Monday, November 8, 2010

ఉల్లేఖాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉల్లేఖాలంకారము


సూత్రం: బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే
అర్థం: ఒకే వస్తువు పలువురికి పలు విధములుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది.

ఉదా:- (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనోబాణుడని స్త్రీలు, నరసిమ్హరాయలును తలంచెదరు

ఇక్కడ కవితావస్తువు ఒకటే - నరసిమ్హరాయులు. ఆయన కవులకు బాణుడిగా, రాజులకు మురారిగా, స్త్రీలకు మన్మథుడిగా కనిపిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కవి ఒకే వ్యక్తికి ఎన్నో స్వరూపాలను తెలియజేశాడు. కనుక ఇది ఉల్లేఖాలంకారము. ఇందులోనే శబ్దాలంకారం కూడా ఉంది - బాణుడు అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తోంది - ఇది అనుప్రాస అవుతుందని నా నమ్మకం.


ఒకే వస్తువుకు వేర్వేరు గుణాలను బట్టి వేర్వేరు వస్తువులకు అభేదాన్ని తెలుపడం కూడా ఉల్లేఖాలంకారమే.

ఉదా:- (చంద్రాలోకం)
అతడు వ్యక్తిత్వమందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడు

ఇక్కడ ఒకే వ్యక్తికి బృహస్పతి, అర్జునుడు, భీష్ముడు - ఈ ముగ్గురితో అభేదం చెప్పబడింది. కాకపోతే ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో సమానం అని చెప్పారు. కనుక ఇది ఉల్లేఖాలంకారము.


ఉదా:- (అప్పకవీయం, రచన: అప్పకవి)
తిరమగు త్రిప్రాసము సుం
దరమగు మురవైరిరూపు తరుణులకు మనో
హరమగు, దానవులకు భీ
కరమగు, 'దపసులకూ ముక్తికరమగునవనిన్

"మురవైరి (కృష్ణుడి) రూపము స్త్రీలకు మనసు దోచుకునే విధంగా, దానవులకు భయం కలిగించే విధంగా, తాపసులకు ముక్తి మార్గంగా గోచరిస్తోంది" అని భావం. కృష్ణుడికి ఉన్న ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యక్షమవుతోంది అని చెప్పటంతో ఇది ఉల్లేఖనాలంకారం అయ్యింది.

ఉదా:- (శ్రీమద్భాగవతం, రచన: పోతన)
రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుఁదా బ్రహ్మాండమున్ నిండుచోన్

వామనావతారఘట్టంలోని ఈ పద్యం బహుశః అందరికీ తెలిసిన ఉదాహరణ. పోతనామాత్యుడి ఊహాశక్తికి నిదర్శనం. వామనుడు తన శరీదైర్ఘ్యాన్ని పెంచుకుంటూపోతుంటే అతని పక్కన ఉన్న సూర్యుడు చిన్నవాడైపోతున్నట్టుగా అనిపిస్తోందని కవి భావం.

బ్రహ్మచారికి పట్టిన గొడుగుగా, అతడి తల మీద ధరించిన రత్నంగా, చెవుల కుండలాలుగా, మెడలో నగగా, భుజాలపై బంగారు కేయూరంగా, మణికట్టుపైన కంకణంగా, నడుముకు కట్టిన గంటగా, కాలికి ఉంచిన పట్టీలుగా, చివరికి వటుని పాదాలకు పీటగా అనిపిస్తున్నాడుట సూర్యుడు. అంటే పోల్చి చూస్తుంటే వటుడి పరిమాణం పెద్దదైపోతోంది, సూర్యుడు చిన్నవాడైపోయి శిరస్సు పైనుండి, పాదాలకు చేరినట్టనిపిస్తోంది - అని కవి భావం. కవితావస్తువు సూర్యబింబం - ఒక్కో తరుణంలో ఒక్కోలాగా కనిపించడం ఉల్లేఖాలంకారానికి ఆధారమైంది.

ఉదా:- (పాట: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ముక్కుపుడక లాగ, చెవులకు చుట్టూ ఝూక లాగ, చేతికి రంగులగాజుల్లాగా, కాలికి మువ్వలపట్టీ లాగా, మెడలో పచ్చని పతకం లాగా ఉండిపోవే వానచినుక

చినుకును వేర్వేరు వస్తువులతో సమంగా పోల్చడం ద్వారా కవి ఉల్లేఖాలంకారాన్ని ప్రయోగించారు.

Sunday, November 7, 2010

కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి (జొన్నవిత్తుల రచన)

"దేవి" చిత్రం తో దేవిశ్రీప్రసాద్ చలనచిత్రసంగీతరంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రం అంటే ఏ సంగీతదర్శకుడైనా చాలా కష్టపడి మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఉదాహరణకి ఇప్పటికీ రోజ వంటి అద్భుతమైన పాటలను మళ్ళీ రెహ్మాన్ చెయ్యనేలేదు అనే వారున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంతో ఉత్సాహంగా కనబడి నేటి తరం యువకుడు లాగా కనబడే ఈయన, ఎంతో పొందికైన, శ్రావ్యమైన గీతాలని ఈ చిత్రానికి అందించారు. పాటల మధ్యలో వేణువు (ఈ పాట), వీణ (తొట్టిగ్యాంగ్ చిత్రంలో "నువ్వే కావాలి" అనే పాట), సన్నాయి (ఆనందం చిత్రంలో "చికిచికిచం") వంటి సంప్రదాయవాయిద్యాలను వాడటంలో ఈయన సిద్ధహస్తుడు. ఈ పాట బాణీ చక్కని తెలుగుదనంతో ఉంటుంది.

