Monday, April 19, 2010

ఆపరేషన్ నామకరణం

ఈ టప ఉద్దేశం పిల్లలకు నామకరణం చేసేటప్పుడు ఆలోచించే విషయాలను హాస్యభరితంగా చెప్పాలనే కానీ, ఎవరినో బాధపెట్టాలనో, ఏదో పేరును కించపరచాలనో కాదు. ఒకవేళ ఎవరికైనా అలాగ అనిపిస్తే పెద్దమనసు చేసుకుని క్షమించాలని నా మనవి!

మా వదినమ్మ తను ఆరోనెలలో అడుగుపెట్టగానే తనకు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని తెగ ఆలోచించేసింది. కాసేపు గూగులిన తరువాత, "ఇదంత అర్రీబుర్రీగా తేలే యెవ్వారం కాదు. మా సెగట్రీతో సెర్చించి (searchఇంచి) ఆలోసిత్తాను", అని నిర్ణయించుకుంది. ఈ విషయానికి నన్ను సెగట్రీగా నియమించింది. తనకు నా గురించి తెలియదు పాపం. అందుకే, "నాకు ఈ ప్రపంచంలో ఏదీ నచ్చదు, అన్నిటిలోనూ లోపాలు వెతకడం నా ప్రథమకర్తవ్యంగా భావిస్తాను", అని చెప్పాను. ఐనా సరే నన్నే సెగట్రీగా నియమించింది. అంతే, చర్చ అనుకున్నది కాస్తా, లెక్చర్ అయ్యింది. అదే ఈ రోజు నా టప.

మా వదినమ్మ నాకు ఇచ్చిన సూచనలు (specification) ఏమిటంటే:
  • సంస్కృతపదం అవ్వాలి 
  • రెండు/మూడు అక్షరాలుండాలి
  • మరీ పాతపదాలు, మరీ కొత్తపదాలు (posh పదాలు) వద్దు 
  • పేరులో negative-తనం ఉండకూడదు
  • వినగానే "ఆహా, కొత్తగా ఉంది. హాయిగా ఉంది ఈ పేరు." అనిపించాలి. 
అంతే, ఇంక సెగట్రీ, చెవులు వాచేలా e-mail లో ఉవాచ:

వదినమ్మా!

నువ్వు పేరు పెట్టడం అనేది ఏదో చాలా సులువైన పనిలాగా మాట్లాడుతున్నావు. అసలు ఈ పేరు పెట్టడం అనే ప్రక్రియే చాలా దీర్ఘమైనది, సునిశితమైన బుద్ధితో కానీ సాధించలేనిది. అందుకే ఈ నామకరణం అనే ప్రాజెక్టుకు పేరు పెట్టడం చాలా ముఖ్యం. నన్నడిగితే దీనికి "ఆపరేషణ్ నామకరణం" (ON) అని పేరు పెడదాము. నీ తొలిబిడ్డ గనుక ఈ సారి version-1 అనచ్చు. అంటే ON-1. రెండో బిడ్డకు ON-2 అలాగ పెంచుకుంటూ పోవచ్చు. ఏమంటావ్? బేమ్మర్ల పెళ్ళిళ్ళల్లో పంతులుగారు అందరి పేర్లకీ చివర్లో శర్మ తగిలించినట్లు సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతీ పనికి "ప్రాజెక్టు" అనే పదాన్ని తగిలిస్తారు. లేకపోతే motivation రాదాయె!

విషయానికి వస్తే పని చెయ్యడం కంటే సలహా ఇవ్వడం చాలా సులువు అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా? ("ఎన్నో అధ్యాయంలో? నాకు గుర్తులేదే?" అనకు. నిజంగా గీతలో ఉందో లేదో నాకూ తెలియదు కానీ, భారీ కొటేషన్ల వెనుక భగవద్గీత backing ఉండటం మంచిది అని అలాగ అంటున్నాను, ఈ మధ్యన.) అందుకే ఇప్పటికి నీకు పేర్లు-వాటితో ఉండే తంటాలు అనే విషయం పైన కొంచం జ్ఞానోదయం చేస్తాను చూడు.

మొదటగా చెప్పాల్సింది ఏమిటంటే, నీ specificationలో "కొత్తదనం" అనే అంశం నాకు కొంచెం అనవసరమనిపించినది. ఆ మధ్యన మా దూరబ్బంధువుల అబ్బాయికి శ్రేయస్ అనే పేరు పెడితే దానికి బంధువర్గంలో "చాలా కొత్తగా ఉంది, చక్కని పేరు", అని మాంచి talk వచ్చి హిట్టయ్యింది. ఆ తరువాత నేను సాఫ్ట్వేర్ ధర్మానుసారం రెండేళ్ళ తరువాత ఉద్యోగం మారాను. అక్కడికి వెళ్తే కేవలం మా teamలోనే నలుగురు శ్రేయస్లు ఉన్నారు. మా officeలో, confusion ఎందుకని వాళ్ళను సొంతపేర్లతో కాక, ఇంటి పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు, అంత కష్టపడి పెట్టిన పేరూ release కాకుండానే drop అయిన ప్రాజెక్ట్లాగా అయిపోయింది. ఇందులో నీతేమిటంటే, నీకు నచ్చిన పేర్లు చాలా చోట్ల చాలామందికి పిచ్చపిచ్చగా, విచ్చలవిడిగా నచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళపాటు ఒక పేరుకు మంచి talk ఉండి, అదే పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాందరూ ఒక చోట చేరితే ఇంక variety ఏముంది?

ఒకసారి ఇలాగే ఒక చెల్లెమ్మ నన్ను పేరు select చెయ్యమని అడిగితే కే. విశ్వనాథ్ చిత్రాల్లో అమ్మవారిపైన పాటలు వింటే నీకు ఏమైనా నచ్చచ్చు అన్నాను. చివరికి ఆమె "సప్తపది" చిత్రంలో పాట విందో లేదో తెలియదు కానీ, వాళ్ళ పాపకు "శశిహాసిని" అనే పేరు పెట్టుకున్నారు. నాకు "హాసిని" అనే పేరు బాగా నచ్చింది. అందులోనూ సరస్వతీదేవి పేరంటే నాకు మక్కువాయే! అక్కడికి OK. ఇంతలో బొమ్మరిల్లు సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా చూసినప్పటినుండీ నాకు హాసిని అనగానే పెదాలు జిడ్డుగారేలాగా lip-stick పూసుకుని, ఆ పెదాలు కలవనివ్వకుండా మాట్లాడుతూ, తెలుగు సరిగ్గా పలకడం చేతకాని; ఎవరితో ఎలాగ behave చెయ్యాలో తెలియని ఒక immature కోతిపిల్ల గుర్తొస్తోంది :-( నేను చెప్పే point ఏమిటంటే మనకు "హాయిగా" అనిపించే పేరు రేపు మరొకరివల్ల చెత్తగా గా అనిపించవచ్చును.

