Sunday, May 22, 2011

వేటూరికి నివాళి

నేటికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం వేటూరి అస్తమించారు. ఆయనని తలుచుకుంటూ ఏవో నాలుగు మాటలు కూర్చాను. వారికి ఇదే నా పదాంజలి.

తలపులన్నీ మనసు-తలుపు తడుతున్నా, కలముతో ఈ పాట వ్రాయలేకున్నా
మాటలన్నీ మధుర జ్ఞాపకాలాయి, మనసులోన నింపె ఆనాటి హాయి
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

తెలుగుకోకిలమ్మ మూగబోయింది, తేటగీతి నీవు ఇవ్వలేదంటూ
మనసు-తేనెటీగ మధువు చేదంది, పాత పాటపూల మధురమేదంటూ
పాటలన్నీ యిచ్చి పయనమైనావు, మైనమల్లే నీవు మాయమైనావు
కన్ను వెతుకుతోంది ఆనాటి వెలుగు, నిన్ను అడుగుతోంది నీ తల్లి తెలుగు...

రంపమంటి బాధ రగిలించె మంట*, రాగమాగనంటు కదిలింది వెంట
అంపశయ్య మీదె అల్లావు పాట, సాగి చేరుకుంది పదిమంది నోట
పాపగా ఎదిగావు తెలుగమ్మ కంట, పాటగా మిగిలావు మా అందరింట
మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట...

వెన్ను తట్టి లేపె ఈ నాటి ఉదయం, నిన్నటి నీ పాట తేనె నెమరేసె హృదయం...
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

* వేటూరి గారు ఎన్నో పాటలు ICUలో ఉండి వ్రాశారని చాలామంది చెప్పగా విన్నాను.

Friday, May 20, 2011

రాధ-మధు

ఒకరోజు ఊరికెనే youtubeలో ఏదో వెతుకుతుంటే "రాధ-మధు" ధారావాహికలో ఒక అంకం (episode) ఎదురైంది. చూస్తే Maa TV వాళ్ళు ఆ ధారావాహికనంతా high resolutionలో youtube లో ఉంచారు. సరే అని ఆ అంకాన్ని నొక్కి చూస్తే ఎందుకో నచ్చింది. అలాగ నెమ్మదిగా అంకం తరువాత అంకం పూర్తి చేసుకుంటూ మొత్తానికి ఆ ధారావాహికను రెండు నెలలు తిరక్కుండా పూర్తిగా చూసేశాను (450 అంకాలు). ఒక్క ముక్కలో చెప్పలంటే అద్భుతంగా ఉంది. ఈ ధారావాహికలో నాకు నచ్చిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ఆ విశేషాలు నచ్చినవారు కూడా ఈ ధారావాహికని చూసి సంతోషిస్తారని ఈ టప వ్రాస్తున్నాను. చదువర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాధ పూర్తి పేరు రాధాకృష్ణ, మధు పూర్తి పేరు మధూళిక.
  • బలమైన స్త్రీపాత్రలు: రాజరాజేశ్వరి, మధూలిక, జానకమ్మ (రాధారాణి) ముఖ్యపాత్రలు కావడంతో వాటికి బరువుని కల్పించడం సహజం. కానీ అక్కడక్కడ కనబడే పాత్రలను కూడా చాలా చక్కగా రూపించారు. ఉదాహరణలు:
    • జూలూ, రాధ class కి ఎందుకు రావట్లేదో కనుక్కోమని తన friend ని అడుగుతుంది. ఆ friend కి పట్టుమని పది సన్నివేశాలు కూడా ఉండవు. కానీ, ఎంతో పరిపక్వతను కనబరుస్తుంది. ఆమె చెప్పే నాలుగు మాటల్లో కూడా చాలా అనుభవం కనబడుతుంది.
    • గోదావరి (రాధ వాళ్ళింట్లో పనిమనిషి) రెండు మూడు సార్లు రాధను ఎదిరించి మంచి చెప్తుంది. ఆ చెప్పటంలో కూడా ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పాత్ర చాలా చక్కగా అల్లారు.
  • సున్నితత్వం ఉన్న పాత్రలు: దాదాపు అన్ని పాత్రలలోనూ సున్నితత్వాన్ని చూపించారు (బహుశా, మూర్తి తల్లి పాత్ర తప్ప). రెండు మాటల్లో ఎంతో లోతును ప్రదర్శించే అవకాశం దాదాపు అన్ని పాత్రలకూ లభించింది. ఉదాహరణలు:
    • మధూలిక రాధను విడిచి వెళ్ళిపోయే ముందు (అతనికి తెలియదు వెళ్ళిపోతోంది అని) చక్కగా వండి కొసరికొసరి వడ్డించి వెళ్ళిపోతుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. 
    • రాధ అత్యవసరమైన పనిని తన ఉద్యోగికి చెప్పి, "నాకు lunch time లోపల పని జరగాలి", అంటాడు. ఆ ఉద్యోగి వెళ్తూంటే, "చూడండి, మీరు lunch రోజూ చేసే time కే చెయ్యండి", అంటాడు. ఇందులో శ్లేషతో కూడిన హాస్యం కలిగే అవకాశమున్నా, రాధ కళ్ళల్లో ఆ సున్నితత్వం కనిపించి సన్నివేశాన్ని పండించింది. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూస్తుంటే ఈ తిట్టుకోవాడాలు, కొట్టుకోవడాలు ఉన్న చలనచిత్రాల కంటే ఈ ధారావాహికల్లోనే మనసుకు కాస్త ఊరట కలుగుతుంది అనిపించింది.
  • చక్కని మాటలు: మాటల రచయిత ఎవరో తెలియదు కానీ, మంచి హాస్యాన్ని, పదాల వాడుకలో మెళకువని, మనసుని స్పృశించే భావావేశాన్ని కనబరిచాడు. దాదాపు ప్రతి రెండు అంకాలకు ఒకసారి "హమ్మ, భలే మాట వాడాడురా" అనిపించింది. మచ్చుకు మూడు చెప్తున్నాను.
    • ఒక కార్మికనాయకుడు ఆ కర్మాగారానికి managerతో మాట్లాడే సందర్భంలో, "మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు" అంటాడు. వెంటనే ఆ manager, "మన factoryలో గాజులు తొడుక్కుని పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను అవమానించడం దేనికి? విషయం చెప్పండి.", అంటాడు. ఆ సన్నివేశానికి ఆ మాట వలన ఎంతో అందం చేకూరింది.
    • మిత్రా రాధను వెక్కిరిస్తూ, "ఆరంభించకుండా ఆగిపోయేవాడిని అధముడు అని, ఆరంభించి మధ్యలో వదిలేసేవాడిని మధ్యముడు అని, ఆరంభించిన పనిని పూర్తిచేసేవాడిని ఉత్తముడు అని అంటారు" (భర్తృహరి సుభాషితం), అంటాడు. రాధకు చాలా కోపం వచ్చి, "ఆరంభించక ముందే అపశకునం పలికేవాణ్ణి 'వాయి మూడు' అంటారు", అంటాడు. రచయత భాషాచాతుర్యాన్ని ప్రదర్శించడంతో చక్కని హాస్యం పండింది. ఇలాంటి హాస్యం ఇంకా చలా చోట్ల ఉంది.
    • మూర్తి మధూళికతో మాట్లాడుతూ రాధ దగ్గరనుండి భరణం అడగమని అంటాడు. ఇన్నాళ్ళు తను రాధ కుటుంబానికి చేసిన సేవకు ప్రతిఫలంగా అడగడంలో తప్పులేదని, అందులో గౌరవం పోయేదేమీ లేదని అంటాడు. అప్పుడు మధూ, "ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా, నన్ను నేను గౌరవించుకోవాలి కద మూర్తి", అంటుంది. ఆత్మగౌరవాన్ని ఇంత చిన్న మాటల్లో చెప్పడం నాకు బాగా నచ్చింది.
  • రాజేశ్వరి, మిత్ర, గోపాలం -- వీరి స్నేహం: ముగ్గురికి ముగ్గురు ఎంతో మానసికపరిపక్వత కలిగినవాళ్ళయ్యుండి కూడా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ వృద్ధాప్యం మనిషిలో ఉల్లాసానికి అడ్డు కాదు సుమీ అనిపిస్తారు. పెద్దరికం ఎంత కనబరుస్తారో, మాటలు అంత తేలికగా ఉంచుతారు.
  • తెలుగుదనం: ఎక్కడా మాటల్లో అతిగా ఆంగ్లాన్ని వాడలేదు. వాడినా అది information కోసమే వాడారు. ఉదాహరణకి నాకు french leave అంటే ఏమిటో ఈ ధారావాహిక ద్వారానే తెలిసింది. అక్కడక్కడ శతకపద్యాలను, మంచి సామెతలను గుర్తుచేశారు. మామూలు సన్నివేశాలలో "మార్దవం" లాంటి పదాలను వింటే మనసు పొంగిపోయింది. ఒక చోట బాపి, "మూర్తి ఉన్నాడా అండి", అని మూర్తి మరదల్ని అడిగితే "మూర్తి గారు" అనలేదు అని ఆమెకు కోపం వచ్చి, "ఓయ్, ఏమిటి? నువ్వేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, పేరు పెట్టి పిలుస్తున్నావు?" అంటుంది. ఆ మాట విని ఎన్ని రోజులైందో!
  • చిలిపిదనం: మొత్తం ధారావాహిక అంతా బోల్డంత చిలిపిదనం ఉంది. రాధ, మధు లాంటి యువదంపతుల మధ్యన అది ఉండటం సహజమే, కానీ వెంకట్రావు, జానకమ్మ వంటి వృద్ధదంపుతల మధ్యన కూడా చాలా చిలిపి సందర్భాలు చూపించారు. చూస్తూనే పెదాలపైన చిరునవ్వు వెలియవలసిందే!
 వెఱసి రాధ-మధు ఒక పరిపూర్ణమైన ధారావాహిక అయ్యింది. తీరిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది చూడాలని నా సలహా.

