Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

Sunday, September 2, 2012

రాంబాబు కథలు - అసలు కంటే వడ్డీ ముద్దు

ఒక రోజు పొద్దున్నే రాంబాబు & కో మధ్య సంభాషణలు.

వెం: ఆకలేస్తోందిరా. ఏమైనా తినడానికి ఉందా?
రాం: వెళ్ళి వంటింట్లో వెతుక్కో.
వెం: ఇక్కడ biscuit packet ఉంది? ఎప్పటిది?
రాం: అది తినకు, ఎప్పుడో పరమపదించింది.
వెం: (packet పై label చదువుతూ) ఇది September 1st న manufacture ఐందిరా. Best before 2 weeks of manufacture. ఫరవాలేదు.

(వెంకట్ packet తెరిచి ఒక biscuit ముక్క తిన్నాడు. తింటూనే గొంతులో మండినట్టైంది, ఒక రకమైన చేదు నాలికని ముంచేసింది.)

వెం: యక్క్...ఏమిటిరా ఇది? ఇంత దారుణంగా ఉంది?
రాం: బ్రహ్మచారుల ఇళ్ళలో manufacture date చూసినప్పుడు year కూడా చూసుకుంటూ ఉండాలి బాబు. నేను ముందే చెప్పాను. అందుకే...మంచి మనిషికొక మాట, మంచి కుక్కకొక biscuit అన్నారు. నీకు మాట పని చెయ్యలేదు కానీ biscuit పని చేసింది.

(ఇంతలో వెంకట్ లేచాడు.)

చం: Good Morning
రాం: ఆ నీకు శుభోదయం, వీడికి అశుభోదరం.

(చందు phone మ్రోగింది. phone ఎత్తాడు.)

చం: ఏంటి పెద్దమ్మ, ఎలాగున్నావు?
...
చం: ఆవేశపడకు, అసలేం జరిగిందో చెప్పు.
...
చం: నేను అన్నయ్యలతో మాట్లాడతానులే.


(చందు phone cut చేసి, వేఱొక number నొక్కి మాట్లాడసాగాడు).


చం: ఆ, అన్నయ్య. ఇప్పుడే పెద్దమ్మ phone చేసింది. అసలు విషయమేమిటి?
...

(చందు వేఱే గదిలోకి వెళ్ళి చాలా సేపటికి phone పెట్టేసి బయటకు వచ్చాడు. రాంబాబు, వెంకట్ ఏమైందా అని కంగారు పడ్డారు.)


వెం: ఏరా, ఏమైంది?

(దానికి చందు పకలబడి ఒక ఐదు నిముషాల పాటు నవ్వాడు. వెంకట్, రాంబాబులకు ఏమీ అర్థం కాలేదు. విషయం ఏమిటో చెప్పమన్నా చెప్పట్లేదు.)

వెం: అన్నట్టు ఇందాక మా danger బాబాయ్ phone చేసాడు రా. పిసినారు మాష్టారు గారి అమ్మాయి నాకు వద్దని చెప్పేసాను కదా, నాకు తెలిసిన software engineer లు ఎవరైనా ఉంటే సంబంధం చెప్పమన్నాడు. నీ పేరు ప్రతిపాదిస్తున్నాను.

(చందు ముఖం ఉన్నట్టుండి ఎఱ్ఱగా అయిపోయింది.)

చం: రేయ్, ఎంత పని చేసావు రా? నిన్ను friend అని ఆదరించినందుకు నాకు
...
వెం: వోల్డేయ్! అదేమీ జరగలేదు. ఇప్పుడు చెప్పు -- అసలా phone లు ఏంటి, నీ నవ్వేమిటి?
చం: "అసలు కంటే వడ్డీ ముద్దు" అనే సామెత మనవల గురించి చెప్తూ ఉంటారు కదా?
రాం, వెం: ఊఁ
చం: ఇప్పుడు మన bank లకు మల్లే వడ్డీలు ఆట్టే బాగుండట్లేదు. మా పెద్దమ్మ మనవలు, మనవరాళ్ళు ఆవిడకు నచ్చట్లేదు. అదే గగ్గోలు పెడుతోంది.
రాం: ఇంకొంచెం వివరింపుము.
చం: మా పెద్దమ్మకు నలుగురు కొడుకులు. నలుగురూ నాలుగు ఊళ్ళల్లో ఉన్నారు. ఆవిడకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడకు వెళ్ళి వస్తూ ఉంటుంది. కొడుకులందరూ ఆవిణ్ణి బాగా చూసుకుంటారు. ఈ మధ్యన మా పెద్దమ్మ హైదరాబాదులో ఉన్న రెండో కొడుకు ఇంటికి వెళ్ళింది. అదే సుందరన్నయ్య అని చెప్తాను అతను. సుందరన్నయ్య కి పదేళ్ళ కూతురుంది. దాని పేరు  సౌమ్య.

ఒక రోజు తఱగతిలో అందరూ తమ తమ తాత గురించి చెప్పుకుంటున్నారు. సౌమ్య ఏమో అసలు మా పెదనాన్నను చూడనే లేదు. అది పుట్టక మునుపే ఆయన కాలం చేసారు. కానీ తోటి పిల్లల మాటలు విని ఈమెకు బాధేసింది. చాలా ఉక్రోషంతో ఇంటికి వచ్చి అన్నయ్యతో "నాన్న, నువ్వు తాతను నాకు ఎందుకు చూపించలేదు?", అని నిలదీసింది. వాళ్ళ తను నవ్వుతూ, "నువ్వు పుట్టక ముందే తాతగారు చనిపోయారమ్మా",  అన్నాడు. ఆమె ముఖం దిగులుగా మారిపోయింది. కాస్త ఉత్సాహపరుద్దామని, "బాధపడకమ్మా, నువ్వే మా నాన్నవి, తాతే మళ్ళీ నువ్వై పుట్టావు", అన్నాడు. అదే అన్నయ్య చేసిన పాపం. వెంటనే సౌమ్య చెలరేగిపోయింది. వాళ్ళ అమ్మను, నాన్నను పేరు పెట్టి పిలవడం మొదలెట్టేసింది. తిడితే ఏడుస్తుంది అని ఊరుకున్నారు.

అది జరిగిన వారానికి మా పెద్దమ్మ పెద్దన్నయ్య ఇంటినుండి సుందరన్నయ్య దగ్గరకు వచ్చింది. ఆవిడ వస్తూనే సౌమ్య ఆవిణ్ణి పేరుతో పిలిచి, "కాస్త కాఫీ పట్రా" అంది. పెద్దమ్మ నివ్వెరపోయింది. "ఏఁవిటే గుంట, నీ ఆగడం", అంది. దానికి "ఇదిగో, నన్ను గుంట, తుంట అన్నావంటే దెబ్బలు పడతాయి. నన్ను ఏఁవండీ అని పిలవాలి" అంది. పెద్దమ్మకు ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఇంతలో అన్నయ్య వచ్చి జరిగిన విషయం చెప్పి, "అమ్మా, రెండు రోజులు ఊరుకుంటే విషయం సర్దుమణుగుతుందిలేవే", అన్నాడు.

అక్కడితో కథ ముగిసింది అనుకున్నాడు కానీ అసలు సంగతి మరిచిపోయాడు. మా పెదనాన్న form లో ఉండగా మా పెద్దమ్మను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకని మా పెద్దమ్మకు ఆయనంటే గొప్ప చిఱాకు. సౌమ్యకు మా పెదనాన్న పోలికలు కొన్ని వచ్చాయి. వెరసి, చంద్రముఖి రజినీకాంత్ నే రాజు అనుకున్నట్టు మా పెద్దమ్మ నిజంగానే సౌమ్య మా పెదనాన్న అని sub-conscious గా ముద్ర వేసేసుకుంది.  పెదనాన్న మీద ఉన్న కక్షంతా ఈ చిన్నపిల్ల మీద చూపించడం మొదలెట్టింది. అది తాగే పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేయడం, కోడలు అడిగితే "చిక్కటి పాలు తాగితే అజీర్తి చేస్తుంది", అనడం. అన్నంలో పెరుగనేసరికి  చకచకా మజ్జిగ గిలక్కొట్టేయడం, కోడలు అడిగితే "మజ్జిగ అరుగుదలకు మంచిది", అనడం.  పాప పడుకుంటే fan కట్టేయడం, కోడలడిగితే బుగ్గలు నొక్కుకుంటూ, "ఓసినీ, అంత పెద్ద మంచం మీద పిట్టంత ఉంటే దిండనుకున్నాను", అనడం. చదువు చెప్తాను అని పద్నాల్గు పన్నెండ్లగడం -- చెప్పకపోతే మొట్టేసి, "నీకు దెబ్బలు పడాలి", అనడం. ఒక రోజు ఏం జరిగిందంటే...

<ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్...>

పెద్దమ్మ: ఈ రోజు నక్షత్రం ప్రకారం మీ నాన్న గారి పుట్టినరోజు రా అబ్బాయ్, ఈ చంటిదానికి తలంటు పోసుకుని సంతోషించనివ్వరా.

(వదిన వద్దు అని చెప్పమని అన్నయ్యకు సైగ చేసింది, కానీ అప్పటికే అన్నయ్య కళ్ళల్లో నీళ్ళు municipality గొట్టంలో లాగా చుక్కలు చుక్కలుగా కారుతున్నాయి. గొంతైతే ఆ కుళాయిలో నీళ్ళొచ్చే ముందు లాగా గాలి వస్తోంది
కానీ మాట రావట్లేదు. అప్పటికీ మా వదిన ఆపుదామని ప్రయత్నించింది.)


వదిన: అత్తయ్య గారు, ఎవరైనా English calendar ప్రకారం చేసుకుంటారు, లేకపోతే తిథుల ప్రకారం చేసుకుంటారు, నక్షత్రాల ప్రకారం ఏమిటండి? పైగా ఇది అధిక మాసం కూడాను!
పెద్దమ్మ: నెల తక్కువ వాళ్ళకు అధికమాసంలోనే పుట్టినరోజు చేస్తారని మీ మావయ్య గారు ఎప్పుడూ అధికమాసంలోనే చేసుకుంటూ ఉండేవారులే తల్లీ. ఐనా మా వైపు ఆచారాలు నీకు తెలియవు.
వదిన: అమ్మాయికి జలుబుగా ఉందండి. ఇప్పుడు ఎందుకు?
పెద్దమ్మ: అంతేలే అమ్మా, ఎంతైనా కూతురు లేదనే కదా నీకు నేనంటే లోకువ? మీ మావగారు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పినా అదేమిటో మాయదారి దేవుడు ఒక్క ఆడ నలుసును కూడా ఇవ్వలేదు.

(అంటూ కంట తడి పెట్టుకుంది. ఇది చూసి ఓర్చుకోలేక మా అన్నయ్య...)

అన్నయ్య: అమ్మా, నువ్వు సౌమ్యకు స్నానం చేయించాలి. అలా చేయిస్తేనే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది.

(పది నిముషాలు తిరిగేసరికి సౌమ్య కళ్ళు మంట, జుట్టంతా చిక్కులు. ఆరున్నర శ్రుతిలో ఏడుస్తుంటే వదిన అన్నయ్య దగ్గరకు తీసుకొచ్చి...)

వదిన: మీ నాన్న గారు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. కాస్త ఓర్దార్చండి.

(అన్నయ్య వదిన దగ్గర తువ్వాలు తీసుకుని సౌమ్యని దగ్గరకు తీసుకుని ఆ తువ్వాలు తలపై వేసి చెవులు నొక్కి పట్టుకుని...)

అన్నయ్య: పిచ్చి మొహమా...మా నాన్న సౌమ్య అవ్వడం ఏమిటే వెఱ్ఱిబాగుల్దానా. నువ్వు దీన్ని ఎనిమిదో నెల కడుపుతో ఉండగా మా నాన్న స్వర్గస్థులయ్యారు. అప్పటికే ఇది నీ కడుపులో comfortable గా దొర్లుతూ ఉండటం నా కళ్ళతో sonogram లో చూసాను. కి..కి..కి. నేను అబద్ధం ఆడితే నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న నీకే
తెలియలేదు. అలాగ ఉండాలి అబద్ధం అంటే...
వదిన: అవునా...మరి మీ నాన్న గారి నక్షత్ర-పుట్టినరోజుకు దీనికి తలంటు పోస్తానంటే ఎందుకు ఒప్పుకున్నట్టో? మీ అబద్ధాలు మిమ్మల్ని కూడా నమ్మించేస్తున్నాయి కాబోలు.

(అన్నయ్య తెల్లబోయి చూస్తూ ఉండగా సౌమ్య శ్రుతి పెంచి ఏడవడం మొదలెట్టింది...)

సౌమ్య: నాన్న -- నాకు వినబడటం లేదు. నా చెవులకు ఏదో ఐంది...
అన్నయ్య: బంగారం, ఏఁవీ కాలేదు నాన్న, ఆగు.

(అంటూ తల తుడవడం మొదలెట్టాడు. ఇంతలో పెద్దమ్మ గది బయటనుండి...)

పెద్దమ్మ: ఒరేయ్ నాన్న, మీ నాన్న గారికి ఇష్టమని జీడిపప్పు గారెలు చేసాను రా. అల్లప్పచ్చడి కూడాను.
వదిన: జీడిపప్పు గారెలా? అదేమిటండి?
అన్నయ్య: మా అమ్మకు గారెలంటే పిచ్చి, మా నాన్నకు మందులో నంజుకోవడానికి వేయించిన జీడిపప్పు అంటే ఇష్టం. పుణ్యం పురుషార్థం కలిసొస్తాయని మా అమ్మ ఈ కొత్త వంటకం కనిపెట్టింది. మా గొప్ప రుచిగా ఉంటుంది అనుకో. ఇప్పటికీ మా నాన్నకు తద్దినం పెట్టడానికి వచ్చిన బ్రాహ్మలు "మీ చేత్తో వడ్డించిన గారెలే గారెలండి!" అంటూ ఉంటారు.
పెద్దమ్మ: ఏరా, వస్తున్నారా?

(భోజనాల బల్లమీద అందరూ కూర్చుంటుంటే)

పెద్దమ్మ: అమ్మాయ్, నువ్వు నేను తఱువాత కూర్చుందాము. అదేమిటో వడ్డిస్తూ తిన్నా, ఒక్కదానినీ తిన్నా నాకు వంటపట్టదు.

(వదిన అమాయకంగా తల ఊపుతూ లేచింది).

అన్నయ్య (లొట్టలేస్తూ): అబ్బా, గొప్ప కారంగా కుదిరాయే. సెగొచ్చేస్తోంది నోట్లోంచి.


(ఇంతలో సౌమ్య మళ్ళీ ఏడవడం మొదలెట్టింది...)

అన్నయ్య: ఏమైంది బంగారం?
వదిన: మీ బంగారానికి కారమెక్కువైంది. ఆగండి, పంచదార తెస్తాను.
పెద్దమ్మ (సౌమ్యతో): అదేమిటండి? ఒకప్పుడు ఇవి లొట్టలేసుకుంటూ తినేవారు. ఇప్పుడెందుకు కారమంటున్నరు?
వదిన: ఆఁ, అప్పట్లో పక్కన తీర్థముండేది. ఇప్పుడు ప్రసాదం ఒక్కటీ తింటుంటే ఎక్కట్లేదు.

(అన్నయ్య, సౌమ్య తిని లేచి వేఱే గదిలో కూర్చున్నారు)

అన్నయ్య: బంగారం, నీకొక surprise.
సౌమ్య: నాకు surprise వద్దు. బామ్మతో sorry చెప్పించు. నాకు కోపం తెప్పిస్తోంది.
అన్నయ్య: బామ్మ మనందరి కంటే పెద్దది కదా, sorry చెప్పకూడదు. అందుకే నీకు chocolate తెచ్చాను. ఇదిగో!

(సౌమ్య ఒక చేత్తో chocolate తీసుకుని, మఱొక చెయ్యి చాపింది. అన్నయ్య చెయ్యి తట్టబోతే, చెయ్యి పక్కకు జరిపి మళ్ళీ చాపింది...)

అన్నయ్య: chocolate ఇచ్చాను కదా?
సౌమ్య: రెండు కావాలి.
అన్నయ్య: అమ్మ మీద నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటే కదా ఇచ్చేది?
సౌమ్య: అది మా అమ్మ కోపం తెప్పిస్తే. ఇప్పుడు మీ అమ్మ కోపం తెప్పిస్తోంది.

(అన్నయ్య నివ్వెరపోయి రెండొ chocolate ఇచ్చాడు. వెంటనే పక్కనే ఇంకో చెయ్యి చాపి ఉంది. చూస్తే అది మా వదినది.)

వదిన: నాకోటి ఇవ్వండి.
అన్నయ్య: ఎందుకు?
వదిన: ఆఁ, మీ అమ్మ గారు నాకూ కోపం తెప్పించారు.
అన్నయ్య: అబ్బా, ఆశ, దోస...సౌమ్యకు, నీకూ ఒకందుకే కోపం వచ్చింది. నాకు మాత్రం మూడు chocolateలు ఖర్చా?
వదిన: నాకు వేఱేగా కోపం తెప్పించారు.

(అన్నయ్య ముఖంలో ప్రశ్నార్థకం చూసి వీళ్ళు వచ్చేసిన తఱువాత భోజనాల బల్ల దగ్గర జరిగిన విషయం చెప్పింది...)


<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

పెద్దమ్మ: అమ్మాయ్, కూర్చో వడ్డించుకుందాము. ఇప్పటికే పదకొండైంది. మళ్ళీ నువ్వు మధ్యాహ్నానికో రెండు పప్పు గింజలు, నాలుగు బియ్యపు గింజలూ cooker లో పడేసి, కాసిని కూర ముక్కలు వేయించాలి, ఇంత చారో పులుసో కాయాలి. నేనూ రెండు గారెలు తిని కాస్త సాయం చేస్తాను. ఎలాగా నూనె పొయ్యి మీదనే ఉంది కాబట్టి అప్పడాలూ, ఒడియాలూ వేయిస్తాను.
వదిన: అలాగేనండి
పెద్దమ్మ:  అన్నట్టు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి కొట్టిన కొబ్బరికాయ పచ్చడి చేసేయమ్మాయ్, లెకపోతే పాడైపోతుంది. అన్నట్టు ఈవేళ శనివారం కదా. రాత్రి నేను tiffin ఏ తింటాను. అందులో ఈ పచ్చడి నంజుంకుని తింటే సరిపోతుంది.
వదిన: అలాగేనండి. రాత్రి మీకు వేఱుగా కాస్త ఉప్పుపిండి వండుతాను.
పెద్దమ్మ: అదేమిటమ్మాయి? నాకేమైనా చక్కెరవ్యాధా, గుండెపోటా? పెసలు నానబోసి చక్కగా నాలుగు పెసరట్లు పొయ్యి. సన్నగా తరిగిన మిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు కూడా దట్టించావనుకో ఆ రుచే వేఱు.