ఇంక నీకు ఇచ్చే కొన్ని సామాన్యమైన సూచనలు:
  • పిల్లలకు మనం పెట్టే పేర్లను పెద్దయ్యాక వాళ్ళ friends కుదించడం, కుదిపెయ్యడం సహజం. ఉదాహరణకి మా స్నేహితురాలి పేరు "కౌస్తుభ" - ఎంత చక్కనైన పేరు! ఐతే ఆమెని స్నేహితురళ్ళందరూ, "Hi Cow, How are you?" అంటుంటే, మొదట్లో, "ప్రకృతిధర్మానికి విరుద్ధంగా మానవులకు గోసంతతి కలిగింది", అనిపించింది.
  • ఇందాకటి పాయింటుకో జాయింటు. పేరులో రెండు మూడు పదాలు ఉన్నప్పుడు ఆ పదాల మొదటి అక్షరాలు కలిపి కొత్త పేరు సృష్టించి దానితో పిలుస్తూ ఉంటారు స్నేహితులు. నా స్నేహితుడి పేరు కార్తీక్చంద్ర - ఎంత చక్కనైన పేరు! దాన్ని స్నేహితులని చెప్పుకునేవాళ్ళందరూ కలిసి "కాచా" అని మార్చారు. అదేదో కొండాజాతివాళ్ళ బండ పేరులాగా లేదు? ఇంకొకరి పేరు గోపాలరావు. అతనిని ముద్దుగా గోరా అని పిలిచారు. ఇంకా నయం వాళ్ళింటి పేరు ఏ ఆదిభట్లో అయితే అతని పేరు అగోరా అని ఘోరంగా అయ్యేది. పద్మని పద్దు అని (చాకలిపద్దు లాగా), లలితని లల్లి అని పిలువడం నువ్వూ గమనించే ఉంటావు! అందుచేత ఇలాంటి కంకర్రాళ్ళు nicknames గా రాని పేర్లను ఎంచుకోవడం మంచిది.
  • మళ్ళీ పై పాయింటుకో జాయింటు. మొత్తం పేరులోని పదాలలో మొదటి ఆంగ్లాక్షరాలను కలిపి nickname ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రక్రియకు బలైపోయిన కొన్ని పేర్లు: పిసుపాటి-చంద్రశేఖర-కుమార్ , అరుముగం-శివ-సామి. తస్మాత్ జాగ్రత్త!
  • తెలుగు ఉచ్చారణ తెలియని English-medium స్నేహితుల దౌష్ట్యాన్ని కూడా మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి: పేరులో "శ" లేకుండా చూసుకో! ఎందుకంటే కొంతమంది "శంకర్" ని "సంకర్" (అదే, వర్ణసంకరంలో సంకర్) అని గానీ, "షంకర్" అని గానీ పిలుస్తున్నారు. వింటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంటోంది.
  • ఇంటి పేర్లతో ఉండే తంటా కొంత ఉంటుంది. మా దూరబ్బంధువు ఇంటిపేరు "కొట్రా". అతడు లవ్వాడి, ఇంట్లోవాళ్ళతో గొడవాడి, ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళాడాడు. అంతవరకూ బానే ఉంది. ఆ అమ్మాయి పేరు "బెట్టి". ఇంటిపేరుతో కలసి, "కొట్రా బెట్టి" అయ్యింది. పేరు వింటే violins విన్న feeling రావాలి కానీ, violence కనబడకూడదు కదా?
  • పేరులో కాస్త లింగభేదం ఉంచడం మంచిది. చైతన్య, ప్రసన్న లాంటి పేర్లు పెడితే e-mails వ్రాసేటప్పుడు లింగభేదం తెలియక ఎవరైనా "Prasanna is a nice girl" అంటే nice అన్నందుకు ఆనందించాలో, girl అన్నందుకు దుఃఖించాలో తెలియక పిల్లలు బాధపడతారు.
  • ఇంక ప్రాస కోసం ప్రయాస పడుతూ, శ్వాస విడిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పిల్లలపేర్లన్నిటికీ ప్రాస కుదర్చాలని ప్రయత్నిస్తారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ప్రాసతో పాటు కాస్త భావం, అర్థం బాగుంటే సొంపుగా ఉంటుంది. ఈ ప్రాసపై ఆశకు ప్రతిరూపలుగా ప్రతాప్-ప్రేలాప్, పురుష్-పరుష్, అభిషేక్-అరబ్ షేక్ వంటి నామద్వయాలు ఉద్భవిస్తున్నాయి.
  • సంస్కృతంలో బాగుండే కొన్ని పదాలు జంట లేకపోతే నిరర్థకాలవుతాయి. ఉదాహరణకి చరణ్ అనే పేరు వాడుకలో ఉంది. ఆ చరణానికి ఒక మొండెం, తలకాయ కూడా ప్రసాదిస్తే బాగుంటుంది. వాడు విష్ణుచరణ్ ఆ? సాయిచరణ్ ఆ? శివచరణ్ ఆ? అలాగే ప్రతీక్ అంటే "ఓహో!" అనిపిస్తున్నా దాని అర్థం "గుర్తు" అని. ప్రేమకు ప్రతీకా? మంచితనానికి ప్రతీకా? ఏమిటి అన్నది ఆ బిడ్డకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగేదాకా ఆగకుండా ముందే చెప్తే సంతోషిస్తాడు. ఏమంటావ్?
  • సంస్కృతం అంటే గుర్తొచ్చింది. కొంతమంది సంస్కృతం కంటే ఆంగ్లాన్ని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అందుకని కొన్ని పేర్లను ఆంగ్లీకరిస్తున్నారు. ఉదాహరణకు లవకుశుల పేర్లను ఈ మధ్యన love, khush గా మార్చి పెట్టుకోవడం నేను గమనించాను. ఒక idea పిల్లల జీవితాన్నే మార్చేయగలదు!
  • ఈ మధ్యన పేర్లకు prefixలు, suffixలు తగిలించడం రివాజు అయ్యింది. సాయి వాడుకలోనున్న ఒక prefix. సాయిచరణ్, సాయికిరణ్, సాయికరుణ్, సాయిశరణ్ మొదలైనవి మనం వింటూనే ఉన్నాము. ఐతే దీనితో వచ్చిన బాధేమిటి అంటే ముద్దుగా కొడుకుని సాయి అని పిలుచుకోలేము. "సాయ్" అనగానే "ఓయ్" అనేవాళ్ళు బోళ్ళుమంది ఉంటారు. అప్పుడు సాయిని వదిలేసి, "కిరణ్", "తరుణ్", "చరణ్" వంటి తాడుతెగిన గాలిపటాలలాంటి పేర్లు వాడుకోవాలి. కుమార్ మనకు తెలిసిన ఒక suffix. మా friend ఒకడి పేరు "రవికుమార్". వాడిని ఒకడు "రవికి ఇద్దరు కుమారులు. శని, యముడు - నువ్వెవరు నాయినా?" అని అడిగాడు. వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. అందుచేత కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కూడా!
  • కొన్ని పేర్లకు అర్థం వెతికితే నాకు ఏమీ తోచదు. ఉదాహరణకి "సతీశ్" (*) అనే పేరుకు అర్థం నాకు తెలియదు. "సతి + ఈశ్" అనుకుందాము అంటే "సతికి అధిపతి" అని అర్థం వస్తుంది. ఎవడు మాత్రం పెళ్ళానికి మొగుడు కాకుండా పోతాడు చెప్పు? ఒకవేళ నేను సంధిని విడదీయడంలో తప్పు చేసి ఉంటే సవరించు సుమీ! అలాగే ఇదివరకు నేను పని చేసే చోట ఒకడి పేరు "అల్పేశ్". "అల్పంగా ఉండే ఈశుడా" అనుకుని ముక్కున వేలేసుకున్నాను.
  • కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు కొడుక్కి పెట్టుకుందాం అనుకుంటారు. దీనివల్ల పూజల్లోనూ, తతంగాలలోనూ తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్పుకోవడం సులువవుతుంది! అలాగే కొడుకును పిలిచినప్పుడల్లా తండ్రిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడిదాకా బాగుంది కదా అనుకునేవాణ్ణి. ఇదే పద్ధతి కొన్ని తరాలు పాటించిన మా teacher ఒకాయన వంశవృక్షం చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. ఆయన పేరు అరుముగం శివసామి. అరుముగం ఆయన తండ్రి పేరు, శివసామి ఆయన పేరు. ఈయనకి వీళ్ళ తాతగారి పేరు పెట్టారుట. అంటే తాత పేరు శివసామి. ఇప్పుడు తండ్రి పూర్తి పేరు "శివసామి అరుముగం". అరుముగం తండ్రి పేరు, శివసామి ఆయన తండ్రి పేరు. ఇలాగ మూడు నాలుగు తరాలు ముందుదాకా వెళ్తే అందరూ శివసామి అరుముగం, అరుముగం శివసామి అనే రెండు పేర్లను audio cassette A-side, B-side లాగా మార్చి మార్చి పెట్టుకుంటూనే ఉన్నారు. పాపం, అల్పసంతోషులు అనిపించింది. మీ వాడు తండ్రి పేరు చివర్లో తగిలించుకుందాం అంటే ఇబ్బంది కాకుండా చూసుకోండమ్మోవ్!
  • అన్నట్టు ఈ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు పెట్టుకోవాడానికి మన ఆంధ్రులకు ఇంకో మార్గం ఉంది వదినమ్మోయ్! ఏంటంటే కొడుకు పేరులో "శివ, వీర, వేంకట, నాగ, కనక, ఫణి" వంటి పదాలు కొన్ని తగిలిస్తే అందులో ఏదో ఒకటి తాతకో, తండ్రికో ఉండకపోతుందా? ఆ విధంగా వాళ్ళ పేరు పేరు కూడా కొడుక్కి పెట్టినట్టు ఉంటుంది కదా?
  • అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. "అంకిత" లాంటి పేర్లు పెట్టద్దు. ఎందుకంటే వెంటనే మనసులోకి వచ్చే ప్రశ్న, "ఎవరికి అంకితం చేశావు? ఏం అంకితం చేసేశావు?". అలాగే అన్వేషిత, ఆకాంక్షిత వంటివి కూడా అలాంటి అర్థాలే వస్తాయి. 
  • "ప్రియలలిత", "ప్రియదర్శిని", ప్రియమణి" లాంటి పేర్లు కూడా పెట్టద్దు. ఎందుకంటే నీ ఎదురుగుండానే ప్రతీ తలకు మాసిన వెధవా ఆమెని "ప్రియా..ప్రియా..." అని పిలుస్తాడు. అది వినలేక మనం ఏడవాలి. ఆమె మొగుడికి అనవసరమైన అనుమానాలు కూడా వస్తాయి. అన్నట్టు, ఆ ప్రియదర్శిని అనే పేరుకు అర్థమే నాకు తోచలేదు ఇప్పటికీ!
  • పైన చెప్పినదానికి కొంచం reverse చేసుకుంటే తరువాతి సూత్రం వస్తుంది. ఏమిటంటే, "జననీ", "జగదంబ" వంటి పేర్లు బయటవాళ్ళు పిలుస్తుంటే ఆమె మొగుడికీ ఒక sense of security ఇచ్చినా, స్వయంగా నోరారా పెళ్ళాన్ని పూర్తి పేరుతో పిలుద్దాము అనుకుంటే ఘోరాలు జరిగిపోతాయి.
  • ఈ మధ్యన numerlogyతో ఒక చిక్కు వచ్చి పడింది. పాప(డు) పుట్టిన తేదీ బట్టి పేరు decide చేస్తామంటారు. దీని కోసం ఎంతో చక్కని పేర్లను ఖూనీ చేస్తారు. ప్రేమ (Prema) అనే పదాన్ని ప్రేమా (Praemaa) గా వ్రాయడం లాంటి పైత్యాలు గమనించాను. వెంటనే నాకు "దీని అసాధ్యం కూల. ఇంకా నయం పేరు శ్రద్ధ (Sraddha) అయ్యి, numerologist ఇంకో రెండు అచ్చులు (vowels) కలపమన్నాడని శ్రాద్ధా (Sraaddhaa) అని వ్రాసింది కాదు!", అనుకున్నాను. చెప్పొచ్చేదేమిటంటే మనం ఎంతో ప్రేమగా పెట్టుకునే పేరు రేపు పిల్లలు numerology అని మార్చుకోగలరు. అలాగ మార్చుకుంటే తప్పుడర్థాలు రాని పేరైతే మంచిది అనుకుంటున్నాను. (+)
అదీ సంగతి! ఇంక నువ్వాలోచించు!