Tuesday, May 17, 2011

తెలుగు భారతికి వెలుగు హారతై, ఎద లయలో పదకవితలు కలయ... (అన్నమయ్య జన్మదినం)

ఈ రోజు అన్నమాచార్యుని పుట్టినరోజు. తెలుగువారందరూ ఎంతో గర్వించ-తగిన/వలసిన రోజు. తెలుగు భాషని, భాషకి సేవచేసిన మహానుభావులని మరిచిపోవడం మనకు వెన్నతో పెట్టిన విద్య అయినప్పటికీ ఈ రోజు కాస్త ఆ అలవాటుని పక్కన పెట్టి, ఆ మహానుభావుడిని ఒక్కసారి స్మరిద్దాము.

ఈ రోజుల్లో మన చలనచిత్రాల్లో వస్తున్న పాటలను చూస్తే "ఓసోసి, పాట వ్రాయడం అంటే ఇంత సులువా? నేనూ వ్రాస్తాను" అనుకుని "నిన్ను చూస్తే గుండె కొట్టుకుంది, మాయరోగం నన్ను పట్టుకుంది" అని వ్రాసేద్దామనిపిస్తుంది. చలనచిత్రకవులకు కూడా పదే పదే అదే సందర్భం ఇస్తే తరచూ అవే పదాలు/భావాలు దొర్లుతూ ఉంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. అలాంటిది ముప్ఫైవేలకు పైగా పాటలు, ఒక్కడంటే ఒక్కడి మీద, వ్రాయడం, ప్రతీ పాటలో వైవిధ్యం కనబరచడం, వాటిని భావితరాలకు నచ్చేలాగ/ఉపయోగపడేలాగా స్వరపరచడం, ఎక్కడా యాంత్రికంగా అనిపించకుండా ఆవు పొదుగు దగ్గరి పాలలాగ స్వఛ్ఛంగా ఉంచడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న కర్ణాటక సంగీతంలో ఇంతటి అద్భుతాన్ని సాధించినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చును (అంటే తక్కువ సంకీర్తనలను రచిస్తే తక్కువ కవులు/గాయకులు అని కాదు. కానీ రోజుకో అద్భుతమైన గేయం వ్రాయడం గుర్తించదగిన విషయం అని).

