Showing posts with label ఉట్టినే. Show all posts
Showing posts with label ఉట్టినే. Show all posts

Sunday, April 12, 2020

"అల వైకుంఠపురములో" దుర్భరం

అసలు ఈ మధ్యన బ్లాగులో రాయడం మానేశాను. ఎప్పుడో పండగకో పబ్బానికో రాస్తున్నాను. అలాంటిది ఉన్నట్టుండి ఒక పోస్టు రాయాలని అనిపించింది. సాధారణంగా అభిమానంతో రాసే నేను ఈ రోజు చిరాకు, విరక్తితో రాస్తున్నాను. ఎంతోమంది బాగుందని చెప్పారని ఈ రోజు Netflix కి signup చేసి మరీ "అల వైకుంఠపురములో" అనే ఒక సినిమా చూస్తే కలిగిన భావాలవి.

ఈ మధ్యన నేను తెలుగు సినిమాలు చూడటమే తగ్గింది. చూస్తే పాత సినిమాలు, లేకపోతే indie సినిమాలు చూస్తున్నాను. మంచి సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణలు వెతికితే వెంటనే పెళ్ళి చూపులు, బ్రోచేవారెవరురా, మత్తు వదలరా గుర్తొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి కూడా. ఐనా కూడా కొంతమంది దర్శకులు నవ్యత లేని సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.

ఇక సినిమా  గురించి మాట్లాడుకుందాం. నాకు అన్నిటికంటే ముందు చిరాకు వచ్చిన విషయం - బావామరదళ్ళ ప్రణయం. దక్షిణభారతదేశంలో ఇది ఒకప్పుడు మామూలై ఉండవచ్చును. కానీ ఇప్పుడు మనం కూడా సైన్సు చదువుకుంటున్నాము కదా. First cousins పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు అనారోగ్యం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 1980 లోనే మా నాన్న గారిని ఎంతో మంది మరదలినో, మేనగోడలినో పెళ్ళి చేసుకోమంటే పిల్లలు బాగుండాలని వద్దు అన్నారు. ఇది 2020. మనకీ అంతో ఇంతో లోకజ్ఞానం వచ్చింది కదా. ఇకనైనా మనం first cousins పెళ్ళిళ్ళని ఆపమని సందేశం ఇవ్వచ్చునా? పోనీ, సినిమాల్లో సందేశాలెందుకు అంటారా, కనీసం అది glorify చెయ్యకుండా ఉండవచ్చునా? ఈ సినిమాలో రాజ్, తన మరదలైన నందినిని ఇష్టపడతాడు. వేరే దేశాల వరకు ఎందుకు? మన దేశంలోనే ఉత్తరాదిలో దీన్ని అసహ్యంగా భావిస్తారు. బావామరదళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళ లాంటివారే అని వారి అభిప్రాయం. ఈ విషయంలో త్రివిక్రం repeat offender. ఇంతకు ముందు తీసిన "అత్తారింటికి దారేది" లో కూడా ఇదే చేసాడు.

రెండవ విషయం ఆడవాళ్ళ పట్ల రచయిత చులకన భావం. ఈ సినిమాలో పదే పదే హీరొయిన్ కాళ్ళను చూపించడం చిరాకు అనిపించింది. పాట మొదట రాసి తరువాత సినిమా తీసారో, సినిమా రాసిన తరువాత పాట రాసారో తెలియదు. కానీ, చివరికి అశ్లీలంగా అనిపించింది. ఎవరైనా అలాగ office లో ఎవరితోనైనా వ్యవహరిస్తే ఉద్యోగం పీకేస్తారు. ఇక్కడ మన "హీరో" ఏకంగా CEOని అలాగ చూసి వ్యాఖ్యానం చేసినా ఆవిడ ఏమీ అనుకోదు. ఇంతకు ముందు అతారింటికి దారేది సినిమాలో కూడా శమాంతా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు "హీరో" ఆమెకు ఏదో కథ చెప్పి, మీద చేతులు వేసి హడావుడి చెయ్యడం కూడా నాకు లైంగిక వేధింపు నేరంలాగా అనిపించింది. నవ్వు రాలేదు.

మూడో విషయం అర్థం పర్థం లేని పాత్రలు. అసలు సునీల్ పాత్ర ఎందుకు ఉంది, ఏం చేస్తోంది? రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఎందుకు ఉన్నాడు? ఎంతో నైపుణ్యం ఉన్న నటులను పెద్ద పాత్రలలో పెట్టకుండా, ఈ చిల్లర పాత్రలలో ఎందుకు పెట్టినట్టు? ఎవరైనా HR లో పని చేసేవాళ్ళు పొద్దున్నే బైకుల మీద తిరుగుతూ అమ్మాయిల చున్నీలు లాగుతారా? అలాంటి వెధవని ఒక CEO ఐన అమ్మాయి HR లో ఉంచుతుందా? బ్రహ్మాజీ వెనకనుండే రౌడీలు తెల్లవాళ్ళెలాగ అయ్యారు? రష్యా నుంచి వచ్చి రౌడీలుగా హైదరాబాద్లో స్థిరబడ్డారా? బ్రోచేవారెవరురా చిత్రంలో నిండుగా బట్టలు కప్పుకుని, స్వతంత్రనిర్ణ్యయాలు తీసుకోగల ఒక మంచి పాత్ర చేసిన నటి (నివేద) ఈ సినిమాలో సగం సగం బట్టలు వేసుకుని ఎవరో వచ్చి "నువ్వు పెద్ద అందగత్తెవు కాదు కానీ sexy గా ఉన్నావు" అంటే ఎందుకు మురిసిపోయింది. పెద్ద కంపెనీ పెట్టి CEO అయినావిడ ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళికి ఎలాగ ఒప్పుకుందీ? ఆ పెళ్ళి ఆపెయ్యకుండా వేరేవాడిని తల్లిదండ్రుల ఎదురుగుండా ఎందుకు కావలించుకుంటోంది? ఇది మోసం కాదా? ఇవా ఆడవాళ్ళ పాత్రలు రాసే విధానం. రాజ్ నందినిని ఇష్టపడితే board meeting సీన్ లో అమూల్యని చూసి ఎందుకు ఊగుతున్నాడు? వాడు కొంచం నెమ్మెదస్తుడు అని చెప్పారు కానీ, వాడికి ఎవరు ఇష్టమో కూడా తేల్చుకోలేని శుంఠా?

నాలుగో విషయం అర్థం పర్థం లేని కథనం. (1) ఒక పెద్ద ఆఫీసులో ఒకటే lift ఉందా? దాన్ని ఆపడం ఎలాగో పల్లెటూరులో ఉండే ఒక తాతగారికి తెలిసిందా? Freight elevator ఏమైంది? ఆ టైంలో రామచంద్రకికి అప్పలనాయుడుకి meeting ఉంది అని schedule లో ఉంటుంది, నాయుడు లోపలకు రావడం వెళ్ళడం పదిమందీ చూసి ఉంటారు. అయినా కేసు ఎందుకు పెట్టలేదు? (2) పాతికేళ్ళు కోమాలో ఉన్న ఆమె ఉన్నట్టుండి లేవడం, సరాసరి రామచంద్ర కొడుకుని కలవడం, వాల్మీకి చూసి గుర్తుపట్టడం, పూస గుచ్చినట్టు కథ చెప్పటం, అది వీళ్ళ తాత కూడా వినడం - ఇదంతా చిత్తు కాగితాల మీద రాసుకునే కథనం లాగా ఉంది. కోమా లోంచి వచ్చినావిడ "మా అమ్మ ఏది? నాన్న ఏడి? మొగుడేడి? పిల్లలేరీ?" - ఇవేమీ అడగలేదు? corridor లో ఉన్న ఆమె బంటుతో మాట్లాడుతుంటే curtain ఎక్కడ నుంచి వచ్చింది? (3) ఎంత సరదాగా ఉన్నా board meeting లో పాటలు పెట్టి dance చేసేవాడెవడైనా ఉంటాడా? అలాగ చేస్తే share value ఏమౌతుంది? అసలు ఆ సీనే నాకు అర్థం కాలేదు. (4) ఏ తల్లి ఐనా తన కొడుకు ఎదురుగుండా ఇంకోడితో "You are better than my son" అంటుందా? కన్నకొడుకుని బయటకు గెంటి వాడికి సగం ఆస్తి రాసి ఇస్తుందా? వాడు helicopter ఎక్కుతుంటే కుటుంబమంతా వచ్చి చప్పట్లు కొడుతుందా? (5) ఉన్నట్టుండి ఆ రాజ్ వెళ్ళి వాల్మీకి ఇంట్లో ఉండటం ఏమిటో, ఆ ఇంటి ఇల్లాలి ఎదురుగుండా "మందు కొడతాను" అనడం ఏమిటో, ఎవరో బేవార్స్ గాళ్ళను ఇంటికి పిలవడం ఏమిటో? పెళ్ళి కావలసిన కూతురున్న ఏ తల్లైనా ఇవన్నీ ఒప్పుకుంటుందా? ఏంటి ఈ పిచ్చి. (6) "హీరో" ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఎక్కడో వాడు వెళ్ళి వందమంది గూండాలను కొడుతూ ఉంటే, ఇక్కడ రామచంద్ర, యశోదా మేనగోడలి కోసం సంతకాలు పెడతారు అని, రాజ్ మొత్తానికి కోపం తెచ్చుకుంటాడు అని ఎలాగ ఊహించాడో మహానుభావుడు. ఇంటిల్లిపాది చూస్తుండగా రామచంద్ర ఎవరో ఒక అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అని చెప్పడం ఏమి ఔచిత్యమో నాకు అర్థం కాలేదు.

ఐదో విషయం అర్థం పర్థం లేని ఫైట్లు. 2020 లో ఇంకా తెలుగు హీరోలు భౌతికశాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఫైట్లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు చూస్తే ఇది కార్టూనా అనిపించింది. మనిషి భూమి మీద పడి స్ప్రింగులు ఉన్నట్టు ఎలాగ లేస్తాడు? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1980లలో ఫైట్లు మరీ రివాజుగా ఉన్నాయి అని సినిమాల్లో దర్శకులు ఏదో ఒక gimmick పెడుతూ ఉండేవారు. football నేల మీద పడకుండా రౌడీలని కొట్టడం, ఆయుధం వాడకుండా కొట్టడం (స్టేట్ రౌడీ) చూసను. 2020 లో చున్నీ తడిపారెయ్యడం ఒక ఫైటుగా చూస్తాను అని ఊహించలేదు.