(వింటూనే వదినకి తల తిరిగింది. పెద్దమ్మ రెండంటే రెండే గారెలు తీసి వదిన పళ్ళెంలో వేసింది. వదిన ఆశ్చర్యంగా చూస్తూ...)

వదిన: అదేమిటండి మీరు పదహారు గారెలుకు కదా పిండి కలిపింది?
పెద్దమ్మ: అవునమ్మాయ్, రుచి కోసమని ఓ నాలుగు నోట్లో పడేసుకున్నాను. అదేమిటో ఉప్పు తక్కువైంది అని, కారం తక్కువైంది అని, రెండూ సరిపోతే జీడిపప్పు చాలక, అన్ని సార్లు రుచి చూడాల్సొచ్చింది. అది కాక అబ్బాయ్ ఒక అరడజను తిన్నాడు. వెఱ్ఱి నాగన్న! మంచి తిండి తిని చాలా రోజులైనట్టుంది. గుంటది రెండు తింది, మిగిలిన నాలుగూ నీకు రెండు, నాకు రెండు వేసాను. నీకు చాలకపోతే చెప్పు, ఒక సగం గారె అటేస్తాను.

వదిన: వద్దులేండి.

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

వదిన: అది కూడా సహించానండి. కాకపోతే తింటున్నంత సేపూ మీ నాన్న గారి వలన ఆవిడ అనుభవించిన కష్టాలన్నీ చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. పోయినాయన్ని పట్టుకుని, "అసలు మనిషేనా", అని అడుగుతుంటే అవుననాలో కాదనాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాను. పోనీ తింటున్నట్టు నటిద్దామా అంటే ఆ రెండు గారెలు ఎంత గిల్లుకొని తిన్నా అరగంట తినగలనా?

(ఈ కంగారు తట్టుకోలేక మా అన్నయ్య ఇక నిజం చెప్పేద్దామనుకున్నాడు. ధైర్యం చిక్కబుచ్చుకుని, పెద్దమ్మకు ఎదురుబడ్డాడు.)

అన్నయ్య: అమ్మా, నేను నీకొక నిజం చెప్పాలి. అది విని నువ్వు నన్ను తిట్టకూడదు, నువ్వు బాధపడకూడదు.
పెద్దమ్మ: మీ నాన్న నిజం దాచి ముప్పు తెచ్చారు, నువ్వు నిజం ఎంత చేదైనది ఐనా సరే, చెప్పరా.
అన్నయ్య: నేనేదో దాన్ని ఊరడించడానికి అలాగ చెప్పానే కానీ అది నాన్న కాదమ్మా.
పెద్దమ్మ: అవునా?
అన్నయ్య: అవునమ్మ.
పెద్దమ్మ: కాదురా, ఇదే మీ నాన్న అని నా అనుమానం. ఆయన కూడా ఇంతే తలంటితే చాలు గుక్కపెట్టి ఏదుస్తూ ఉండేవారు.

అన్నయ్య: అమ్మా, అలాగైతే అన్నయ్య, నేను, తమ్ముళ్ళిద్దరూ కూడా ఏడ్చేవాళ్ళం. అంత మాత్రాన అందరం నాన్నలమైపోతే ఇది జీవితం కాదు అమ్మ, దశావతారం cinema అవుతుంది. ఐనా మగవాడు జన్మాంతరంలో ఆడదానిగా ఎలాగ పుడతాడే?
పెద్దమ్మ: అవునురోయ్!
అన్నయ్య: నిన్న నాన్న నాకు కలలో వచ్చి 'ఒరేయ్ అబ్బాయ్, నువ్వు పొరబడ్డావు.  నేను నీ కడుపున పుట్టలేదు. నీ తమ్ముడు జానకిరాం ఇంట్లో పుట్టానూ' అన్నారే.

(ఆకలిగా ఉండి పాలు తాగుతున్న వదినకి ఈ మాట వింటూనే పొలమారింది...)

పెద్దమ్మ: అవునా! నిజమేలే ఆ వెధవ నాతో మాట్లాడడు కానీ పనిమనిషితో చొంగ కారుస్తూ వాగుతూ ఉంటాడు.
అన్నయ్య: పోనీలేవే అమ్మా, వాడికి ఇంకా ఇప్పుడే మూడో ఏడు వచ్చింది. ఇంకో ఏడాదిలో చొంగ కార్చడం ఆపేస్తాడు. మాటలంటావు...ఆ వచ్చిన అత్త, అమ్మ, న్యాన, అక్క ఎన్ని సార్లు అంటే మాత్రం ఏమౌతుందిలే. ఇంకో రెండేళ్ళాగితే బడిలో చేరిపిస్తారుగా. అప్పుడు మంచి-చెడూ తెలుస్తుంది.
పెద్దమ్మ: మీ బామ్మ కూడా మీ నాన్న గురించి అదే చెప్పింది, "ఉద్యోగం వచ్చి బయట తిరిగితే మంచి-చెడూ తెలుస్తుంది" అని. మీ నాన్నకు ఉన్న మంచి పోయి, చెడు మాత్రం బాగా అబ్బింది.
అన్నయ్య: అమ్మా, పోయినాయిన్ని ఎందుకు తలుచుకోవడం. ఊరుకోవే.
పెద్దమ్మ: అవును, ఇది మీ నాన్న కాకపోతే మరెవరు? కొంపదీసి మీ నాన్నమ్మ కాదు
కదా?

(ఎవరని చెప్తే ఏం తగులుకుంటుందో అని...)

అన్నయ్య: అబ్బె, కాదులేవే. ఇది ఎవరో - అసలు మనకు సంబంధం లేదు.

(ఇంతలో ఆ గదిలోకి నడుచుకుంటూ వచ్చింది సౌమ్య...)

సౌమ్య: నాన్న, నేను ఎవరు నాన్న. నువ్వు మా నాన్నవు కావా? మా class లో అందైర్కీ నువ్వే మా daddy అని చెప్పాను.

మళ్ళీ సౌమ్యకి అనుమానాలన్నీ తీర్చి మామూలు మనిషిని చెయ్యడానికి ఆరు five-star chocolate barలు అవసరమయ్యాయి.

<ట్రుంగ్ ట్రుంగ్ ట్రుంగ్...>

రాం: అంతేలే...పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కష్టాలు వస్తే bar ఏ కదా దిక్కు...ప్చ్...
చం: అదీ కథ. అసలు తాతను చూడలేదు అంటూ మొదలైన కథ చివరకు, తండ్రి తనేనని ఒప్పించాల్సిన పరిస్థితికి వచ్చింది.
వెం: మఱి ఆ తఱువాత ఏమైంది?
చం: హ్మ్....తఱువాత...తఱువాతేమౌతుంది? పెద్దమ్మ బెంగళూరు వచ్చింది...
రాం: హే, మాయ ఓ మాయ...ఈ life అంటే మాయ...
చం: వెటకారం వద్దు. ఇప్పుడు సమస్య కొత్త మలుపు తిరిగింది.
వెం: ఏమైంది? కొంపదీసి ఆవిడ ఇప్పుదు మన ఇంటికి వస్తున్నారా?

బెంగుళూరులో మా మూడో అన్నయ్య జానకిరాం ఉన్నాడు. వాడి ఇంటికి వచ్చింది. వాడి రెండేళ్ళ కొడుకు ఏం చేసినా అది మా పెదనాన్న అలవాటేనని అంటోందిట. అది సరే, ఈ రోజు వాడు మా సుందర్ అన్నయ్యతో మాట్లాడదామని skype call చేసాడట. అప్పుడు మఱొక నాటకం జరిగింది.

<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

జానకిరాం: ఒరేయ్ అన్నయ్య, అమ్మతో మాట్లాడతావని చేసాను రా. సౌమ్య ఏది?
సుందర్: అమ్మా, సౌమ్యా రా -- నాన్నమ్మతో మాట్లాడుదుగాని...
సౌమ్య: మరి chocolate ఇస్తావా?
సుందర్ (గొంతు సవరించుకుంటూ): అలాగే.
సౌమ్య (video chat లోకి వచ్చి): నాన్నమ్మ, నన్ను "fourteen twelves are" అడుగు?
పెద్దమ్మ: ఆ అడిగాను, చెప్పు.
సౌమ్య: నాకు తెలియదు. మా text book లో లేదు.

(ఎవ్వరికీ అర్థం కాక చూస్తున్నారు...)

సౌమ్య: దెబ్బలు పడతాయా? హ హ...computer లోంచి కొట్టలేవుగా...

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

చం: అది విని మా పెద్దమ్మకు మళ్ళీ అనుమానం పట్టుకుంది, సౌమ్యే మా పెదనాన్నేమోనని. అందుకే ఇంత పొద్దున్నే నాకు phone చేసి నాకేమనిపిస్తోందో అడిగింది. అది సంగతి.

Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.

Wednesday, January 18, 2012

రాంబాబు కథలు - సుబ్బారావ్ బాబాయ్

(ఉపోద్ఘాతం: రాంబాబు, వెంకట్, చందు బెంగుళూర్లో ఒక ఇంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.)

అది అర్థరాత్రి అమావాస్య. జుట్టు విరబూసుకున్న దెయ్యాలు అన్నీ ఒక చోట చేరాయి. వాళ్ళ పెదాలు నెత్తురు పూసుకున్నట్టు ఎఱ్ఱగా ఉన్నాయి. చుట్టూ చెవులు పగిలిపోయేలాగా కేకలు వినిపిస్తున్నాయి. అంతా చీకటిగా ఉన్నా అక్కడక్కడ అదో రకమైన తెలుపులో వెలుగు, అప్పుడప్పుడు ఎఱ్ఱని కాంతి వచ్చి మాయమైపోతోంది. కొన్ని దెయ్యాలు గుమ్మిగూడి పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాయి. మఱి కొన్ని దెయ్యాలు బాగా బలిసిన మగవాళ్ళని గొంతు మీద కొఱుకుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తోంది. ఇంతలో ఒక దెయ్యం అతడికేసి వచ్చి "అగ్గిపెట్టుందా?" అని అడిగింది. ఉన్నా సరే ఇస్తే, "నా పేరు అగ్ని, జమదగ్ని" అని ముక్కుతో dialogue చెప్పి తనను తగలబెడుతుందేమోనని భయమేసింది. "లేదు" అన్నాడు. ఆ దెయ్యం తనకేసి కోపంగా చూస్తూ మీదకు రాసాగింది. తనకేం చెయ్యాలో తెలియక వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ చీకట్లో ఎన్నో గుహలు దాటుకుంటూ బయటకు వచ్చేసరికి tar road కనిపించింది. ఆశ్చర్యంతో అసలు తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని పైకి చూశాడు. "Capital Pub, M.G. Road" అని ఉంది. ఆ క్రిందనే, కన్నడంలో "క్యాపిటలో పబో, ఎమో. జీ. రోడో", అని కూడా ఉంది. "ఓహో ఇంతసేపూ నేను ఉన్నది పబ్ లోనా" అనుకుంటూండగ వెనకాలనుండి ఒకరు తన భుజం మీద చెయ్యి వేసారు. వెనక్కి తిరిగినవాడు, "కెవ్వ్.....", అని అరిచాడు.

Scene త్రుంచితే రాంబాబు, చందు పరిగెట్టుకుంటూ వెంకట్ గదిలోకి వచ్చారు. అతను మంచం మీద ఒళ్ళంతా తడిసిపోయి, తల అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు. రాంబాబు, "మూర్ఛరోగమేమో, ఇంటి తాళాలు చేతులో పెట్టు", అన్నాడు. చందుకు సమయస్ఫూర్తి ఎక్కువ, "ఇప్పుడు మనం చెయ్యాల్సింది అది కాదు", అని కాస్త వెనక్కి జరిగి front-foot వేసిన తెండుల్కర్ లాగా ముందుకు వచ్చి చాచి వెంకట్ గూబ మీద ఒక్కటిచ్చాడు. అంతే వెంకట్ లేచి కూర్చున్నాడు.

వెం: ఏమైంది?
రాం: నీకు చెప్తే case అవుతుంది. నువ్వు చెప్పు. నీకేమైంది? నీకు మూర్ఛరోగమేమైనా ఉందా?
వెం: లేదు. ఏదో పీడకల వచ్చింది.
చం: అంత భయంకరమైన పీడకల ఏమిటిరా?
వెం: నేను అర్థరాత్రి పబ్ కి వెళ్ళానట. అక్కడ lip-stick పూసుకున్న అమ్మాయిలు, కాన్పుకు దగ్గరైన అబ్బాయిలు మందు కొడుతున్నారు.
రాం: కాన్పుకు దగ్గరైన అబ్బాయిలా?
వెం: అదే నాకూ అర్థం కాలేదు.
చం: Experience ఉన్న engineerలు అనుకుంటాను. పొట్టలు వికసించి ఉంటాయి.  ఐతే ఏమైంది?
వెం: అక్కడ ఒక అమ్మాయిని చూసి దెయ్యం అనుకుని పరిగెట్టుకుంటూ వస్తూంటే అక్కడ....అక్కడ...అక్కడ...
చం: మీ manager ఎదురయ్యాడా?
రాం: ఓహో, మీ manager శకునం వస్తూంటే బయల్దేరావు. దారిలో traffic police పట్టుకుని arrest చేసాడు. అంతేనా? మీ manager పిల్లి కళ్ళు చూసినప్పటినుండే నాకు వాడి శకునం మంచిది కాదని అనుమానం.
వెం: నీ శకునాల గోల ఆపు. ఇది అంతకంటే భయంకరమైనది.
చం: ఒరేయ్ బాబు, నువ్వు ఇంత build-up ఇచ్చి business man cinema లో flash back లాగా ముక్కిపోయిన తొక్కలో కథ చెప్పవు కదా. ఐనా దెయ్యాలు disco చేసుకునే timeలో మాకీ suspense ఏమిటిరా?
వెం: సుబ్బారావ్ బాబాయ్.
రాం: ఆయనెవరు.
వెం: మా ఊళ్ళో ఇంటి పక్కనే ఉండే మా బాబాయ్ నన్ను వెతుక్కుంటూ బెంగుళూరు కూడా వచ్చాడు అని కల.
చం: నా బ్రతుకు, తుబుకు తుబుకు. ఒకడేమో వచ్చీ రాని ఇంగ్లీషుతో, చాదస్తంతో వేపుకు తింటున్నాడు. పోనీలే నువ్వు మామూలోడివే కదా అనుకుంటే TV serial లో లాగా అణాకు ఆఠాణా action చేసి అర్థరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు హడావుడి చేస్తున్నావు.
వెం: అంతేరా. నీకేం తెలుస్తాయి నా కష్టాలు.
చం: నువ్వు గతంలో నక్స్లైట్వా?
వెం: (అనుమానం గా చూస్తూ) కాదు.
చం: ఏమోలే జల్సా cinemaలో పవన్ కళ్యాణ్వి అనుకున్నాను. కాదు కదా. (పక్కనే ఉన్న కొవ్వొత్తిని తీసి వెంకట్ చేతిలో పెట్టి, కళ్ళు పెద్దవి చేసి అణుచుకోలేని ఆవేశంతో ) ఐతే నవరంధ్రాల్లోనూ మైనం కూఱుకుని పడుకో. నన్ను కెలకమాక. (అని గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు)
వెం: (రాంబాబు కేసి జాలిగా చూస్తూ...) నువ్వైనా నా బాధను పంచుకుంటావా?
రాం: (దుష్కుతూహలంతో తన ముఖాన్ని వెంకట్ దగ్గరకీ జరిపి) Does your small-father have cat-eyes? అన్నాడు.

అప్పటికే రాంబాబు ఇంగ్లీషుకు అలవాటు పడిన వెంకట్, small-father అంటే చిన్నాన్న అని గుర్తించి, వేగంగా వస్తున్న బంతిని square-cut కొట్టడం కోసం అన్నట్టు వెనక్కు జరిగి రాంబాబు ముఖానికి తనకు ఎడం ఏర్పరుచుకుని చాచిపెట్టి కొడితే రాంబాబు నోరెళ్ళబెట్టుకుని చూసాడు. వెంటనే చేతిలో ఉన్న కొవ్వొత్తిని రాంబాబు నోట్లో పెట్టి, "మైనం కూరేస్తా" అన్నాడు. రాంబాబు గప్-చుప్ గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రంతా వెంకట్ కి అదే పీడకల మళ్ళీ మళ్ళీ వచ్చింది.

మర్నాడు చందూ coffee తాగుతూ వెంకట్ గదిలోకి వచ్చాడు. వెంకట్ ఇంకా ముందురోజు రాత్రి పీడకలనుండి తేరుకోలేదు అని అర్థమైంది. దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసాడు.