నేను గతసంవత్సరం అన్నమయ్య జన్మదినానికి ఒక పాట వ్రాశాను. స్వరాలంటారూ, నా లాంటి స్వరపరిజ్ఞానహీనుడు ఏం చేస్తాడు? ఏదో "ల లా ల" అనుకుంటూ పాట వ్రాశాను. ఈ ఏడాది కూడా ఎలాగైనా ఒక పాట అన్నమయ్య మీద వ్రాయాలని నా మనసు లాగింది. కానీ, గంటసేపు కూర్చున్నా ఏమీ తట్టట్లేదు. ఇప్పుడు నేను అన్నమయ్య అంత కవిని అనే దుస్సాహసం చేయట్లేదు, కాకపోతే ఏడాది ఖాళీ ఉన్నా అదే సందర్భానికి మఱొక పాట వ్రాయలేకపోతున్నాను. మఱి రోజూ వేంకటేశుడి మీదనే వ్రాయాలంటే ఎంత భక్తి, భావనాశక్తి, భాషాపటిమ ఉండాలో ఆలోచిస్తేనే అన్నమయ్యకు పొఱ్లుదణ్ణాలు పెట్టేయాలనిపిస్తోంది. ఐనా సాహసించి అన్నమయ్య గుఱించి ఏమైనా వ్రాద్దామంటే చలనచిత్రకవితాపితామహుడు వేటూరి ఇప్పటికే అద్భుతమైన పదాలను వాడి అన్నమయ్యని మెప్పించేశాడు. ఆ పాటలు తలుచుకుంటేనే "అమ్మో...నేను ఇలాగ వ్రాయలేను మొఱ్ఱో" అనాలనిపిస్తుంది.

అన్నమయ్య గళానికి (అదే...నందకానికి!) రెండు వైపులా పదునే. అటు సంఘాన్ని విమర్శించినా (బ్రహ్మమొకటే), ఇటు సంఘాన్ని విస్మరించినా (అదినే నెఱగనా); అటు శృంగారమైనా (ఏమొకో చిగురుటధరమున), ఇటు పరమవైరాగ్యమైనా (అంతర్యామి అలసితి); అటు గంభీరమైన సంస్కృతమైన (ఫాలనేత్రానలప్రబల), ఇటు జానపదమైనా (సిరుతనవ్వులవాడే సిన్నెక్క) -- అన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చినవే అనిపిస్తుంది. ఒక వంద thesisలు వ్రాయగలిగినన్ని విషయాలు ఆయన పాటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన కవితాపటిమ గుఱించి చెప్పడానికి నా బోటి అల్పుడు సరిపోడు. ఆ ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు.

కొంతమంది కారణజన్ములు అని వారిని చూడకపోయినా వారి సృష్టిని బట్టి చెప్పచ్చును. ఆది శంకరుడి గొప్పదనం తెలియడానికి ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ చదవక్కరలేదు. సంస్కృతంలో అక్షరం ముక్క తెలియని వాడైనా "అయి గిరి నందిని" అన్న శ్లోకం విన్నాడంటే, "ఇదెవరో మహానుభావుడు వ్రాశాడురోయ్!" అనుకుంటాడు. అలాంటి కారణజన్ముడే అన్నమాచార్యుడు కూడా. నేను దైనందినజీవితంలో విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఆయన మాటలను గుర్తుచేసుకుంటుంటాను. ఆయన వైరాగ్యభరితమైన పాటలు వింటూవుంటే నా మనసుకు ఊరట కలుగుతుంది. భగవద్గీతలోని లోతంతా ఒక్క నిముషంలో చూసినంత ఎత్తుకు వెళ్ళిపోతాను.

"కోరిన కోఱ్కెలు కోయనికట్లు, తీరవు నీవవి తెంచక; మదిలో చింతలు మయిలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక"
"యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి; కొంతైన బ్రహ్మచింత కోటిలాభము"
"పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా"

 
ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్ని రోజులైనా చెప్పుకుంటూపోవచ్చును. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపి, పదకవితాకులంలో ఒక మరుగుజ్జునైన నేను మనసార ఆ మహాత్ముడికి ప్రణామం చేస్తున్నాను. "మహానుభావ... మళ్ళీ నీకు పుట్టే ఉద్దేశం ఉంటే చెప్పు, నీకు చెప్పులుకుట్టేవాడిగా పుట్టినా నాబోంట్ల జన్మ ధన్యమవుతుంది", అని గట్టిగా అరవాలనిపిస్తోంది.

PS: సోదరుడు శ్రవణ్ కుమార్, తన బ్లాగు ద్వారా అన్నమయ్య పాటలను నలుగురికీ అందే విధంగా చేస్తున్నాడు. ఆ బ్లాగులో అన్నమయ్య అనే అనంతరత్నాకరంనుండి గ్రహించిన అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. చదువర్లు ఆ బ్లాగుని దర్శించవలసిందిగా నా మనవి. 

Saturday, April 16, 2011

పెద్దలొస్తున్నారు జాగ్రత్త!

నన్నెఱిగిన చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే: నేను మంచివాణ్ణా, చెడ్డవాడినా అన్న సంగతి పక్కన పెడితే, పెద్దలంటే గౌరవం ఉంది అని. ఇదేదో ఆత్మస్తుతి అనుకునేరు. ఇది నేను యత్నపూర్వకంగా చేసేది కాదు. ఎందుకో చిన్నప్పటినుండి అలాగ అలవాటైపోయింది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఇరవయ్యేళ్ళు పట్టింది.

మన దేశంలో ఉండగా ఎప్పుడూ నా స్నేహాలు ఉపాధ్యాయులతోనే (school, junior college, engineeringలో కూడా). నా ఎదురుగుండా ఉపాధ్యాయులను వెటకారం చెయ్యాలన్నా, మనస్పూర్తిగా తిట్టుకుందామన్నా నా స్నేహితులు జంకేవాళ్ళు. అలాంటి స్నేహాలు నాకు విచిత్రంగా తోచకపోయినా నా మిత్రులందరికీ విచిత్రంగా అనిపించేవి (అనిపిస్తున్నాయి). ఇక నిత్యజీవితంలో నాకు నచ్చేవారు కూడా తలలు పండిపోయినవారే. ఇంట్లో నేను మా తాతయ్య కంటే చాదస్తుణ్ణని వినికిడి. భారతంలో నాకు నచ్చిన పాత్రలు భీష్ముడు, వ్యాసుడు, విదురుడు -- అందరూ తలలు పండి నీతులు చెప్పే వాళ్ళే. ఆఖరికి మన భారతక్రికెట్లో T20 ఆటలో కూడా నాకు నచ్చుతున్నది ముసలివాళ్ళే (ద్రావిడ్, తెండుల్కర్, లక్ష్మణ్ :) ).

