Tuesday, May 25, 2010

వేటూరికి ఎవరు ఋణపడి ఉన్నారు?

ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే, "ఆయన పాటల్ని అనుదినం పాడుకుంటూ ఆనందించిన పిన్నాపెద్దలందరూ ఋణపడ్డారు", అని కొందరంటే, "ఇంతటి అపారమైన సంస్కృతాంధ్రభాషాఙ్ఞాననిధిని తమ నవ్యత లేని కథలలో పనికిమాలిన సందర్భాలకు పరిమితం చేసిన, కళాత్మకమైన వృత్తిని వ్యాపారమాత్రంగా మార్చిన, దర్శకనిర్మాతలు ఋణపడి ఉన్నారు" అని కొందరంటారు. ఆయన పాటలనే కాక, పాట్లని కూడా గమనించిన కొందరు అభిమానులు, "అంతటి పుంభవ సరస్వతికి వెయ్యి గజాల జాగా కూడా ఇవ్వలేకపోయిన మన తెలుగునాడు (సర్కారు) ఋణపడిపోయింది", అని అంటారు. కానీ, నన్నడిగితే వీళ్ళే కాదు,  ఋణపడిపోయినవాళ్ళ జాబితా ఇంకా పెద్దదేనంటాను.

మొట్టమొదటగా ఋణపడిపోయింది, ఆయన నోట అనేకమార్లు పొగడబడిన దేవతలు. శివుడు (శంకరాభరణం, భక్తకన్నప్ప, సాగరసంగమం మొ.),  రాముడు (గోదావరి,  రాధాగోపాళం, సీతారామయ్యగారి మనవరాలు మొ.), కృష్ణుడు (సాగరసంగమం, స్వరాభిషేకం, కాంచనగంగ మొ.), అమ్మవారు (సప్తపది, భైరవద్వీపం మొ.), హనుమంతుడు (శ్రీ ఆంజనేయం, జగదేక వీరుడు అతిలోక సుందరి, మొ.), వేంకటేశ్వరుడు  (సప్తగిరి మొ.), అయ్యప్పస్వామి (శ్రీ అయ్యప్పస్వామి మహత్యం), రాఘవేంద్రస్వామి (2003 లో విడుదలైన రాఘవేంద్ర). ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమంది దేవతలు ఆయన పదపుష్పాలతో అర్చింపబడ్డారు. కొన్ని సార్లు దేవుణ్ణి పొగడే సందర్భం చిక్కితే, కొన్ని సార్లు సందర్భం చిక్కించుకుని దేవుణ్ణి పొగిడారు వేటూరి. ఉదాహరణకి, ఆలుమగల అన్యోన్యాన్ని చెప్పడానికి రాధాగోపాళంలో "ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ, తనువులు రెండూ తామొకటైన సీతారాములకు - మీకు శతమానం భవతి" అని అన్నారు. పువ్వూ తావీ అనో, ఆమనీ కోయిలా అనో, వేణువు నాదం అనో వర్ణించడంతో సరిపెట్టకుండా భార్యాభర్తల అన్యోన్యానికి పరమేశ్వరుడే ప్రమాణం అని మనసుకు హత్తుకునేలాగా చెప్పారు. ఒక సరదా వాన పాట వ్రాయండయ్యా అంటే ఎవరైనా కొంచెం సరసం కలుపుతారు. కానీ ఆ సరసం పక్కనే సాత్వికతను నిలుపగల ఘనుడు వేటూరేనేమో. గోదావరి చిత్రంలో "టిప్పులు టప్పులు" అనే పాటలో "లంగరేసినా లొంగిచావని రంగసాని చాటుపిలుపులు" అని సరసం చూపిస్తూనే, "రాకడా పోకడా రాములోరికెరుకలే" అంటూ గోదావరిపై రాముని ఉనికిని మాటల్లో నిలబెట్టారు. రాముడు కూడా "ఏవిటి నా మీద వీడికింత వెర్రి అభిమానం?", అనుకునేలాగా ఆ చిత్రంలో దాదాపు అన్ని పాటల్లోనూ రాముణ్ణి గుర్తుచేశారు. ఇంక రాధను ఎన్నిసార్లు ఆయన పాటల్లో తలుచుకున్నాడో చూసి కృష్ణుడికే, "ఎంతైనా వేటూరికి రాధ పట్ల పక్షపాతం ఉంది", అనిపిస్తుందేమో! దేవతలేనా? పురాణాల్లో అనేక పాత్రలకు ఆయన పాటల్లో చోటు దక్కించారు ఆయన. కొన్ని సందర్భానికైతే, కొన్ని సరదాకి. శబరి, ద్రౌపది, చంద్రమతి, శకుంతల, వరూధిని, ఘటొత్కచుడు, ఇంద్రుడు మొదలుకొని ఆఖరికి మంథర, సూర్పనఖ, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా ఆయన పాటల్లో ఎక్కడొ ఎదురవుతూనే ఉంటారు.