చం: Sorry రా. నిన్న నిద్ర మధ్యలో లేపితే తిక్కలో ఉన్నాను. అసలు మీ బాబయంటే నీకు ఎందుకు అంత భయం. ఆయనకు క్షుద్రపూజలు తెలుసునా? లేక నిన్ను చిన్నప్పుడు పదే పదే కొట్టేవారా? లేక...
వెం: ఇవన్నీ చిన్న చిన్న విషయాలురా. మా బాబాయ్ వీటన్నిటికంటే బలమైన విద్య తెలుసును.
చం: (చూపుడు వేలిని, ఉంగరం వేలిని జతపరచి చేతిని తిప్పుతూ) మర్మకళా?
వెం: కాదు, వర్మ కళ.
చం: అంటే?
వెం: మాట మాటకీ చిఱాకు తెప్పించగలగడం.
రాం: (కొత్త చొక్కా వేసుకుని గదిలోకి వస్తూ) In not more than 300 words or 6 paragraphs, please explain your answer. పక్కన bracketsలో 10 marks.
చం: (రాంబాబుని చూపిస్తూ) మీ బాబాయ్ కూడా వీళ్ళాగే మాట్లాడతారా?
వెం: చాలా తేడా ఉంది. వీడు మాట్లాడితే "వీడు వెధవ" నుండి "వీణ్ణి చంపేయాలి" అనే range లో feelings ఉంటాయి. మా బాబాయ్ మాట్లాడితే, "నేను వెధవిని" నుండి "నన్ను చంపేయండి" అనే rangeలో feelings ఉంటాయి.
రాం: త్రివిక్రంలాగా మంచి quotationతో answer ప్రారంభించావు. రాజమౌళి లాగా మంచి interval bang కూడా ఇవ్వు.
చం: (కళ్ళు పెద్దవి చేసి రాంబాబు కేసి చూసి) అరవ cinema లాగా చివరికి నిన్ను చంపేస్తాడు. సరేనా?
(అని వెంకట్ కేసి చూస్తూ) అలాగేం చేస్తారురా బాబు. చెప్పు.
వెం: ఎక్కడినుండి మొదలెట్టను. ఆఁ

నాకు BITS-Pilani లో seat వచ్చినప్పుడు ఆనందంగా వెళ్ళి, "బాబాయ్, నాకు BITS లో seat వచ్చింది.", అన్నాను. కళ్ళు చిన్నవి చేసి చూసి, "ఏడాదికి ఎంతౌతుందేంటి", అన్నాడు. నేను సందేహిస్తూ చూసి, "డబ్భై వేలౌతుంది", అన్నాను. "ఓరినీ, బాగా చదువుకోవాల్సింది కదరా? మన పక్కింటి పిసినారి మాష్టారు వాళ్ళ అబ్బాయికి మన వీధి చివర engineering college లో free seat వచ్చింది. నీకేమో donation కట్టాల్సొచ్చింది. మీ నాన్నకు చెప్తూనే ఉన్నాను, పండితపుత్రా పరమశుంఠా అంటారు కానీ, పరమశుంఠ కొడుకు కూడా పరమశుంఠే అవుతాడని. విన్నాడు కాదు.", అన్నాడు. (చందు, రాంబాబు జాలిగా చూస్తున్నారు. వెంకట్ కళ్ళు చమర్చాయి.) ఒరేయ్ ఎవరైనా బాగా చదవకపోతే తిట్టచ్చు, పోనీ అపార్థం చేసుకుని నన్ను తిట్టచ్చు, ఒకే దెబ్బతో, నన్ను మా నాన్నని కూడా కలిపి తిట్టగలగడం ఒక్క మా బాబాయ్ కే సాధ్యంరా.
రాం: వెంటనే, "మఱి మీ నాన్న పండితుడా, శుంఠా" అని అడగాల్సింది కదా?
వెం: చాలా తెలివైన ప్రశ్న. మా బాబాయ్ నన్ను, మా నన్ననే తిడితే నేను మా తాతని, తననీ కూడా తిట్టి overall గా మా వంశమే పరమశుంఠల వంశమనాలా?

చం: (వెంకటి భుజాన్ని తడుతూ) పోన్లేరా. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆ తఱువాత నీ గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవడం విని తెలుసుకుని ఉంటారు.
వెం: పిచ్చివాడా. పిల్లకాకికేం తెలుసు హుండేలు దెబ్బ. ఆ తఱువాత వేసవి సెలవలకి మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళబ్బాయి friends వచ్చి ఆడుకుంటున్న సమయంలో నేను బాబాయ్ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో లేడు అని తెలిసి వెనక్కి తిరుగుతుంటే వచ్చాడు. friends అందరూ తింటున్న తాయిలాన్ని కాకొచ్చి ఎత్తుకుపోయినట్టు తెల్లబోయారు. మా బాబాయ్ మొహం ఎఱ్ఱగా ఐంది. పక్కనే నన్ను గమనించాడు.
రాం: వాణ్ణి చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నాడా?
వెం: ప్చ్...(రాంబాబు తల నిమురుతూ) "సరిగ్గా చదువుకోపోతే వాడిలాగా ఎడారుల్లో తిరుగుతూ చదువుకోవాలి. వెధవ ఒంటె మొహాలు, మీరూను.", అన్నాడు.
చం: అమ్మనీ -- ఏం దెబ్బ కొట్టార్రా.

రాం: నీకు gold-medal వచ్చినప్పుడు చూపించాల్సింది కదరా?
వెం: హ హ హ -- You naughty boy. అన్నీ చిలిపౌడియాలే. అదే చేద్దామని నా gold medal నాన్నగారికి కూడా చూపించకుండా ముందు బాబాయ్ దగ్గరకు తీసుకెళ్ళాను. చూపించగానే దాన్ని తీసి అరుగుకేసి గీసి "నిజమైన బంగారమే" అని మురిసిపోయి "నాతో రా", అని cycle మీద ఎక్కించుకుని బయల్దేరాడు.
చం: మీ నాన్నగారి దగ్గరకా?
వెం: అనుకున్నావా? నేనూ అదే అనుకున్నాను. తిన్నగా బంగారం కొట్టుకు తీసుకెళ్ళి, దాన్ని తూకం వేయించి ఎంత పలుకుతుందో అడిగాడు. అక్కడున్న శెట్టిగారు అది చూసి, "యాభై వేలు పలుకుతుంది. ఐనా దీన్ని అమ్ముకోవడం దేనికండి. గొప్పగా దాచుకోవాలి కానీ", అంటే మా బాబాయ్ "అవునులేవయ్యా. ధర తగ్గించడానికి మీ శెట్ట్లు ఇలాగే కొనడం ఇష్టం లేనట్టు మాట్లాడతారు. మావాణ్ణి చదివించడానికి మా అన్నయ్య పొద్దనకా రాత్రనకా కష్టపడి బోళ్ళు డబ్బులు పంపిస్తే మావాడికి ఆ college వాళ్ళు చివరికి ఈ బంగారం ఇచ్చారు. దీని విలువ కనీసం నాలుగు లక్షలుంటుంది. మఱొక మాట లేదు.", అన్నాడు. నాకు ఏఁవీ తోచలేదు. శెట్టికేసి జాలిగా చూసాను. మా బాబాయ్ నన్ను జబ్బ పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, "ఏరా, నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే ఆ college వాళ్ళు నిన్ను మోసం చేసి ఇదిగో పావలా అంత బంగారం ముక్క చేతిలో పెట్టారు. నేను ఏదో ఒక లాగ దీనికి మంచి ధర తెద్దామని శెట్టితో బేరమాడుతుంటే ఆ బిత్తర చూపులేమిటిరా తిరణళ్ళలో తప్పిపోయిన తింగరోడి లాగా?", అన్నాడు. నాకు బుఱ్ఱ పనిచేయలేదు.
రాం: (చందు త్రాగిన coffee glass తీసుకుని, అందులో ఉన్న చెంచా తో గంట కొట్టి) Last 5 minutes. త్వరగా రాయలమ్మా, ఆ కబుర్లేటి? ఏం మీ ఇద్దరినీ debar చెయ్యాలా?
చం: (ఆవదం త్రాగిన ముఖం పెట్టి రాంబాబు కేసి తిరిగి) చొక్కా బాగుందిరా, కొత్తదా?
రాం: హీ...అవును
చం: అంతా బానే ఉంది కానీ కుడిభుజం మీద బల్లి బొమ్మ ఒక్కటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది.
రాం: నేను కొన్నప్పుడు బల్లి బొమ్మ లేదే?
చం: ఐతే నిజం బల్లి అయ్యుంటుంది.
(అది వింటూనే రాంబాబు కంగారు పడుతూ పరిగెట్టుకుని bathroomలోకి వెళ్ళిపోయాడు. చందు ముఖం లో చిఱాకు కాస్తా శాంతంగా మారి వెంటనే జాలైంది. వెంకట్ కేసి చూస్తూ).
చం: ఆ తఱువాత?
వెం: ఏం చేస్తాను. ఏడ్చుకుంటూ ఆ medal పట్టుకుని పరుగెట్టి ఇంటికి పోయాను.
చం: ఆ medal...?
వెం: మా నాన్నతో చెప్పి SBI లో locker తీసుకుని అందులో ఉంచాను. ఎప్పుడు మా బాబయ్ నన్ను చూసిన అది అమ్మెయ్యమనే గొడవ.
చం: భలేవారురా, మీ బాబాయ్. ఇంటి రక్షకుడిని ఈశ్వరుడు కూడా ఆపలేడు అన్నమాట.

వెం: ఏం చెప్పమంటావు? ఎవరైనా Google తో interviews ఐతే ఏమంటారురా?
చం: All the best చెప్తారు.
వెం: మా బాబాయన్న మాటలేంటో తెలుసునా? "నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ ఉద్యోగం నీకు రాకూడదు." (చందు shock అయి చూస్తున్నాడు. వెంకట్ నిట్టూర్చి) ఏం చెప్పమంటార్రా? "Google అంటే ఏమిటి" అన్నాడు. "Search engine", అన్నాను. "Computer లో కనబడతుందా?" అని అడిగాడు. laptopలో google.com తెరిచి చూపించాను. పైకి కిందకు చూసి, "ఒక బొమ్మ, ఒక డబ్బా ఉన్నాయి. వీడికే తిండానికేమీ ఉండి ఉండదు. నీకేం పెడతాడురా? నీ వాలకం చూస్తే వాడు ఉద్యోగమివ్వగానీ సకిలించి మరీ తీసేసుకునేట్టు ఉన్నావు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ ఉద్యోగం నీకు రాకూడదు."  (చందు నిశ్చేష్టుడైపోయాడు.)

ఇంతలో వెంకట్ cell మ్రోగింది. Screen పైన "Danger Babai calling..." అని చూస్తూనే తన గుండె వేగం రెండింతలైంది, చమటలు పట్టడం మొదలైంది. వెంకట్ పక్కనుండి చూస్తూ, "ఎత్తరా. నేను ఉన్నానుగా? భయం దేనికి? పోనీ speaker on చెయ్యి", అన్నాడు. వెంకట్ తన ధైర్యాన్నంతా కూడబెట్టుకుని on చేసాడు.

phoneలో సుబ్బారావ్: ఒరేయ్ వెంకట్ నేను. STD call కనుక ఉభయకుశలోపరి. మొత్తానికి మీ నాన్న చాదస్తం నుండి నీ gold-medal ని విడిపించి శెట్టిగారికి నలభై వేలకి అమ్మేసాను. నీకు అప్పుడు శెట్టి చెప్పిన ధర నచ్చక పిల్లాడి చేతిలోంచి కోతి కొబ్బరి చిప్ప లాక్కున్నట్టు అది లాక్కుని ఇంటికిపోకుండా ఉంటే హీనపక్షం లక్ష వచ్చేది. పోనీలే, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం." (ఇది వింటూనే వెంకట్ phone పరుపు మీద పడేసి గోడకేసి తలకొట్టుకుంటున్నాడు)

"ఇంతకీ మఱొక విషయం. నువ్వు పని చేస్తున్న companyకి పెద్ద పేరు లేదు. ప్రపంచంలో నాలుగే మంచి కంపెనీలు ఉన్నాయట Infosys, TCS, CTS, Wipro. నువ్వు వాటిలో ఏదో ఒక దానికి మారకపోతే పిసినారి మాష్టారు గారి అమ్మాయిని నీకు ఇవ్వమంటున్నారు. అసలే ఆయన పిసినారి. లక్ష కట్నం ఇవ్వడానికి కూడా ఏడ్చేలాగ ఉన్నాడు. నీదా ఒంటె చదువు, ఒంటి డబ్బా company. ఇలాగైతే అది కూడా రావడం కష్టం. ఏదో కొంత కష్టపడి నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని interviewలో చీదేసి వాటిల్లో ఒక దాంట్లో చేరిపో. మిగతావన్నీ నేను ఇక్కడ చూసుకుంటాను."

(ఇంతలో రాంబాబు bathroomలోంచి బయటకు వచ్చి, పంచాంగం తీసుకుని కంగారుగా వెంకట్ గదిలోకి వచ్చి)

రాం: చందు, ఇంట్లో ఆవదం ఉందా? Urgent రా. నేను ఆవదంతో దీపం పెట్టాలి -- లేకపోతే ప్రమాదమని పంచాంగంలో ఉంది. 

phoneలో సు: హలో, ఒరేయ్ సన్నాసి? లేచావా? నిద్రమత్తులో తూగుతున్నావా?

(చందు, వెంకట్ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. చందు phone తీసి షోయబ్ అఖ్తర్ బంతిని విసిరినట్టు గంటకు నూటయాభై మైళ్ళ వేగంతో రాంబాబు పైకి విసిరాడు.)

...

PS: మన ఇళ్ళల్లో పెద్దలు software గురించి ఏవో నాలుగు విషయాలు తెలుసుకుని అవి మనతో చెప్పి తమకు కూడా ఈ విషయాలపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి అని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైన చెప్పబడిన companyల పేర్లు మన పెద్దలందరికీ బాగా తెలుసు కాబట్టి వాటిని ప్రస్తావించడం జరిగింది తప్ప, వేఱే దురభిమానం ఏమీ లేదు. నా సోదరులు ఇద్దరు Infosys, TCS లో పనిచేస్తున్నారు. పాఠకమిత్రులకెవరికైనా అది తప్పుగా గోచరిస్తే క్షమించి, తెలియజేస్తే తొలగించగలను.

Friday, July 29, 2011

కిట్టు కథలు: సంతృప్తి నాకు దిక్సూచి

కిట్టును చూడటానికి తన తండ్రి రాజు, వాళ్ళ స్వగ్రామం నుండి కలకత్తా వచ్చాడు. కిట్టు అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటిదాక వాళ్ళ వ్యవసాయం అంతంత మాత్రంగా నడుస్తుండటం, తండ్రి తన చదువుకోసం అప్పులు చేయడం గమనిస్తూ ఉన్న కిట్టు, ఇప్పటికైనా తన తండ్రికి కాస్త విశ్రాంతి కలిగించాలని, తను అనుభవిస్తున్న సుఖాలను తన తండ్రి కూడా అనుభవించాలని కోరుకున్నాడు. రాజుని ఎంతో అభిమానంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రతి వారం ఏదో ఒక చిత్రానికో, షికారుకో అద్దెగాడీల్లో (taxi) వెళ్ళడం, ఖరీదైన restaurantsలో భోజనం చెయ్యడం మామూలైపోయాయి.

కిట్టు ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడు అని సంతోషించినా, ఖర్చులు కొంచెం మితి మీరుతున్నాయి అని రాజుకు బాధ కలిగింది. సున్నితమైన మాతలతో, "నాకు వద్దు. ఇంట్లోనే ఉండాలని ఉంది.", లాంటి మాటలతో చెప్పినా కిట్టు బలవంతంగా బయటకు తీసుకెళ్ళసాగాడు. ఒక రోజు కిట్టు, రాజు ఒక పెద్ద mall లో pizza center కి వెళ్ళారు. అక్కడ కిట్టు వెళ్ళి ఒక కుఱ్ఱాడికి తన పేరు ఇచ్చి వచ్చాడు. అది జరిగిన పావుగంటకి ఆ కుఱ్ఱాడు కిట్టు పేరు చదవగా, గబగబా తన తండ్రి చేయి పట్టుకుని లోపలకు, ఆ కుఱ్ఱాడు చూపించిన బల్లకు ఇరువైపులా కూర్చున్నారు. కిట్టు జాబితాలో ఉన్న వంటకాలన్నీ రాజుకు వివరిద్దామని చూశాడు. రాజు మాత్రం, "నీకేది నచ్చితే అదే చెప్పరా నాన్న", అని ఊరుకున్నాడు. కిట్టు రెండుమూడు వంటకాలు తెమ్మని చెప్పాడు.

కాసేపటికి ఆ వస్తువులు వచ్చాయి. కిట్టు ఎంతో సంతోషంగా ఒక ముక్క తుంపి రాజు పళ్ళెంలో వేసి తినమన్నాడు. రాజు దాన్ని తిందామని ప్రయత్నించాడే కానీ, అది ఎక్కట్లేదు. అది ఊతప్పానికి, దిబ్బరొట్టెకి మధ్యలో ఉంది కానీ, ఆ రుచి లేదు. కారంగా లేకపోతే రాజుకు రుచించదు. కిట్టును బాధపెట్టడం ఇష్టం లేక ఎంతో కొంత తిన్నాడు. ఇంతలో bill వచ్చింది, కిట్టు ఇంకా తింటూ ఉండటంతో రాజు దాన్ని తెరిచి చూశాడు. అక్షరాలా ఏడు వందల రూపాయలు అయ్యాయి. రాజుకు తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయ్యింది. ముఖం ఎఱ్ఱగా అయ్యింది. కుఱ్ఱదనంలో తానూ బళ్ళ మీద, బట్టల మీదా ఖర్చుపెట్టాడు కానీ, ఇది మరీ ఎక్కువ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా కిట్టుతో పాటు ఇంటికి వచ్చేశాడు. తను నెమ్మదిగా చెప్తే వినట్లేదు అని కాస్త గట్టిగా, "ఏడొందలు పెట్టి కొన్నావు. నాకు అది ఏమీ నచ్చలేదు. ఎందుకురా? నాకు పక్కన hotelలో దొరికే రోటీ, దాల్ తడ్కా నచ్చింది." అన్నాడు. కిట్టు, పిజ్జ కొత్త తరం విషయం అని, యువతకు నచ్చుతోందని, రాజు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చునని నచ్చజెప్పాలని చూశాడు. కిట్టును తను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నాడని గమనించి, రాజు అప్పటికి ఊరుకున్నాడు.

సాయంత్రం ఇద్దరూ coffee తాగుతూ కూర్చున్నారు. రాజు కిట్టు కేసి చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయిరా. మా బాబాయ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడేవాడిని", అన్నాడు . కిట్టు నిట్టూర్చి, "అదేం లేదు నాన్న", అన్నాడు. రాజు, "సరే. మా బాబాయ్ కథ ఒకటి చెప్తాను, వింటావా?", అన్నాడు. కిట్టు ఏంటన్నట్టు చూశాడు.