ఇప్పుడు ఈ చరిత్ర అంతా మాకెందుకు అంటారు. అక్కడికే వస్తున్నాను. ఈ తరం పెద్దలకి (అంటే సుమారుగా 50 ఏళ్ళు దాటినవాళ్ళకి) Internet రావడం వలన జీవితంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు trunk call చెయ్యాలంటే ముందురోజునుండి ఏమేమి మాట్లాడాలో ఆలోచించుకునేవాళ్ళు, ఈ రోజు ఏమీ తోచక ISD calls చేసేవాళ్ళ మధ్యలో ఇమడటానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుకు కూడా మా చిన్నత్తయ్య, నేను విశాఖపట్నం నుండి తుని వెళ్తుంటే "ఒరేయ్ నాన్న మూడు గంటల passenger పట్టుకుంటే పదిరూపాయలు తక్కువవుతుంది" అంటుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతుంది, "అరే? నా ముందుతరం వాళ్ళు డబ్బుకు ఇంత వెనకాడేవారా? ఈ రోజు మనం జీవితంలో ఏమీ సాధించకుండానే పుట్టినరోజు పేరు చెప్పి మూడువేలు తగలేస్తున్నాము".

మార్పు సహజం. దాన్ని యువత ఆహ్వానించినట్టుగా పెద్దలు ఆస్వాదించలేరు. కానీ, మన ముందుతరం వాళ్ళు మన మీద ప్రేమతో ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే Internet లో మసలడానికి కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని చూసి మన తరమంతా మనఃపూర్వకంగా గర్వపడాల్సి ఉంది. వాళ్ళు కూడా ఒక్కసారి కొడుకుతోనో, మనవడితోనో వాళ్ళంతటవాళ్ళు chat చేసినా, video callలో మాట్లాడినా పొంగిపోతారు, గర్వపడతారు.

"ఇదంతా సరే, అసలు ఈ శీర్షవాక్యానికి (titleకి) నువ్వు మాట్లాడుతున్నదానికి సంబంధం ఏమైనా ఉందా?", అని ఇప్పటికే చదువర్లు చిఱాకు పడుతూ ఉండి ఉంటారు. అందుకే అసలు విషయంలోకి వస్తున్నాను. మన పెద్దలు చేస్తున్న ప్రయత్నంలో కొంచెం నవ్వు తెప్పించేవి కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు మనం తెలిసీతెలియని మాటలు మాట్లాడుతుంటే పెద్దలకు కలిగిన నవ్వులాంటిదే ఇదీను. అందుకే ఈ నవ్వులో కూడా ఒక అభిమానం దాగుంటుంది. అలాగ నాకు ఎదురైన సందర్భాలను చెప్పడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

నా స్నేహితుడు ఒకడు MS చేసి US లో ఉన్నాడు. వాడు వాడి తల్లిదండ్రులకి ఏకైక సంతానం. వాడి మీదనే వాళ్ళ ఆశలన్నీ పెట్టుకుని పెంచారు. వాడు ఇక్కడకి వచ్చాక, వాళ్ళకు కాళ్ళూచేతులూ ఆడలేదు. వీడు ఒక Computer కొనిపించి అందులోంచి వాడితో ఎలాగ మాట్లాడాలో నేర్పించాడు. అప్పటినుండి తండ్రీకొడుకుల పాత్రలు తారుమారు అయ్యాయి. వాళ్ళ నాన్న గారు కనబడిన siteలోకల్ల వెళ్ళి login create చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అన్ని sitesలోనూ social aspect ని చేర్చారు కాబట్టి invite your friends అని ఉంటే అది click చెయ్యడం. దానితో వీడికీ, వీడి friends కి emails వెళ్ళడం. ఒకసారి ఏకంగా facebook account సృష్టించుకుని వీడికి friend request పంపించారు. అది చూసి మనవాడు ఖంగు తిన్నాడు. ఇంటికి phone చేసి, "నాన్న, మీరంటే నాకు ఇష్టం, గౌరవం ఉన్నాయి. కానీ, Internet లో మాత్రం నన్ను వదిలెయ్యండి. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి. మీ నాన్న గారు కూడా ఇలాగ మీరు friends  తో కలిసి cigarette కాలుస్తూ బాతాఖానీ కొడుతుంటే వచ్చి చూసేవారా? మీరు facebookలో ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారో నేను అడగను. అమ్మతో కూడా చెప్పను. నేను ఏం చేస్తున్నానో మీరు అడగద్దు", అని బొమ్మరిల్లు style లో చెప్పాడు. అది విని నేను తెగనవ్వుకున్నాను.

మఱొక స్నేహితురాలు వాళ్ళ అమ్మగారికి facebookలో ఖాతా సృష్టించి, కొంతవరకు ఎలాగ వాడాలో నేర్పించి US వచ్చింది. ఒక రోజు వాళ్ళ అమ్మ గారి మీద అలిగి phone ఎత్తడం మానేసింది. వాళ్ళ అమ్మగారికి ఇంకా కోపం వచ్చింది. అది ఎలాగ చెప్పాలో తెలియలేదు. facebook లో login అయి ఈమె updates చూసింది. ఈమె ఒక స్నేహితురాలి photo లో ఒక వ్యాఖ్య వ్రాసింది. ఆ క్రింద Add comment అని కనబడింది. aunty కి ఏం తెలుస్తుంది అక్కడ వ్రాస్తే అందరూ చూస్తారు అని. ఆవేశంగా, "phone కూడా ఎత్తట్లేదు. చాలా ఎదిగిపోయావు. thanks!" అని వ్రాశారు. అంతే ఈ అమ్మాయి అన్నం తింటున్నది కాస్తా, బుఱ్ఱ గింగిరాలు తిరిగి వాళ్ళ అమ్మగారి ఖాతా లోనికి login అయ్యి ఆ వ్యాఖ్యని నిర్మూలించింది (deleted). ఆ అలక విషయం నాకు చెప్తూన్నంత సేపు బాధపడ్డవాడిని ఇది వినగానే నవ్వు ఆపుకోలేకపోయాను.