నేనూ ఒక రచయితనే. నా శక్తి కొలది మంచివో, చెడ్డవోపద్యాలూ, పాటలూ, కథలూ రాస్తాను. వాటిని ఎవరైనా విమర్శిస్తే బాధ కలుగుతుంది. అందుకని వీలైనంతవరకు వ్యక్తులను కాక వారి పనులను మాత్రమే ప్రయోజనాత్మకంగా విమర్శించే ప్రయత్నం చేస్తాను. కానీ, ఒక్కో సారి మనసు గడి తప్పి ఇలాగ రాయాలనిపిస్తుంది. ఈ సినిమా రచయిత, దర్శకుడు ఐన త్రివిక్రం ని మాటలమాంత్రికుడని ఎందుకు అంటారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. పేరు, బలగం, ప్రజాభిమానం ఉన్న నటులు కూడా మంచి పాత్రలు చెయ్యగలరు అని ఎప్పటినుంచో ఋజువులు ఉన్నాయి. ఇలాంటి అత్తెసరు కథలు, కథనాలు ఎందుకు ఇష్టపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రపంచమంతా ముందుముందుకీ పోతుంటే, మన తెలుగు సినిమా అగ్రవర్గం మాత్రం వెనక్కి వెళ్తోంది. వాళ్ళకే గురూజీ అనీ, intelligent directors అనీ, మాటల మాంత్రీకులని బిరుదులు ఇచ్చుకుంటున్నాము అంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు.

ఈ సినిమా మొత్తానికి పాటలు; జయరాం, మురళీ శర్మల నటన నచ్చాయి. ఈ సినిమా తీసినవారికి, బాగుందని నాతో అన్నవారికి శతకోటి నమస్కారాలు. 

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Sunday, March 31, 2013

వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి...


నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.

You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?


అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.

మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి

తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు  (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

Sunday, February 24, 2013

కొన్ని పద్యాలు



మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.


Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

Monday, November 7, 2011

అదేం పలకరింపు స్వామీ?

ఎవరినైనా పలకరించేటప్పుడు "హలో" అనడం సాధారణం. "నమస్కారం, బాగున్నారా?" అనడం గౌరవసూచకం. కొంతమంది పలకరింపు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు హాస్యానికి, కొన్ని సార్లు వ్యంగ్యానికి మఱికొన్ని సార్లు ఎలాగ మాట్లాడాలో తెలియక ఇబ్బంది వలన, ఇంకొన్ని సార్లు... ఆ వ్యక్తి తీరే అంత. ఎందుకో ఈ రోజు అవన్నీ గుర్తొచ్చాయి.

మా ఊరు విశాఖ జిల్లా తాండవ జంక్షన్ (తునికి, నర్సీపట్నానికి మధ్యలో) దగ్గర "ఎఱ్ఱవరం" లోపల సీతారామపురం. అక్కడ దాదాపు రెండు వందల ఎకరాల మామిడి, జీడి తోటల మధ్యలో ఐదారు కుటుంబాలుండేవి. ఉప్పు కావాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. మేము తునిలో ఉండి చదువుకునే రోజుల్లో ఒక్కోసారి రెండు మూడు రోజులు సెలవలు వస్తే మా ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎఱ్ఱవరంలో దిగి కబుర్లు చెప్పుకుంటూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరైనా తెలిసినవాళ్ళు ఎడ్లబండి మీదనో, సైకిల్ మీదనో వెళ్తూ చూసి ఎక్కించుకుని తీసుకుపోయేవారు.

ఒక సారి ఏడో తఱగతిలోననుకుంటా, నేను ఒక్కడినే వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండలో తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా తెలిసినవాళ్ళు తగలకపోతారా అని మధ్యమధ్యలో వెనక్కి చూస్తూ నడుస్తూ ఉంటే, నాకు తెలిసిన ఒక తాతగారు Luna మీద వస్తూ కనబడ్డారు. మా ఊళ్ళో ఉండే ఐదు కుటుంబాలలో ఆయన ఒక కుటుంబానికి పెద్ద. సరే ఆయన పెద్ద మనిషి, నేను చిన్న పిల్లాణ్ణి, ఇది మిట్టమధ్యాహ్నం -- ఈ సమీకరణంలో ఎలాగ చూసుకున్నా ఆయన నాకు "lift" ఇచ్చే తీరాలి అనుకుని సూర్యుడి కంటే వెలిగిపోతున్న మొహంతో "బాగున్నారా?" అని అడిగాను. ఆయన గంటకు ఇరువై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ, నన్ను గమనించి, దాటి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కన్నడ కంఠీరవ రాజ్కుమార్ లాగా ఒక ముసిముసి నవ్వు నవ్వి "వస్తున్నావా? రా రా..." అంటూ వెళ్ళిపోయారు.

నాకు మహాకోపం వచ్చింది. పొఱబాట్న ఆయన ఊళ్ళో కనబడితే "నువ్వేం పెద్దమనిషివయ్యా? చిన్నపిల్లాడు ఎండలో నడుస్తున్నాడు? కాస్త ఎక్కించుకుని తీసుకెళ్ళలేవు? పోనీ నీ షష్టిపూర్తైన బండికి అంత ఓపిక లేకపోతే ఒక్క నిముషం ఆగి, ఆ విషయం చెప్పి పోకూడదు? పైగా ఆ ప్రశ్నేమిటి, "వస్తున్నావా? రా రా!", అని. నేను ఇక్కడిదాక వచ్చి ఊరు చివర అత్తిపత్తి మొక్కలతో (touch-me-not) ఆడుకుని, బోరింగు పంపులో కిలుం పట్టిన నీళ్ళు తాగేసి, bus stand లో పడుకుని తిరిగి రేతిరికి తుని వెళ్ళిపోతాననుకున్నావా? (బ్రహ్మానందం styleలో) అసలు మాట్లాడితే meaning ఉండాలి. ఈ ఊళ్ళో నువ్వు తద్దినం పెట్టినప్పుడల్లా వచ్చే ఏకైక భోక్త మా నాన్నగారే. ఆ విషయం మరిచిపోకు.", అందాం అనుకున్నాను. మహానుభావుడు ఆ రెండుమూడు రోజులూ మళ్ళీ కనబడలేదు.

ఇదేదో పల్లెటూరు, అందుకే ఇలాగ జరిగింది అనుకోవడానికి లేదు. ఇది పెద్ద నగరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నీ మధ్యన నా స్నేహితుణ్ణి కలవడానికి California వెళ్ళాను. వాడు నన్ను విమానాశ్రయం నుండి తన బండిలో ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ దిగుతూనే ఒక అమ్మాయి ఎదురొచ్చింది. ఆమె వీడిని చూసి సిగ్గుతో నవ్వుతూ తల దించుకుని తన car వైపు వెళ్ళింది. వీడు ఆమెను చూసి ఒక విరక్తిభరితమైన నవ్వు నవ్వాడు. సరేలే "ఆళ్ళిద్దరికీ ఏఁవండర్ష్టాండింగుందో మనకేటి తెలుసు", అనుకుని మా వాడితోటి నడిచాను.

మరునాడు apartment basement లో lift లో మాతో పాటు ఒకాయన ఎక్కాడు. అప్పుడు జరిగిన సంభాషణ నాకు విచిత్రంగా తోచింది. అందరం భారతీయులమేనని గమనించి ఆయన నా మిత్రుడికి shake-hand ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. మా వాడు "హలో, నా పేరు ప్రసాద్" అని నా మిత్రుడు చెప్తే, అదేదో ఇళయరాజ అని చెప్పినట్టు అతడు కళ్ళు పెద్దవి చేసి, "ఓ, ప్రసాదా? అంటే మీరూ, మా ఆవిడా - ఆఁ, ఆఁ, ఆఁ", అని కనుబొమలెగరేసి సిగ్గుతో కూడిన ఆశ్చర్యం వలన కలిగిన నవ్వును ప్రసరింపజేశాడు. వెంటనే నా మిత్రుడు విజయోత్సాహంతో కూడిన జాలి వలన కలిగిన నవ్వు ఒకటి విసిరాడు. ఇద్దరూ నవ్వుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాము.

అనకూడదు కానీ, ఎంతటి పత్నీవ్రతుడి గురించి అయినా సందేహం కలిగేలాగ ఉన్నాయి వాళ్ళ సంభాషణ, మొహాలలో హావభావాలు. నా కుతూహలం కట్టలు తెంచుకుని గొంతులోంచి "ఒరేయ్, ఏం జరుగుతోందిరా? నాకు తెలియాలి...నాకు తెలియాలి...నాకు తెలియాలి! " అని అడిగేలాగ చేసింది. వాడు నవ్వుకుని అసలు కథ చెప్పాడు, "మా ఆవిడ parking లో car నడుపుతుంటే, వాళ్ళావిడ చూసుకోకుండా car reverse చేసి accident చేసింది. మొదట్లో వాళ్ళావిడ మా ఆవిడదే తప్పని వాదిస్తే నేను వెళ్ళి తగులుకున్నాను. ఆ సమయంలో వీడు ఊళ్ళో లేడనుకుంటాను. చివరికి ఆవిడ ఒప్పుకుని insurance వాళ్ళ చేత డబ్బులు ఇప్పించింది",  అన్నాడు. "ఓహో, వాడి మొహంలో సిగ్గు, ఆశ్చర్యం ఏమిటో, నీ మొహంలో విజయోత్సాహం, జాలి ఏమిటో ఇప్పుడు అర్థమయ్యాయి. నాయనా, ఇలాంటి దిక్కుమాలిన expressions తో పలకరించుకోవడం చూడటం ఇదే మొదటి సారి.", అనుకున్నాను.

పెద్దయ్యాక ఈ పలకరింపులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఎదురౌతాయి. కానీ బాల్యంలో (సరదాగా) ఇబ్బంది కలిగించడానికి ఇలాంటి పలకరింపులు ఎదురౌతూ ఉంటాయి. చిన్నప్పుడు మేము ఏటా వేసవి సెలవులకు విజయవాడ వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మమ్మల్ని ఉడికించడానికి ఎప్పుడూ వెటకారంగానే ఆహ్వానించేవారు. "ఒసేయ్ అమ్మాయ్, మాఁవిడి పళ్ళన్నీ దాచెయ్ వే. తూర్పోళ్ళొచ్చారు. దొరికితే పరకలు పరకలు లాగించేస్తారు.", అని గట్టిగా అరవడం. "బాబు, ఎందుకొచ్చారు నాయనా? మా ఇంట్లో ఏమీ లేవు. మీ సీతారాంపురం వెళ్ళి జీడిపిక్కలేరుకోండి", అనడం. మేము అది విని పౌరుషపడటం -- ఇది రివాజు. చాలా గంభీరంగా, "అమ్మ, వెనక్కెళ్ళిపోదాం పద!" అన్నా అందరూ నవ్వడం చూసి చాలా కోపం కలిగేది.