(*) సతీశ్ అనే పదం గురించి శిశిర గారు వివరించడంతో నాకర్థమైంది. సతి అంటే అమ్మవారు (దక్షుని పుత్రి), సతీశ్ అంటే శివుడు. నేను చిన్నప్పుడు తునిలో పెరిగాను. అక్కడికి అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు. అందుచేత అక్కడ సత్యనారాయణ స్వామి భక్తులు ఎక్కువ. వాళ్ళు సత్యనారయణ అనే పేరుకు మారుగా సతీశ్ అని వాడటం గుర్తు. అందుకే నాకు సతీదేవి సంగతే గుర్తురాలేదు.

(+) ఈ పాయింటు శ్రీదేవి గారి కామెంటు చూసి చేర్చడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు!




ఈ టపకు సహకరించిన వదినమ్మ హరితకి, సోదరుడు ఫణీంద్రకి, మిత్రుడు కిరణ్‌కి నా మనఃపూర్వక ధన్యవాదాలు!  అన్నట్టు ఇతని పేరు (నల్లాన్ చక్రవర్తుల కిరణ్) కూడా ఇందాక చెప్పిన ఆధునికనామవ్యాకరణసూత్రాలకు లోబడి, "నచకి" గా మారింది. 

Wednesday, April 7, 2010

విరహవేదన (మూడు పద్యాలు)

ఒక friend అడిగితే విరహవేదన గురించి మూడు పద్యాలు వ్రాశాను. ఈ పద్యాలు నాకు పెద్దగా సంతృప్తిని కలుగజేయలేదు. ఐనా కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారని బ్లాగుతున్నాను.