మఱొక స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు వంట వండటం మొదలెట్టాడు. నేను కూర్చుని చూస్తున్నాను. అప్పుడే వాళ్ళ ఇంటినుండి Yahoo! messenger audio call వచ్చింది. నేను వెళ్ళి నీకు call వస్తోందిరా అంటే, వాడు బెంబేలెత్తిపోయి reject కొట్టాడు. అదేమిరా అంటే, "మా అమ్మకు అవసరమైనప్పుడు మాట్లాడటానికి ఉంటుంది అని నేను ఇది నేర్పిస్తే రోజూ నాలుగు సార్లు చేసేస్తోంది. అసలు రోజంతా call ఉంచితే ఏం పోయింది? Internet bill అంతే వస్తుంది కదా అంటోంది.", అన్నాడు. "Internet bill అంతే వస్తుందని ఎలాగ తెలుసురా?" అంటే "మనమెంత మాట్లాడితే అంత ఖర్చవుతుంది అని అనుకుని ఎప్పుడూ 'బాగున్నావా? ఆరొగ్యం జాగ్రత్త. ఉంటాను నాన్న.' అని తప్ప వేరేది మాట్లాడేది కాదు. అప్పుడు చెప్పాను, 'మనది unlimited plan. ఎంత మాట్లాడినా అంతే ఖర్చవుతుంది అని.", అన్నాడు.  నాకు ఏం చెప్పాలో తెలియలేదు -- వాళ్ళ అమ్మగారు వాడిని ఎంత miss అవుతున్నారో చూసి బాధ, ఆవిడ idea కి నవ్వు.

నా స్నేహితుడి అన్నగారు కూడా facebook లో చేరారు. ఒక రోజు వెళ్ళి ఆయన profile చూస్తే ఆయన friends లో ఎవడొ russia వాడున్నాడు. వాడెవడొ spammer కుంక అయ్యి ఉంటాడు. మనవాళ్ళకి తెలియదు కదా. ఎవడో పరాయి దేశస్థుడు మనని రెండు చేతులూ చాచి స్నేహాన్ని కోఱుతుంటే కాదంటే తప్పుగా ఉంటుంది అని అనుకున్నాడొ ఏమో accept చేశాడు. అది చూసి మా వాడు, "ఒరేయ్, ఇది చూడరా మరీను", అని చెప్పి కంగారు పడ్డాడు.

ఇక "Click here and claim your laptop; Congratulations! You're the lucky winner; Win a trip to Maldives for free!: లాంటివి చూసి వీళ్ళు ఇంకేం చేస్తారో; ఎక్కడ click చేసి computerకి ఏ Virusలు తెచ్చుకుంటారో అని ఒక కంగారు. ఒక్కోసారి, రేపు పెద్దయ్యాక పిల్లల మీద అభిమానంతో మనం ఎలాంటి పనులు చేస్తామో అనిపిస్తుంది నాకు. అదీ చూద్దాము :)

Thursday, March 3, 2011

శివరాత్రి సందర్భంగా పద్యాలు

శివరాత్రి గురించి బహుశః పాఠకులందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పనికట్టుకుని కొత్తగా చెప్పేది ఏముంది?  శివతత్త్వం ఒక్క మాటలో చెప్పాలంటే "ప్రాణులన్నింటినీ ప్రేమించడం. అహాన్ని జయించడం." -- అంతే.  భగవంతుని కృప చేత మనందరిలోనూ దాగున్న అరిషడ్వర్గాలు నశించాలని ఆశిస్తున్నాను. ఇదే విషయాన్ని పద్యాల రూపంలో ఉంచాను. తప్పులేమైనా కనబడితే సవరించగలరని ప్రార్థన.

ఉ:-
ధ్యానములోనిమగ్నమయి ధారుణిలో మను పాపకర్ములన్
కానకనుంటివో? తగదు! కాదిది ధర్మము నీలకంధరా!
ఆనక నేత్రముల్ దెరువ అంధము రాజ్యము జేయుఁభూమిపై
మానవజాతి దానవుల మారణహోమపు యజ్ఞధేనువై

భా:-
శివా! ధ్యానంలో ఉండిపోయి భూమిపైనున్న పాపులను చూడటం మానేశావా? ఇది నీకు ధర్మం కాదు. నువ్వు కొంచెం ఆలస్యం చేసి కళ్ళు తెరచినా ఇక్కడ మిగిలేది - మానవరూపరాక్షసుల మారణహోమానికి దేవతైన అంధకారం మాత్రమే.

మ:-
తలపై శీతలగంగ భూతలముపై తానెట్టి దౌర్భాగ్యమున్
గలదై నిత్యము శోకసాగరములో గాసిల్లి వేసారెనో
తెలుపన్ చూడదె? ఆమె బాధ గనవా? తీర్చంగ సర్వేశ్వరా!
తలమే ఆమెను ఏపరించు తెగులై తారాడు కాలుష్యమున్

భా:-
నీ తలపైన ఉన్న గంగ తను భూమిపై ఎంత దౌర్భాగ్యానికి లోనౌతోందో, శోకసాగరంలో తపిస్తోందో (అన్ని నదులు సాగరంలో కలిస్తే గంగ శోకసాగరంలో కలుస్తోంది) చెప్పలేదా? భార్య బాధను చూసి ఆమెను వేధిస్తున్న కాలుష్యం అనే రోగాన్ని నువ్వు నయం చెయ్యలేవా?

శా:-
కైలాసంబున కాపురంబదెటులో కాశ్మీరు యుద్ధాలతో?
కాలాకారుడవంచు వేదములలో కైవారముంజేసిరే?
కాలే జీవుల సాక్షిగానెఱుగుమా కాదంచునీ సత్యమున్
కాలేవయ్య నవీనమానవతకున్ కాసింత పోటీ హరా!

భా:-
కాశ్మీర్లో నిత్యం యుద్ధాలు జరుగుతుంటే కైలాసంలో నువ్వు కాపురమెలాగ ఉంటున్నావయ్యా? ఐనా వేదాలలో నిన్ను కాలరూపుడు (మృత్యురూపుడు) అన్నారు కానీ మా మానవజాతి సృష్టిస్తున్న విధ్వంసం సాక్షిగా తెలుసుకోవయ్యా - నువ్వు మాకు ఏ మాత్రం పోటే రాలేవు.

కం:-
అవలక్షణదాసులగుచు
అవధులునెఱుగక యెగబడి యావజ్జనులున్
అవనిని నాశము జేసిరి
శివునాజ్ఞకు భయము లేదు చీమలకైనన్

భా:-
మనుషులు ధర్మాన్ని విడచి ఎవరికి నచ్చినట్టు వారి ఈ భూమిని నాశనం చేస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేక చీమైనా కదలదంటారు కానీ, నిజానికి ఈ ప్రపంచంలో చీమకు కూడా నీ ఆజ్ఞపైన గౌరవం లేదు.