అదేమిటో ఎప్పుడు మా అన్నయ్య విజయవాడ వెళ్ళినా అదో రకం పలకరింపే ఎదురయ్యేది. ఒక సారి ఆత్రంగా మధ్యాహ్నం పన్నెండికి వెళ్ళి తలుపు కొడితే, మా అమ్మమ్మ వచ్చి తలుపు తెరిచి, తీక్ష్ణంగా చూసి, "ఆయనిప్పుడే భోజనానికి కూర్చున్నారండి. కాస్త చల్లబడ్డాక రండి.", అని చెప్పి తలుపు వేసేసింది. మా అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకోవడం మరిచిపోయిందన్నమాట. దానికి తోడు అంతకు ముందు వేసవి మా అన్నయ్య విజయవాడ వెళ్ళలేదు. ఎదిగే వయసు కద! ఉన్నట్టుండి ఒక అడుగు ఎదిగేసరికి మా అమ్మమ్మకు కనీసం "వీడు మనవాడేమో",   అని అనుమానం కూడా కలగలేదు.

ఒక సారి మా అన్నయ్య వెళ్తూనే మా అమ్మమ్మ కనబడింది. "అమ్మమ్మ, నాకూ బియ్యం పెట్టేయ్" అన్నాడు. (మా వైపు "నాకూ అన్నం వండు", అనడానికి అలాగ అంటారు. సరిగ్గా అన్నం వండే సమయానికి ఇంటికి వచ్చాడు కాబట్టి వంట చేసేవాళ్ళకు మళ్ళీ రెండు ఎసర్లు పెట్టడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రాగానే తన రాకను declare చేసాడు.). పక్కనే అలమర తలుపు మూసి వెలుగులోకి వచ్చిన మా తాతయ్య, "ఏఁవిటి నాయనా? మిట్టమధ్యనం వచ్చి బియ్యం పెట్టమంటున్నావు? సన్న్యాసమేమైనా పుచ్చుకున్నావా?", అన్నారు. వెంటనే మా అన్నయ్య ఒక వంకర నవ్వు నవ్వితే, "వేద్ధవ, బావున్నావా? తాతయ్యేడి అని అడగడం మానేసి అదేం పలకరింపు" అన్నారు. ఇంక అప్పటినుండి మా అన్నయ్య రావడం చూసినప్పుడల్లా మా తాతయ్య, "ఒసేవ్, చిన్నాడొచ్చాడు. బియ్యం పెట్టేయ్", అని చెప్తుంటారు.

మఱొక సారి మా తాతయ్యకి ఒంట్లో బాగోక వైద్యశాలలో చేర్పిస్తే మా అన్నయ్య కంగారుగా వెళ్ళాడు. ఆయాస పడుతూ తలుపు తెరిచి చూస్తే మా తాతయ్య నిబ్బరంగా పరుపు మీద కూర్చుని, వెటకారంగా, "ఏరా? అంతలా పరిగెట్టుకుని వచ్చావు, ఏఁవౌతుందనుకునావేంటి?", అన్నారు. అప్పటి దాక కంగారు పడ్డ మా అన్నయ్యకు అప్పుడు మనసు కుదుటపడింది.

వ్యంగ్యమైన పలకరింపులకి వయసుతో పనేమీ లేదు, వెటకారం చెయ్యడానికి అవతల వ్యక్తి బలహీనత, అలవాట్లనే వాడుకోవక్కరలేదు అని నా బాల్యస్నేహితుడొకడు నిరూపించాడు. వాడు ఆదివారం వాళ్ళ నాన్నకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అది నా ఎనిమిదో తఱగతి అనుకుంటాను. ఒక సారి pen తెచ్చుకోవడం మరిచిపోయాను. వాడు ఎప్పుడూ మూడు నాలుగు రంగుల pen లు compass box లో పెట్టుకుని తిరిగేవాడు. వాడిని అడుగుదామని విరామంలో "ఒరేయ్", అన్నాను. వాడు వెనక్కి తిరిగి చాలా నిర్లిప్తమైన చూపుతో, "ఆఁ, చెప్పమ్మా" అన్నాడు. ఇదేం పలకరింపురా నాయనా అనుకుని, "నాకు ఒక pen కావాలి - సాయంత్రం ఇచ్చేస్తాను", అన్నాను. వాడు "ఏ color అమ్మ, blue ఆ, black ఆ, red ఆ?", అని అడిగాడు. నేను "blue ఐతే better" అన్నాను. దానికి వాడు, "blue stockలో లేదమ్మ. రేపొచ్చి కనబడు. black ఐతే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఐనా black తో ఉన్న look blue కి రాదమ్మ", అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక అలాగ ఉండిపోయాను. వాడు వెంటనే నవ్వి, "black ఏ ఉందిరా. ఇదిగో", అని ఇచ్చాడు.

సరే అందరి గురించి చెప్పి నా గురించి చెప్పుకోకపోతే ఎలాగ? నా వంతు విచిత్రమైన పలకరింపులు నేనూ చేసాను. చిన్నప్పుడు మా ఉపాధ్యాయుడికి నేనంటే చాలా అభిమానం ఉండేది. ఆయన అంటే నాకూ చాలా గౌరవం ఉండేది. నాలుగో తఱగతిలోనో ఎప్పుడో, ఒక రోజు ఆయన "ఎవరైనా పెద్దలు కనబడితే Good Morning/Afternoon/Evening." చెప్పాలి అన్నారు. చిన్న hint ఇస్తే చెలరేగిపోతాను అని మా పాఠశాలలో నా గురించి మంచి talk ఉండేది. అది నిరూపించుకోవాలన్నట్టు, ఆ రోజు సాయంత్రం పాఠశాల నుండి విడిచిపెట్టాక నడుస్తూంటే రెండు వీధుల అవతల ఆయన్ని చూసి "సార్ సార్" అని అరుచుకుంటూ పరిగెట్టాను. ఆయన ఏదో ఉపద్రవం వచ్చినందుకుని కంగారుగా వెనక్కి తిరిగి "What happened Sandeep?" అంటూ ఆత్రంగా అడిగారు. నేను ఆయసంతో ఊపిరి ఎగబీలుస్తూ, "Good Morning ఛి ఛి... Good Evening sir" అన్నాను. ఆయనకు నవ్వాలో ఏడవాలో తెలియక "OK" అని చెప్పి వెళ్ళిపోయారు. "ఆయన చెప్పింది మనం practical గా చేసి చూపించినా ఈయనకెందుకు ముచ్చటెయ్యలేదు చెప్మా", అనుకుంటూ నేనూ ఇంటికి వెళ్ళిపోయాను.

నా జీవితంలోనే మరిచిపోలేని ఘోరమైన పలకరింపు చేసింది నా మిత్రుడు కిట్టు. వాడికి intermediate పరీక్షలలో చక్కని marks వచ్చినందుకు విజయవాడ నుండి వాళ్ళ దూరబ్బంధువు ఒకాయన ప్రత్యేకించి phone చేసి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వాడి తల మీద తన చెయ్యి పెట్టి దువ్వుతూ ఉంది. వాడికా చదువు తప్పితే ఏఁవీ తెలిసేది కాదు. ఆయన గురించి అసలేమీ తెలియదు. వాళ్ళ అమ్మ చద్దన్నం పెఱుగులో కలిపి పెట్టినప్పుడల్లా వాడు చిఱాకు పడుతుంటే, "నాన్న, రావు తాతయ్య గారు లేరు? ఆయనకు బోళ్ళు డబ్బులున్నా ఇప్పటికీ రోజూ చద్దన్నమే తింటారు. ఆయన్ని చూడు ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యం గా ఉంటారో. చద్దన్నం బలం.", అనేది. కర్మ కాలి వాడికప్పుడు ఆ విషయమే గుర్తొచ్చి, "రావు తాతగారు! మీ గురించి మా అమ్మ చెప్తూ ఉంటుందండి. మీరు ఇప్పటికీ చద్దన్నం తింటూనే ఉంటారుట కదా.", అన్నాడు. వాళ్ళమ్మ ఒక్క సారిగా దువ్వడం మానేసి నెత్తి మీద మొట్టింది. ఎందుకు మొట్టిందో అప్పట్లో వాడికి ఎంతకీ అర్థం కాలేదు.

ఇలాంటి పలకరింపులు తలుచుకున్నప్పుడల్లా నవ్వాగదు.

Friday, September 30, 2011

సంగీతమేఘం (ఉదయగీతం)


తమిళంలో ఇళయరాజ చేసిన శ్రావ్యమైన గీతాల జాబితాను తయారు చేయడం వారికి కూడా అసంభవం అని నా నమ్మకం. ఏ జన్మపుణ్యఫలమో ఆయనకు అనుకోగానే మధురాతిమధురమైన బాణీలు ఇట్టే స్ఫురిస్తాయి. అలాంటి మధురమైన గీతాలలో నాకు నచ్చిన ఒక పాట ఇది. దీన్ని ఉదయగీతం అనే చిత్రానికి ముత్తులింగం అనే రచయిత వ్రాసారు, బాలు పాడారు. చిత్రంలో కథానాయకుడు పాటకాడు. సంగీతం పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, ఇష్టాన్ని ఈ పాట ద్వారా చెప్తాడు అని నాకు చూచాయిగా అర్థమైంది. ఆ పాటను తెలుగులో కూడా వ్రాద్దామనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

పాటలో చాలా వాక్యాలు వేటూరిని, ఇళయరాజ ని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. మొదటి చరణంలో సాహిత్యం గురించి, రెండవ చరణంలో సంగీతం గురించి వ్రాసాను. పాట Commerical గా ఉండకుండా వీలైనంతవరకు ప్రయత్నించాను. రోజంతా కూర్చుని వ్రాయవచ్చును కానీ, అంత సమయం లేదు కాబట్టి రెండున్నర గంటల్లో తోచిందేదో వ్రాసాను. పల్లవి ఆఖరిలో పూర్తి చేసినందుకో ఏమో అంత బలంగా అనిపించలేదు.