"నా చిన్నదనంలో మా నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను సాకాడు అని నీకు తెలుసు. మా తాత ఆస్తిని తనే చూసుకుని, నేను ఎదిగాక నాకు నా భాగాన్ని ఇచ్చాడు. ఆస్తి నా చేతికి వచ్చే ముందు, అంటే నేను చదువుకునేటప్పుడు, నాకూ నీ లాగ చాలా సరదాలు ఉండేవి. అంతమంది కూతుళ్ళ మధ్యన ఒక్కడినే కొడుకుని అని మా అమ్మ నన్ను గారంగా చూసుకునేది. కానీ, డబ్బు కావాలంటే మాత్రం బాబాయ్ నే అడగాలి. మిగతా వారందరూ ఏమనుకున్నా, నాకు మటుకు మా బాబాయ్ మంచివాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గడ్డ పెరుగేసి  అన్నం కలిపి, అందులో కొత్తావకాయ్ నంజి పెడుతూ ఉండేవాడు. తన బిడ్డలతో సమానంగా చూసేవాడు - ముద్దాడినా, కొట్టినా.

మా బాబాయ్ వంద ఎకరాల ఆసామి. కానీ, మహా పిసనారి అని మన ఊరంతా చెప్పుకునేది. అయినా, పరుల సొమ్మును ఆశించేవాడు కాదు. ఊరక అణా కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బుల కోసం ఆయనని అడగాలంటే నాకూ అదే చిఱాకు, భయం. ఈ సారి కొత్త cycle కోసం అడిగాను. గంభీరంగా ఒక చూపు చూశాడు. వద్దనే దాని అర్థం, అనుకుని నిట్టూర్చాను. నిజానికి కళాశాల ఇంటికి రెండు కిలోమీటర్లకు మించి ఉండదు, మిత్రబృందం అంతా నడుచుకునే వెళ్తున్నారు. ప్చ్...అది చెప్పే వద్దంటాడేమో అనుకున్నాను.

ఉన్నట్టుండి,  "రేపు తెల్లారుకట్ట నేను పార్వతీపురం వెళ్ళాలి, నువ్వూ వస్తావా?", అన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప వేరు అలవాటు లేదు ఆ ఇంట్లో. సరేనని చెప్పి ఆయన వెంట వెళ్ళాను. కొండల వెంటా, గుట్టల వెంటా తిప్పి తీసుకెళ్తూ ఐదారు కిలోమీటర్లు నడిపించి కొంచెం మనుషులు కనబడే చొటికి చేర్చాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. పొద్దున్న ఒక్క అరటిపండు  పెట్టి ఇంత దూరం నడిపించాడేమిటిరా బాబు అనుకుంటుండగా, ఒకరి ఇంటి దగ్గర ఆగి నన్ను అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు. లోపలనుండి ఒకావిడ వచ్చి ఒక లోటాలో మంచినీళ్ళు ఇచ్చింది. బాబాయే పంపించి ఉంటాడు. ఒక గంట తరువాత వెనక్కి వచ్చాడు. మా ఆకలేసింది. బాబాయైతే పెద్దవాడు. ఉపవాసాలు చేసి చేసి అలవాటైంది, మరి నా గతేం కాను అనుకున్నాను. మళ్ళీ యాత్ర కొనసాగింది.

ఇంక శొష వస్తుంది అనగా ఒక ఇంటి ముందు ఆపాడు. బయట బాల్చీ, చెంబు ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్తూ, "నువ్వూ రా" అన్నాడు. నేనూ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాను. ఒకాయన వచ్చి తుండు ఇచ్చాడు. ఇద్దరం చేతులు తుడుచుకున్నాం. "ఏరా అబ్బీ, మీ ఆవిడ ఎలాగుంది? పిల్లలు చదువుకుంటున్నారా? ఏఁవిటి హొటేలు  పెట్టారట?", అన్నారు. "అవునయ్యా, మీరు హొటేలు పెట్టాక  మొదటిసారి వచ్చారు. కడుపు నిండా తినే వెళ్ళాలి", అన్నాడు అతను. "బయటవాళ్ళకు తెలిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళకు పరువు తక్కువరా. హ హ. సరే, ఇక్కడే వడ్డించు", అన్నాడు బాబాయ్.

ఇద్దరం కూర్చున్నాము. రెండు అరటాకులు వేసి ఇడ్డెనలు వడ్డించసాగింది అతడి భార్య. ఆ కాలంలో ఇడ్లీరేకులు దొరికేవి కాదు, saucer అంత ఉండే పళ్ళాల్లో కానీ, పనస ఆకుల్లో కానీ తయారు చేసేవారు ఇడ్డెనలు. "బాగున్నావా అమ్మా", అని నవ్వుతూ అన్నాడు బాబాయ్. అంతే... ఆ తరువాత ఆవిడ వడ్డిస్తూనే ఉంది, బాబాయ్ తింటూనే ఉన్నాడు. మూడు ఇడ్డెనలకే నాకు కూర్చోలేక నడ్డి విరిగినంత పని అయ్యింది. బాబాయ్ మాత్రం డజన్ల కొద్దీ లాగించాడు. బాబాయ్ ఎక్కువ తినడం నేను ఎప్పుడూ చూడలేదు. "ముందురోజు ఉపవాసం ఉన్నాడనుకున్నా, మరీ ఇంతా?" అనుకుంటున్నాను.

బాబాయ్ మొదటి మూడు ఇడ్డెనలూ తింటుండగా హొటేలు యజమాని ముఖ్యంలో "ఇంత పెద్దాయనకు వడ్డించగలుగుతున్నాం" అనే సంతృప్తిని చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయనకు మన వంట నచ్చింది", అనే సంతోషం చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయన మాంచి ఆకలి మీద ఉండి మొహమాటం కూడా లేకుండా టింటున్నాడు", అనే చిరునవ్వు చూశాను. ఆ తఱువాతి మూడింటికి "ఒక మనిషి ఇన్ని ఇడ్డెనలు తినగలడా" అనే ఆశ్చర్యం చూశాను. ఆ తరువాతి మూడింటికి, "వాయంతా ఈయనకే సరిపోతోంది, బయటవాళ్ళకి ఎలాగ వడ్డించాలి" అనే కంగారు చూశాను. ఆ తఱువాత మూడింటికి, "ఇన్నీ తిన్నాడు సరే, ఈయన చిల్లిగవ్వగా ఇవ్వడని ఈయన ఊళ్ళొనే చెప్తారు. ఇరువై ఇడ్డెనలకి ముడిసరుకే రెండు రూపాయలు ఉంటుంది", అనే నిట్టూర్పు చూశాను. బాబాయ్ కి మాత్రం ఏమీ పట్టలేదు. ఇడ్డెనలూ, పచ్చడీ జుఱ్ఱేస్తున్నాడు భాగవతంలో బాలకృష్ణుడిలాగా.

అంతా అయ్యింది, ఆయన  లేచి దొడ్లోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. నా చేతులు ఆరిపోయాయి, పిండి చేతులపై అట్టగట్టుకుపోయింది. బలంగా రుద్దుకుని కడుక్కుని వెనక్కు వచ్చేసరికి నా జీవితంలో చూస్తాను అనుకోనిది ఒకటి చూశాను. మా బాబాయ్ తుండు నా చేతుల్లో పెట్టి తన సంచిలోంచి ఒక కొత్త వందరూపాయల కాగితం తీశాడు. అది ఇంకా నలగలేదు. అప్పట్లో ఒక రూపాయి అంటే ఇప్పుడు dollarకు సమానం. వడ్డించిన ఆమెను పిలిచి, ఆమెకు చూపిస్తూ "అమ్మాయ్, గోప్ఫగా వండావే ఇడ్డెనలు. ఆ పచ్చడో, అమృతంలాగా ఉందే. ఇదిగో మీ ఆయనకు డబ్బులుస్తిన్నాను. బట్టలు కొనిపించుకో", అన్నాడు. హొటేలు యజమాని, అతడి భార్య, నేను తెల్లబోయి చూస్తున్నాము. బాబాయ్ అతని భుజం తట్టి, "ఒరేయ్ అబ్బీ, నీ ఇంట్లో ఈ అన్నపూర్ణే మహాలక్ష్మి కూడా, చక్కగా చూసుకో. ఉంటాను.", అని నాకేసి చూసి పద అని సైగ చేసి బయల్దేరాడు.

వచ్చేటప్పుడు busలో వచ్చేశాము. దిగి ఇంటికి నడుస్తూ ఉండగా భుజం మీద చెయ్యి వేసి, "ఏరా. cycle కావాలా? ఈ రోజు పొద్దున్న నడిచావు కదా? అంత దూరం నడిచి, ఒక్కోసారి వంతెన పడిపోతే ఏట్లో ఈదుకుంటూ వెళ్ళి నేను పొరుగూరులో బడికి వెళ్ళేవాణ్ణి. ఎక్కువ చదువుకోలేదు అనుకో. cycle ఉండటం మంచిదే. చాలా శ్రమ తగ్గిస్తుంది. విలువ ఉన్న వస్తువు. కొంటాను", అన్నాడు. ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాం.

నేను ఎప్పుడూ మా బాబాయ్ ని ప్రశ్నించలేదు, డబ్బు విషయాల్లో అయితే అసలేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిగాను, "బాబాయ్, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా? మరి మూడు రూపాయలు ఇవ్వవలసిన చోట వందరూపాయలు ఎందుకు ఇచ్చారు?", అని అడిగాను. బాబాయ్ గంభీరంగా చూసి, "డబ్బు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది రా నాన్న. ఒకటి అవసరానికి, రెండు సంతృప్తికి. డబ్బును నేను జాగ్రత్త చేసేది అవసరానికి. తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు అది చేతకాలేదు. అవసరమైతే ఖర్చు పెడతాను, లేదా సంతృప్తి కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న అంత దూరం నడిచి వెళ్ళేసరికి "ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని అడగకుండా అభిమానంగా పిలిచి పీట వేసి భోజనం పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇడ్డెనలు నాకు అమృతప్రాయంగా అనిపించాయి. చాలా తృప్తి కలిగింది. పెళ్ళాంపిల్లలు ఉన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు, బుద్ధిమంతుడు -- వాడికి సాయం చేయడంలో నాకు తృప్తి ఉంది. అందుకే ఇచ్చాను", అని చెప్పి భాగవతం తెరిచి కూర్చున్నాడు. అక్కడే ఉంటే నన్ను చదవమంటాడేమో అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంటే, "నాకు సంతృప్తి కలిగితే ఎంతైనా ఇస్తాను. కలగనప్పుడు ఎంత తక్కువైనా ఇవ్వను. ఊసుపోని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి?", అన్నాడు. "అవును బాబాయ్", అని చెప్పి బయటకు వచ్చేశాను.

అప్పుడు నేను ఆలోచించాను, "ఈ cycle నాకు అవసరమా? తాత్కాలికమైన ఆత్రమా? లేక దీర్ఘకాలిక సంతృప్తా?" అని. ఇప్పటికీ విషయాలూ, వస్తువులూ  మారుతూ వచ్చాయి కానీ అదే ప్రశ్న మనసుని తడుతూ ఉంటుంది. ఈ ప్రశ్న నీకూ ఉపయోగపడచ్చేమోనని ఈ కథ చెప్పాను అంతే."

అని చెప్పాడు రాజు. కిట్టు ఒక చిరునవ్వు నవ్వి, "సాయంత్రం నేనే వంట చేస్తాను నాన్న", అని చెప్పి తన mobile లో taxi వాడికి phone చేసి రావద్దని చెప్పాడు.

Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

Wednesday, July 20, 2011

మహాభారతంలో యజోపయజుల కథ

(వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

Monday, July 18, 2011

జంతువు - దైవం

ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?

Thursday, January 20, 2011

కిట్టు కథలు - పెళ్ళికానుకలు


అసలు పెళ్ళి అనగానే అందరికీ గుర్తొచ్చేవి షరామామూలే. కిట్టుకు మటుక్కు, పెళ్ళి హడావుడి కంటే పెళ్ళయ్యాక జరిగే ఒక తంతు మాత్రం మహాముచ్చటగా అనిపిస్తుంది. హన్నన్నా - తప్పుగా అనుకోకండి! నేనంటున్నది పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ వచ్చే బహుమతులను తెరిచి చూస్తూ ఉండటం గురించి. ఇది అంటే కిట్టుకు ఒక అది కలగడానికి కారణం తన మేనమామ కొడుకు పెళ్ళి లో ఎదురైన ఒక అనుభవం. ఆ పెళ్ళి జరుగుతున్నంత సేపూ కిట్టు వాళ్ళ తాతయ్యగారి (మాతామహుడు) పక్కనే ఉన్నాడు. పెళ్ళయ్యాక ఎవరి గొడవలో వాళ్ళుండగా తాతయ్య కిట్టును పిలిచి, "ఒరేయ్, వెళ్ళి ఆ బహుమతులబుట్ట పట్టుకురా అన్నారు" (పెళ్ళికూతురిని తీసుకురావడానికి వాడే బుట్ట తరువాత బహుమతులబుట్ట అవుతుందిలెండి). సరే అని కిట్టు నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున అన్నీ తీసుకుని వచ్చాడు. తాతయ్య ఆయన పడకగదిలో పడకకుర్చీలో వెనక్కి ఆనుకొని ఆ కుర్చీ చేతుల మీద ఒక కాగితం పెట్టి, కలంతో "శ్రీరామ" వ్రాశారు. "ఈ సారి ఒక్కోటీ తీసి ఏముందో చూసి నాకు లెక్క చెప్పు", అన్నారు. కిట్టు మొదలెట్టబోతుంటే, "ఆగు, చిన్న చిన్న coverలన్నీ మొదట తెరిచి చూడు", అన్నారు. సరేనని కిట్టు ఒకటి తెరిచాడు - అందులో నూటపదహార్లున్నాయి. ఆ cover పైన ఉన్న పేరు, సంఖ్య చెప్తే తాతయ్య నెమ్మదిగా ఎక్కించుకుంటున్నారు. ఇలాగ కొంతసేపు సాగింది.

అప్పటికీ cover పట్టుకోగానే అందులో ఎంత ఉందో తెలిసిపోతోంది కిట్టుకు. cover లు చింపడం మీద మిగులు ఆత్మవిశ్వాసం కలిగి పరపరా చింపేస్తున్నాడు. ఒక్క నిముషం తాతయ్య కాగితం మీద దృష్టి కిట్టు చేతుల మీదకు మరల్చారు. వెంటనే కిట్టుకు అర్థమైంది ఏదో తప్పు జరుగుతోంది అని. తాతయ్య కిట్టుకేసి చూసి - "నువ్వు ఒక పది నోటైనా చింపకుండా ఈ రోజు మన లెక్క తేలదుర", అన్నారు. "ఛఛ! తాతయ్యది చాదస్తం. ఇంకా నేను పదో తఱగతి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను software-engineerని", అనుకుని - "అబ్బే లేదు తాతయ్య", అని ఒక వెకిలి నవ్వు నవ్వి తప్పించుకున్నాడో లేదో అదే జరిగిపోయింది. తిడతారు ఏమో అనుకుని బేల మొహం వేసుకుని, నాలుక కరుచుకుంటూ - "తాతయ్యా...", అన్నాడు. ఆయన తల తిప్పకుండా, "చెప్పానా - సరే అది మీ పెద్దన్నయ్యకి ఇవ్వు - వాడి bank లో మార్చుకుని తీసుకొస్తాడు", అన్నారు. "ఓహో, ఇంకా నోటు చిరక్కుండానే నోటు చిరిగితే ఏం చెయ్యాలో ఆలోచించారు అన్నమాట", అనుకుని ముక్కున వేలేసుకున్నాడు కిట్టు. మఱి ముప్పై పెళ్ళిళ్ళు చేయించిన అనుభవం తాతయ్యది, మొదటిసారి పెళ్ళిని విహంగవీక్షణంగా కాకుండా వియ్యాలవారి పక్షంగా చూస్తున్న శైశవం కిట్టుది.

ఇంతలో ఒక cover చాలా బరువుగా ఉంది - తెరిచి చూశాడు. అందులో పదివేలు ఱొక్కం ఉంది. కిట్టు నివ్వెరపోయాడు. దాన్ని తాతయ్యగారికి చూపించాడు. తాతయ్య కుర్చీలోంచి ముందుకు వంగి  "అబ్బో, ఎవర్రోయ్" అన్నారు. కిట్టు పేరు చదవగానే, "ఓహో, వాడా!", అన్నారు. ఇంతలో coffee ఇవ్వడానికి గదిలోకి కిట్టు మేనత్త భార్యకు (పెళ్ళికొడుకు తల్లి) అది చూస్తూనే ముఖం వెలిగిపోయింది. కిట్టు తాతయ్య ఒక చిరునవ్వు నవ్వి, "వీడు 1990లో దివాళా తీశాడురా. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు - నాకు వాడి నిజాయతీ,వ్యాపరమెలకువల మీద నమ్మకం ఉంది. blank-cheque వ్రాశిచ్చి 'నువ్వెప్పడికైనా గొప్పవ్యాపారస్థుడవౌతావురా' అని చెప్పి ఇచ్చాను. వాడు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని వెళ్ళాడు. నా నమ్మకం ఋజువైంది - వాడు మళ్ళీ పోయిందంతా సంపాదించుకున్నాడు. అందుకే ఇలాగ వాడి కృతజ్ఞతను చెప్పుకుంటున్నాడు", అన్నారు. ఆ రోజుకు కిట్టు తాతయ్య దగ్గరనుండి నేర్చుకోవలసిన పాఠం నేర్చుకున్నాను. ఇంకేదొచ్చినా అదనమే. ఒక్కసారి ఆయన కోడలి వైపు చూసి "వాడికి ఆ cheque ఇచ్చిన రోజు నువ్వేమన్నావే అమ్మాయి?", అన్నారు. ఆవిడ ముఖం ఇంకా సంతోషం నుండి తేరుకోలేదు. "ఊ", అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. "ఈ సారి వాళ్ళు ఇంటికి వస్తే పింగాణీ glassలో పరమాన్నం పెడుతుంది మీ అత్తయ్య", తాతయ్య అన్నారు నవ్వుతూ.