సీ:-
కాటుక దిద్దిన కలువకన్నులు నేడు తమ నెలరాజుకై తల్లడిల్లె
నిండుగ జడలోన నింపిన పువ్వులు తుమ్మెదకై వేచి సొమ్మసిల్లె
నీతోడు కోరుచు నిలువెల్ల వాడినా నీ ఊహతో మది నిదురపోదు
నువు జతలేకుండ నిండుపున్నమియైన వెన్నెలరేయిపై వెగటుఁబుట్టె

ఆ:-
దినములెన్నియైన తీరదు నా ప్రేమ
జీవమున్న వరకు చెదిరిపోదు
నింగిలోకి చూడ నెలరాజు ప్రతిరోజు
మారె కాని నేను మారలేదు

ఆ:-
మనసుపడిన నీవు కనులలోనుండగ
కలిమి,లేమి నన్ను కదుపలేవు
లేమి ఏమి? నీవు లేకుండుటే కద?
కలిమి ఏమి? నిన్ను కలియుట కద

P.S: అన్నీ సాధారణమైన తెలుగుపదాలే ఉన్నాయి కాబట్టి ఈ పద్యాలకు నేను ప్రత్యేకించి భావం వ్రాయలేదు.

Monday, April 5, 2010

నిత్యజీవితంలో పద్యాలు

ఈ మధ్యన నాకు పద్యాలు వ్రాయటానికి సందర్భాలు/సమస్యలు దొరకలేదు. మొత్తానికి స్రవంతి గారు, శైలజ గారు, బాబాయ్ కొన్ని సమస్యలు ఇచ్చారు.

సమస్య (దత్తపది):- పూలజడ, క్రోధం, బుట్ట, వేపపువ్వు.
ఇచ్చింది: స్రవంతి గారు
పూరణ (ఆటవెలది):-
క్రోధమయ్యెనేమొ కొమ్మకు ఈవేళ
బుసలుగొట్టసాగె పూలజడదె
నాగసరమునూది కౌగిలిబుట్టలో
పెట్ట వేపపువ్వు పట్టుతేనె!
భావం:-
అమ్మాయికి ఈరోజు కోపం కలిగినట్టుంది, ఆమె పూలజడ బుసగొడుతోంది. నాగసరం ఊది (నాలుగు మంచిమాటలు చెప్పి) కౌగిలి అనే బుట్టలో పెడితే ఇప్పటిదాకా వేపపువ్వులాగా చేదునొలికిస్తున్న ఆమె, పట్టుతేనెలాగా తీయగా మారిపోతుంది. [[ మొదటి మూడూ చూసి నాకు అభినవశ్రీనాథుడైన వేటూరి పూనాడు. ఐతే ఆఖరిది చూడగానే "ఐస్క్రీం లో ఆవకాయముక్కలాగా" అనిపించింది. ఎప్పుడైనా అలాగ ఉంటేనే కదా పద్యాలు కాస్త తమాషాగా ఉంటాయి :) ]]


సమస్య (దత్తపది):- త్రివిక్రముడు, విక్రమార్కుడు, మూడు, మూర్ఖుడు
ఇచ్చింది: శైలజ గారు
పూరణలు:-
(ఆటవెలది) 
భార్గవ ఉవాచ:-
సాహసాన యినుడి సరి విక్రమార్కుడౌ
గనుకయట్లు బలినియనగఁదగును
మూడడుగులనిచ్చె మూర్ఖుడై నామాట
వినక ఏలనోత్రివిక్రమునకు
భావం:-
(వామనావతారం ముగిసిన తరువాత శుక్రుడనుకుంటున్నాడుట)
విక్రమార్కుడు అంటే విక్రమంలో అర్కుడితో (సూర్యుడు) సమానమైనవాడు అని అర్థం కాబట్టి, ఆ పేరు బలికి సరిపోతుంది. అట్టి (నా శిష్యుడైన) బలి నా మాటలను వినకుండా, ఆ మూడు అడుగులను త్రివిక్రముడికి (వామనుడికి) ఎందుకు ఇచ్చాడు? అహో!
(తేటగీతి)
సందీప ఉవాచ:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మంచి పేర్లు
కలిగి కూడ చెత్తగనుండు గదర మూడు!
ఇడియటనగమూర్ఖుడెయైన ఇంపుగుండు
వినగ మాటలు తోచు త్రివిక్రముండు
భావం:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మూడూ మంచి పేర్లు ఉన్నా కూడా చెత్తగా ఉంటాయి. అదే మూర్ఖుడు అనే అర్థం ఉన్న ఇడియట్ చిత్రం మాత్రం చాలా బాగుంటుంది. అందులోని మాటలు వింటే నాకు త్రివిక్రముడు (త్రివిక్రం శ్రీనివస్) గుర్తుకొస్తాడు.


సమస్య (దత్తపది):- మనసు, మాట, మౌనం, మనువు
ఇచ్చింది:- శైలజ
పూరణ (కందం):-
మునుపుటి మాటలనడిగిన
మనసుకు మిగిలిన బదులది మౌనంబేనా?
చనువుగ పలుకుమ! యంటిని
మనికితమును చూపి నేను మనువడిగితినా?
భావం:-
ఇదివరకుటిలాగా మాట్లాడమని అడిగిన నా మనసుకు నువ్వు ఇచ్చే సమాధానం మౌనమేమా? చనువుగా మాట్లాడమన్నానే కానీ, నా మనసులోని బాధ తెలిపి పెళ్ళిచేసుకోమని అడిగానా?



సమస్య (వర్ణన):- పల్లవి గారు గీసిన ఈ చిత్రాన్ని వర్ణించాలి.
ఇచ్చింది:- బాబాయ్ (రవీంద్ర)
పూరణ:-

సీసం:-
సూర్యునికిరణాలు సోకి చంద్రునివోలె అద్దంబు మెరిసె నీ అందమునకు
జడబిళ్ళ తొడిగిన పొడవైన నీ వేణి మణియున్న ఫణివోలె మదికి తోచు
బొమవింట బాణమై పొడిచెను తిలకంబు, సంపంగిముక్కుపై సరఘ నత్తు
ఆడజన్మఁగొనిన సౌందర్యమా! నీదు సొగసుచూడతరమా? శోభనాంగి?
ఆటవెలది:-
కోటిసిరుల మోము కొలను చందమునుండ
కళలు చల్లు కనులు కలువలౌన?
రాజసాన మెలగ రాజహంసలెయౌన?
రూపసామ్యమునకు చేపలౌన?
భావం:-
సూర్యుడి కిరణాలు తగిలి చంద్రుడు ఏ విధంగా వెలుగుతాడో, అదే విధంగా నీ అందం తగిలి అద్దం కూడా మెరిసిపోతోంది. జడబిళ్ళ తగిలించిన నీ అందమైన జడ పడగపై మణి ఉన్న నాగుపామును గుర్తుచేస్తోంది. నీ రెండు కనుబొమలూ చూస్తే ఒక ధనుస్సులాగా ఆ మధ్యన ఉన్న తిలకం బాణం లాగా అనిపిస్తున్నాయి. నీ ముక్కు సంపెంగపువ్వులాగా ఉంటే, దానిపైన ముక్కెర తుమ్మెద లాగా ఉంది. సౌందర్యమ ఆడజన్మ ఎత్తితే అది నువ్వేనేమో? నీ సొగసు చూడతరమా?
ఎన్నో కళలున్న నీ ముఖం, కొలనైతే - మృదువుగా ఉన్న నీ కళ్ళు కలువలవుతాయా? రాజసంగా అటూ ఇటూ కులుకుతున్నందుకు రాజహంసలవుతాయా? లేక, చూడటానికి చేప ఆకారంలో ఉన్నాయి కాబట్టి చేపలవుతాయా? (చెప్పవూ?) [[ ఈ పద్యాలకు స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఇంత అందంగా ఎవరైనా బొమ్మ గీస్తే కవిత్వం పొంగకుండా ఉంటుందా? ]]