సంగీతమేఘం వర్షించే గానం
మనసుల్లో పండిస్తుంది ఆనందం
గానం నా జీవితం, గీతం మీకంకితం
ఎపుడూ సాగాలి ఈ సంబరం

మాట పూల తోటలో బాటసారి శ్వాసలో
తావి కలిసిన తీపి గాలుల మాధుర్యమూ
భావమేఘమాలలో  ఆస చుక్కల డోలలో
మేను మరిచిన గుండెజాబిలి సౌందర్యమూ
ఇలా పాటై తేనె వూటై పొంగెనీ గొంతులో (2)
పాటే నా గమ్యం...

తీపి స్వరముల సవ్వడో, స్వాతి చినుకుల తాకిడో
గుండె ఝల్లని పొంగు క్షణమున నేనెఱుగను!
భావమెఱిగిన రాగమూ, తాళశ్రుతులకు యోగమూ
మేళవించిన గీతమందు అదే అనుభవం
ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా (2)
పాటే నా జీవం...

తమిళ పల్లవిలో "సంగీతమేఘం తేన్సిందుం రాగం", మొదటి చరణం చివరిలో వచ్చే "ఇంద దేగం, మరైందాలుం ఇసయాయ్ మళర్వేన్" -- ఈ రెండు వాక్యాలనూ తస్కరించి వాడాను. మొదటిది తమిళ పాట తెలిసినవాళ్ళకు (నాకు కూడా) బొత్తిగా తలా తోకా లేకుండా పూర్తిగా కొత్త పల్లవి ఇష్టం లేక. రెండవది నాకు ఆ వాక్యం బాగా నచ్చింది కనుక. నిజానికి ఆ వాక్యం పాతలో రెండు సార్లు వస్తుంది -- దాన్ని వేటూరికి అన్వయించినప్పుడు "ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా, పాటల్లో భావాన్నై (లై) మీలో వసిస్తా" అని పాడుకునేవాడిని. ఇక్కడ మాత్రం బీజగీతంలో లాగ మొదటి వాక్యం మాత్రమే ఉంచాను.

Saturday, September 10, 2011

విడిపోవడం ఎలా?

యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాసం పైన వ్రాసిన పుస్తకం పేరులాగున్నా ఈ వ్యాసంలో అలాంటివి ఏమీ ఉండవని ముందుగానే చెప్తున్నాను. "ఎవరైనా కలిసుండటం ఎలాగ అని వ్రాస్తారు కానీ ఇలాగ విడిపోవడం ఎలాగ అని వ్రాస్తారా?" అని అడిగే చదువర్లకు వివరణ, ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం రెండూ ఒకటే.

మనిషి ఒక విచిత్రమైన జంతువు. తను ఒక్కడూ ఉండలేడు, అలాగని మఱి కొందరితో ఉంటే వాళ్ళందరికంటే పై చేయి తనదవ్వాలని, తనకొక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. (ఈ గోలంతా మనం ఇదివరకే ఒక సారి చెప్పుకున్నామనుకోండి. దానికి ఇది కొనసాగింపు వ్యాసం అనుకోవచ్చునేమో.) ఈ ప్రత్యేకతని సంపాదించుకోవడానికి మొదట తన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పరుచుకుని, ఆ బలగానికి తను నాయకుడై, ఆ బలగం బలం పెంచి మిగతావారిని ఓడిస్తాడు. ఓడిపోయినవారిలో గొప్ప ఎవరో పట్టించుకోరు, గెలిచినవాళ్ళలో నాయకుడి పేరే అందరికీ తెలుస్తుంది. ఫలితంగా అతడికి ప్రత్యేకత కలుగుతుంది. భాషలో సవర్ణదీర్ఘసంధి సూత్రం, గణితంలో పైతాగరస్ సూత్రం, భౌతికశాస్త్రంలో న్యూటన్ సూత్రం లాగా మనిషి అనే జంతువు ఆడే, సాంఘిక క్రీడలో ఇది ఒక సూత్రం/ఎత్తు. దీన్నే ముద్దుగా కూడలి-విడుగడ సూత్రం అని పిలుచుకుందాం. చదువర్లెవరైనా ఇంకా మంచి పేరును సూచిస్తే చాలా సంతోషిస్తాను.

ఇదే సూత్రాన్ని తరతరాలుగా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు. సరే ఒకప్పుడు ఛాందసం, మూర్ఖత్వం, సమాచారమాధ్యమాల లేమి కారణం అనుకుందాము. గొప్ప సూత్రం లక్షణం ఏమిటి అంటే అది కాలంతో పాటు మారిపోదు. సర్వకాల సర్వావస్థలలోనూ పని చేస్తుంది. కూడలి-విడుగడ సూత్రం కూడా ఒక గొప్ప సూత్రం. ప్రస్తుతకాలంలో కూడా ఈ సూత్రం వాడకంలో ఉందనడానికి సాక్ష్యాలను చెప్పడానికే ఈ వ్యాసం.

చైనీయులకు, మనకు చాలా సహస్రాబ్దాల నుండి వాణిజ్యసంబంధాలు ఉన్నాయి. చైనీయులకు చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నాయి. వాళ్ళ భాష, దేశం మొదలైన విషయాలపై వాళ్ళకు చాలా గౌరవం ఉంది. ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి. అది కాదు ఇక్కడ విషయం. 1940లలో ఒక చైనీయ శాస్త్రవేత్త ఒక గుహలో కొన్ని అస్తి పంజరాలను చూశాడు. అవి మానవరూపంలో ఉన్నప్పటికీ మానవులకు (Homo Sapiens) చెందినవి కావు. వారి (మన) పూర్వీకులైన Homo Erectus Pekinensis వి అని తెలుసుకున్నాడు. అంటే కోతిజాతిలో మన కంటే పూర్వం ఉన్న జంతువులవి అన్నమాట. వాటి ముఖాలు గుండ్రంగా, ముక్కు చప్పిడిగా ఉండటం గమనించి ఓహో, ఐతే మనందరం (చైనీయులు) వీరి సంతతి అన్నమాట అని "ఊహించాడు". అంతే రాజకీయనాయకులు వచ్చేశారు. దాన్ని దండోరా వేయించారు. అది పెద్ద రాజకీయవిషయమైంది, చైనీయజాతి గౌరవానికి సంబంధించిన విషయమైంది.

చూసారా? మొదట "మేము వేఱు" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి వాళ్ళను కూడజేసారు. వారిని మిగతా జనాలనుండి విడదీశారు. చిటికెడంత ఆధారం దొరకగానే "మేము మామూలు మనుషులం కాఁవు, మేము మీ అందరికంటే ముందు పుట్టిన జాతినుండి వచ్చాము" అనే భ్రమలోకి ప్రజలను తోసి దాదాపు 50 ఏళ్ళు చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల ద్వారా అదే మప్పారు. అంతే! నాయకులకు గొప్ప ఆదరణ లభించింది. చివరికి 1999లో జన్యుపరిశోధన ద్వారా ఎంతో దృఢంగా, అసలు చైనీయులకీ Homo Erectus కి ఏమీ పెద్ద సంబంధం లేదు, చైనీయులు కూడా అందరు మనుషులలాంటి వారే అని ఒక చైనీయ శాస్త్రవేత్తే తేల్చి చెప్పాడు. అతను చిన్నప్పటినుండి చదువుకున్న విషయం తప్పని తెలిసి ఎంతో బాధపడ్డానని స్వయంగా అతనే BBC కి ఇచ్చిన interview లో చెప్పాడు. అప్పటిదాకా "మేము వేఱు" అనే అబద్ధం పునాది గా నిర్మించుకున్న రాజకీయభవంతులన్నీ ఒక్క సారిగా చలించడం మొదలెట్టాయి.

సరే పొరుగు దేశంతో మొదలెట్టాము. ఇప్పుడు పొరుగు రాష్ట్రం. తమిళనాడులో చాలా రోజులు ద్రవిడులు వేఱు, ఆర్యులు వేఱు -- ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది. దీనికి పాక్షికంగా కారణం ఆంగ్లేయులు. దక్షిణ, ఉత్తర భారతదేశ భాషలలో భేదాలను; పాశ్చాత్య, సంస్కృతభాషలలో సామ్యాన్ని వివరించడానికి వారికి ఈ ఆర్య-ద్రవిడ జాతిభేదం ఒకటే తోచింది. కానీ, అది కేవలం ఊహ. ఆ ఊహ EVR, కరుణానిధి మొదలైన వారికి ఉపయోగపడింది.

తమిళం భాషలన్నిటిలోకీ పురాతనమైనదని, సంస్కృతం ఈ మధ్యనే పుట్టిందని చాటింపేశారు. కాకపోతే వారికి ఎదురైన రెండు ప్రశ్నలు -- ఒకవేళ ఆర్యులు ద్రవిడులపై దండుకొస్తే అంత పెద్ద విషయం ఆ రెండు భాషలో చారిత్రాత్మక గ్రంథాలలోనూ ఎందుకు ప్రస్తావించలేదు అని. అప్పుడు మళ్ళీ సంస్కృతగ్రంథాలతో పని పడింది. వాటికి వక్రీకరించిన భాష్యాలతో వచ్చారు. రామాయణం కథ అంతా దక్షిణాది వాళ్ళను కోతులుగా, రాక్షసులుగా చూపించి కించపరచడానికి, ఉత్తరాది రాజు ఐన రాముడి ఆధిక్యతను చూపడానికి అని చెప్పారు. అలాగే అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి రావడం వేదాలలో ఉంది కాబట్టి అది కూడా ఉత్తరాది నుండి ఆర్యులు దక్షిణాదికి రావడాన్ని సూచిస్తోందని చెప్పారు.

ఇప్పుడే ఒక చిన్న మెలిక పడింది. అగస్త్యుడు తమిళ వైయాకరణుడని అప్పటిదాకా చెప్పుకున్నవారు అగస్త్యుడు ఆర్యుడని, ఉత్తరం నుండి వచ్చాడని చెప్తే అప్పుడు సంస్కృతమే తమిళంగా కంటే పురాతనమైనది అవ్వాలి కదా? అబ్బే, తర్కం నిజాలపైన ఆధారపడాలి కుతర్కానికి నిజంతో పనేమిటి? పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ బ్రాహ్మలని (వీళ్ళే ఆర్యులట!) తిట్టి, వారిపైన సంఘంలోనే దురభిమానం కల్పించారు. అదిగో మళ్ళీ ద్రవిడులమంటూ కూడిక, ఆర్యులు వేఱంటూ విడతీయడం. ఉన్నట్టుండి EVR మహానేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ మున్నేట్ర కళగం పేరిట (DMK) అవే భాష్యాలు కొనసాగుతూ ఉన్నాయి.

