు ఒకటే - నరసిమ్హరాయులు. ఆయన కవులకు బాణుడిగా, రాజులకు మురారిగా, స్త్రీలకు మన్మథుడిగా కనిపిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కవి ఒకే వ్యక్తికి ఎన్నో స్వరూపాలను తెలియజేశాడు. కనుక ఇది ఉల్లేఖాలంకారము. ఇందులోనే శబ్దాలంకారం కూడా ఉంది - బాణుడు అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తోంది - ఇది అనుప్రాస అవుతుందని నా నమ్మకం.


ఒకే వస్తువుకు వేర్వేరు గుణాలను బట్టి వేర్వేరు వస్తువులకు అభేదాన్ని తెలుపడం కూడా ఉల్లేఖాలంకారమే.

ఉదా:- (చంద్రాలోకం)
అతడు వ్యక్తిత్వమందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడు

ఇక్కడ ఒకే వ్యక్తికి బృహస్పతి, అర్జునుడు, భీష్ముడు - ఈ ముగ్గురితో అభేదం చెప్పబడింది. కాకపోతే ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో సమానం అని చెప్పారు. కనుక ఇది ఉల్లేఖాలంకారము.


ఉదా:- (అప్పకవీయం, రచన: అప్పకవి)
తిరమగు త్రిప్రాసము సుం
దరమగు మురవైరిరూపు తరుణులకు మనో
హరమగు, దానవులకు భీ
కరమగు, 'దపసులకూ ముక్తికరమగునవనిన్

"మురవైరి (కృష్ణుడి) రూపము స్త్రీలకు మనసు దోచుకునే విధంగా, దానవులకు భయం కలిగించే విధంగా, తాపసులకు ముక్తి మార్గంగా గోచరిస్తోంది" అని భావం. కృష్ణుడికి ఉన్న ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యక్షమవుతోంది అని చెప్పటంతో ఇది ఉల్లేఖనాలంకారం అయ్యింది.

ఉదా:- (శ్రీమద్భాగవతం, రచన: పోతన)
రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుఁదా బ్రహ్మాండమున్ నిండుచోన్

వామనావతారఘట్టంలోని ఈ పద్యం బహుశః అందరికీ తెలిసిన ఉదాహరణ. పోతనామాత్యుడి ఊహాశక్తికి నిదర్శనం. వామనుడు తన శరీదైర్ఘ్యాన్ని పెంచుకుంటూపోతుంటే అతని పక్కన ఉన్న సూర్యుడు చిన్నవాడైపోతున్నట్టుగా అనిపిస్తోందని కవి భావం.

బ్రహ్మచారికి పట్టిన గొడుగుగా, అతడి తల మీద ధరించిన రత్నంగా, చెవుల కుండలాలుగా, మెడలో నగగా, భుజాలపై బంగారు కేయూరంగా, మణికట్టుపైన కంకణంగా, నడుముకు కట్టిన గంటగా, కాలికి ఉంచిన పట్టీలుగా, చివరికి వటుని పాదాలకు పీటగా అనిపిస్తున్నాడుట సూర్యుడు. అంటే పోల్చి చూస్తుంటే వటుడి పరిమాణం పెద్దదైపోతోంది, సూర్యుడు చిన్నవాడైపోయి శిరస్సు పైనుండి, పాదాలకు చేరినట్టనిపిస్తోంది - అని కవి భావం. కవితావస్తువు సూర్యబింబం - ఒక్కో తరుణంలో ఒక్కోలాగా కనిపించడం ఉల్లేఖాలంకారానికి ఆధారమైంది.

ఉదా:- (పాట: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ముక్కుపుడక లాగ, చెవులకు చుట్టూ ఝూక లాగ, చేతికి రంగులగాజుల్లాగా, కాలికి మువ్వలపట్టీ లాగా, మెడలో పచ్చని పతకం లాగా ఉండిపోవే వానచినుక

చినుకును వేర్వేరు వస్తువులతో సమంగా పోల్చడం ద్వారా కవి ఉల్లేఖాలంకారాన్ని ప్రయోగించారు.