"coverలన్నీ అయిపోయాయి తాతయ్య", అన్నాడు కిట్టు. "ఈ సారేం...చిన్నచిన్న డబ్బలతో ఉన్న gift-packలు తెరువు. అరచేతిలో పట్టాలి", అన్నారు. ఆయన కాగితంలోకి తొంగి చూశాడు కిట్టు - ఆయన రెండు అడ్డగీతలు గీసి ఇదివరకు చెప్పిన సంఖ్యల మొత్తాన్ని అక్కడ వ్రాశారు. కిట్టు జాగ్రత్తగా gift-packలు తెరుస్తూ ఉన్నాడు. మొదటిదాంట్లో ఒక వెండి కుంకంభరిణ ఉంది. అది చూస్తూనే తాతయ్య "right, ఊహించాను", అన్నారు. నెమ్మదిగా, అలాంటివాటిల్లో కిట్టు నాలుగు భరిణలు ఉండే పసుపుకుంకుమల stand, చిన్న చిన్న దేవతావిగ్రహాలు మొదలైనవి చూశాడు. ఇక అలాంటివి లేవు. మఱికొంచెం పెద్దవి వచ్చాయి. తాతయ్య ఈ విషయం గమనించి ఒక దాన్ని చూసి, "ఏమిటి బాబూ, వినాయకుడి ప్రతిమా?" అని అడిగారు. తెరిచి చూస్తే అదే. "సరే, అది జాగ్రత్తగా ఆ packలోనే ఉంచేయ్. ఇప్పటికే ఇంటినిండా అవే ఉన్నాయి.", అన్నారు. ఈ సారి ఒక పుస్తకం పరిమాణంలో ఒక pack ఉంది. అది కూడా చూస్తూ, "శాయీ బాబా పటమో, photo-frame ఓ అయ్యి ఉంటుంది", అన్నారు. అది దేవత చిత్రం కలిగిన ఒక photo-frame. ఇంక మరికొద్ది పెద్దవి వచ్చేసరికి, "ఇది hot-pack అయ్యుంటుంది, ఇది cup-saucer pack అయ్యుంటుంది", అని అన్నీ చెప్పేస్తూనే ఉన్నారు. కిట్టు ఇంక packetలు తెరవడం కంటే తాతయ్య చెప్పినదాన్ని బట్టి, అది తెరవకుండా వేరే పెళ్ళిళ్ళకు పేరు మార్చి ఇచ్చెయ్యవచ్చు అని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి అన్నీ పూర్తయ్యాక, పెద్దపెద్ద వస్తువులని అటక మీదకు చేర్చేదాక తాతయ్య పని చెప్పారు. మధ్యలో మళ్ళీ కిట్టువాళ్ళ అత్త వచ్చింది. "అమ్మాయి, నీ మేనల్లుడు చాలా కష్టపడ్డాడు, ఒక coffee పట్టుకురా", అన్నారు.

అంతా బానే ఉంది కానీ, కిట్టుకు ఒక సందేహం కలిగింది. తాతయ్య ఇంత ధనవంతులు కదా, స్వశక్తి మీద నమ్మకం కలిగిన వ్యక్తి కదా - మఱి కట్నం ఎందుకు తీసుకున్నారు? అని ఆ అనుమానం. "ఇంకేమిటి నాన్న, సంగతులు?", అన్నారు తాతయ్య. "తాతయ్యా, మీరు కట్నం తీసుకున్నారా?", అని అడిగాడు కిట్టు. "నా పెళ్ళి సమయానికి మేము చాలా బీదవాళ్ళం. కట్నం అడిగితే మీ అమ్మమ్మే - 'నీ మొహానికి నేనే ఎక్కువ!' అనేసేదిరా. ఐనా మా మాఁవగారి దగ్గరా డబ్బులేదురా. జోగీ జోగీ పూసుకుంటే బూడిద రాలింది అన్నట్టు", అని నవ్వారు. కిట్టు కూడా నవ్వి, "మఱి మావయ్య పెళ్ళికి?", అని ప్రశ్నను కొనసాగించాడు. "లేదు నాన్న. నాకు ఎవరి సొమ్మూ వద్దు. నేను కట్నం కావలన్నాను అనుకో, వాడెవడో కూతురు పెళ్ళికోసం బల్లలకింద చేతులు పెట్టో, వ్యాపారంలో మోసం చేసో, అప్పు చేసిన దుఃఖంతోనో ఆ డబ్బు తీసుకొచ్చి నా బిడ్డకు ఇస్తాడు. అది వాడికి క్షేమం కాదు. అయినా సమర్థత ఉన్నవాడికి పరాయివాడి సొమ్మెందుకురా", అన్నారు. కిట్టుకు సంతోషం కలిగింది. "మఱి ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు?", అన్నాడు కిట్టు. గట్టిగా నవ్వారు తాతయ్య. "నాన్న, నీకు ఇక్కడ ఒక సూక్ష్మం తెలియదురా", అన్నారు. ఆగి, లేచి నిలుచుండి డబ్బాలోంచి చుట్ట తీసి గోడకేసి చూస్తూ fan ఆపమని సైగ చేశారు. కిట్టు ఆ పని చేస్తూ, తాతయ్యకేసి చూశాడు. ఒక్కసారి బలంగా పొగ పీల్చి, నెమ్మదిగా అది బయటకు వదులుతూ, తాతయ్య అన్నారు, "నాకు కట్నం తీసుకోవాలని ఎప్పుడూ లేదు. మీ మావయ్య పెళ్ళప్పుడు మీ అమ్మమ్మ ఎప్పుడూ నా విషయాలలో కలగజేసుకోలేదు. అది ఒకవేళ అడిగినా, 'నువ్వేం తెచ్చావే నీతో' అని నోరు మూయించేసేవాడిని. మరి ఇప్పుడు జరిగేది నా కొడుకు పెళ్ళి కాదు - వాడి కొడుకు పెళ్ళి. మరి పెళ్ళికొడుకు తల్లిదండ్రులేమంటున్నారో చూసుకోవద్దు?", అన్నారు. కిట్టుకు విషయం అర్థమైంది. "అందరూ వాళ్ళ గతాన్ని గుర్తు పెట్టుకుంటారా? ఐనా అందులోనూ మనం కొంత సామం ఉపయోగించాము.", అని ఒక చిరునవ్వుతో అన్నారు.

"అదొక్కటే కాదు - ఇక్కడ ఇంకో విషయం ఉంది. నాకు ఒక్కడే కొడుకు. ఆడబిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. మరి వాడికి ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ ఒకే స్థోమత ఉన్న కుటుంబం నుండి పిల్లలు రావాలని లేదు కదా? కట్నం తీసుకున్నాం అనుకో కలిగిన ఇంటి పిల్ల దగ్గరనుండి ఒకింత తక్కువ తీసుకుంటే రేపు 'నేను ఉన్న ఇంట్లోంచి వచ్చానూ, అని అదంటే మఱొకత్తి, 'నేను ఎక్కువ తీసుకొచ్చానూ అంటుంది. సరిపోదూ?", కిట్టుకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ, ఇది పూర్తిగా తాతయ్య అంగీకారంతో జరుగుతున్నది కాదు అని అర్థమయ్యి తల ఊపాడు. "ఐనా - నాకూ ఆడపిల్లలున్నారురోయ్! అందుకే నేను ఇంకో తండ్రిని ఇబ్బందిపెట్టను. మీ పెద్దమ్మ పెళ్ళినాటికి నా దగ్గర ఆస్తి లేదు. మఱి నాకు తెలియదా ఆ బాధ?", అని కిట్టు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, తూకం నెత్తిన ఉండే సూది లాగా తలను అటూ ఇటూ ఊపారు. కిట్టు అవునన్నట్టు తల ఊపాడు. "కట్నం పది దగ్గర మొదలైందిరా", అని ఆయన అంటుంటే కిట్టు నమ్మలేనన్నట్టుగా చూశాడు. "మఱి నేను సామం వాడి ఒకటిన్నరకు దించాను", అనగానే కిట్టు అదెలాగ అన్నట్టు చూశాడు.

"పెళ్ళి వాళ్ళ ఊళ్ళో జరగడం రివాజు. అలాగ జరిగితే మన వ్యాపరంలో భాగస్వాములు, మన దగ్గరకు వచ్చే customerలు, మనకు సరుకులు ఇచ్చే supplierలు వీళ్ళెవరూ రావడం వీలు కాదు. మఱి వీళ్ళందరూ వస్తేనే వాళ్ళకు మనం గుర్తుంటాము కదరా. అది వ్యాపారసూక్ష్మం. అందుకని పెళ్ళి మా ఊళ్ళో చెయ్యమని చెప్పి మూడు కట్నం కోసేశాను. మన బంధువులందరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. మనవాళ్ళందరికీ ticketల ఖర్చు మిగులు. మఱి వాళ్ళందరూ లేకుండా పెళ్ళెలాగరా?", అన్నారు. ఇంతలో కిట్టు, "తలకో వెయ్యినూటపదహార్లు ఇస్తారు అని వేసుకున్నా వాళ్ళకి రాను పోనూ ticketలే ఖర్చవుతాయి", అన్నాడు. తాతయ్య గట్టిగా నవ్వుతూ, "అదీ నిజమే. ఆ డబ్బు వాళ్ళు మనఃపూర్వకంగా పెళ్ళికొడుక్కి ఇవ్వాలి గానీ, ప్రయాణం చేస్తే ఎవరికిచ్చిన సొమ్ము? ఈ ఊళ్ళో మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేశామురా? మనకు షామియానాల నుండి బ్రహ్మగారి వరకు అన్నిటిలోనూ discount ఉంది. వియ్యంకుణ్ణి వాళ్ళకు పరిచయం చేశాను. ఆయనకు ఈ ఊళ్ళో కూడా బోలెడు బంధువులున్నారు. సులువైపోలేదు. ", అన్నారు.

కిట్టు "ఇంకా?" అన్నట్టు చూశాడు. తాతయ్య మంచినీళ్ళకోసం సైగ చేస్తే కిట్టు అక్కడ ఉన్న మఱచెంబులోంచి నీళ్ళను గ్లాసులోకి ఒంపి అది అందించాడు. అది త్రాగాక తాతయ్య, "మనకు cash ఐతే ఆదాయపన్ను శాఖ సమస్య అవుతుంది అని చెప్పి, మూడు పెట్టి మీ అమ్మాయికి నగలు చేయించి ఇచ్చెయ్యండి అన్నాను", అన్నారు. మఱి ఇందులో తగ్గించిందేముంది అన్నట్టు చూశాడు కిట్టు. "మనం మూడంటే వాళ్ళు మూడు పెట్టి చేయిస్తారా? అందులో ఎంతో కొంత తగ్గుతుందిలే - అయినా వాళ్ళు చిన్నప్పటినుండి అమ్మాయికి చేయించినవే పంపిస్తారు.", అన్నారు. కిట్టు నవ్వుకుని, "ఎన్ని పెళ్ళిళ్ళు చేసిన/చూసిన అనుభవమో!", అనుకున్నాడు. "మరి మిగతాది", అన్నాడు కిట్టు. "వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారో లెక్కేశాను. ఒక ఐదువందలమందిదాక వస్తారు అని చెప్పారు. కుటుంబానికి వెయ్య వేసుకున్నా రెండు లెక్క తేలింది. వియ్యంకుణ్ణి పిలిచి అమ్మాయి పేరున వచ్చిన వస్తువులు అమ్మాయితో పాటు వస్తాయి - డబ్బులే ఆయనకు వస్తాయి అని చెప్పాను. వాళ్ళవాళ్ళందరికీ ఆ విషయం తెలిసి డబ్బులే ఇచ్చారు. మఱి అది ఆయనకు కలిసి వచ్చినట్టేనా?", అన్నారు. కిట్టుకు చుక్కలు కనబడటం మొదలైంది. శ్రీకృష్ణరాయబారంలాగా, "అసలు ఈయన ఎవరి పక్షం మహప్రభో?" అని నివ్వెరపోతూ చూశాడు. "ఇంకెంత మిగిలిందిరా?", అన్నారు తాతయ్య. కిట్టు, "రెండు తాతయ్య. సరిపోయింది.", అన్నాడు కిట్టు. లెక్క తెగింది కదా అనుకుని గుక్క తిప్పుకోబోతుంటే, "ఇంకా లేదు, చెప్తాను విను", అని నెమ్మదిగా నడుం వాల్చారు తాతయ్య.

"మిగిలిన రెండు ఆమె పేరునే fixed వెయ్యమన్నాను. ఆ విషయం కూడా పెళ్ళి తఱువాత చూసుకుందాం అన్నాను. దానితో ఆయన మన చేతికి ఇవ్వాల్సిందీ లేదు, మనం ఆయన చేతికి ఇవ్వాల్సిందీ లేదు. లెక్క సరిపోయింది ఇప్పుడు", అన్నారు. కిట్టు మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలిగింది, ఏదో వెల్తి పూరింపబడింది, సుమారు రెండుతులాల బరువు గుండెలోంచి తీసేసినట్టు అనిపించింది. తాతయ్య కనబడటానికి ఆరడుగుల ఆజానబాహువు. ఈ చర్చతో ఆయన ఎత్తు ఇంకా ఎక్కువగా అనిపించడం మొదలైంది. "సరే, నేను కాసేపు పడుకుంటాను. నాలుగవుతూనే లేపెయ్. భక్తి TVలో మంచి ప్రసంగం వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు light కట్టేయ్", అని జోడించిన అరచేతుల్లోకి చూస్తూ నమస్కరించుకుని ఆవలించారు. కిట్టు light కట్టి తలుపు వైపుగా వెళ్తుంటే, "నేను చెప్పిన లెక్కలు వంటింటి దాక చేరితే మీ అత్తయ్య నీకు sweetలు, నాకు చీవాట్లూ పెడుతుంది", అన్నారు. ఒక చిరునవ్వు నవ్వి, "అబ్బే...లేదు తాతయ్యా", అని కిట్టు తలుపు దగ్గరకేస్తుండగా ఆ తలుపు పక్కగా ఉన్న తాతయ్య తాతయ్య చుట్టలడబ్బా, మఱచెంబూ చూశాడు. తనకు ఊహ తెలిసినప్పటినుండీ తాతయ్య అవే వాడుతున్నారు అన్న విషయం మఱొక్కసారి గుర్తొచ్చింది.

Wednesday, December 22, 2010

నా అనుభవాలు: 1

("నా అనుభవాలు" పేరుతో వ్రాస్తున్న ఈ శీర్షికలో నా చిట్టి అనుభవంలో చూసిన/విన్న సంఘటనల గురించి వ్రాస్తున్నాను. దీనిలో కేవలం మనోభావాలు, అధ్యాత్మిక విషయాలు వంటివి ఉంటాయి. హాస్యం ఉండదు.)

కామేశ్వరరావు గొప్ప భక్తుడు. ఒకప్పుడు సైనికవిభాగంలో పని చేశాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా రోజూ ఒక గంటసేపు తన ఇష్టదైవాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడూ మద్యమాంసాల జోలికి పోలేదు. ఇప్పుడు ఆయన పదవిని విరమించి స్వగ్రామంలో ఉంటున్నాడు. ఆయన జీవితంలో ఒక సారి జరిగిన ఘట్టం వారి అబ్బాయి (నా మిత్రుడు) నాతో చెప్పాడు. అదే ఈ చిన్నకథ.

ఒక రోజు కామేశ్వరరావు పూజ ముగించి వరండాలో కూర్చున్నాడు. తన మిత్రుడు ఎవరో ఒక అపరిచితవ్యక్తిని వెంటబెట్టుకుని గుమ్మం ముందుకు వచ్చాడు. మర్యాద కోసమని కామేశ్వరరావు వెళ్ళి వాళ్ళను పలకరించి ఇంట్లోకి పిలిచాడు. అందరూ కాఫీలు పుచ్చుకున్న తఱువాత, కామేశ్వరరావు మిత్రుడు తనతో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, ఆయన గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అని, ఎవరింట్లో ఐనా పూజగది చూసి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్పగలడని చెప్పాడు. కామేశ్వరరావుకి కుతూహలం ఆగలేదు. వెంటనే ఆయన్ని పూజగదిలోకి తీసుకెళ్ళాడు.

ఆ వ్యక్తి గంభీరమైన ముఖంతో ఉన్నాడు. నుదుట విభూతి గాని కుంకుమ గాని లేదు. పూజగదిలోకి అడుగు పెడుతూనే ఒక్క సారి చుట్టూ చూశాడు. దేవుడి పాటాలను, దీపాలను చూసినదాని కంటే మిగతా దిక్కులను ఎక్కువ చూసి "మీ నాన్నగారు మీ చిన్నప్పుడే పోయారు. ఆయన చామంచాయ, ఆరడుగులు ఎత్తు, మీసం ఉండదు - అవునా", అన్నాడు. కామేశ్వరరావు ఆశ్చర్యచకితుడైనాడు. వాళ్ళ నాన్నగారికి ఒక నమ్మకం ఉండేది - photo తీయించుకుంటే సహజసౌందర్యం దెబ్బ తింటుంది అని. అందుకే ఆయన ఎప్పుడూ photo తీయించుకోలేదు. ఈ వ్యక్తి తన తండ్రి photo సంపాదించి ఈ విషయం చెప్తున్నాడు అనడానికి ఆస్కారం లేదు. అలాగే తన చిన్నదనంలోనే చనిపోయిన తండ్రిని తన భార్య, బిడ్డలు చూసే కూడా చూడనేలేదు. ఈ వ్యక్తి చూసే అవకాశం కూడా లేదు. ఒక వేళ ఇదివరకు ఇతను తన తండ్రిని స్వయంగా చూశాడా అంటే ఇతడు కామేశ్వరరావు కంటే చిన్నవాడాయె. ఇదంతా తనకు నమ్మశక్యంగా లేదు. కాసేపటికి తేరుకుని ఆయన చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకుని సాష్టాంగప్రణామం చేసినంత పని చేశాడు. ఆ తఱువాత ఆ వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పడం, కామేశ్వరరావు ఊ కొట్టడం జరిగాయి. చివరికి ఆయనకు భోజనం కూడా పెట్టి పంపించాడు.

కామేశ్వరరావు ఈ విషయాన్ని సత్వరమే తన గురువుగారికి చెప్పాలని ఆ మఱునాడు బయల్దేరి ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన నుదుటన, విభూతి, కుంకుమ పెట్టుకుని ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. కామేశ్వరరావుని చూసి, "కామేస్వరం, నిన్న మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తే పూజగది చూపించావు కదూ?" అన్నాడు. మళ్ళీ కామేశ్వరానికి మతి పోయింది. ఇదివరకు ఎప్పుడూ ఈ గురువుగారు మానవాతీతశక్తి ఉన్నట్టుగా ప్రవర్తించలేదు, అనిపించలేదు. ఉన్నట్టుండి ఈయనకు కూడా ఈ శక్తి ఎక్కడినుండి వచ్చింది? ఇది కలా? నిజమా? అని అనుకుంటూ, "అవును స్వామీ, ఆ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను", అన్నాడు. ఆయన గంభీరమైన ముఖాన ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వి, "తప్పు చేశావు కామేస్వరం. పూజగది మన ఆధ్యాత్మికబలానికి నెలవు. అక్కడికి ఎవరినిబడితే వారిని రానివ్వకూడదు. శక్తికి కూడా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతికి అనుకూలమైన దైవీకశక్తి, రెండవది ప్రకృతిధర్మాలను ధిక్కరించే శక్తి. మనం మల్లెబాటలో వెళ్ళాలయ్యా. ఇంకెప్పుడూ అలాంటివాళ్ళను ఆశ్రయించకు", అన్నాడు.