Friday, March 26, 2010

ధన్యోహం ఓ శబరీశా - వేటూరి

"అయ్యప్పస్వామి మహత్యం" చిత్రంలోని పాటలు ఎన్నిసార్లు విన్నా, నాకు మనసు నిండదు. నేను అయ్యప్పస్వామికి వీరభక్తుణ్ణి కాదు. ఎప్పుడో చిన్నప్పుడు మా వీధిలో అందరూ అయ్యప్పస్వామి మాలవేసుకుంటే చూడటమే తప్పితే, నేను అంత దగ్గరనుండి మాలధారులను కూడా చూడలేదు. ఐతే, మహదేవన్, వేటూరి, బాలు, చేసిన మహిమ వలన ఆ పాటలు ఎంతసేపైనా వినాలనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఈవేళ ఇంకో పాటను గుర్తుచేసుకున్నాను.

ఒక భక్తుడు ఈ మలినపూరితజగతిని చూసి దుఃఖిస్తూ మనఃశాంతిని వెతుక్కుంటూ ఆఖరికి స్వామి మాలను ధరించి ఆ హరిహరపుత్రుడి దర్శనం చేసుకుంటాడు. ఆ దర్శనం కలిగిన క్షణంలో అతని హృదయంలో పుట్టే ఆనందంతో కూడిన ఆవేశం ఈ పాట రూపంలో చెప్తాడు. ఆ భక్తుడి ఆవేశానికి తగినట్టు బాణీని సమకూర్చిన మహదేవన్, దానికి తన గళంతో న్యాయం చేకూర్చిన బాలు - ఇద్దరూ నిజంగా అభినందనీయులు. వేటూరి ఈ పాటలో సంస్కృతశబ్దాల ప్రయోగం ఎక్కువ చేసి, ఎంతో లోతైన భక్తిభావాన్ని, వేదసూత్రాల్ను ఎప్పటిలాగే ఒక మాలధారిని పాత్రధారిని చేసి చెప్పాడు.

ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగశబరిగిరిశృంగ, నిత్యనిస్సంగ, మంగళాంగ,
పంపాతరంగ,  పుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగ!

అయ్యప్పస్వామిని ఎంతో ఎత్తులో ఉండే శబరిగిరియొక్క శిఖరంతోనూ, పంపానదిలో తరంగాలతోనూ పోల్చి, భవబంధాలు లేని వాడిగా, శుభకరమైన రూపం కలిగినవాడిగా, మంచివారిని ప్రేమించేవాడిగా, మునుల మనస్సులను గ్రోలే (అందులోని భక్తిని అందుకొనే) తుమ్మెదగా అభివర్ణించాడు. అసలు, ఆ ప్రాస చూడండి! అద్భుతం. భావానికీ, భాషకీ న్యాయం చేకూరుస్తూ ఎంతో చక్కగా వ్రాశాడు.

బ్రహ్మచారినై, భక్తియోగినై, ద్వంద్వము అన్నది వీడి,
విగతకామినై, మోక్షగామినై, తాపత్రయమును విడచి
కన్నెసామినై, కర్మధారినై, కాలాంబరములు తొడిగి 
నీ దరి చేరితి నీలగిరీశా! బంధము తెంచితి పన్నగవాసా!

బ్రహ్మచారి అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. బ్రహ్మచారులు పరబ్రహ్మనే మనసులో ఉంచుకుని ఐహికవాంఛలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఈ కాలంలో బ్రహ్మచారులంటే ఆడపిల్లలు కనిపిస్తే కరిగిపోయే కాముకులకు పర్యాయపదంగా వాడుకోవడం మన భారతదేశసంస్కృతికి పట్టిన దుర్దశ. అయ్యప్పస్వామి మాల ధరించిన వారందరూ నిజంగా బ్రహ్మచారులై, ఆడువారికి దూరంగా ఉంటూ, ప్రతీ స్త్రీలోనూ తల్లిని చూస్తూ, అన్నీ ఆ పరమాత్ముడికోసం చేస్తూ భక్తియోగాన్ని అవలంబిస్తారు. చలి - వేడి, సుఖం-దుఃఖం వంటి ప్రాపంచికభావాలను విడచి కేవలం పరమాత్మ మీదనే దృష్టిని నిల్పుతారు. కామాన్ని విడిచి, మోక్షపథంలో నడిచి, దైనందినజీవితంలో కలిగే కష్టనష్టాలకు దూరంగా విధ్యుక్తకర్మను అనుసరిస్తూ నల్లని బట్టలు ధరించి ఆ అయ్యప్పస్వామి సన్నిధానానికి చేరుకుంటారు. ఇంతలోతైన భావాన్ని, చిన్నచిన్న మాటలతో వర్ణించాడు వేటూరి. నాకు ఈ చరణం వింటే భగవద్గీత చదివిన భావం కలుగుతోంది. భక్తియోగం, నిర్ద్వంద్వం, విగతకామి, మోక్షగామి, కర్మధారి, బంధములను తెంచుకోవడం - అంతా కృష్ణుడు భగవద్గీతలో బోధించినదే కదా? భగవద్గీత అంటే వేదసారమే కదా? అందుకే నేను చెప్పింది "వేటూరి వ్రాసిన భక్తిపాటల్లో వేదసారం ఉంటుంది", అని.

శరణం శరణం భవతరణ, శబరిగిరీశా అయ్యప్పా!
సుఖదం, శుభదం నీ చరణం, హరిహరపుత్రా అయ్యప్పా!
అయనరేఖలా సంగమవేళ మిథ్యావాదపు మధ్యస్థలిలో
సూన్యజగతిలో సూక్ష్మపరిధిలో నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచరసృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది,
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా, ఈ మహికి దేవుడే అయ్యప్ప!
శబరిగిరీశా ధన్యోహం ||

సూర్యుడు మకరరాశి మొదలుకొని కర్కాటకరాశివరకూ సాగించే ప్రయాణాన్ని (అంటే సుమారుగా ఆంగ్ళ క్యాలెండరు ప్రకారం జనవరి 13/14 తేదీలనుండి జూలై 13/14 తేదీలవరకు) ఉత్తరాయణం అని, అలాగే తిరిగి సింహరాశినుండి ధనుర్రాశివరకూ సాగించే ప్రయాణాన్ని దక్షిణాయనం అని అంటారు. ఈ రెండు అయనాలూ సంగమించేది  మకరసంక్రాంతిరోజు. ఆ పర్వదినాన మకరజ్యోతి కనబడుతుంది. "మకరసంక్రాంతిరోజు మిథ్యావాదాన్ని ఛేదిస్తూ ఆకాశంలో చిన్నదీపమై వెలిగేది మకరజ్యోతి - అది నీ మహిమే", అని అయ్యప్పస్వామిని వందిస్తున్నాడు వేటూరి.