ఇక్కడ మఱి కొన్ని మెలికలు. "ద్రవిడ" అనే పదమే సంస్కృతపదం. భాగవతంలో ఆ పదం కనీసం మూడు సార్లు ఉంది. దాని అర్థం "దక్షిణాది దేశం" అని -- అది వేఱే జాతి అని కాదు. (వైదీక గ్రంథాలలో ఎక్కడా ద్రవిడ దేశంలో వేఱే జాతి వారు ఉన్నారు అని లేదు.) ఆ పదాన్ని ఆది శంకరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. "నువ్వెవరు" అని ఉత్తరాదిలో ఎవరో అడిగితే, "ద్రవిడశిశువును" అని చెప్పారట. సరే తీగె లాగితే డొంక కదులుతోంది. అసలు విషయానికి వస్తే 2009లో ఒక బృహత్పరిశోధనా ఫలితంగా తేలింది ఏమిటంటే ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు అని. జన్యుపరంగా భారతదేశంలో రెండు జాతులు 40,000 సంవత్సరాల క్రితం (అంటే Homo Floresiensis వంటి మానవసంబంధజాతులు ఇంకా బ్రతికి ఉండగానే, శాస్త్రీయ అంచనాల ప్రకారం అప్పటికి మానవుడు ఇంకా మట్టికుండలు కూడా తయారు చేసి ఉండడు!) ఉన్నాయి కానీ ఈ మధ్యన ఏమీ లేవు అనే నిర్ధారణకు వచ్చారు. మొత్తం రెండు జాతుల భూటకం అంతా కూలిపోయే సమయం ఆసన్నమైంది.

సరే పొరుగు దేశం, పొరుగు రాష్ట్రం అయ్యాయి. ఇప్పుడు వేఱుబడదాం అనుకునే మన రాష్ట్రం వారి గురించి మాట్లాడుకుందాం. చైనీయులు "మేము మనుషులమే కాఁవు" అన్నారు, తమిళులు "మీరు మా జాతి మనుషులు కారు", అన్నారు. అదేదో చిత్రంలో చెప్పినట్టు, "కొట్టుకోవడానికి కారణం ఎందుకు? నిర్ణయించుకున్నాక కొట్టేసుకోవడమే" అన్నట్టు, ఆఖరికి భాష పేరు చెప్పి కొట్టేసుకుందాం అని తెలంగాణలో కొంతమంది సిద్ధమౌతున్నారు. అయ్యా, తెలంగాణాకు అన్యాయం జరిగి ఉండవచ్చును, తెలంగాణను ఆంధ్రనాయకులు దోచుకునీ ఉండవచ్చును, తెలంగాణ వేఱ్పాటు ప్రస్తుతం అత్యవసరం కూడా కావచ్చును -- నాకివేవీ తెలియవు. కానీ, తెలంగాణ అనేది వేఱే భాష అనడం, తెలుగు కవుల విగ్రహాలు పడగొట్టడం, హన్నన్న! ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకోని ఆలోచించండి. రాజకీయాలకు భాషకు ముడి ఏముంది? శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, తూర్పు గోదావరి యాస -- వీటన్నిటినీ మనం చూస్తూనే ఉంటాము, చలనచిత్రాలలో హాస్యానికి వాడుకుంటూనే ఉంటారు. ఉన్నట్టుండి భాష వేఱనడం కొంచెం విడ్డూరంగా లేదు? మళ్ళీ చెప్తున్నాను -- నాకు తెలంగాణా వేఱ్పడాలా వద్దా అన్నది తెలియదు. కానీ, భాష వేఱు అనడం మాత్రం నాకే కాదు, పరరాష్ట్రీయులైన నా మిత్రులకు కూడా విచిత్రంగా తోచింది. కూడలి-విడుగడ సూత్రానికి ఎంత చిన్న కీలు సరిపోతుందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

ప్రఖ్యాత విదూషకుడు George Carlin, "గర్వం అనేది నాకు కేవలం నా వ్యక్తిగత పురోగతి, సమర్థత, కార్యసిద్ధి వలనే కలుగుతుంది. నా పుట్టుక చేత పొందేది ఏదైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, గర్వాన్ని కాదు" అని అన్నాడు. అమెరికాలాంటి సంపన్నమైన దేశంలో అతడు, "I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America.", అని చెప్పాడు. అదే మనమూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు  గర్విస్తున్నాను, తమిళనాడులో పెరిగినందుకు గర్విస్తున్నాను, మొదలైనవి కూడా పరుల కార్యసిద్ధిని దోచుకోవడంతోనే సమానం. మాట వరసకు అనవచ్చునేమో కానీ, అదే పట్టుకుని వేళ్ళాడితే బావిలో కప్పలలాగా ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గర్వపడాలి అనుకుంటే ఆ భారతదేశచరిత్రకి, సంస్కృతికి నీవు ఏమైనా గొప్ప విషయాన్ని చేర్చి అప్పుడు గర్వపడాలి కానీ, ఊరికెనే మా తాతలు వేదాలు చదివారు -- మాకు వేదాలెన్నో కూడా తెలియవు -- అయినా మేము గొప్ప అనుకోవడం కేవలం మూర్ఖత్వం అని నా అభిప్రాయం.

PS:
1. చదువర్లు నా తెలుగు పదాల వాడుకలో ఏమైనా తప్పులుంటే తప్పక సవరించగలరని మనవి. ముఖ్యంగా "ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది.
2. తెలంగాణ గురించి మాట్లాడితే కోపించి వ్యాఖ్యాస్థలిని రణరంగంగా మార్చేసే కొందరు ఔత్సాహికులు ఉన్నారు అని తెలుసును. సరైన పదాలు, సరైన ఉద్దేశం లేని వ్యాఖ్యలు తొలగించబడతాయి.

Saturday, August 20, 2011

మనిషికో రోగం, మనసుకో భోగం

ఆత్మబంధువు అనే అనువాదచిత్రంలో బహుశా రాజశ్రీ అనుకుంటాను ఒక పాట వ్రాశారు - "మనిషికో స్నేహం, మనసుకో దాహం" అని.ఈ రోజు ప్రపంచాన్ని చూస్తే దీన్ని "మనిషికో రోగం, మనసుకో భోగం" అని మార్చాలనిపిస్తోంది.

ప్రతి మనిషీ తనకో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. అందులో తప్పు లేదు. కొందరు దానికోసం రాత్రింబవళ్ళు శ్రమించి సాధించుకుంటే కొందరు సులభమార్గాలను వెతుక్కుంటారు. నేను బెంగుళూరులో పని చేస్తుండగా నా సహోద్యోగి ఒకాయన అన్నాడు, "Most people are ordinary, and that is by definition." అని. నాకు భలే నచ్చింది. నిజమే! సామాన్యం అనే పదానికి అర్థమే "అత్యధికంగా సంభవించే విషయం" అని. లేకపోతే అమెరికాలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళను విచిత్రంగానూ, మన దేశంలో అవైవాహికసహజీవనాన్ని (live-in relationship) విచిత్రంగానూ ఎందుకు చూస్తున్నారు? సరే, అది మఱొక సున్నితమైన విషయం కాబట్టి దాన్ని విడిచిపెడదాము.

ప్రతి మనిషికీ ఒక అభద్రతాభావం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి తన చుట్టూ ఒక సమూహాన్ని (ఇల్లు, ఊరు, మొదలైనవి) ఏర్పరుచుకుంటాడు. ఆ సమూహం బలంగా ఉంటే తనూ బలంగా ఉంటాడని ఒక నమ్మకం. అది స్వార్థమా లేక ఔన్నత్యమా అన్నది ఎవరికిష్టమొచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చును.

ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్రబిందువు (central point) ఏమిటయ్యా అంటే, వివాదాస్పదమైన వ్యాఖ్యలతో, పనులతో ఈ రెండూ (తమ ఉనికి చాటుకోవడం, ఒక గుంపులో మెలగడం) సాధించుకునేవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.  అంటే అభద్రత అనే రోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమకంటూ ఒక అవాస్తవిక అస్తిత్వాన్ని (false identity), పరపతిని ఏర్పరుచుకుని దాన్నే భోగంగా భావించే వారి గురించే ఈ వ్యాసం. వారి వాదనలోని మూర్ఖత్వాన్ని, అసంగతాన్ని (incoherence) వారికి ఎలాగ తెలియజేయాలో అర్థం కాదు. వారికి నిజం కంటే వారి డొల్ల-పునాదితో ఏర్పడిన అభిప్రాయాలే ముఖ్యం. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాము.

ఇటీవల Ace Ventura - The Pet Detective అనే చలనచిత్రాన్ని చూశాను. Jim Carrey నటించిన ఈ చిత్రం హాస్యరసభరితంగా ఉంటుంది అని విని, ఓపిగ్గా చూశాను. అప్పుడప్పుడు నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల జుగుప్స కలిగింది. పతాకసన్నివేశంలో ఒక dolphin ని దొంగిలించినవాడు ఎవరో కాదు, ఆ ఫిర్యాదును పర్యవేక్షిస్తున్న ఆడ police ఏ నని తెలుస్తుంది. ఇదేమిటి ఆ వ్యక్తి ఇంతకీ వాడా, ఆమా౨ అన్న సందేహానికి సమాధానం -- రెండూను. అవును, ఆ వ్యక్తి ద్విలింగి (transgender). కథలో ఏడాగోడానికి (confusion) అదే మూలకారణం. దొంగిలించిన వ్యక్తి మగ అని కొన్ని ఆధారాలు, ఆడ అని కొన్ని ఆధారాలూ దొరికి చివరికి రెండూ అని తెలుసుకుంటాడు నాయకుడు. ఆ ద్విలింగిని శిక్షిస్తారు. ఇక్కడిదాక విషయం ఫరవాలేదు.