జొన్నవిత్తులకి అపారమైన లాఘవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం. దేవుడు, దేవి మొదలైన చిత్రాలలో ఆయన అందించిన సాహిత్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అచ్చతెలుగు పదాలను వాడి అందరినీ మెప్పిస్తారు. ఈ పాటతో సరసగీతాలలో ఆయనకు ఉన్న పట్టుని ప్రదర్శించారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చును.


చిత్రం: దేవి
రచన: జొన్నవిత్తుల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
పాడింది: చిత్ర, బాలు
సంగీతం: దేవిశ్రీప్రసాద్

కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమిబంగరు  చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి

ఇక్కడ గమనించవలసినది యతినియమాన్ని - కుంకుమ, కులికే; మేలిమి మెరిసే - పల్లవిని పాడుకోవడానికి హాయిగా మలచాయి. కుంకుమపూలతోట, మేలిమిబంగరు చీర వంటి పదాలు తెలుగుపాటల్లో వినిపించడం చాలా అరుదు. అవకాశం దక్కినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు జొన్నవిత్తుల. "మరాళి" అంటే హంస అనే అర్థం ఉంది. తన గుండెకొలనులో సంచరించే హంసగా, మల్లెల తావిని నింపుకున్న గాలిగా తన ప్రేయసిని వర్ణించడం చక్కగా కుదిరింది.

శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి

"శంఖములూదిన ప్రేమ" అనేది గొప్ప ప్రయోగం. శంఖారావం విన్నప్పటికి మల్లే, ప్రేమ మనసును తట్టగానే గుండె ఝల్లుమంటోంది అనే లోతైన భావాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు కవి. "సమాళించడం"అంటే అనుకూలంగా చేర్చడం - ఈ పదం కూడా చలనచిత్రగీతాల్లో విన్నది తక్కువే! చంద్రకాంతిని వెతికే చకోరంగా తనను, యవ్వనమనే వనానికి కాపరి గా ప్రియుణ్ణి సంబోధించడం కూడా చాలా నవ్యంగా ఉంది.

మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం 

తామరమొగ్గ, కాముని సవాసం -శృంగారానికి కూడా ఎంతో సాత్వికతను అలది చెప్పగలిగారు కవి.

హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం

"చ్చ" తో అనుప్రాస కలిపడం ఒక ఎత్తైతే, "హెచ్చెను హేమంతం" అనడంతో "హె"-కు యతి కలిసింది - అలాగే హేమంతానికి ఉత్సాహం కలిగింది అనే కొంగొత్త ప్రయోగం కుదిరింది.

ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా

"విరిసిన పరువాల పిలిచెను మధుబాల" -- స్త్రీని విరిసిన పువ్వుతో పోల్చడం గతంలో చాలా పాటల్లో జరిగినా ఇది కొత్త మాటలతో వినూత్నంగా ఉంది. ఆ వాక్యానికి "వేసే పూబంధాలు" అంటూ మరింత సౌందర్యాన్ని అలిదారు కవి.

అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం

పుష్యమి నక్షత్రం అనడంలో కవి ఆంతర్యం పరిపూర్ణంగా అర్థం కాకపోయినా -- పుష్యం అంటే ఒక నవరత్నాలలో ఒకటి. "ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చిన తాంబూలం ఆమె చెక్కిలిపై పుష్యంగా చేరి నక్షత్రం వలే మెరుస్తోంది" అన్నది కవి భావమనిపిస్తోంది. ఇక్కడ కూడా జొన్నవిత్తుల వారు వేటూరిని తలపించారు. నక్షత్రాలను, తిథులను పాటల్లోకి తీసుకురావడం ఇదివరకు వేటూరి చాలా సార్లు చేశారు. (ఉదా:- కొండవీటి రాజ చిత్రంలో "గన్నవరం సిద్ధాంతి అన్నారు - వలపుల్లో వర్జ్యాలు ఉండబోవని").అలాగే, ఒక ప్రయోగానికి రెండుమూడు భావాలు కుదిరేలాగా వ్రాయగలగడం కూడా వేటూరి పాటల్లో రివాజు.

ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం

ఇది నా చేత, "ఆహా" అనిపించిన వాక్యం. "పంచదారవిల్లు" (అంటే "చెరుకువిల్లు", మన్మథుడి విల్లు) చేసిన గాయం అంటే ప్రేమ పెట్టిన తొందర - ఎంత కొత్తగా చెప్పారు కవి! ఆ విల్లు వదిలిన బాణం తగలకపోతే వయసు మోమాటం తీరదుట - మహాచిలిపిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది.

నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి

"రసమయరహదారి" (ప్రేమరసం నిండిన త్రోవ) - ఇటువంటి మాటను నేను తెలుగుపాటల్లో వినలేదు. అదొకటే కాక "శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి" అనడంలో ఎంతో శృంగారం నిక్షిప్తం చేశాడు కవి.

మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై...

నింగీనేలా ఏలే రాగాలు అంటే సాయంసంధ్య గా నాకు అర్థమయ్యింది. అంటే సందెవేళలో ప్రేయసీప్రియులు ఏకమై ప్రేమభావంలో పొంగిపోతున్నారు...అని.