ఈ "మహిమ, మహి" అన్న పదాలు కలిపి వాడటం వేటూరికి బాగా ఇష్టం అనుకుంటాను. "రాఘవేంద్ర" అనే (ప్రభాస్ హీరో గా వచ్చిన) సినిమాలో "నమ్మిన నా మది మంత్రాలయమేగా", అనే పాటలో "మహిని దాచిన మహిమంత, మరల చూపరా" అని వ్రాశాడు. అలాగే, "అర్జున్" చిత్రంలో "మధుర, మధురతర మీనాక్షి" అనే పాటలో "మహిని మహిమ కల మీనాక్షీ", అని వ్రాశాడు. కొన్నికొన్ని ప్రయోగాలు వేటూరి పదే పదే చేసినా వినడానికి ఇబ్బంది కలగవు! వాటిల్లో ఇది ఒకటి!

Thursday, March 25, 2010

మాలధారణం నియమాలతోరణం - వేటూరి

భక్తిరసప్రధానమైన చిత్రాలు తెలుగులో చాలా వచ్చాయి. వాటిల్లో చాలా మంది రచయితలు మంచి పాటలు వ్రాశారు. అలాంటి చిత్రాలలో "అయ్యప్పస్వామి మహత్యం" అనే చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో గీతసారాన్ని గీతాలలో నింపాడు రచయిత వేటూరి. ఒక్కో పాటా ఆణిముత్యం. భావం గంగమ్మలాగా ప్రవహిస్తే తెలుగు గోదారిగంగలాగా పారింది. ఈ పాటలు అయ్యప్పస్వామి భక్తులందరికీ అత్యంతప్రీతిపాత్రమైనవి.

ఈ పాటలను వేటూరే వ్రాసారని ragalahari.comలో చెప్పారు. అయినా నేను నిర్ధారించుకోవడానికి సినిమాలో titles చూశాను. అక్కడ ఆచార్య ఆత్రేయ పేరు (సహాయకులతో సహా) ఒక చోట, వేటూరి సుందరరామమూర్తి అని ఒక చోట పడ్డాయి. కానీ, వారు నిర్వహించిన బాధ్యతలను చెప్పే పదాలు backgroundలో ఉన్న వెలుగు వలన కనబడలేదు. ఆచార్య ఆత్రేయ సినిమాలకు మాటలు వ్రాసేవారు. అందుచేత ఆయన మాటలు వ్రాయగా వేటూరివారు పాటలు వ్రాశారని నా నమ్మకం. ప్రత్యేకించి ఈ పాట శైలి, సాగరసంగమంలో వేటూరి వ్రాసిన "ఓం నమఃశివాయ" శైలితో పోల్చదగినది (ఎందుకో క్రింద చెప్పాను). అందుకే ఇది వేటూరే వ్రాశారని నా నమ్మకం.

మాలధారణం, నియమాలతోరణం
జన్మతారణం, దుష్కర్మవారణం
శరణం, శరణం, శరణం, శరణం, అయ్యప్పస్వామి శరణం, అయ్యప్పస్వామి శరణం

"అయ్యప్పస్వామి మాలను ధరించడం అంటే నియమాలను దండగా చేసుకుని ధరించడం, భవసాగరాన్ని ఆ ఊతతో ఈదడం, చెడ్డపనులవైపు మనస్సు మరలకుండా అప్పడం", అని కవి వర్ణన. అంత్యప్రాస ఎంత చక్కగా కుదిరింది? భావం ఎంత లోతుగా ఉంది? భక్తిపాటలు వ్రాయడంలో తెలుగు చలనచిత్రపరిశ్రమలో వేటూరికి సాటి లేరు అని నా నమ్మకం. వైదీకసూత్రాలను కూలంకషంగా పరిశీలించి వ్రాసినట్టుగా గోచరిస్తాయి ఆయన పాటలు.

ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయసాధనలో
చతుర్వేదములలో రక్షణలో, పంచభూతముల పంజరశుకమై
ఆరుశత్రువుల ఆరడిలోపడి, ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల, మాలధారణం!

"ఉదయమూ సాయంత్రమూ, ధర్మం-అర్థం-కామం (తలచిన పని సిద్ధించాలని) ఈ మూడింటినీ తీరంగా పెట్టుకుని, నాలుగు వేదాల చేతా రక్షింపబడుతూ ఉంటారు మాలధారులు. పంచభూతములు అనే పంజరములో ఉన్న చిలుకలాగా, అరిషడ్వర్గాలు (కామక్రోధమోహలోభమదమాత్సర్యాలు) చేత వేధింపబడుతూ ఉన్న వారు నువ్వే ఏడు జన్మలకూ వీడని చేయూతవని నమ్మి నీ మాలను ధరిస్తారయ్యా!", అని భావం. ఎంత లోతైన వైదీకమర్మాలను చెప్పాడు? భక్తుల మనస్సులోనున్న ఆవేదన, వారి కష్టాలు, వారు భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తారు - అన్నీ చెప్పాడు.

మీరు గమనించినట్టైతే ఇక్కడ రెండు సంధ్యలు, మూడు పురుషార్థాలు, నాలుగు వేదాలు, పంచభూతాలు, ఆరు శత్రువులు, ఏడు జన్మలు" అన్నాడు కవి. పెరుగుతూ ఉన్న సంఖ్యలను చూడండి. సాగరసంగమం చిత్రంలో "ఓం నమఃశివాయ" పాటలో "త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, పంచభూతములు ముఖపంచకమై, ఆరు ఋతువులే ఆహార్యములై, ప్రకృతి పార్వతీ నీతో నడచిన ఏడు అడుగులూ స్వరసప్తకమై, నీ దృక్కులే అష్టదిక్కులై, నీ వాక్కులే నవరసమ్ములై, నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా", అంటూ సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకే "మాలధారణం" పాట శైలిని "ఓం నమఃశివాయ" పాటతో పోల్చినది.

"అ-ఉ-మ" సంగమనాదంలో ఓం, ఓం, ఓం
హరిహరరూపాద్వైతంలో శరణం, శరణం, శరణం, శరణం
నిష్ఠురనిగ్రహయోగంలో, మండలపూజామంత్రఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం!