కుతూహలం ఆగని కామేశ్వరరావు, "స్వామీ, మీరు చెప్పింది పాటిస్తాను. ఆ విషయాన్ని మీరు మరింత వివరిస్తే వినాలనుంది", అన్నాడు. గురువుగారి ముఖంలో గాంభీర్యం తగ్గి కాస్త శాంతం చోటు చేసుకుంది, "కామేశ్వరం, మీ ఇంటికి వచ్చిన వ్యక్తిది దైవబలం కాదు. దైవబలం ఉన్న వ్యక్తులు ఎప్పుడుబడితే అప్పుడు వారి శక్తిని వాడరు. పిండోదకక్రియలను సక్రమంగా ఆచరిస్తున్న నీకు పితృదేవతల అండ ఉంది. అతను మీ పితృదేవతలతో మాట్లాడాడయ్యా. ఇది పెద్ద విద్యేం కాదు. కాకపోతే అది ప్రకృతివిరుద్ధం. నీ పితృదేవతలు కూడా నీకు ప్రశ్నలుంటే, అవి ముఖ్యమైనవైతే, నువ్వు నీ వారిపట్ల నీ ధర్మాలను సరిగ్గా ఆచరిస్తే నీకు కల ద్వారానో, లేక మఱొక మార్గంలోనో సూచనలనిస్తారు. ఇలాంటి వ్యక్తులు వాడేవి ప్రకృతివిరుద్ధమైన మార్గాలు. వారు మీ పితృదేవతలను ఇబ్బంది పెట్టగలరు. నిన్నూ నమ్మించి మోసం చెయ్యగలరు. వీరిని నమ్మితే నువ్వు నీ పితృదేవతల అండని, భగవంతుడి కృపని వదులుకోవలసి రావచ్చును. అందుకనే వీళ్ళకు దూరంగా ఉండమంటున్నది", అన్నాడు. కామేశ్వరరావుకు విషయం అర్థమైంది. అప్పటి నుండి ఇలాంటి మాయలకు దూరంగా ఉంటున్నాడు.

Friday, September 17, 2010

ఉప్మా కథ

నాకు చిన్నప్పుడు ఉప్మా, ఇడ్లీ - ఈ రెండింటి మీద కొంచెం చిన్నచూపు ఉండేది. ఐనా, చట్నీ బాగుంటే, అందులో ఇవి నంజుకుంటూ సర్దుకుపోయేవాణ్ణి. అమెరికా వచ్చాక మాత్రం ఉప్మా నా జీవనాధారం అయిపోయింది. అది ఎందుకో జీవితంలో ఒక్కసారైనా ఉప్మా వండినవాళ్ళకు తెలుస్తుంది. పావుగంటలో వండుకునే భారతీయ ఉపహారాలు చాలా తక్కువ. అందులో ఉప్మా శ్రేష్ఠమైనది అని నా అభిప్రాయం. పోకిరి సినిమాలో చెప్పినట్టు, "semesterలు semesterలు ఉప్మా తిని బ్రతికేస్తున్నాను". ఈవేళ కూడా అదే వండుకుని తిన్నాను. అది వండుతున్నప్పుడు నాకో కథ గుర్తొచ్చింది.

మాకు చిన్నప్పుడు బడిలో Moral Science చెప్పేవారు. ఐతే ఆరో తఱగతి దాటాక ఆ subject లో మార్కులు total లో లెక్కపెట్టేవారు కాదు. అందుచేత విద్యార్థులందరూ ఆ classలో కళ్ళు తెరిచి పడుకోవడం, book-cricket ఆడుకోవడం, మర్నాడు ఉదయానికి hand-writing వ్రాయడం వంటి పనులు చేసుకుంటూ ఉండేవారు. అది చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులు మాకు ఈ subject అంటే ఆసక్తి లేదని గ్రహించి, కొంతసేపు విషయం చెప్పి, మధ్యలో విద్యార్థుల దృష్టిని మళ్ళీ తమవైపు మరల్చుకోవడానికి కథలు చెప్పేవారు. అలాంటి కథల్లోదే ఈ ఉప్మా కథ. చెప్పిన ఉపాధ్యాయుని పేరు ఆరుముగం శివసామి. ఇంతకీ ఆ కథ ఏమిటో చూద్దాము.

అనగనగా తమిళనాడులో, ఒక ఊళ్ళో ఒకబ్బాయి ఉన్నాడు. అతనికి చదువు అవ్వగానే ఎక్కడో ఉత్తరభారతదేశంలో ఉద్యోగం వచ్చింది. మనవాడా అరవోడు. పొట్ట కోస్తే హిందీ ముక్క రాదు. అక్కడికి వెళ్ళి ఉద్యోగంలో చేరాడే కానీ మరీ తిండికి ఇబ్బందయ్యింది. ఇతడికి వంట రాదు. బయట hotel లో దక్షిణభారతదేశపు వంటకాలు దొరకవు. ఒకసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు అతను తింటున్న తీరుని బట్టి, "వీడు మన తిండికి మొహం వాచిపోయి ఉన్నాడు. వీడికి పెళ్ళి చేస్తే మంచిది", అని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. "బాగా వంట వచ్చిన అమ్మాయి కావాలి" అనుకుని, సంబంధాలు వెతగ్గా వెతగ్గా ఒకమ్మాయి photo అతడికి బాగా నచ్చింది.

ఒక సుముహూర్తంలో అందరూ కలిసి పెళ్ళి చూపులకు వెళ్ళారు. అక్కడ ఉప్మా పెట్టారు. ఆ ఉప్మా తిన్న కుఱ్ఱాడు పెనం మీద పడ్డ వెన్నముద్దలాగా కరిగిపోయాడు. ఆ ఉప్మా అమ్మాయే చేసింది అని తెలుసుకుని మురిసిపోయాడు. అమ్మాయి అందరికీ బాగా నచ్చింది. పెద్దలు అన్నీ మాట్లాడుకుని పెళ్ళి జరిపించారు.

స్వంత ఊరు వచ్చిన మొదటి రోజు, అతను భార్యతో, "నువ్వు పెళ్ళిచూపులప్పుడు చేసి పెట్టిన ఉప్మా అద్భుతం. మళ్ళీ చెయ్యవూ?" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించి, చక్కగా వండిపెట్టింది. మనవాడు కొత్త పెళ్ళికొడుకు కావడం చేత ఎంత తింటున్నాడో చూసుకోకుండా సుబ్బరంగా తినేసి "మా ఆవిడ వంటలో best" అని చాటింపేశాడు. ఇంక ఆ వారమంతా అదే ఉప్మా తిన్నాడు. మరుసటివారం మనవాడికి కొంచెం వెగటు వచ్చి, "ఈ రోజు దోశలు చెయ్యవోయ్. ఉప్మాకి కొంచెం break వేద్దాం", అన్నాడు. ఆమె, "నాకు దోశలు చెయ్యడం రాదండి" అంది. కొత్తసంసారంలో కోపాలు ఉండకూడదు, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామన్న సదుద్దేశంతో:
అ: "పోనీ నీకేం వచ్చు"
ఆ: "నాకు ఉప్మా చెయ్యడం వచ్చును."
అ: "అది కాకుండా?"
ఆ: "నాకు అదొకటే వచ్చునండి"
అ: "ఆఁ? ఆ ముక్క పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు?"
ఆ: "మీరు అడగలేదు కదండి"

సరే ఇంత చిన్న విషయాన్ని పెద్దది చెయ్యడం ఎందుకు అనుకుని అతను రోజూ అదే tiffin గా సేవిస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు అతడుంటున్న ఊళ్ళో ఒక South Indian restaurant (అదే, దక్షిణభారతవంటకాల పూటకూళ్ళ ఇల్లు) ప్రారంభించారు. పందొమ్మిదివందల నలభై ఏడు, ఆగష్టు పదిహేనున మన జాతీయపతాక ఎగిరినప్పుడు గాంధీగారు ఎంత ఉబ్బితబ్బిబ్బైపోయారో, మన కథానాయకుడు కూడా అంతే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సాయంత్రం త్వరగా office నుండి వచ్చేసి, భార్యాసమేతంగా ఆ restaurant దగ్గర వాలిపోయాడు.

ఒక waiter, menu తీసుకొచ్చి మనవాడి ముందు ఉంచాడు. "ఎన్నిరిక్కు?" అని ఆత్రంగా అడిగాడు మనవాడు. "menu దేఖియే" అన్నాడు waiter. అప్పుడు అర్థమైంది అకడ waiters అందరూ హిందీలో సంభాషిస్తున్నారు అని. menu కూడా హిందీలో ఉంది. సరే, హిందీ రాదనే విషయం భార్యకు తెలిస్తే నామోషీ అని దేవుణ్ణి తలుచుకుని ఉన్నవాటిల్లో ఒకదాని మీద వేలు పెట్టి waiterకి చూపించాడు. Waiter, "ఓ, అర్థమైంది", అన్నట్టు తల ఊపి, తన చేతిలో ఉన్న కాగితం మీద ఏదో బరుక్కుని వెళిపోయాడు. ఇంతలో మన వాడు భార్యకేసి చూసి, "Waiter లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే లోకువైపోతాము", అన్నాడు. అతని భార్య అమాయకంగా, "ఓ, అలాగా", అని తల ఊపింది.

ఇంతలో మన వెయ్టరు రెండు పళ్ళాల నిండా ఉప్మా పెట్టుకుని తీసుకొచ్చాడు. అది చూసిన మనవాడు ఉప్మా కంటే ముందు ఖంగు తిన్నాడు. భార్యకేసి తిరిగి, కాస్త తెల్లముఖానికి గాంభీర్యం పూసి, "ఎప్పుడూ నీ చేతి ఉప్మా తింటున్నాను కదా. ఈ సారి అసలు బయట ఎలాగ చేస్తారో తెలుసుకుందామని order చేశాను" అన్నాడు. భార్య మళ్ళీ అమాయకంగా తల ఊపి తినడం మొదలెట్టింది. మనవాడు తింటున్నాడే కానీ, ఒకటే వెగటు పుట్టింది. మొత్తానికి అయ్యింది అనిపించి, "సరే, ఇంకేమైనా తిందాం" అనుకున్నాడు. పక్క బల్ల మీద కూర్చున్న వాళ్ళేమి order చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. ఒకాయన ఏదో హిందీలో చెప్పాడు. అది విన్న waiter ఘుమఘుమలాడే సాంబార్తో వడలు తీసుకొచ్చాడు. మనవాడికి మనసు లాగింది. ఆయనేమన్నాడో అలాగే గుర్తుపెట్టుకుని waiter వచ్చాక అదే చెప్పాడు. waiter, "ఓహో" అన్నట్టు చూసి లోపలికెళ్ళాడు.

కాసేపాగి మళ్ళీ waiter రెండు ప్లేట్లలో ఉప్మా పట్టుకొచ్చాడు. మనవాడు బిక్కమొహం వేసి, "ఏంటిది? వెటకారమా? owner తో మాట్లాడతాను" అని వాడితో తగువుపెట్టుకున్నాడు. Owner తెల్లని పంచి కట్టుకుని, అడ్డనామాలు పెట్టుకుని, కిళ్ళీ నవులుతూ వచ్చాడు. "Problem ఏంటి సార్", అని అడిగితే మనవాడు అరవంలో తన బాధ వెలిబుచ్చుకున్నాడు. ఆ owner, waiter తో, "ఈయన ఏమి చెప్పారు?" అని అడిగితే "ఫిర్ యెహీ లాయియే, అన్నారు సార్", అని waiter చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న owner, "సార్, మీరు ఇదివరకు తెచ్చిందే తెమ్మని చెప్పారుట కదా సార్" అన్నాడు. అప్పుడు వెలిగింది మనవాడికి, ఆ పక్క బల్ల వాడు ముందు కూడా సాంబార్వడ order చేసి ఉంటాడు అని. తగువు పెట్టుకుంటే అసలు విషయం తెలిసిపోతుందని, "అయ్యో, నేనో పరధ్యానంలో ఉన్నాను" అని owner తో చెప్పి మళ్ళీ ఉప్మా తినేశాడు.

మూడో సారి కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనవాడు menu తిరగేశాడు. "సరే, అది ఉప్మా అనుకో, మిగతావేవీ ఉప్మా కాకూడదు కదా?" అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అని ఉప్మాకు అతిదూరంలో ఉన్న, menu లోనే ఆఖరి item ని order చేశాడు. అదేదో మిగతావాటికంటే వేరే font తో, special గా ఉంది, కచ్చితంగా ఏదో అద్భుతమే అయ్యుంటుందని ఊహించాడు. ఆ waiter ఒక వెర్రిచూపు చూసి, వెళ్ళి owner తో మాట్లాడాడు. Owner వచ్చి, "సార్, మీరు చెప్పింది మేము తీసుకురాలేము", అన్నాడు. "ఎందుకు తీసుకురాలేరు", అని అడిగాడు మనవాడు. ఆ owner ఒక వెటకారపు నవ్వు నవ్వి, "ఆ menu చివరిలో ఉన్నాది, నా పేరు సార్", అన్నాడు.

మొత్తానికి కథానాయకుడికి ఉప్మా తప్ప వేరే ఏదైనా తినాలనే కోరికకు అలాగ అడ్డంకులు పడుతూ వచ్చాయి అన్నమాట. నా పరిస్థితి కూడా అలాగే ఉంది.


--
సెర్చి పార్టీలకు: Viveka Vardhani/Vardhini Public School, Arumugam Sivasami/Sivasamy, Tuni

Friday, June 11, 2010

చిట్టికథ - అన్ని విద్యలనీ గౌరవించాలి

(ఈ కథకు మూలం ఏమిటో నాకు తెలియదు. పెద్దలనుండి విని చెప్తున్నదే. అందుచేత ఏమైనా తప్పులుంటే చెప్పగలరు. ఈ వ్యాసం ఏదో ఒక శాస్త్రాన్నో, విద్యనో, ఎవరో ఒక వ్యక్తినో, సమూహాన్నో విమర్శించడానికో, కించపరచడానికో వ్రాయలేదు. ఎక్కడైనా పొరబాటు కనిపిస్తే తప్పక తెలియజేయగలరు. నేను వెంటనే సవరిస్తాను.)

పూర్వం ఒక బ్రాహ్మడు పొరుగూరుకెళ్దామనుకున్నాడు. దానికి ఒక నది దాటాల్సివచ్చింది. ఆ నది మీద పడవ నడిపే వాడు (రేవుబోయ) ఒకడు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు అతడిని తన పడవలో నది దాటించమన్నాడు. ఆ బోయ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి పడవలో నది మీద సాగుతున్నారు.

 ఇంతలో బ్రాహ్మడు ఆ బోయని, "ఏమయ్యా, నువ్వు భాగవతం చదివావా?" అని అడిగాడు. ఆ బోయ, "అబ్బే నాకు చదవడం రాదు సాములు", అన్నాడు. దానికి ఆ బ్రాహ్మడు నివ్వెరబోయి, "అయ్యో, ఐతే నీ జీవితంలో సగభాగం వృథా చేసుకున్నావయ్యా", అన్నాడు. ఆ బోయ "అయ్యో" అన్నట్టు చూశాడు. అప్పుడు బ్రాహ్మడు, "పోనీ మహాభారతం విన్నావా?", అని అడిగాడు. "లేదు సాములు", అన్నాడు బోయ. దానికి ఆ బ్రాహ్మడు మరింత ఆశ్చర్యపోయి, "మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. మహాభారతంలో ఉన్నవన్నీ ఈ ప్రపంచంలో ఎక్కడో జరుగుతూనే  ఉంటాయి. అది వినకపోవడం నీ దురదృష్టం", అన్నాడు. మళ్ళీ బోయ కించిత్ బాధపడ్డాడు. ఆ తరువాత బ్రాహ్మడు, "కనీసం రామాయణం తెలుసునా?" అన్నాడు. అది కూడా తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు బోయ. దాంతో బ్రాహ్మడు "అయ్యయ్యో, అఙ్ఞానంతో నీ జీవితాన్ని నదికి, పడవకి అంకితం చేసుకోకు, ఇవన్నీ తెలియని జన్మ నిరర్థకం", అన్నాడు.

కొంతసేపు ఆగి ఆ బోయ "సాములు, మీకు ఈత వచ్చా?" అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మడు, "ఈతదేముందయ్య? అది నీళ్ళను ఈదడానికే పనికొస్తుంది. భవసాగరాన్ని ఈదడానికి పనికిరాదు", అన్నాడు. బోయ, "ఐతే గొప్పచిక్కొచ్చిపడింది సాములోరు. నది పోటెత్తుకుంది. ఇంకాసేపటిలో పడవ పగిలిపోతుంది. అప్పుడు నది ఈదుకొని దాటాలి. నాకు ఈత వచ్చు. మీకు రాదాయె!", అన్నాడు. ఒక్కసారిగా ఆ బ్రాహ్మడు "అమ్మో, ఇప్పుడెలాగ? నన్నెలాగైనా కాపాడు బాబు. నీకు దండం పెడతా!", అని ఆ బోయని వేడుకున్నాడు.

కథ అంతే! ఈ కథ వినగా నాకు స్ఫురించిన విషయాలు చెప్పదలుచుకున్నాను. అవి:

1. నిజంగా భవసాగరంలో చిక్కుకుపోయిన బోయని చూసి బ్రాహ్మడు జాలిపడితే, వాడికి పనికొచ్చే రెండు మంచిముక్కలు ("బాబూ, రామాయణంలోని నీతి చెప్తాను, విను" అనో, "హరినామస్మరణ మహత్మ్యం తెలుసుకో", అనో) చెప్తే బాగుండేది. అంతే కానీ, అవతలవాడి విద్యనో, వృత్తినో తక్కువ చేసి మాట్లాడటం తప్పు. ఎవరి ధర్మం వారిది. అన్నీ వృత్తులూ ఉండబట్టే ఈ భౌతికప్రపంచం సాగుతోంది కదా?