సీ:-
సాగరాల తుదల సంగతులేలయ్య? నగరంబు నరకమై నలిగె గోవు
పచ్చగడ్డిని మేసి పాలిచ్చు గోమాతరొమ్ము చీల్చి రుధిరమమ్ముకొనుచు
వాలము చేబట్టి వైతరణినిఁద్రోయ, తనయాడపడుచుల తాపమెఱిగి
ధరణిపై జరిగేటి దారుణాలను నీకు వర్ణించి చెప్పడే వృషభరాజు?

భా:-
"చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు" అంటారు కదా? ఆ సాగరాల చివరిదాక ఎందుకు పట్టణాలే గోవులకు నరకమైపోతున్నాయి. ఎవ్వరూ ఆశించని గడ్డిని తీసుకొని కమ్మని పాలనిచ్చే ఆ గోమాతని హింసించి ఆమె రొమ్ము చీల్చుకుని మరీ రక్తంతో కూడిన పాలను అమ్ముకునేటువంటి మనుషులు తయారయ్యారు. ఆవు తోక పట్టుకుని వైతరణి దాటడం కాదు, బ్రతికున్న ఆవునే తోకతో లాగి వైతరణిలోకి తోసేస్తున్న దుఃస్థితి ఇది. తన ఆడపడుచుల కష్టం చూసి నందీశ్వరుడైనా నీకు మానవుల దౌష్ట్యాన్ని గురించి చెప్పలేదా?

ఆ:-
భూమి చాలదంచు వ్యోమయానముఁ జేసి
చందమామ తలమునందుకొనిరి
తనకు భూమి స్థితియె తప్పదేమోనంచు
విధువు చేయలేద విన్నపములు?

భా:-
భూమి చాల్లేదని చివరకు చంద్రమండలం మీద కూడా జెండా పాతాము. తనకు కూడా భూమి స్థితే పట్టి కాలుష్యంతో, దుష్టులతో నిండిపోతాడేమోనని భయపడి చంద్రుడు నిన్ను ఏమీ అడగలేదా?

చం:-
గరళము త్రాగి దేవతలఁ గాసితివందురు సత్యమా శివా?
మరణము లెక్కజేయక ప్రమాదముఁదెచ్చెడి రాక్షసాళికిన్
వరములనిచ్చు దానగుణవంతుడవందురు నమ్మవచ్చునా?
కరుణకు రూపమన్న నుడి కల్పన కాదుగ, శైలమందిరా?

భా:-
విషం తాగి దేవతలను కాశావు అంటారు? మరణాన్ని సైతం లెక్కచేయకుండా రాక్షసులకు వరాలిచ్చిన దానవీరుడవంటారు? కరుణకు నీవు నిలువెత్తు రూపం అంటారు. ఇవన్నీ నిజమేనా? లేక మా అపోహలా?

శా:-
బోళాశంకరుడన్న మాట రుజువై, భూమాత హర్షించగన్!
కైలాసంబున ధ్యానయోగతపముల్ కాసేపు చాలించుమా
మా లోకంబున ధర్మరక్షకుడవై మాలిన్యమున్ తెంచుమా
నీలో పేర్మిని మానవాళి మఱగన్ నేర్పించఁ రా దైవమా!

భా:-
ఇవన్నీ నిజమని, నువ్వు బోళామనిషివి అని రుజువయ్యే లాగా -- భూమాత ఆనందించేలాగా కొన్నాళ్ళు కైలాసంలో ధ్యానం మాని మా లోకంలో ధర్మాన్ని రక్షించు. నీలో ఉన్న గొప్ప గుణాలన్నీ మానవజాతికి మప్పు.

Saturday, February 26, 2011

తొలివలపే తీయనిది... (వేటూరి పాట)

సామాన్యజనులకు అర్థమయ్యే విధంగా లోతైన భావాలను వ్రాయగలగడం సినీకవులకు ఉపయోగపడే లక్షణం. వేటూరి వ్రాసిన భావాలను అర్థం చేసుకోవడానికి ఒక్కోసారి భాషలో కానీ, చరిత్ర వంటి విషయాలలో కానీ పట్టు అవసరమౌతుంది. అది ఆయన లేఖినిలోని గాంభీర్యం ఐతే, అలాగ అవసరం లేకుండా వ్రాసిన పాటలు ఆయన కలంలోని లాలిత్యాన్ని ప్రదర్శిస్తాయి. దేని అందం దానిది.

వేటూరి లలితంగా వ్రాసిన పాటల్లో యువరాజు చిత్రంలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. తొలివలపు గురించి ఎంతో లోతుగా చెప్పారు వేటూరి, కానీ ఎక్కడా గ్రాంధికమైన పదాలు కనబడవు. ఒక్కో వాక్యంలోనూ ఒక్కో ఉపమానంతో ఆకట్టుకున్నారు. ఈ పాటకు స్వరకల్పన చేసింది రమణ గోగుల, పాడింది హరిహరన్, చిత్ర.. ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిటో అర్థం కాదేమో...

తొలివలపే తీయనిది, ఆ దాహం తీరనిది
కాలంలా కరిగిపోనిది, తానంలా(?) తిరిగిపోనిది
తొలివలపు ఒక దాహం. మనసులో ఉన్న వ్యక్తిని ఎంతసేపు చూసినా, తనతో ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఒక సారి ప్రేమభంగం అయ్యాక మళ్ళీ ప్రేమించడంలో  "ఇదివరకు చూసినదే" అనే ఒక రకమైన నిర్లిప్తత ఉంటుంది. కాలంతో కరిగిపోకుండా చివరివరకు గుర్తుండే ఒక తీయని జ్ఞాపకం అది.

వేదంలాగా లిపిలేనిది, వేధిస్తున్నా సుఖమైనది
పూర్వం వేదాన్ని ఎవరూ వ్రాసి ఎఱుగరు. అది గురుముఖతః విని కంఠస్థం చేయడమే మార్గం. అందుకే వేదం లిపి లేనిది అంటారు. తొలివలపు కూడా మాటల్లో వివరించలేని ఒక తీయని అనుభూతి అనడానికి దాన్ని వేదంతో పోల్చడం జరిగింది. తొలివలపు వలన చలించినంతగా మనసు మళ్ళీ చలించదు. ఎప్పుడూ అవే ఆలోచనలతో కలవరపెడుతున్నా తీయగా ఉంటుంది. ఇక్కడ "వేదానికి", "వేధిస్తున్నా" కి యతిమైత్రి, ప్రాస కుదరడం గమనార్హం.