వేటూరికి పూర్వకవులు కూడా ఆయనకు ఋణపడ్డారు. "ఇదేమిటి? వాళ్ళ కావ్యాలు, పాటలు ద్వారా ఙ్ఞానాన్ని పొందిన వేటూరే ఋణపడి ఉండాలి కదా?" అని అనిపించడం సహజమే. కానీ, వేటూరి వాళ్ళని పదే పదే పాటల్లో తలుచుకుని వాళ్ళ ఋణం తీర్చుకోవడమే కాక, వాళ్ళనే ఋణబద్ధులను చేశారేమోననిపిస్తుంది. వాల్మీకి, కాళిదాసు మొ. సంస్కృతకవులని; నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, రామలింగడు మొ. ఛందోబద్ధకావ్యకర్తలని; త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య మొ. వాగ్గేయకారులని; కృష్ణశాస్త్రి, నండూరి, శ్రీశ్రీ, గుడిపాటి చలం, గురజాడ వంటి ఆధునికకవులని; ఆత్రేయ, పింగళి వంటి చలనచిత్రగీతకర్తలని ఆయన పాటల్లో గుర్తుచేశారు. (వేటూరికి గురువుగారు) విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి అపరభాషాప్రవీణులనే కాక, ఒమర్ ఖయ్యాం, రబీంద్రనాథ్ ఠాగోర్ వంటి పరభాషాప్రవీణులని కూడా ఆయన పాటల్లో చూస్తూ ఉంటాము మనం. తాన్సేన్, గులాం అలీ వంటి గాయకులను సందర్భం దొరికంప్పుడల్లా ప్రస్తావించే సినీకవి మనకు దొరుకుతాడా? ఇకపై వీళ్ళని పట్టించుకునేవాళ్ళు ఉంటారా? "తెలుగు" అన్న పదాన్నే సరిగ్గా పలకడం చేతకాని వాళ్ళ చేత "చిరుత్యాగరాజు, నీ కృతినే పలికెను" అని అనిపించేవారున్నారా? ఒక యుగళగీతం వ్రాసిపెట్టవయ్యా అని అంటే పనిగట్టుకుని, "నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, ఆత్రేయ ప్రేమగీతం" అనో, కుటుంబమంతా కలిసి పాడుకునే పాట వ్రాయవయ్యా అంటే, "మనసు కవి మాట మనకు విరిబాట", అనో కనీసం చలనచిత్రరంగంలో తమకు సీనియర్లైన కవులని గుర్తుచేసేవారుంటారా?