మనం కూడా ఇంజినీరింగు కాలేజీలలో చూస్తూ ఉంటాము, "అరే నీది ఫలానా బ్రాంచా? ఎందుకురా? కంప్యూటర్ సైన్సో, ఎలెక్ట్రానిక్సో తీసుకోవచ్చును  కదా?", అని అంటూ ఉంటారు. వాళ్ళల్లో, "సరే, నాకు ప్రోగ్రామింగ్ నేర్పుతావా?", అని అడిగితే నేర్పేవాళ్ళెంతమంది. అది కూడా ఈ బ్రాహ్మడి జాలి/విఙ్ఞానం వంటిదే!

2. నిజంగా అంత భవసాగరాన్ని ఈదేటువంటి విఙ్ఞానం, స్థితప్రఙ్ఞత ఉన్నవాడే ఐతే అట్టి ప్రమాదంలో భగవంతుణ్ణి ధ్యానించాలి, ప్రాణభయం లేకుండా చెయ్యగలిగినదేదో తెలుసుకోవాలి, గత్యంతరం లేకపోతే పరమాత్ముడిపై ధ్యానాన్ని నిలిపి "నీవే దిక్కు" అనాలి (గజేంద్రమోక్షంలో లాగా) కానీ, వెంటనే కంగారు పడితే "చదివిందంతా నాలుకపైనే ఉంది, మనసులోకి వెళ్ళలేదు" అని అర్థం.

ఇది కూడా మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాము. కొంతమంది "ఆర్ట్ ఆఫ్ లివింగ్", "పర్సెనాలిటీ డెవెలప్మెంట్" వంటి కోర్సులు చేస్తూ ఉంటారు. వారికి శమము ఆ కోర్సులో ఉన్నంతసేపే ఉంటుంది కానీ, ఆ తరువాత కనబడదు. గతంలో నేను కూడా భగవద్గీత పదే పదే చదివుతూ, తలుచుకుంటూ ఉండేవాడిని కానీ చిన్న విషయాలకు కూడా కోపపడేవాడిని. ఒక రోజు మా తమ్ముడు నాతో అన్నాడు, "ఇంత చిన్న విషయాలకు కూడా కోప్పడితే ఇంక నువ్వు చదివిన భగవద్గీత నీకేమి మప్పిందిరా అన్నయ్య?", అని. అప్పటినుండి కొంత శాంతం అలవరుచుకున్నాను.

Wednesday, March 17, 2010

కిట్టు కథలు - తండ్రి ప్రేమ

కిట్టుకి భాగ్యనగరంలో ఒక పెద్ద MNC లో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిన వెంటనే తన తండ్రి సుబ్బారావుకి phone చేసి అక్కడ విషయాలన్నీ చెప్పాడు. అది విని సుబ్బారావు చాలా సంతోషించాడు. ఇక తనకున్న తగులూమిగులూ భూములని అమ్మి ఆ డబ్బు తీసుకుని భార్యతో సహా కిట్టు దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఏ తండ్రికైనా వచ్చే సంతోషమే తనకూ వచ్చింది.

రాత్రి దగ్గరే ఉన్న హోటల్లో భోజనం చేసి కిట్టు తన room-mateతో మాట్లాడుతూ ఇంటివైపికు నడుస్తున్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే అది కిట్టు వాళ్ళ మేనత్త కొడుకు, శివ. తను వరసకు బావ అయినా కిట్టు కంటే చాలా పెద్దవాడు. శివ తల్లికి, కిట్టు తండ్రికి పదిహేనేళ్ళ వయోభేదం ఉంది. అతను వైజాగ్లోనే కిట్టు ఇంటికి దగ్గరలో ఉంటాడు. ఎత్తగానే, "ఒరేయ్ నాన్న, నువ్వు urgent గా బయల్దేరి వైజాగ్ వచ్చెయ్యరా. నాన్నని ఆసుపత్రిలో చేర్పించాము.", అని అన్నాడు. కిట్టుకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన తండ్రికి దగ్గూ, జ్వరం కూడా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు కిట్టుకి. ఉన్నట్టుండి hospitalలో admit చెయ్యడమేమిటా అనుకుంటుండగానే, "వివరాలన్నీ రేపు నువ్వు వచ్చాక మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి నువ్వు దొరికిన bus ఎక్కి వచ్చెయ్యి", అని పెట్టేశాడు శివ.

కిట్టు వెంటనే బస్సెక్కి వైజాగ్ చేరుకున్నాడు. ICU బయట తన తల్లి కళ్ళల్లో నీళ్ళతో కూర్చుని ఉంది. "ఒరేయ్ నాన్నా, మీ నాన్న నిన్న సీతాపురం వెళ్ళివచ్చారు. వస్తూనే ఏమీ మాట్లాడకుండా, భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి పడుకున్నారు. కాసేపటికి వొళ్ళంతా చెమటలతో, మొహం ఎర్రగా అయిపోయి, "అరుణ, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అన్నారు. వెంటనే శివగాడికి ఫోన్ చేశాను. వాడు వచ్చి హాస్పిటల్లో చేరిపించాడు. రాత్రినుండి ఇక్కడే కూర్చుని ఉన్నాను. ఎవరూ నాకు ఏమీ చెప్పట్లేదు. డాక్టర్ నువ్వు వచ్చాక మాట్లాడతానన్నారు. త్వరగా వెళ్ళి విషయం ఏంటొ కనుక్కోరా", అంది. తన తల్లికి కాస్త ధైర్యం చెప్పి ICUలోకి వెళ్ళాడు.

ఒంటినిండా వైర్లతో చుట్టూ మెషీన్లతో ఉన్న సుబ్బారావుని చూస్తూనే కిట్టుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెళ్ళి, "నాన్నా", అని పిలవగానే "సర్, ఆయన్నిప్పుడు మాట్లాడించకూడదు. మిమ్మల్ని doctorగారు కలవమని చెప్పారు", అంది ఒక నర్సు. కిట్టు బాధగా డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్, "మీరేనా సుబ్బారావుగారి అబ్బాయి?", అని అడిగాడు. "అవునండి", అన్నాడు కిట్టు. "కూర్చోండి. మీ నాన్నగారి పరిస్థితి గమనిస్తున్నాము. ప్రస్తుతానికి బానే ఉంది. కాకపోతే ఇంకా నయమైంది అని చెప్పలేము.", అన్నాడు డాక్టర్. "అసలేమైంది డాక్టర్? మా నాన్నగారికి ఎప్పుడూ అనారోగ్యం చెయ్యడం నేను చూడలేదు", అన్నాడు కిట్టు. "ఆయనకి BP ఉంది. ఎప్పటినుండో heart-related-problem ఉంది. ఆయన check చేయించుకోలేదు. మీరైనా చేయించి ఉండాల్సింది. యాభై ఏళ్ళు దాటాక అందరూ health-check చేయించుకుంటూ ఉండాలి అండి.", అన్నాడు డాక్టర్. "ఐతే ఇప్పుడు మా నాన్నగారికి  ఆపరేషన్ చెయ్యలా?", అడిగాడు కిట్టు. "ఇప్పుడు ఆయన గుండెకి ఆపరేషన్ కి తట్టుకునే బలం లేదు. కొన్నాళ్ళు observationలో పెట్టి అప్పుడు నిర్ణయించాలి. అప్పటిదాకా ఆయన్ని మాట్లాడించద్దు. మీ బంధువులని కూడా ICU లోనికి పోనివ్వద్దు అండి.", అన్నాడు డాక్టర్. "అలాగే అండి. ఉంటాను", అని చెప్పి కిట్టు బయటకు వచ్చేశాడు.

బయట బల్ల మీద కూర్చుండగా శివ వచ్చాడు. "ఒరేయ్ నాన్న, మీ నాన్నను చూశవా, డాక్టర్ తో మాట్లాడావా?", అని అడిగాడు. "చూశాను బావ. డాక్టర్ గారు ఇంకా అబ్సర్వ్ చెయ్యాలి అంటున్నారు", కిట్టు అన్నడు. "నాతో కూడా అలాగే అన్నారు. బాధ పడకురా. తండ్రిలాంటివాడే అన్యాయం చేస్తే ఎవరికి  గుండె మండదు?", అన్నాడు శివ. అదేమిటి అన్నట్టు చూశాడు కిట్టు. "నిన్న మీ నన్న సీతాపురమ్నుండి వస్తూ మీ ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం నాతో చెప్పాడు. మీ నాన్నకి ఉన్న భూములు అమ్మి నీ పేరున fixed depositలు వేద్దామని అనుకున్నాడురా. అందుకే తన భూములని ఎవరో కొనడానికి వస్తే చూపించడానికి సీతాపురం తోటకి వెళ్ళాడు. అక్కడ మీ తోటని కొలిస్తే రెండు ఎకరాలు తక్కువ వచ్చాయి. తాతయ్య చనిపోయినప్పుడు మావయ్యకి ఐదేళ్ళు. అమ్మమ్మకి (కిట్టూకు నాన్నమ్మ) అసలు ప్రపంచకఙానం లేదని మన చినతాతే తనవాటా, మన తాతయ్యవాటా కూడా చూశేవారు. మావయ్యను పెంచడానికి అమ్మమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు మావయ్య చదువు పూర్తయ్యాక చినతాత తాతయ్య వాటా మావయ్యకి ఇచ్చారు. నేను మావయ్యకి చెప్తూనే ఉన్నాను 'వొకసారి కొలిపించు మావయ్యా', అని. కొలిపించకుండా తీసుకున్నాడు. మావయ్యకి చినతాత అంటే గుడ్డినమ్మకం. తనను సొంతకొడుకులాగా పెంచిపెద్దచేసినవాడు తనను ఎందుకు మోసం చేస్తాడు అని! చినతాత మనిషి మంచివాడే అయినా, మావయ్య అంటే అభిమానం ఉన్నా తన భార్య అలాంటిది కాదు కదా. ఎప్పుడూ తన ఆస్తి ఏదో మనం తినేస్తున్నట్టుగా అనుకునేది. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళ తరువాత చూసుకుంటే తెలిసింది, మావయ్యకు రావాల్సిన రెండు ఎకరాలు చినతాత ఉంచేసుకుని, తన కొడుకు పేర్న వ్రాసుకున్నాడు అని. ఆ విషయం తెలియగానే మావయ్య వెళ్ళి చినతాతని తన తోట తనకు ఇచ్చెయ్యమని అడిగితే చినతాత ఇవ్వనన్నాడు. సుమారు నూరేళ్ళు ఉంటాయి ఆయనకి, మునిమనవల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఐనా కూడా ఆయనకు డబ్బు మీద మక్కువ పోలేదు. మావయ్య నీకోసం దాచిన ఆస్తి ఆ భూమే. అదే నీకు దక్కనివ్వకపోతే ఆయనకు కోపం వచ్చి చినతాతతో తగువు పెట్టుకుని వచ్చేశాడు. అదే బాధ మనసులో పెట్టుకోవడం వలన ఇలాగ గుండెపోటు వచ్చింది", అన్నాడు. వింటూనే కిట్టుకు రక్తం మరిగిపోయింది. వెళ్ళి చినతాతని "నూరేళ్ళు వచ్చాయి. మునిమనమళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నీ కళ్ళతో నీ కొడుకు వయసువాళ్ళు చనిపోవడం చూసి ఉంటావు. నీ మనవరాలు వయసు వాళ్ళు భర్తను కోల్పోవడం చూసి ఉంటావు. తాత, నీకు ఇంకా విరక్తి కలగలేదా?", అని అడుగుదామనిపించింది. కోపం కంటే కర్తవ్యం ముఖ్యమని అనుకుని తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, డాక్టర్తో మాట్లాడాను. రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. నువ్వు టిఫిన్ చేశావా? పద తిందుగాని?", అన్నాడు.

రెండుమూడురోజులు గడిచాక సుబ్బారావు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. త్వరలోనే general ward కి మారుస్తాము అని చెప్పాడు డాక్టర్. కిట్టుని తండ్రితో మాట్లాడనిచ్చారు. కిట్టు లోపలికి రాగానే సుబ్బారావు కుశలప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానం ఇచ్చి, నాలుగు మంచి మాటలు చెప్పిన కిట్టు, కాసేపటికి జరిగిన విషయం గుర్తుకొచ్చి, "నాన్న, పండుముసలివాడయిపోయి, నరాలు చచ్చుపడిపోతున్నా ఎందుకు నాన్న చినతాతకి అంత డబ్బు పిచ్చి. ఆయనేమీ చచ్చేటప్పుడు పట్టుకుపోడు కదా? వంద సంవత్సరాలు బ్రతికినా మనిషికి విరక్తి రాదేమిటి? పెళ్ళాం మాట పట్టుకుని మీకు ఎందుకు ద్రోహం చేశారు నాన్న?", అన్నాడు. అప్పటిదాకా శాంతంగా ఉండి, వీలైనంతవరకు నవ్వడానికి ప్రయత్నించిన సుబ్బారావు ఒక్కసారిగా, "నోర్ముయ్!", అన్నాడు. అప్పటిదాకా దీనంగా ఉన్న కిట్టుకు ఒక్కసారి కరణాలన్నీ జాగృతమయ్యాయి. "ఎవడ్రా మా బాబాయికి వందేళ్ళు అన్నది? ఆయన పుట్టింది 1917లో. ఇప్పటికి ఆయన వయసు 93 ఏళ్ళు. మా బాబాయి గురించి మాట్లాడటానికి మీకెవ్వరికీ హక్కు లేదు. పుట్టినరోజుకని నాకు బట్టలు కుట్టించడం కోసం డబ్బులు అడుగుదామని, మా అమ్మ తన పుట్టింటి నుండి ప్రయాణం చేసి వస్తే ఇంట్లోకి కూడా రమ్మనేది కాదు మా పిన్ని. బయట గంటలకొద్దీ చింతచెట్టుకింద చెప్పులు లేకుండా నిలబడేది మా అమ్మ నా కోసం. అప్పుడు మా బాబాయ్ వచ్చి మమ్మల్ని మనస్పూర్తిగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి గడ్డపెరుగు కలిపి పెట్టేవాడురా. ఆయన పెళ్ళాం మాట విని మాకు అన్యాయం చేసి ఉంటే ఇలాగ మనం ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. మా అన్నయ్య (చినతాత కొడుకు) ఉట్టి వెర్రిబాగులవాడురా. వాడికి ఏమీ తెలియదు. వాడి తెలివిదక్కువతనంతో ఎక్కడ కొంచం ఆస్తి పాడుచేసినా ఇంకా ఉంటాయని ఆ రెండు ఎకరాలూ తీసుకున్నాడు. ఐనా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు?", అన్నాడు సుబ్బారావు. కిట్టూ అలాగ చూస్తూ ఉండిపోయాడు. ICUలో ఉండి, కొడుకు కన్నీళ్ళతో వచ్చి కూర్చుంటే ఇలాగ తిట్టి, తనకు అన్యాయం చేసిన బాబాయ్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు తండ్రి అన్నది తనకు అంతు పట్టలేదు.

చిన్నబోయిన కిట్టూని చూసి, సుబ్బారావు కాస్త నెమ్మదిపడి, "ఒరేయ్ నాన్న, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సహిస్తావా? లేదు కదరా? అలాగే మా బాబాయ్ ని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేనురా. వరసకు బాబాయే కానీ, ప్రేమకు తండ్రికి ఎప్పుడూ తీసిపోలేదురా. నా అక్కచెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. నన్ను చదివించాడు. నా ఆస్తిని ఇరవయ్యేళ్ళు కాశాడు. ఇంతకంటే ఇంకెవరు చెయ్యగలరురా?", అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు అక్కలందరికీ కట్నం కోసం చూసుకుని తక్కువ సంబంధాలు చేశాడని, తన ఆస్తిలో ఒక భాగం తీసేసుకుని మోసం చేశాడని, ఆ చినతాత సొంతబిడ్డలే అనుకుంటూ ఉండగా చాలాసార్లు కిట్టు విన్నాడు. అలాంటిది ఇంకా తన తండ్రి గుడ్డిగా చినతాతను నమ్మడం ఇంకా కిట్టు సహించలేకపోతున్నాడు. తను పరిస్థితి గమనించిన సుబ్బారావు, "నేను ఎందుకు తోటలు అమ్మాలనుకున్నానురా? ఆ డబ్బులు నీకు ఇద్దామనే కదా? అలాగే ఆ రెండు ఎకరాలూ తన కొడుక్కి ఇద్దామనుకున్నాడు మా బాబాయ్. ఎటొచ్చి అవి న్యాయంగా నాకు చెందాల్సినవి. అది నీకు అన్యాయం అనిపించవచ్చు. ఎప్పుడూ మా బాబాయ్ కి ఎదురుగా ఒక్క మాట కూడా మాట్లాడని నేను ఆ రోజు 'ఇకనుండి నువ్వు ఎవరో, నేను ఎవరో. నీకూ నాకూ సంబంధం లేదూ, అన్నాను తెలుసునా?", అన్నాడు సుబ్బరావు. ఇది విని కిట్టు ఆశ్చర్యపోయాడు. తన బంధువర్గమంతా "సుబ్బారావే వాళ్ళ బాబాయ్ కి కన్నకొడుకుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాడు.", అని పేరు. "బాబాయ్ ని అంత గౌరవించే నా చేత అంత మాట అనిపించిందిరా పిల్లల మీద ప్రేమ. మరి వయసు మీరిపోయి, కొడుకు అమాయకుడు, ఏమవుతాడో అన్న బెంగ ఆయనకు ఉంటుంది కదరా? అందుకే అలాంటి పని చేశాడు. సొంతపిల్లల మీద ప్రేమతో పెంచిన కొడుకు దగ్గర రెండు ఎకరాలు తీసుకోవడం తప్పైతే, పిల్లలమీద ప్రేమతో పెంచి పెద్ద చేసిన బాబాయ్ ని అంత మాట అనడం కూడా తప్పే!", అన్నాడు సుబ్బారావు. కిట్టుకి ఒక విషయం అర్థమయ్యింది. తన మీద ప్రేమతో తన తండ్రి చినతాతని ఎదిరించాడు తప్పితే, ఆ డబ్బు మీద అసలు సుబ్బారావుకు ఆశ లేదు. "నాన్నా, చినతాతయ్య గురించి నేను ఏమీ అనను. కానీ, ఆ రెండు ఎకరాల గురించి మీరు మరిచిపోండి. నేను సంపాదిస్తున్నాను కదా డబ్బులు. అవి చాలు నాన్నా మనకి. మీరు చెప్పించిన విద్యాబుద్ధులు ఉన్నాయి. అంతకు మించి నాకేమీ వద్దు నాన్న!", అన్నాడు కిట్టు. "నీకున్న పాటి బుద్ధి నాకు లేకపోయిందిరా. మా బాబాయ్ చెప్పించిన విద్యాబుద్ధులున్నాయి కదా. ఐనా ఆ భూమి కోసం నేను పెద్దపెద్ద మాటలన్నాను. బాధపడుతూ ఉంటాడేమో", అన్నాడు సుబ్బారావు. విని కిట్టూ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. సుబ్బారావుని rest తీసుకోమని చెప్పి బయటకు వచ్చాడు.