ఓడిస్తున్నా గెలుపే అది, ఓదార్చే ఓ పిలుపైనది
ఈ చిత్రంలో తను ప్రేమించిన మనిషి మఱొక అమ్మాయిని పెళ్ళిచేసుకుంటుంటే చూస్తూ సిమ్రన్ ఈ మాటలంటుంది. తనకిష్టమైన వ్యక్తి తనకు దక్కకపోయినా అందులో అతనికి మంచి ఉంటుంది అని తెలిసి ఆ ఓటమిని అంగీకరిస్తూ, తన ప్రేమను గెలిపించుకుంటోంది కాబట్టి "ఓడిస్తున్నా గెలుపే అది". కథానాయకుడు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయాక తనకు మిగిలేవి తొలివలపు జ్ఞాపకాలే కాబట్టి అవే తనకు ఓదార్పు అని భావన.

చుక్కలనే నిలుపునది, దిక్కులనే కలుపునది -- ఆకశం తానై ఉన్నది
ఆకాశానికి ప్రేమకు సామ్యం చెప్తున్నారు వేటూరి. చుక్కలవంటి ఆశలను/జ్ఞాపకాలను ధరించేది, ఎక్కడెక్కడో పుట్టీ పెరిగిన ఇద్దరు మనుషులను కలిపేది, ప్రపంచమంతా ఉండేది ప్రేమ/ఆకాశం.

ఇద్దరిలో ఒక్కటది, ఒక్కరిలో ఇద్దరది -- నీకోసం నేనై ఉన్నది
ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఇద్దరిలోనూ ఉన్న ఒకే భావం తొలివలపు. ఒక్కరే ఉన్నా తమతో మఱొకరు కూడా ఉన్నట్టు అనిపించేటువంటి భావన ప్రేమ. ఒకరి కోసం ఒకరై జీవించేటువంటి అనుబంధం ప్రేమ.

గుండెల్లోన గూడే ఇది, గుచ్చే రోజామాలైనది
తొలివలపుకు మనసులో శాస్వతంగా ఒక స్థానం ఉంటుంది కనుక, "గుండెల్లోన గూడు" అది. వేధిస్తున్నా సుఖమైనది కనుక గుచ్చేటువంటి రోజాపూల మాల కూడా.

మాటల్లోన మౌనం అది, మనసుల్లోన ధ్యానం అది
సిమ్రన్ మనసులో బాధను పెట్టుకుని మాట్లాడుతున్నా అందులో తన ప్రేమ ఒక మౌనవేదనగా దాగి ఉంది. మనసులోని తమ ప్రేమను నిరంతరం తలుచుకునే ఇద్దరు ప్రేమికుల తపస్సు అది.

ఏ ఋణమో తెలియనిది, ఏ వరమూ అడగనిది, ఏ మజిలీ చేరేనో అది
కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఏదో ఋణం ఉండటం వలనే ఒక్క చూపులో ఇద్దరు మనుష్లు అంత దగ్గర అవుతారు అని కవి భావన. తొలివలపే ఒక వరం, అందులో స్వార్థం ఉండకూడదు. అలాంటి నిస్స్వార్థమైన ప్రేమ ఏ గమ్యం చేరుతుందో అనే ప్రశ్నతో నాయకుడు సందిగ్ధంలో పడ్డాడు.

ఎప్పటిదో తెలియనిది, ఎప్పటికీ మరువనిది, ఓ కథలా చేరే కంచికి
ఎవరు వ్రాశారో తెలియకుండానే "అనగనగనగనగా" అంటూ కథలు చెప్పుకుంటాను. చివరకు కథ కంచికి వెళ్ళింది అని నిద్రలోకి జారుకుంటాము. అలాగే ప్రేమ కూడా. ఎక్కడ మొదలౌతుందో తెలియదు కానీ, కొన్నాళ్ళుండి వెళ్ళిపోయినా జీవితాంతం గుర్తుంటుంది.

ఎద కన్నా లోతుగుంటది, బ్రతుకల్లే తోడు ఉంటది
ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి. మనసు ఎంతో లోతైనది, అందులో ఎన్నో భావాలు ఉంటాయి. ఆ మనసు కూడా అర్థం చేసుకోలేని ఒక రకమైన ఆరాధనా భావం ప్రేమ. ఎందుకు కలుగుతోందో తెలియని ఒక ఆర్ద్రత ప్రేమ. అది బ్రతికున్నంతకాలం గుర్తుంటుంది...

ఈ పాటను క్రింది వీడియోలో చూడవచ్చును.

Friday, January 28, 2011

వేటూరి గారి జయంతి

జనవరి వస్తోంది అనగానే మా ఇంట్లో పుట్టినరోజు పండుగల హడావుడి. ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య -- అందరూ ఇదే నెలలో పుట్టారు. అలాగే నేను గుర్తుంచుకున్న మఱొక పుట్టినరోజు వేటూరిది -- జనవరి 29. నా బంధువులందరూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. మఱి వేటూరో? లేదు. ఆయనకు ఫలానా సందీప్ అనే అభిమాని ఉన్నాడనే తెలియదు. మఱి వేటూరి పుట్టినరోజుతో నాకేమిటి సంబంధం? ఇది పరోక్షమైనది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా, ఆయన పాట నన్ను పట్టుకుంది. బహుశః దీన్ని పాటిచ్చుకోవడం అనాలేమో. నా కష్టసుఖాల్లో నా ఆత్మీయులందరితో పాటు ఆయన పాటలు కూడా తోడున్నాయి. అందుకే ఆయన పాటంటే నాకు ప్రాణం. ఆ పాట ఇచ్చిన మనసు అంటే నాకు అభిమానం.