మన జీవనదులు వేటూరికి ఋణపడ్డాయి. "పలుకులా అష్టపదులా, నడకలా జీవనదులా", అని నదుల అందాలను గుర్తుచేశారు. "ఒయ్యారి గోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం?" అని గోదావరిని చిలిపిగా అడిగారు. "నీలవేణిలో కృష్ణవేణినే చూశా" అని అమ్మాయిని పొగుడుతున్న నెపంతో కృష్ణని, "నాలోనే పొంగెను నర్మద" అని నర్మదని, "నీ తుంగభద్ర మా పాపాలు కడుగంగ" అని రాఘవేంద్రస్వామిని పొగుడుతూ తుంగభద్రని, "చినుకులన్నీ కలిసి చిత్రకావేరి" అని కావేరిని గుర్తుచేసారు. ఇంక గంగమ్మ సంగతైతే చెప్పుకోవక్కరలేదు. గంగోత్రి చిత్రంలో ఏకంగా పాటే వ్రాశారు. భారతీయనదులకే కాకుండా "పరదేశి" చిత్రంలో "మిసిసిపి-తీరే" అంటూ పరదేశంలోని నదులకు కూడా తన పాటల్లో స్థానం ఇచ్చారు.  హైదరాబాదులో, ఒక అర్ధరాత్రి, ఒకబ్బాయి అమ్మాయితో కలిసి కారులో షికారుకెళ్తుంటే, అప్పుడు పాడే పాటలో ప్రకృతిసౌందర్యాలను ఎలాగ వర్ణిస్తాము? కానీ వేటూరికి ఆ సంకోచం లేదు, "యమునాతీరం, సంధ్యారాగం - నిజమైనాయి కలలు, నీలా రెండు కనులలో" అని "నువ్వు నా కళ్ళెదుటవుంటే, నేను కలగన్న యమునాతీరం-సంధ్యారాగం నిజంగా ఎదురైనట్టు ఉంది", అని వ్రాశాడు. ఒక్క నదులనే కాదు, మన భారతదేశసౌందర్యానికి ప్రతీకలైన ఎన్నో సంపదలని ఆయన పాటల్లో నిక్షిప్తం చేశారు. రాఘవేంద్రస్వామిని గురించి చెప్పవయ్యా అంటే, "మనసు చల్లని హిమవంతా" అని హిమాలయాను గుర్తుచెయ్యగలరు వేటూరి!

ఆ తరువాత ఋణపడింది కర్ణాటకసంగీతం! "ఇదేమిటి? ఆయనకు సంగీతమొచ్చా? ఆయనేమైనా పాడాడా?" అని మీరు అనుకోవడం సహజం. "పాడితేనే ఋణపడాలా? సామాన్యులకు రాగాలను పరిచయం చేస్తే అది గొప్ప కాద?", అని నాకనిపిస్తుంది. "మదనమోహినీ చూపులోన మాండురాగమేలా?", అని ప్రేయసిని అడిగినా, "పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం - అది ఆనందభైరవి రాగం" అని ప్రేమికుల మధ్యలో అనురాగానికి స్వరరూపం ఆపాదించినా, "శ్రీ-రాగమందు కీర్తనలు మానర!"  అంటూ డబ్బు పిచ్చి వదులుకొమ్మని సరదాగా చెప్పినా - అది కర్ణాటకసంగీతం పట్ల వేటూరికి ఉన్న మమకారానికి నుడికారాన్ని కల్పించి చెప్పటమే! శంకరాభరణం, దేవగాంధారి, కీరవాణి, శివరంజని, భాగేశ్వరి వంటి రాగాలు ఆయన పాటల్లో మనకు తారసపడుతూ ఉంటాయి. ఇక "భైరవద్వీపం" చిత్రంలో "శ్రీతుంబురనారదనాదామృతం" అనే పాటలో ఆయన కర్ణాటకసంగీతానికి పదాభిషేకం చేశాడనే చెప్పుకోవాలి. మన సాంప్రదాయవిశేషాల మీద ఇంత పట్టు కలిగి, "నువ్వు సందర్భం చెప్పు, నేను సాంప్రదాయంతో జోడించి సాహిత్యాన్ని అందిస్తాను" అని ధైర్యంగా నిలబడి చెప్పగలిగే వారు చలనచిత్రసీమకు మళ్ళీ ఎప్పుడు వస్తారు? సంగీతంలో ఒ,న,మ-లు తెలియని నాబోటి వాళ్ళకు కూడా, "ఫలానా రాగం ఉందన్నమాట" అని తెలిసేలాగా ఎవరు చేస్తారు?