కిట్టు ICU బయట బల్ల మీద కూర్చుని ఆలోచించాడు, "ఏమిటి? నాన్నకి వాళ్ళ బాబాయ్ మీద అంత గౌరవం? కేవలం నాలుగు మంచిమాటలు మాట్లాడి, మా ఆస్తి కొన్నాళ్ళు చూసిపెట్టినందుకే? మరి నాన్న నన్ను పెంచి పెద్దవాడిని చేసి, ఏది అడిగితే అది కొనిపెట్టారు నాకు కూడా నాన్న పట్ల ఇంతే గౌరవం ఉందా? నాన్న ఏదైనా పొరబాటు చేస్తే నేను ఇలాగే సహనంతో ఓర్చుకుంటానా? ఏదేమైనా సరే, ఈ సంఘటన ద్వారా నాకు ఒకటి తెలిసింది. ఒక మనిషి మనకు కోపం తెప్పించినప్పుడు, ఆ మనిషి మనకు గతంలో చేసిన మంచిని మరిచిపోకూడదు. తప్పులందరూ చేస్తారు. కానీ, వాటిని అవతలవాళ్ళ దృష్టిలోనుండి అర్థం చేసుకుని క్షమించకపోతే అప్పుడు ఆ అనుబంధానికి విలువే లేదు. నాన్నా! నేను గొప్ప universityలో masters  చదివాను. కానీ, నాకు ఇలాంటి పాఠం ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ICUలో ఉండి మీరు చెప్పారు.", అనుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నాన్న condition మెరుగుపడిందిటమ్మా. general ward లోకి shift చేస్తున్నారు.", అని చెప్పాడు. అప్పటిదాక కంట కునుకు లేకుండా ఉన్న అరుణ మొహంలో కాస్త కాంతి కనబడింది.

Monday, January 25, 2010

రాంబాబు కథలు - స్త్రీద్వేషి

రాంబాబు ఏదో ఒకరోజు మారతాడు, కార్పొరేట్ సెంటు పూసుకుంటాడు అని చందుకి ఎక్కడో కొంచం ఆశ ఉండేది. కానీ, ప్రతీ రోజూ ఇంగ్లీషు idioms కి విపరీతార్థాలు తీస్తూ idiot అనిపించుకుంటూనే ఉన్నాడు. చందు, రాంబాబు అమాయకత్వాన్ని చూసి తన రూంలోనే ఉండమన్నాడు. వాళ్ళు ఇప్పుడు room-mates and  team-mates. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాయి. తఱువాత చందు మిత్రుడి ద్వారా వెంకట్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. తనూ software engineer ఏ కావడం, వాళ్ళ office చందు ఇంటికి దగ్గరగా ఉండటం చేత చందు వాళ్ళ ఇంట్లోనే చేరతానంటే చందు ఒప్పుకుంటాడు.  ఒక మధ్యాహ్నం పూట వెంకట్ సామాన్లతో చందు, రాంబాబుల ఇంట్లోకి దిగాడు. అప్పటినుండి వెంకట్కి చెవుల్లో జోరీగ duplex house కట్టుకుని కాపురం ఉంటున్న feeling మొదలైంది.

వెళ్తూనే రాంబాబుని చూసి, "Hello, I am Venkat, from Vijayawada!" అన్నాడు. దానికి రాంబాబు, "I am Rambabu from baapaTla." అన్నాడు. వెంటనే రాంబాబు చిరునవ్వుతో "Do you care for a చిలగడదుంప?" అన్నాడు. ఒక్క నిముషం వెంకట్ కి అర్థం కాలేదు. అది గమనించిన చందు, "ఏం లేదు వెంకట్, రాంబాబు 'చిలగడదుంప తింటావా?' అని అడుగుతున్నాడు", అన్నాడు. దానికి వెంకట్ రాంబాబుని చూసి, "నేను తెలుగువాడినేనండి", అన్నాడు. దానికి రాంబాబు, "I know. But, still I talk in English only", అన్నాడు. ఆ shock నుండి వెంకట్ తేరుకుని ఇల్లు సర్దుకునేసరికి రాత్రి అయ్యింది. ఆ time కి రాంబాబు వంట చేసాడు.

భోజనానికి paper పరుచుకుని ముగ్గురూ కూర్చుక్న్నారు. వెంకట్ కూర తిన్నవెంటనే మజ్జిగ packet పట్టుకోవడం చూసిన రాంబాబు, "Hey, Help yourself to some పులుసు!" అన్నాడు. dinnerతోపాటు ఖంగు తిన్న వెంకట్, "రాంబాబు, పులుసు అనేది తెలుగుపదం కదా? మరి దాన్ని ఇంగ్లీషు వాక్యంలో ఎలాగ వాడుతున్నావు?", అని ధర్మసందేహం అడిగాడు. దానికి రాంబాబు ఒక నవ్వు నవ్వి, "How much possible, that much I talk in English. I do my best and leave the rest!" అన్నాడు. అప్పుడు తెలిసింది వెంకట్కి తను భోజనం చేసి అక్కడనుండి వెళ్ళిపోవడం ఉత్తమం అని.

పొద్దున్నే లేచి సుప్రభాతం వినడం అలవాటు ఉన్న వెంకట్ laptopలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సుప్రభాతం పెట్టాడు. ఆ సడికి మెలుకువొచ్చిన రాంబాబు లేచి, "Oh! Morning morning you listen సుప్రభాతం ఆ?", అన్నాడు. అది విన్న వెంకట్ వెంటనే సుప్రభాతం కట్టేసి, తన చెవులకి కాస్త శాంతిని కలిగిద్దామని bathroomలోకి దూరాడు. brush తీసి దానిపైన paste వేశాడో లేదో, ఇంతలో రాంబాబు తలుపుతట్టి, "Hey, I want to write oil to my hair. Please give me Parachute." అన్నాడు. నాలికబద్దతో రాంబాబు నాలిక కోసెయ్యాలి అనిపించినంత కోపం వచ్చినా సముదాయించుకుని ఆ నూనెసీసా బయటకు ఇచ్చి రక్తం వచ్చేంత speedగా పళ్ళు తోముకున్నాడు.

రాంబాబు NDTV పెట్టుకుని వార్తలు వింటున్న సమయంలో చందు లేచి వచ్చాడు. అప్పుడు వెంకట్, చందు ఏదో బాతాఖానీ కొట్టుకుంటూండగా, తనకు ఆఫీసులో ఒకమ్మాయి ఎంతగా కోపం తెప్పించిందో చందు చెప్తున్నాడు. "That is why I hate ladies", అని రాంబాబు, ఎక్కడనుండి వచ్చాడో తెలియకుండానే వచ్చి అన్నాడు. వెంకట్ 'ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావూ?' అన్నట్టు ఒక చూపు చూశాడు. అప్పుడు రాంబాబు ఇచ్చిన ఉపన్యాసానికి వెంకట్కి సన్యాసం తీసుకోవాలి అనిపించింది. "I hate ladies. Coolly they come at 10'o clock to office like Perantaas. I tell them the work like a parrot. They listen with one ear and leave it another ear.Everything is over-head-transmission. They don't finish their work before deadline. When I ask them why, they start dropping crocodile tears. They have no insight but want onsite. It is not words to tell the headache they create.", అన్న రాంబాబును చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు వెంకట్. రాంబాబు ఆ ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

తను చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీషుని రెండురోజుల్లో మరిచిపోయేలాగా చెయ్యగల రాంబాబుని చూసి వెంకట్కి దిమ్మదిరిగింది. చందుని పక్కకు పిలిచి, "అసలు వీడి problem ఏమిటి? ఎందుకు ఇలాగ ఇంగ్లీషుని ఖూని చేస్తున్నాడు?", అని అడిగాడు. అప్పుడు చందు చెప్పాక తెలిసింది అసలు విషయం.

రాంబాబుకి స్వతహాగా తెలుగంటే పిచ్చయిష్టం. కానీ తన జీవితంలో మరిచిపోలేని దినం - 22-మే-2009 - ఆ రోజు జరిగిన విషాదానికి అతని గుండె ముక్కలుముక్కలయ్యిపోయింది. ఆ రోజునుండి తన పద్ధతే మారిపోయింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రెండింటికి దూరమయిపోయాడు - ఒకటి తెలుగు, రెండు దివ్య!

రాంబాబు చేరిన రెండు మూడు రోజులకే Luckwhereలో మహేష్, దివ్య అనే ఇద్దరు చేరారు. వాళ్ళని రాంబాబు టీంలోనే వేశారు. మహేష్ తమిళుడు. దివ్య తెలుగుది. దివ్యను చూసిన వెంటనే రాంబాబుకు కళ్ళు తిరిగి కిందపడిపోయాడు - "ఏం అందం, ఏం అందం! దివ్య నాకే!" అనుకున్నాడు మనసులో. ముగ్గురూ bank accounts open చెయ్యాలి కాబట్టి కలిసి దగ్గరలో ఉన్న bank కి వెళ్ళారు. మహేష్, దివ్య ఇంగ్లీషులోనే మాట్లాడుకోవడం చూసిన inferiorగా feel అయ్యాడు. ఎలాగైనా తన ఇంగ్లీషు ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. ముగ్గురూ queue లో application forms fill చేసి, పట్టుకు, నుంచున్నారు. మొదట రాంబాబు వెళ్ళి ఆ form అక్కడ ఉన్న officer కి ఇచ్చాడు. "Fill challaan sir", అంది ఆమె. challaan అంటే ఏమిటో తెలియని రాంబాబు అది కన్నడం అనుకుని, "Speak in English, అన్నాడు. ఆమె, "I spoke in English sir", అంది. వెంటనే మహేష్, దివ్య నవ్వారు. ఆ గాయం తాకిన బరువైన గుండెతో రాంబాబు ఆఫీసుకి వచ్చేశాడు. ఆ బాధను మరిచిపోవడానికి అరగంట foosball ఆడాడు, అరడజనుసార్లు కాఫీ తాగాడు. కాస్త మనసు కుదుటపడ్డాక తన computer ముందుకు వచ్చి కూర్చున్నాక తన teamలో తెలుగువారందరూ cinema కి వెళ్దామని అనుకుంటున్నారని మనశ్శాంతికోసం తనూ వెళ్ళాలి అనుకున్నాడు. తెలుగు సినిమా కాబట్టి మహేష్ రాడనుకున్నాడు రాంబాబు. పాపం, తనకు తెలియదు అక్కడ తన గాయం మీద కారం పడుతుంది అని.

సినిమాలో రాంబాబు అనే పేరుని చాలా తక్కువగా చూపించి, మహేష్ అనే పేరుని గొప్పదిగా చిత్రీకరించారు. అది చూసి తన colleagues అందరూ (దివ్యతో సహా) తనకేసి చూసి నవ్వడం  మొదలెట్టారు. అది సహించాడు. కానీ, బయటకు వచ్చాక దివ్య "నేనే హీరోయిన్ ని అయితే రాంబాబుని కాదు మహేష్నే పెళ్ళి చేసుకునేదాన్ని", అనడం ఆ 70mm screenని 7mm bladeగా చేసి తనగుండెను కోసినట్లుగా అనిపించింది. సహించాడు. కానీ ఆ తరువాత కొన్నాళ్ళకు తెలిసింది మహేష్, దివ్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని. ఇది జరిగినప్పటినుండి రాంబాబుకు అమ్మాయిలంటే చిరాకు పట్టుకుంది. ఎప్పటికైనా మహేష్ కన్నా పాషుగా ఇంగ్లీషు మాట్లాడి దివ్యకంటే అందమైన అమ్మాయిని ప్రేమలోకి దింపాలన్నది వాడి ఆశయం. అది వాడి విషాదగాధ!

కథంతా ఓపిగ్గా విన్న వెంకట్ తన సానుభూతిని ఒక్కముక్కలో తేల్చేశాడు, "తూ, వీడొక గధా, వీడిదొక గాధ!", అన్నాడు. వెంటనే వెంకట్కి ఒక సందేహం వచ్చింది, "అవునూ, వీడికి అమ్మాయిలంటే ద్వేషమన్నావు? మరి ప్రేమలోకి దింపడం దేనికి?", అన్నాడు. దానికి చందు, "అదే కదా వాడి sadism. అమ్మాయి తనకు propose చేశాక, no చెప్పి స్త్రీజాతిమీద తనకున్న కచ్చి తీర్చుకోవాలన్నదే వాడి తపన!", అన్నాడు చందు. "software industryలో ఇంగ్లీషు-మన్మథుడన్నమాట. అఘోరించనీ", అన్నాడు వెంకట్.

చందు రాంబాబుని సముదాయించడానికి గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాంబాబు ఉడికిపోతూ ఉన్నాడు. చందు, "రాంబాబూ, control yourself", అన్నాడు. రాంబాబు ఊపిరి బలంగా పీలుస్తూ మఱొక ప్రసంగం మొదలుపెట్టాడు.

రాంబాబు: ఈ ఆడవాళ్ళతో ఒక తంటా కాదురా బాబు. గొప్ప చిరాకు తెప్పిస్తారు.  వీళ్ళను చూసి చూసి నాకు పెళ్ళి చేసుకోవాలనే కోరిక నానాటికీ చచ్చిపోతోంది. చందు (మనసులో): ఇప్పుడు నిన్ను పెళ్ళి గురించి ఎవరడిగారు?  రాంబాబు: మనిషి తనకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే ఒప్పుకుని, అనుకూలంగా లేనిదాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ, అలాగ చెయ్యడంలో కాస్త కన్సిస్టెన్సీ ఉండాలి కదా? అహా, అసలు మనలో మన మాట! చందు: అవునురా? ఇప్పుడేమైంది?
రాంబాబు: స్త్రీపురుషుల సమానత్వం అంటారు - ముప్పీమూడు శాతం reservation అంటారు! ఒరేయ్, అందరం కలిసి shopping కి వెళ్తే డబ్బు ఖర్చు చేసేది మనము, luggage మోసేది కూడా మనమేనా? ఇదేం న్యాయం రా?
చందు: నిజమే! రాంబాబు: నిజాలు చెప్తే ఒప్పుకోరు, ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేరు.  డ్రెస్సులు కొంచెం ఆకర్షించేలాగ వేసుకోవాలనుకుంటారు. అదేమంటే - మాకు comfortable గా ఉండద్దా? అంటారు. జాకెట్టుకు బొక్క- ఏమన్నా అంటే మాధురీ దీక్షిత్ దీనికక్క! గుడ్డ్లప్పగించి చూసేవాళ్ళ గురించి లెక్చర్లు దంచుతారు. మగవాళ్ళు ఆడవాళ్ళను కాక వీధిలో కుక్కల్ని, విహాయసవీధిలో చుక్కల్ని చూస్తారా? చందు: అవును. (ఇంత ఆవేశంలో కూడా ప్రాస కోసం రాంబాబు పడే ప్రయాసను చూసి నవ్వుకున్నాడు). రాంబాబు: ఏ దేశంలోనైనా మగవాడలాగే ఉంటాడంటే ఒప్పుకోరు. ఏమైనా అంటే ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటారు. నేను కాలేజీలో జాయినైన కొత్తల్లో ఒకడు మా పక్కనుండి వెళ్తున్నమ్మాయిని చూసి movie styleలో కామెంటు చేశాడు. నేను, "తప్పురా, పరస్త్రీ మాతృసమానురాలు" అన్నాను. దానికి వాడు, "మన స్త్రీ ఎవరో తెలిస్తేనే కదా, పరస్త్రీ ఎవరో తెలియడానికి", అన్నాడు.చందు: హ హ హ, వాడన్నదాంట్లో కూడా కొంత విషయం ఉంది.రాంబాబు: అది సరే. కానీ, వాడు అమ్మాయి ముందు మాట్లాడేటప్పుడు మాత్రం, అభ్యుదయభావాలతో, సున్నితత్వంతో మాట్లాడేవాడు. అప్పుడు తెలుసుకున్నాను అందరూ ఒక లాగే ఆలోచించరు అని. ఆలోచించినదే మాట్లాడరని. ఈ విషయం అమ్మాయిలకు ఎప్పుడు అర్థమవుతుందో! ఏమైనా చెప్దామని ప్రయత్నిస్తే...judge చెయ్యద్దంటారు (ఇదొక విచిత్రం, judge  చెయ్యని మనిషిని చూపించు జగజ్జడ్జీ! అని భగవంతుణ్ణి అడగాలనిపిస్తుంది.) - మరి మగవాళ్ళతో మాట్లాడినట్టే మీతో మాట్లాడితే (అంటే కొంచెం పదునైన మాటల్తో, కఠినమైన వాస్తవాలతో, అక్కడక్కడా level-1 తిట్లతో) ఎందుకు ఒప్పుకోలేరు?చందు: మామ, నీలో మంచి ఆవేశం ఉందిరా. బాగా చెప్పావు.
రాంబాబు: వీళ్ళనర్థం చేసుకోవడం: నా వల్లకాదు, నాదు వల్లకాదు, నా చేతన్, చేన్, తోడన్, తోన్ వల్లకాదు,  నా వలనన్, కంటెన్, పట్టి వల్ల కాదు, నా కొఱకున్, కై వల్లకాదు, నా కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ వల్లకాదు, ఓయీ, ఓసీ, ఓరీ, ఏమే, ఏమేమే, ఓరోరీ నా వల్లకాదు! కాదంటే కాదు. 
చందు: విభక్తులనన్నిటినీ వాడి నీ విరక్తిని చెప్పావు కదరా మాఁవా!