ఈ చరణం గురించి చర్చించుకునే ముందు కే.వీ.మహదేవన్ గురించి చెప్పుకోవాలి. వేటూరి ఆయన్ని కలిసిన కొత్తల్లో tune చెప్పండయ్యా అంటే, "tune మేము చెప్తే ఇంక రచయితకు స్వేఛ్ఛ ఎక్కడుంటుందయ్యా? నువ్వు పాట వ్రాయి, నేను tune చేస్తాను", అన్నాడట. ఆహ! ఒక మలయాళీయుడయ్యుండి, తెలుగుజనాలకు తనపాటలతో మృష్టాన్నభోజనం తినిపించిన మహానుభావుడు మామ, మహదేవన్. మొదటి చరణానికీ రెండో చరణానికీ tune భేదం ఉంది గమనించండి. అంటే వేటూరి ముందు పాట వ్రాశాకా, దానికి లయలు నేర్పించాడు మామ! ఈ చరణం ముందు వచ్చే వేణునాదంలో భక్తితరంగాలు తాండవించాయి. మహదేవన్ నిజంగా మహానుభావుడు!

"ఓం" అనే నాదం, "అ", "ఉ", "మ" అనే మూడు స్వరాలను కలిపితే వచ్చింది అని వైదీకుల నమ్మకం. ఈ ప్రపంచం ఆ నాదంలోనుండి పుట్టింది అని మన విశ్వాసం. అయ్యప్పస్వామి హరిహరుల తనయుడని, వారిద్దరి మధ్యనా భేదాలు/విభేదాలు లేవని నిరూపించేందుకు పుట్టాడని ఆయన చరిత్ర చెబుతోంది. ఈ మూడు స్వరాల కలయికలో, ఆ రెండు మహాశక్తుల మేళనలో, ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తూ, మంత్రాలనడుమ భక్తులు వారు చేసిన పాపపుణ్యాలను కర్పూరం చేసి అయ్యప్పస్వామికి హారతిగా పడతారుట! కర్మ, దాని ఫలితం ఉన్నంతకాలమే ఆత్మ ఈ భౌతికప్రపంచంలో నడుస్తుంది. ఆ కర్మను నాశనం చేసేవాడు యోగేశ్వరుడైన పరమాత్మ. ఆ నైష్కర్మ్యాన్ని సాధించేందుకు భక్తులు స్వామి వద్దకు మాలను ధరించి వస్తున్నారు అని ఎంత లోతైన భావాన్ని తక్కువ మాటల్లో చెప్పడో వేటూరి!

ఈ చిత్రంలో మిగిలిన పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే ఆ పరమాత్ముడి దయతో అవన్నీ కూడా వ్రాయగలనని ఆశిస్తున్నాను. హరిః ఓం.

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు - రాముడిపై కొన్ని పద్యాలు :)

మీకూ, మీ ఇంటిల్లిపాదికీ, మీ శ్రేహోభిలాషులకూ నా మనఃపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు! శ్రీరామనవమి గురించి తలుచుకుంటే ఈ బ్లాగుకు రెండేళ్ళు నిండాయన్న సంగతి ఙప్తికి వచ్చింది. శ్రీరాముడి గురించి చెప్పడానికి నేను చాలను. వాల్మీకి, తులసీదాస్, విశ్వనాథ సత్యనారాయణ, త్యాగరాజు వంటి మహానుభావులు ఏళ్ళ తరబడి తపిస్తే వ్రాయగలిగిన పుణ్యగాధ శ్రీరామునిది. వారితో పోలిస్తే నేను మహాసాగరంలో ఒక నీటిబొట్టును. సముద్రానికి, జలబిందువుకూ పరిమాణంలో తేడా ఉన్నా, వాటిలోని గుణం ఒక్కటే. అలాగే ఆ మహాకవుల గొప్పదనానికి నేను సరితూగలేకపోయినా, వారిని నడిపించిన భక్తే నన్నూ నడిపిస్తుంది అన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను.

రాముడి గురించి ఏమైనా చెప్పుకునే ముందు, ఆదికవి వాల్మీకిని స్తుతించడం మన సంప్రదాయం. అందుకే ఒక్కమారు ఆయన్ని తలుచుకుందాము:
పద్యం:-
కూజంతం రామరామేతి మధురం, మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ||
భా:-
కవిత అనే కొమ్మనెక్కి "రామ, రామ" అనే మధురమైన అక్షరాలను తీయగా పాడుతున్న వాల్మీకి అనే కోకిలకు నేను నమస్కరిస్తున్నాను.

జంటగా కూస్తున్న రెండు పక్షులలో ఒకదానికి బోయవాడు గాయం చేయడం చూసిన వాల్మీకి ఆవేశంలో, మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. అందుకే రామాయణాన్ని "శోకంలో పుట్టిన శ్లోకంగా" చెప్పుకుంటారు. ఆ శ్లోకాన్ని, దాని కథని మీరు వాల్మీకికవి వికిపిడియా వ్యాసంలో చూడవచ్చును. అలాగే సంపూర్ణరామాయణం, ఆంగ్లానువాదం ఇక్కడ చూడవచ్చును.

వాల్మీకి నారదమునిని: "ఎవరయ్యా సర్వగుణసమిష్టిరూపం? సద్భుద్ధి కలిగినవాడు, ప్రతాపం కలిగినవాడు, ధర్మం తెలిసినవాడు, నిజమే మాట్లాడేవాడు, పట్టుదల ఉన్నవాడు, కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను జయించినవాడు - వాడెవ్వడయ్యా ఈ లోకంలో?", అని అడిగితే అప్పుడు నారదముని చెప్పిన సమాధానమే "రాముడు". రాముడు ఇతరభగవదవతారాల్లాగా మానవాతీతశక్తులను ప్రదర్శించినట్లుగా రామాయణంలో ఎక్కడా లేదు. ఒక సామాన్యుడు తన మనస్సును ధర్మమార్గంలో పెడితే అప్పుడు అతడు ఎలాగ ఉంటాడు అన్నది మాత్రమే రాముడు చూపించాడు. నాకు, మీకు, మనందరికీ ఆదర్శపురుషుడు రాముడు. పరమాత్ముడు, గురువు, తండ్రి, తల్లి, పినతల్లులు, తమ్ముళ్ళు, భార్య,  దేశం, ప్రజలు  - వీరందరి పట్లా తన ధర్మం తప్పక పాటించిన మహాత్ముడు రాముడు. ప్రపంచం తల్లక్రిందులైనా భరతఖండంలో ప్రతీ ఇసుకరేణువులోనూ నిండే కథ రామాయణం.

ఏకపత్నీవ్రతుడైన రాముడి ఔన్నత్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ముగ్గురిని పెళ్ళి చేసుకున్నవాడికి తెలియదు. ధర్మఙుడైన రాముడి ఙానం రామాయణంలో ఒక్క శ్లోకం కూడా చదవకుండా "చాకలి మాటకు ఇల్లాలిని అడవిపాలు చేశాడు", అని నిందించే కూహనామేధావులకి తెలియదు. భ్రాతృప్రేమకు నిలువుటద్దమైన రాముడి ప్రేమ సొంతతమ్ముడు తిన్నాడొ లేదో చూడకుండా బ్రతికేవాడికి తెలియదు. పితృవాక్పరిపాలకుడైన రాముడి గరిమ తండ్రి చివరిరోజుల్లో దగ్గరుండి సేవ చెయ్యాలని తెలియనివాడికి తెలియదు. సత్యానికి అధీనమై నడచుకున్న రాముడి గొప్పదనం నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయనాయకులకి తెలియదు. కేవలం నిర్మలమైన భక్తిని మనసులో నింపుకున్న భక్తుడికే తెలుస్తుంది. కలలో కనబడి పుస్తకం వ్రాయమంటే ఏళ్ళ తరబడి కూర్చుని వెన్న కన్నా, జున్ను కన్నా, తేనె కన్నా రుచికలిగిన పద్యాలతో స్వామి రసనాన్ని మెప్పించిన పోతరాజు (పోతన) వంటి మహాభక్తులకే తెలుస్తుంది. రామనామము అనేకకోటిసార్లు జపించిన త్యాగరాజుకు తెలుస్తుంది. ఒకటి - మనకు భక్తి ఉంటే ఆ మార్గంలో పయనించాలి. రెండు - మనకు లేకపోతే మన పని మనం చూసుకుని, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వాలి. కలియుగప్రభావాన ప్రస్తుతం ఈ రెండువర్గాలవారూ తక్కువే!