ఈ చలనచిత్రం చూసిన ద్విలింగులు, ఈ చిత్రం ద్విలింగుల పట్ల దుగ్ధతో తీసినదని, ద్విలింగులను తప్పుడు కోణంలో చూపించిందని గొడవకు దిగారు. అయ్యా, ఒక ప్రశ్న: ద్విలింగులని వేఱుగా/వింతగా చూస్తే, "మమ్మల్ని వెలివేస్తున్నారు, మాకు సమానమైన హక్కులు, హోదా కావాలి", అని ధర్నాలకు దిగుతున్నారు. నిజంగా మీ మనసులో సమానభావం ఉంటే, తమరు ద్విలింగులు అనే అభద్రతాభావం లేకుంటే; ఒకవేళ ద్విలింగులు, ఏకలింగులూ సమానం అనే దృక్కోణానికి సమాజం అలవాటు పడి; తరతరాలుగా స్త్రీలనో, పురుషులనో చెడ్డవారిగా చూపించిన చిత్రాలను అన్నిటినీ నిషేధించాలని ఒక ఆరువందలకోట్ల ఆడవారు, మగవారు కూడా ధర్నాకు దిగి, మీరు కూడా వారికి మద్దతును తెలపాలి అంటే ఏం చేస్తారు?

 కథ అన్న తఱువాత మంచిని, చెడుని కొందరు మనుషుల రూపేణ చూపించడం అన్ని సంస్కృతులలోనూ ఉన్న విషయమే కదా? ఎవరికి వారు "మమ్మల్ని తక్కువగా చూపిస్తున్నారు" అంటే ఎలాగ?

హమ్మయ్య, అందరు NRIల లాగా నేను మొదట జన్మభూమిని అవమానించలేదు. ఆ పాఙ్తేయం (fashion?), పైత్యం నాకు ఇంకా వంటబట్టలేదు అనుకుంటాను. సరే, ఇకనైన మన దేశాన్ని విమర్శించకపోతే నన్ను NRIలు అందరూ అపాఙ్తేయుణ్ణని వెలివేస్తారు కాబట్టి ఒకసారి భారతదేశం కేసి చూద్దాము.

మన దేశంలో ఆరక్షణ (reservation) చట్టాలు విస్తృతమౌతున్న దశలో నాకో సందేహం. మొదట ఒక విషయం మాత్రం తేటతెల్లం చెయ్యాలి -- దళితులకు అన్యాయం జరిగింది, అవమానం కలిగింది. దీనిలో సందేహం ఏమాత్రం లేదు. వారికి కొంతవరకు, కొన్నాళ్ళు ఆరక్షణ కల్పించడం కూడా సబబే! నా సమస్య అది కాదు. సందేహం ఏమిటయ్యా అంటే లోక్పాల్ చట్టానికి మీకూ సంబంధం ఏమిటి అని. లోక్పాల్ మనువాది ఉద్యమం అని, ఊర్ధ్వకులాల కుట్ర అని వాపోతున్న మహాధ్యాపకులు (professors?) ఆ సంబంధాన్ని సశాస్త్రీయంగా, తర్కించి విశదీకరిస్తే బాగుంటుంది. లోక్పాల్ లో ఎక్కడైనా దళితులు ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించక్కరలేదు అని ఉందా? పోనీ, దళిత సంఘాల్లో జరిగే కుంభకోణాలను, రంభకోణాలను (సహస్రావధాని గరికపాటి వారి పాదలాకు మ్రొక్కుతూ ఈ ప్రయోగాన్ని తస్కరించాను :) ) మొదట/ఆఖర వెదకాలని ఏమినా ప్రత్యేకించి ఒక వాక్యం ఉందా? ఓహోహో రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్ దళితుడా? ఆ రాజ్యాంగాన్ని గాంధీ స్ఫూర్తితో మారుస్తున్న హజారే దుష్టుడా? సరే. మీకు ఇప్పుడు ఇంకో చిక్కు ప్రశ్న.

మన దేశంలో స్వలింగసంపర్కం క్రూరమైన దుష్చర్యగా (criminal offense) నిర్ణయించిన మహానుభావుడు ఎవరయ్యా? అంబేద్కరే కదా? నవీనకులతత్త్వానికి (modern casteism) నిర్వచనం ఏమిటి? ఒకడు పుట్టిన పరిస్థితులని బట్టి వాడి జీవితంలో ఏదైనా చేసి తీరాలి, చెయ్యకూడదు అని చెప్పడం తప్పు అనే కదా? అంటే దళితుడైతే ఎవరినీ ముట్టుకోకూడదనో, బ్రాహ్మడైతే అందరూ కాళ్ళ మీద పడాలనో అంటే ఎందుకు తప్పు? వాడు పుట్టిన కుటుంబాన్ని బట్టి వాడికి గౌరవాన్నో, అవమానాన్నో కల్పించడం అహేతుకం అనేనా? సరేనయ్యా. మరి మగవాడిగా పుడితే ఆడదాన్నే కామించాలని ఎవరు నిర్ణయించారట? దేవుడెక్కడైనా చీటి వ్రాసిపెట్టాడా? మఱి గబ్బిలాల్లో స్వలింగసంపర్కుల సంఖ్య ఎక్కువగా ఉంది, వాటికి ఏ గ్రుడ్డిగుహలోనో చీటీ చదువుకోవడం వీలు కావట్లేదు అనుకుంటాను. వెటకారం అటుంచితే, మఱొక సందేహం. ఇప్పుడు దళిత స్వలింగసంపర్కులు అంబేద్కర్ ని పొగడాలా? తిట్టాలా? అమ్మో, జటిలప్రశ్నే. సరే నేను దళితుణ్ణీ కాదు, స్వలింగసంపర్కుణ్ణీ కాదు - అందుచేత నేను ఏమీ వ్యాఖ్యానించను. (ఈ వాక్యం కూడా దట్టపరిచెయ్యాలని (bold) ఎందుకో మనసు పీకుతోంది :) )

ఎవరండక్కడ? ఏమిటి? అంబేద్కర్ ఉపవాసాలు మొదలైనవాటిని నిషేధించాడా? మఱి ధర్నాలు ప్రోత్సహించాడా? దండోరాలు, రాస్తా రోకోలూ ప్రబోధించాడా? సరే అదీ వదిలెయ్యండి.

అయ్యా, మీరు మహాధ్యాపకులు, తాత్వికులు కదా. ఇప్పుడు మఱొక ప్రశ్న. మీరు దళితులు అంటూనే కిరస్తానీలు అంటున్నారు. నాకు అద్వైతం మీద గురి కావడం చేత సోదరులైన కిరస్తానీయులపైన ఏమీ దురభిమానం లేదు. ఐతే దళితులు చాలా మంది క్రైస్తవాన్ని పుచ్చుకుని హైందవాన్ని దూషిస్తున్న పరిస్థితుల్లో నాదొక ప్రశ్న -- క్రైస్తవులు తరతరాలుగా నల్లవారిని (అదే నీగ్రోలు అని కొందరు పిలిస్తూ ఉంటారు) కించపరుస్తూ, వారిని బానిసలుగా తిప్పుకున్నారు. మరి మీకు వారిలో కులోన్మాదం ఉంది అనిపించట్లేదా?

పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఏం తెలుసని వ్యాఖ్యానిస్తున్నారో కానీ, మీరు వ్యాధగీత (వ్యాధుడు అంటే బోయవాడు - నికార్సైన దళితుడు) గురించి తెలుసునో లేదో. భగవద్గీత లాగానే భారతంలో ఒక బోయవాడు తపస్వికి చేసిన జ్ఞానబోధ గురించి ఉంది. అంటే (జ్ఞానం ఉన్న) యాదవుడైన కృష్ణుడు, శూద్రుడైన వ్యాధుడు కూడా పొగరుబోతు బ్రాహ్మడి కంటే గొప్పవారని చెప్తోంది మన సంస్కృతి. అయ్యో వ్యాసం ప్రవచనం అయిపోతోంది. క్షమించాలి.

అబ్బెబ్బే, ఈ రోజు నాకేదో ఐంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వివాదాస్పదప్రశ్నావళికి ఇంక ముగింపు పెట్టి మఱొక ఉదాహరణ చూద్దాము.

ఎంత అద్వైతిని ఐనా పొరుగువాడిని నిందించకపోతే ఈ వెధవ జన్మకు నిద్ర పట్టేలా లేదు. ఈ సారి తమిళనాస్తికమిత్రులకు కొన్ని ప్రశ్నలు. కొందరు ద్రవిడకళగభజనాతత్పరులు రావణుడిని పూజించడం మొదలెట్టారు. అదేమిటి అంటే "రాముడు ఆర్యుడు, ఆయన ఎక్కడో వాయవ్యమ్నుండి వచ్చాడు. అమాయకుడైన మా రావణుణ్ణి, ద్రవిడులని అవ్యాజమైన కక్షతో చంపివేశాడు" అంటున్నారు. అబ్బబ్బ, మళ్ళీ ప్రశ్నావళి.

రావణ అనే శబ్దమే సంస్కృతపదం. ఆయన అనేకశాస్త్రాలలో పండితుడని రామాయణం చెప్తోంది. బ్రహ్మకు, ఆయనకు బంధుత్వాన్ని సూచిస్తోంది. ఆయన మహాశివభక్తుడు, రాముడు కూడా సైకితలింగాన్ని నిర్మించాడు. మఱి ఒకరు ఆర్యుడు అయ్యి, మఱొకరు వేరే జాతి ఎందుకు అయ్యారు? వదిలెయ్యండి.

దక్షిణభారతంలోని వారిని కించపరచడానికే వారిని కోతులుగా, రాక్షసులుగా చూపించారని అంటారా? సరే, "హనుమంతుడు చక్కనైన సంస్కృతభాష మాట్లాడుతున్నాడు. ఇలాంటివాడు మనకు తోడుంటే ఎవరినైనా జయించవచ్చును", అని రాముడన్నది దక్షిణభారతీయుడైన హనుమంతుణ్ణే. సోదరసమానుడిగా భావించి గౌరవించిన విభీషణుడు రాక్షసుడే. పతివ్రతగా పరిగణించబడిన మండోదరి కూడా...ఆఁయ్. ఉన్నట్టుండి వీరందరూ మీకు దగ్గర బంధువులు, రాముడికి శత్రువులు ఎలాగయ్యారయ్యా? ఆర్య అయిన కైకని చెడ్డదానిగా ఎందుకు చిత్రీకరించారో? మంథరను ద్రవిడదుర్మతిగా చూపిస్తే కథ ఇంకా రక్తి కట్టేదేమో? అక్కడ నీతి -- వానరుడైనా, మనిషి అయినా, రాక్షసుడైనా, మగైనా, ఆడైనా మనిషి నడవడిని బట్టే గౌరవించాలని. ద్రవిడుడోయంటూ కరుణానిధికి పట్టం కట్టారు. ఏమైంది? ఏ రంగు పూసినా బల్లి బల్లి కాక ఊసరవెల్లి అవుతుందా?

ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా గుర్తొస్తున్నాయి. కానీ, వ్యాసం చదివేవారికి వేఱే వ్యాసంగాలు (vocation) కూడా ఉంటాయి కదా. ఇక్కడితో ఆపుతున్నాను. కాకపోతే ఒక చిన్న నివృత్తితో.

మనిషిని మనిషిగా గుర్తించాలి, అతనిలో మంచిచెడులను విశ్లేషించాలి, తదనుసారం గౌరవించాలి. గుంపుతనం (mob-mentality), కఱుడుఁగట్టిన అభిప్రాయాలు, వితండవాదాలు, అకార్మికంగా కీర్తిని, డబ్బుని, ఆశించడం, సంచలనప్రియత్వం, బహుమతాన్ని (majority) వ్యతిరేకించి గొప్ప అనుకోవడం ఇవన్నీ అభద్రతకు, హృదయదౌర్బల్యానికి సూచనలు. మనిషి ప్రేమించాల్సింది నిజాన్ని. 


వ్యాసంలో ఎక్కడబడితే అక్కడ కొత్తకొత్త తెలుగు/సంస్కృత పదాలను సృష్టించాను. తప్పులుంటే మన్నించగలరు, సవరించగలరు అని మనవి.

Thursday, June 30, 2011

హాస్యధారావాహిక - అమృతం

ఈ మధ్యన భారతీయులకు పరదేశీ హాస్యధారావాహికల మీద దృష్టి మళ్ళింది. Friends, Two and a half men, Big bang theory, How I met your mother మొదలైన ధారావాహికల గురించి ప్రవాసభారతీయులు మాట్లాడుకోవడం తరచూ నేను వింటుంటాను. నేను చూసిన రెండు మూడు ధారావాహికలు నిజంగానే హాస్యభరితంగా ఉన్నాయి. కాకపోతే వీటితో నాకు రెండు చిరాకులు ఉన్నాయి. మొదటిది అశ్లీలత (కొంచెం కూడా విలువలని చూపించకపోవడం) ఐతే రెండోది బలవంతంగా నవ్వించాలనుకోవడం (తెర వెనుక నవ్వులు, చప్పట్లు గుప్పించడం). అయినప్పటికీ వీటిల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. అది నిజంగా అభినందనీయం.

పశ్చిమదేశాలు ఏం చేస్తే అది అనుసరించడం అలవాటైపోయిన మన దేశంలో అలాంటి చిత్రాలు ఊపందుకున్నాయి కానీ, నాకు తెలిసి ధారావాహికలు మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఉత్తరభారతదేశంలో Laughter challenge పేరిట హాస్యాన్ని పండించగలిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఆ తరువాత అదే వృత్తిగా ఎంచుకొని విజయం సాధించారు. వాళ్ళల్లో ప్రముఖుడు రాజూ శ్రీవాస్తవ్ చాలా కీర్తి గడించాడు. దక్షిణాదిలో తమిళులని చూస్తే, వాళ్ళూ చాలా హాస్యభరితమైన ధారావాహికను సృష్టించగలిగారు. "లొల్లు సభ" పేరితో వారు చలచిత్రాలకు వ్యంగ్యరూపాలను చిత్రించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కాకపోతే ఈ రెండిట్లో కూడా ఎంతో కొంత అశ్లీలత, వ్యంగ్యం ఉన్నాయి.

ప్రపంచం అంతా ముగ్గులు వేసుకున్నాక లేస్తూ ఆవలించడం అలవాటైపోయిన కొత్త తరం తెలుగువాళ్ళకు ఇలాంటిది ఏముందా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి లేకుండా ఎంతో చక్కటి అభిరుచి ఉన్న గుణ్ణం గంగరాజు గారు (Just Yellow అనే పతాకంపై) అమృతం హాస్యధారావాహికను మొదలుపెట్టారు. ఈయన ప్రమేయం ఉన్న చిత్రాలు అన్నీ నాకు నచ్చినవే -- Little soldiers, ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది మొదలైనవన్నీ చక్కటి చిత్రాలు. అమృతంలో ఎక్కువ అంకాలు ఎవరు దర్శకత్వం వహించారో తెలియదు కానీ, మొదట్లో కొన్ని చంద్రశేఖర్ ఏలేటి (ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాలకు దర్శకుడు) చివరిలో చాలా భాగాలు హర్షవర్ధన్ (కొన్నాళ్ళు అమృతం పాత్రను పోషించిన చక్కని నటుడు), వాసు ఇంటూరి (సర్వం పాత్రతో సంచలనం సృష్టించిన మరో చక్కని నటుడు) దర్శకత్వం వహించారు. చాలా అంకాలకు రచన చేసింది గుణ్ణం గంగరాజు గారే!

వివిధదశల్లో అమృతం పాత్రను ముగ్గురు నటులు పోషించారు -- శివాజీ రాజా, senior నరేశ్, హర్షవర్ధన్. అలాగే సంజీవని పాత్రను కూడా ముగ్గురు (?) నటులు పోషించారు (ఝాన్సీ, ఉమా మహంతి, సుప్రజ). ఆంజినేలు, శాంతలుగా గుండు హనుమంతురావ్, రాగిణి అద్భుతంగా నటించారు. అమృతరావు మరదలు పద్దుగా స్వాతి, మామగారిగా కనకాల దేవదాస్ నటించారు. అప్పాజీ గా శివన్నారాయన నూటికి నూటొక్కపాళ్ళు న్యాయం చేశారంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోతూ ఉండే పాత్రలు చేసినవాళ్ళు (kidnapper గా చేసిన వ్యక్తి, కిరాణా కొట్లో పనిపిల్లగా చేసిన అమ్మాయి, రాధ-మధులో పద్మశ్రీకి సహాయకుడిగా చేసిన అబ్బాయి -- వీళ్ళ పేర్లు తెలియవు కానీ...) కూడా బాగా చేశారు.

ప్రపంచంలో ఎంతో ఖర్చుపెట్టి తీసిన, పేరు పొందిన హాస్యధారావాహికలు కొన్ని మాత్రమే 300 అంకాలు (episodes) పూర్తి చేసుకున్నాయి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో తీసిన అమృతం ధారావాహిక 313 అంకాల పాటు నడిచింది. ఈ అంకాలను ఒక్కొక్కటిగా Just Yellow పతాకం వారు YouTube లో చేరుస్తున్నారు. దాదాపు అన్ని అంకాలు ఎంతో కొత్తదనంతో, నిజాయతీతో ఉంటాయి. ఈ ధారావాహికలో నాకు నచ్చిన విషయాలు:
  • ప్రతి  frameలోనూ హాస్యాన్ని బలవంతంగా పుట్టించడానికి వ్యంగ్యాన్ని వాడలేదు. నిజానికి ఈ ధారావాహిక మొత్తంలో ఎవ్వరూ ఎవరినీ అనవసరంగా అవమానించరు/కించపరచరు.
  • అశ్లీలత కొంచెమంటే కొంచెం కూడా లేదు! తాగుడూ, జూదం, ధూమపానం వంటివి కూడా లేవు. పిల్లలకు సంకోచం లేకుండా చూపించవచ్చును.
  • తెలుగుదనం -- దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ధారావాహికలో ఎక్కడికక్కడ చక్కటి తెలుగుపదాలు వినబడుతూ ఉంటాయి. అక్కడక్కడా సంస్కృతసమాసాలను కూడా దంచారు. ఇక తెలుగు, ఆంగ్ళం కలిపి ప్రాస వ్రాయడం ఆ రచయితకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. "నేరచరిత్రను నెరేట్ చేస్తాను", "కొరిమి దెయ్యంలా courier service అన్నావ్" లాంటి ప్రయాసప్రాసలు భలేగా నవ్విస్తాయి. నిజానికి ఒక వ్యాపారాత్మకమైన దూరదర్శనస్రవంతి (TV channel) లో episode ని అంకం అని పిలిచిన ఏకైక ధారావాహిక ఇదేనేమో!
  • పాత్రధారులు -- అప్పాజీ, అమృతం, ఆంజినేలు, శాంత, సంజీవిని, సర్వం -- ఎవరికి వారే అద్భుతంగా నటించారు. వీళ్ళకు చలనచిత్రాలలో అవకాశాలు లేకపోవడం చలనచిత్రసీమ ఎంత దుస్థితిలో ఉందో తెలుపుతోంది. అందరి ఉచ్చారణ చక్కగా ఉంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
  • ఒక ఏడాదంతా హాయిగా నవ్వుకునేటన్ని అంకాలు ఉన్నాయి. మరుసటి ఏడాది మళ్ళీ చూస్తే మళ్ళీ నవ్వొస్తాయి :)

మొదట్లో ఈ ధారావాహికకు ఎంతో ఆకర్షనను కలిగించినది మాత్రం రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిలో ఆంగ్ళ, తెలుగు పదాలను చక్కగా కలిపి - హాస్యం, తేలికదనం, కవిత్వం, కొత్తదనం కలిపి వ్రాసిన "ఒరేయ్ ఆంజినేలు" అనే పాట తెలియని మధ్యతరగతి తెలుగు వాడుండడేమో.  అది స్వరపరిచి, వినిపించిన కళ్యానీ మాలిక్ కూడా చక్కటి ప్రావిణ్యం కనబరిచారు. పాటను క్రింద వ్రాస్తున్నాను. ఇలాగ వ్రాసేవరకూ ఈ పాటకు రెండు చరణాలు ఉన్నాయని అనుకోలేదు.

హయ్యోలు, హమ్మోలు -- ఇంతేనా బ్రతుకు హు హు హు
ఆహాలు, ఓహోలు -- ఉంటాయి వెతుకు హ హ హ
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోల్
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడింతో ఐపోయే గాయాలే మనకు గండాలు

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవ ట్రబులు?
హల్లో హవ్డూయుడూ అంటూ అంటోంది అంతే నీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా?
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా?
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు,
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెనుతుఫానసలు?

ఒరేయ్ ఆంజినేలు తెగ ఆయాసపదిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్!

ఈ పాటకు వెనక వచ్చే రేఖాచిత్రాలు (sketches) కూడా చాలా హాస్యభరితంగా, కొత్తగా ఉన్నాయి. "చెంచాడు భవసాగరాలు" అనడం సిరివెన్నెల చేసిన ప్రయోగం చాలా అభినందనీయం. అన్ని కష్టాలనీ రెండు మాటల్లో తేల్చి  పారేశారు. ఏదేమైనా ఈ ధారావాహిక ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సినది!