మొన్న ఒక నాలుగు రోజులు అనారోగ్యం చేసి పక్క దిగలేదు. తత్ఫలితంగా నా mp3 player లో పాటల్ని కూడా వినలేదు. నయమయ్యాక ఒక్క రోజు నాలోనే నాకు తెలియని గొంతు ఒకటి మేలుకొని,  "వేటూరిని మరిచిపోతున్నావా సందీప్?" అని అడిగింది. ఒక్క నిముషం నివ్వెరపోయి చూశాను - "ఎన్నాళ్ళైంది వేటూరి పాట విని - వారం దాట వస్తోందా?", అనిపించింది. సరిగ్గా ఆలోచిస్తే - "లేదే - మొన్ననే వేటూరిని తలుచుకున్నాముగా", అని గుర్తొచ్చింది. ఏదో రెహ్మాన్ సంగీతం గురించి చర్చిస్తూ, "మెరుపు కలలు చిత్రంలోని గీతాలు బాగుంటాయి కదా?", అంటే నా స్నేహితురాలు - "అమ్మో, అందులో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు", అంది. నిజమే! నేను కూడా రెండుమూడు పదాలకు అర్థాలు నిఘంటువులో చూసుకోవలసివచ్చింది. మఱి భాష మీద ఆయన పట్టు అది. "తల్లో తామర మడిచే ఓ చిలకా...అట్టిట్టాయెను మనమే ఓ థళుకా! చెలి ఒడిలో కాగెను హృదయం, నా కంఠం వరకూ ఆశలు వచ్చే వేళాయె, నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టే కొత్తగా, పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖం, గలబా కప్పలు జతకై చేరే ఆషాఢం, ఎడారి కోకిల పెంటిని వెతికే గాంధారం, విరాళిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కలం, నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ? ఇదే సుమా కౌగిలి భాష" -- ఇలాంటి పదాలను వాడితే సగటు తెలుగు చిత్రవీక్షకుడికి ఏమర్థమవుతుంది. "నువ్వసలు నచ్చలే అనో నీ బలుపు ఇష్టం అనో అంత లేదె అంత లేదె అనో if you gonna love me, i gonna love you" అనో అంటే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక సారి గుర్తొచ్చింది, "అయ్యో...మళ్ళీ ఇలాంటి కొత్తపాట వినలేమా?" అనిపించి నా మీద నాకే జాలేసింది. "ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది" అని ఆయన చెప్పిన మాటలే మళ్ళీ తలుచుకోనా?

అదే రోజు రాత్రి ముగ్గురం స్నేహితులం కూర్చుని కర్నాటిక సంగీతం గురించి చర్చించుకుంటున్నాము. ఇంతలో రాగాల పేర్ల గురించి వస్తే, వేటూరి రాగాల పేర్లను ఎలాగ పాటల్లో వాడేవారో చెప్తూ అన్నాను - "వేటూరి రాగాల పేర్లని ఊరికెనే వాడరండీ... అక్కడ ఆ రాగం బాణీలో కూడా ఉండాలి" అని. డబ్బు మీద ఆశ వదులుకొమ్మని చెప్పేటప్పుడు, "శ్రీరాగమందు కీర్తనలు మానర" అనడం గొప్ప ప్రయోగమే. కానీ, అప్పుడు బాణీలో కూడా అదే ఉంటే అప్పుడు అది మహాద్భుతం. అలాగే, "నాలో రేగే హంసానందీరాగాలై", "అరవిచ్చేటి ఆభేరిరాగాలు" అన్నీను.

ఇంతలో వాళ్ళు "మధురాష్టకం" పెట్టారు. అందులో "అధరం మధురం, వదనం మధురం" అని పల్లవి. వెంటనే నాకు వేటూరివి రెండు పాటలు గుర్తొచ్చాయి -- shock చిత్రంలో "మధురం మధురం" అనే పాట దాదాపు ఇలాంటి ప్రయోగాలతోనే సాగుతుంది,  "యువరాజు" చిత్రంలో "మనసేమో చెప్పిన మాటే వినదు" పాటలో పల్లవికి, మొదటి చరణానికి మధ్యలో కూడా ఈ పాట ఉంటుంది. ఈ రెండూ వేటూరికి మధురాష్టకం పైన ఉన్న అభిమానానికి ఋజువులేమో. ఒక సామాన్యమైన యుగళగీతం వ్రాయమంటే కృష్ణభక్తిభరితమైన వల్లభాచార్యుని పాటను తీసుకురావడాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

ఉఫ్...లేదు ఇంకా నేను వేటూరిని మరిచిపోలేదు. అది సంభవం కూడా కాదు. తొలిప్రేమను ఎవరూ మరిచిపోరంటారు. మరి వేటూరి పాట మీద నాకున్న ఈ ప్రేమ తొలిప్రేమే కాదు, మలిప్రేమ కూడానేమో. మళ్ళీ ఇంకొకరి పాటలు వేటూరి పాటలలాగ నన్ను ఆకర్షించవేమో...

వేటూరి వాక్కులనే నేను సామెతలుగా వాడుకుంటూ ఉన్నాను. పిల్లకాయలు ప్రేమ ప్రేమ అని తెగ ఉత్సాహపడిపోతుంటే వారిని చూసిన విరక్తిలో, "పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు" అని, ఏళ్ళ తరబడి పెళ్ళి చేసుకోకపోతే, "ఉలకడూ పలకడూ ముదురుబెండడు" అని, పని చెయ్యాలని నన్ను నేనే ఉత్తేజపరుచుకోవడానికి, "మనసు ఉంటే మార్సు దాక మార్గముంది ఛలో" అని, జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు "అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే" అని, అందమైన అమ్మాయిని చూస్తే "కిన్నెరసాని వచ్చిందమ్మ, వెన్నెల పైటేసి" అని...ఇంక ఇలాగ చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఆఖరికి నా పెళ్ళి గురించి నేను ఇప్పటి దాకా ఆలోచించిన ఏకైక విషయం ఏమిటి అంటే, "పెళ్ళి cassette లో ఏమేం వేటూరి పాటలు పెట్టించవచ్చును?", అని. బహుశః నాది పిచ్చేమో. కానీ, నాకు అందులో తృప్తి ఉంది.

వేటూరి పుట్టినరోజును ఆయన అభిమానులు చాలామందే గుర్తుంచుకోకపోవచ్చును. కానీ, ఆయన పాటలను ఇంకా తమ సొంతవాటిలాగే అభిమానిస్తున్నారు. ఇంతకంటే ఏ కవి మాత్రం కోరుకునేది ఏముంది?..."ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలుక. మిగిలింది వేలిపై అది వాలిన మరక..."