ఆ శ్రీరామకృపవలన నాకు అంతో ఇంతో భక్తిభావం మనసులో కలిగింది. సరస్వతి అనుగ్రహించినంతవరకు, నాకు వీలైన మాటల్లో, ఈ పద్యాలను వ్రాస్తున్నాను:

సీ:-
తండ్రిమాటకొఱకు తాటకనువధించి, యఙాన్ని కాచావు యతినిగూడి
పినతల్లి కోర్కెకై ఎనలేని భోగాలు, విడనాడి అడవికి వెడలినావు
ఇల్లాలి ముచ్చట నెరవేర్చగోరుచు, లేడివెనుక వేటలాడినావు
ధర్మాన్ని రక్షించ దశకంఠునోడించి, నీతికి రూపమై నిల్చినావు

తే:-
ప్రేమ, ధర్మంబు తోడుండ ఏమి లోటు?
కలిమి యెంతైన శౌర్యము కల్గునొక్కొ?
అడవిలోనైన, అయోధ్యనైన నీవె
రాజువుగదయ్య లోకాన! రఘుకులేశ!

ఆ:-
ఆంజనేయుఁగాను హృదయాన్ని చీల్చగ
త్యాగరాజుఁగాను రాగమనగ
పోతరాజుఁగాను కైతలు కురిపించ
పామరుండనయ్య పాహి రామ!

ఇంతసేపూ రాముణ్ణి పొగిడాను కదా. ఇప్పుడు సరదాగా రెండు పద్యాలు వ్రాద్దామనిపించింది. ఇది నా అఙానాన్ని ప్రదర్శించడమే తప్ప, రాముణ్ణి తక్కువ చేసే ప్రయత్నం కాదని రసఙులు గమనించగలరు.

ఆ:-
అందమందు నిండుచందురుడికి సాటి
గుణములోన మెరియు మణి కదయ్య
అమ్మలాగ యింటినాదరించెడి తల్లి
ఆమె చాలనియననద్భుతంబు !!!

కం:-
అందము కొంచెమె చాలయ
కందువ తెలియక మెలగుచు కాస్త శమముతో
అందరిని చూచి, మన్నన
పొందెడి సతి చాలనియన పొగడరె నన్నున్?

భా:- గొప్ప అందకత్తె, గుణంలో మణి, ప్రేమమూర్తి అయిన సీత ఒక్కత్తే చాలని నువ్వంటే అది ఒక అద్భుతం. (మరి, రాముడు ఏకపత్నీవ్రతుడు కదా!) కొద్దో గొప్పో అందం ఉంటే చాలు, కుట్రలు చేయకుండా, అందరినీ చూసుకుంటూ, కాస్త మెప్పు పొందే ఒక అమ్మాయి చాలు అంటే మాత్రం నన్నెవరూ పొగడరెందుకో?

Saturday, March 20, 2010

గురుచరణం శరణం - ఇళయరాజ

మలయాళంలో వచ్చిన "గురు" చిత్రం కథ వింటేనే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ కథ గురించి నేను గతంలో ఒక ఆంగ్లటప వ్రాశాను. ఈ చిత్రం ఎవరైనా మలయాళస్నేహితుడితో కలిసి చూడాలన్నది నా కోరిక. ఇందులో ఇళయరాజ  స్వరపరచిన "గురుచరణం శరణం" అనే పాట, నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈ పాటలో ప్రతీ స్వరం భక్తిని, దయని నింపుకుంది. ఈ పాటను ఎలాగైనా ఆంధ్రీకరించాలన్న నా తపన ఈ రోజు తీరింది.

నాకు వీలైనంతగా ఈ పాటలో భక్తిరసాన్ని, భగవత్తత్వాన్ని నింపాను. పల్లవిలో "గురుచరణం" అన్నది మార్చి "నీ చరణం",  అని వ్రాయడానికి కారణం బాణీలో ఉన్న భక్తితత్వానికి  తగ్గట్టుగా భావాలకు ఇంకా విశాలమైన ప్రాంగణాన్ని కల్పిద్దాము అని. గురువుని కంటే భగవంతుడిని పొగడటానికి అవధులు తక్కువ - అందుకని.

మొదటి చరణంలో పంచభూతాలు, ఆకాశం (గగనం), నీరు (వరుణం), నేల (భువనం), గాలి (పవనం), నిప్పు (సూర్యుడు) అన్నింటినీ భగవంతుడి సృష్టిగా వర్ణించాను. ఇందులో తిగ్మతేజం అనడంలో నా ఉద్దేశం "వేడి కలిగిన ప్రకాశం" అని. కొంచం సంస్కృతభూయిష్టంగా ఉన్నా సందర్భానికి తగినట్లు ఉందని వ్రాయాల్సివచ్చింది. రెండవ చరణంలో ప్రకృతిలో ఉన్న అన్ని విశేషాల వెనుకా ఉన్నది ఆ పరమాత్ముడే అనే భావాన్ని కలిగేలా ప్రయత్నించాను. చివరగా ఆ పరమాత్మకు నమస్కారాలను సమర్పించాను.

చిత్రం: గురు (1997- మలయాళం)
దర్శకుడు: రాజీవ్ ఆంచల్
సంగీతం: ఇళయరాజ
మలయాళంలో గీతకర్త: రమేశన్ నాయర్


నీ చరణం శరణం స్వామీ! భవభయహరణం
పరమాణువు మొదలు జగం, నీ వశమేగా సకలం
ఆధారమై గావరా!

గగనం, నీలిమేఘం, వరుణం, ఇంద్రచాపం,
భువనం, హరితచేలం, పవనం, పుష్పగంధం,
చలిని తొలచు తిగ్మతేజమై, కనులు వెతుకు కాంతిపుంజమై
వెలయు రవీ [ఓంకారరూప] నీ మహిమే! [ఓం శాంతి ఓం]

కులికే కోకిలైనా, ఉరికే జింకలైనా
కురిసే చినుకులైనా, మురిసే ఆకులైనా
వెనుకనున్న ఉనికి నీవుగా!
విశ్వమంత నీకు రూపుగా
వెలసితివే! [ఆనందరూప] ప్రణతులివే [ఓం శాంతి ఓం]