Friday, May 20, 2011

రాధ-మధు

ఒకరోజు ఊరికెనే youtubeలో ఏదో వెతుకుతుంటే "రాధ-మధు" ధారావాహికలో ఒక అంకం (episode) ఎదురైంది. చూస్తే Maa TV వాళ్ళు ఆ ధారావాహికనంతా high resolutionలో youtube లో ఉంచారు. సరే అని ఆ అంకాన్ని నొక్కి చూస్తే ఎందుకో నచ్చింది. అలాగ నెమ్మదిగా అంకం తరువాత అంకం పూర్తి చేసుకుంటూ మొత్తానికి ఆ ధారావాహికను రెండు నెలలు తిరక్కుండా పూర్తిగా చూసేశాను (450 అంకాలు). ఒక్క ముక్కలో చెప్పలంటే అద్భుతంగా ఉంది. ఈ ధారావాహికలో నాకు నచ్చిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ఆ విశేషాలు నచ్చినవారు కూడా ఈ ధారావాహికని చూసి సంతోషిస్తారని ఈ టప వ్రాస్తున్నాను. చదువర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాధ పూర్తి పేరు రాధాకృష్ణ, మధు పూర్తి పేరు మధూళిక.
  • బలమైన స్త్రీపాత్రలు: రాజరాజేశ్వరి, మధూలిక, జానకమ్మ (రాధారాణి) ముఖ్యపాత్రలు కావడంతో వాటికి బరువుని కల్పించడం సహజం. కానీ అక్కడక్కడ కనబడే పాత్రలను కూడా చాలా చక్కగా రూపించారు. ఉదాహరణలు:
    • జూలూ, రాధ class కి ఎందుకు రావట్లేదో కనుక్కోమని తన friend ని అడుగుతుంది. ఆ friend కి పట్టుమని పది సన్నివేశాలు కూడా ఉండవు. కానీ, ఎంతో పరిపక్వతను కనబరుస్తుంది. ఆమె చెప్పే నాలుగు మాటల్లో కూడా చాలా అనుభవం కనబడుతుంది.
    • గోదావరి (రాధ వాళ్ళింట్లో పనిమనిషి) రెండు మూడు సార్లు రాధను ఎదిరించి మంచి చెప్తుంది. ఆ చెప్పటంలో కూడా ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పాత్ర చాలా చక్కగా అల్లారు.
  • సున్నితత్వం ఉన్న పాత్రలు: దాదాపు అన్ని పాత్రలలోనూ సున్నితత్వాన్ని చూపించారు (బహుశా, మూర్తి తల్లి పాత్ర తప్ప). రెండు మాటల్లో ఎంతో లోతును ప్రదర్శించే అవకాశం దాదాపు అన్ని పాత్రలకూ లభించింది. ఉదాహరణలు:
    • మధూలిక రాధను విడిచి వెళ్ళిపోయే ముందు (అతనికి తెలియదు వెళ్ళిపోతోంది అని) చక్కగా వండి కొసరికొసరి వడ్డించి వెళ్ళిపోతుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. 
    • రాధ అత్యవసరమైన పనిని తన ఉద్యోగికి చెప్పి, "నాకు lunch time లోపల పని జరగాలి", అంటాడు. ఆ ఉద్యోగి వెళ్తూంటే, "చూడండి, మీరు lunch రోజూ చేసే time కే చెయ్యండి", అంటాడు. ఇందులో శ్లేషతో కూడిన హాస్యం కలిగే అవకాశమున్నా, రాధ కళ్ళల్లో ఆ సున్నితత్వం కనిపించి సన్నివేశాన్ని పండించింది. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూస్తుంటే ఈ తిట్టుకోవాడాలు, కొట్టుకోవడాలు ఉన్న చలనచిత్రాల కంటే ఈ ధారావాహికల్లోనే మనసుకు కాస్త ఊరట కలుగుతుంది అనిపించింది.
  • చక్కని మాటలు: మాటల రచయిత ఎవరో తెలియదు కానీ, మంచి హాస్యాన్ని, పదాల వాడుకలో మెళకువని, మనసుని స్పృశించే భావావేశాన్ని కనబరిచాడు. దాదాపు ప్రతి రెండు అంకాలకు ఒకసారి "హమ్మ, భలే మాట వాడాడురా" అనిపించింది. మచ్చుకు మూడు చెప్తున్నాను.
    • ఒక కార్మికనాయకుడు ఆ కర్మాగారానికి managerతో మాట్లాడే సందర్భంలో, "మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు" అంటాడు. వెంటనే ఆ manager, "మన factoryలో గాజులు తొడుక్కుని పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను అవమానించడం దేనికి? విషయం చెప్పండి.", అంటాడు. ఆ సన్నివేశానికి ఆ మాట వలన ఎంతో అందం చేకూరింది.
    • మిత్రా రాధను వెక్కిరిస్తూ, "ఆరంభించకుండా ఆగిపోయేవాడిని అధముడు అని, ఆరంభించి మధ్యలో వదిలేసేవాడిని మధ్యముడు అని, ఆరంభించిన పనిని పూర్తిచేసేవాడిని ఉత్తముడు అని అంటారు" (భర్తృహరి సుభాషితం), అంటాడు. రాధకు చాలా కోపం వచ్చి, "ఆరంభించక ముందే అపశకునం పలికేవాణ్ణి 'వాయి మూడు' అంటారు", అంటాడు. రచయత భాషాచాతుర్యాన్ని ప్రదర్శించడంతో చక్కని హాస్యం పండింది. ఇలాంటి హాస్యం ఇంకా చలా చోట్ల ఉంది.
    • మూర్తి మధూళికతో మాట్లాడుతూ రాధ దగ్గరనుండి భరణం అడగమని అంటాడు. ఇన్నాళ్ళు తను రాధ కుటుంబానికి చేసిన సేవకు ప్రతిఫలంగా అడగడంలో తప్పులేదని, అందులో గౌరవం పోయేదేమీ లేదని అంటాడు. అప్పుడు మధూ, "ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా, నన్ను నేను గౌరవించుకోవాలి కద మూర్తి", అంటుంది. ఆత్మగౌరవాన్ని ఇంత చిన్న మాటల్లో చెప్పడం నాకు బాగా నచ్చింది.
  • రాజేశ్వరి, మిత్ర, గోపాలం -- వీరి స్నేహం: ముగ్గురికి ముగ్గురు ఎంతో మానసికపరిపక్వత కలిగినవాళ్ళయ్యుండి కూడా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ వృద్ధాప్యం మనిషిలో ఉల్లాసానికి అడ్డు కాదు సుమీ అనిపిస్తారు. పెద్దరికం ఎంత కనబరుస్తారో, మాటలు అంత తేలికగా ఉంచుతారు.
  • తెలుగుదనం: ఎక్కడా మాటల్లో అతిగా ఆంగ్లాన్ని వాడలేదు. వాడినా అది information కోసమే వాడారు. ఉదాహరణకి నాకు french leave అంటే ఏమిటో ఈ ధారావాహిక ద్వారానే తెలిసింది. అక్కడక్కడ శతకపద్యాలను, మంచి సామెతలను గుర్తుచేశారు. మామూలు సన్నివేశాలలో "మార్దవం" లాంటి పదాలను వింటే మనసు పొంగిపోయింది. ఒక చోట బాపి, "మూర్తి ఉన్నాడా అండి", అని మూర్తి మరదల్ని అడిగితే "మూర్తి గారు" అనలేదు అని ఆమెకు కోపం వచ్చి, "ఓయ్, ఏమిటి? నువ్వేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, పేరు పెట్టి పిలుస్తున్నావు?" అంటుంది. ఆ మాట విని ఎన్ని రోజులైందో!
  • చిలిపిదనం: మొత్తం ధారావాహిక అంతా బోల్డంత చిలిపిదనం ఉంది. రాధ, మధు లాంటి యువదంపతుల మధ్యన అది ఉండటం సహజమే, కానీ వెంకట్రావు, జానకమ్మ వంటి వృద్ధదంపుతల మధ్యన కూడా చాలా చిలిపి సందర్భాలు చూపించారు. చూస్తూనే పెదాలపైన చిరునవ్వు వెలియవలసిందే!
 వెఱసి రాధ-మధు ఒక పరిపూర్ణమైన ధారావాహిక అయ్యింది. తీరిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది చూడాలని నా సలహా.

Sunday, September 12, 2010

అంతరాయానికి చింతిస్తున్నాము

నేను దాదాపు నెలరోజులపాటు ఒక్క టప కూడా వ్రాయలేదు. (అంటే, నా టపల కోసం ఎవరో కాచుకుని కూర్చున్నారు అని అనట్లేదు అనుకోండి.) దానికి కారణం నా స్వదేశగమనం. భారతదేశానికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని, బంధువులని, మిత్రులని కలిసి వెనక్కి వచ్చాను. నేను వెనక్కి రాగానే శనైశ్చరుడు హస్త (నాకు నైధన తార) మీదకు జరిగాడు. తస్సాదియ్యా, నాకు సరదా తీరిపోతోంది. 2011 సెప్టెంబర్ వరకు నాకు చక్కని కాలక్షేపం.

రెండు రోజులనుండి టప వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను కానీ, "ఇదేంటి, ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉందే. ఇవన్ని టపలు వ్రాసింది నేనేనా?" అనే భావం మెదులుతోంది మనసులో. స్వగృహదూరవేదన (home-sick ని తెనుగీకరిద్దామని ప్రయత్నించాను) మనసులోకి దూరదామన్నా ఖాళీ లేనంత పనిలో పడ్డాను. ఏదేమైనా నీళ్ళల్లోకి దూకాక ఈదక తప్పుతుందా.

అలంకారాల టపలు కొనసాగిస్తాను. వీలైనప్పుడు మళ్ళీ పద్యాలు వ్రాస్తాను. వేటూరి వారి సాహిత్యం గురించి కూడా టపలు వ్రాస్తాను. చిట్టి కథలు కూడా వ్రాస్తాను. చదువర్లు అక్షతలు వెయ్యాలనుకుంటే వ్యాఖ్యలను వాడుకోగలరు.

ఇంతే సంగతులు
చిత్తగించగలరు
భవదీయుడు
రామకృష్ణ సందీప్