కవికి స్వేచ్ఛనిచ్చే దర్శకుడు అడిగితే, అమ్మాయిని వర్ణిస్తూ "ముల్లోకాలే కుప్పెలై, జడకుప్పెలై" అని అన్నారు. అలాగే, "మాకదేమీ తెలియద్సార్! మాంచి ఊపున్న పాట ఒకటి రాయండి", అని అడిగితే "యమహో నీ యమాయమా అందం" అనే మాయతెరను అడ్డు పెట్టి, ఆ వెనుకనే "తెల్లనీ చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, పచ్చని పాదాలట్టి, ఎర్రని బొట్టు పారాణెట్టి, చీకటింట దీపామెట్టి, చీకుచింత పక్కానెట్టి", అంటూ మన సాంప్రదాయాన్ని గుర్తుచేశారు. ఇంత ముద్దుగా మనకు మన సాంప్రదాయాలని గుర్తుచెసే శక్తి ప్రస్తుతకవులందరికీ కలుగేలా ఆశీర్వదించమని వేటూరికి నా మనవి. ఇంత చక్కగా వర్ణించబడి, నలుగురి మనసుల్లోనే కాక పెదాలపై కూడా ఉన్నందుకు మన సాంప్రదాయాలు కూడా ఆయనకు ఋణపడ్డాయనిపిస్తుంది!

ప్రతీ మనిషినీ కనేది ప్రకృతి ప్రతిబింబమైన ఆడది. కానీ ప్రతీ కవినీ కనేది మాత్రం సాక్షాత్తు ఆ ప్రకృతే! అలాంటి ప్రకృతిని వర్ణించి కవి తన కవిత్వానికి సార్థకతను సంపాదించుకుంటాడు. దురదృష్టవశాత్తు మన తెలుగు చలనచిత్రాలలో ప్రకృతిని వర్ణించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సందర్భం దొరికినా దొరక్కపోయినా ఒక్కసారి ఆ ప్రకృతిని తలుచుకోకుండా వేటూరి పాట వ్రాయలేదేమో అనిపిస్తుంది. చక్కనైన సందర్భం కుదిరితే, "ఆమనీ పాడవే హాయిగా" అని అన్నారు, ముక్కిపోయిన సందర్భం వస్తే "వానవిల్లు చీర చాటు వన్నెలందుకో; 'వద్దూ' లేదు నా భాషలో" అని అన్నారు. కానీ, ప్రకృతికి మాత్రం తన పాటల్లో పెద్దపీట వేశారు. "బహుశః ఇలాగ ప్రకృతిని వర్ణించాలనే తపన ఇప్పటి కవుల్లో తగ్గిందేమో? ప్రకృతికి మళ్ళీ ఇలాంటి ప్రాధాన్యత మన తెలుగు సినిమాపాటల్లో రాదేమో?", అన్న సందేహం కలిగినప్పుడల్లా ప్రకృతి కూడా వేటూరికి కొంత ఋణపడిందేమో అనిపిస్తుంది.

"అందరి కంటే ఎక్కువ ఋణపడింది భాషేనేమో?", అనిపిస్తుంది. "సంస్కృతమంటే అది గంభీరమైన భాష. మనకు తెలియదు.", అనుకున్నవాళ్ళ నోట, "నీ పదరాజీవముల జేరు నిర్వాణసోపానమధిరోహణముజేయు ద్రోవ"  అని పాడించగల ఘటికుడు వేటూరి.  మీలో ఎంతమంది మారాకు, క్రావడి, క్రీగన్ను, కొంగొత్త, నివురు, పుంగవ, పున్నాగ వంటి పదాలు సామాన్యమైన పాటల్లో విన్నారు? వేటూరి పాటల ద్వారా నాకు పరిచయమైన అనేక తెలుగుపదాల్లో ఇవి కొన్ని మాత్రమే! పద్యప్రాసాదాలలో రాణివాసం చేస్తూ బయటి ప్రపంచాన్ని చూడటానికి నోచుకోక కనుమరుగైపోతున్న(1) అలాంటి పదాలను ఒక సామాన్యమైన తెలుగు సినిమాపాటలో చెప్పేందుకు ఎవరు మిగిలారు? అలాంటి పదాలను పోగు చేసి వాటికి అండగా నిలిచి, "ఇది నేను వ్రాస్తాను. ఎవరు వినరో, ఎందుకు వినరో అదీ చూస్తాను!", అని ధీమాగా నుంచునే సినీకవి ఎవరు? అంతే కాకుండా సరదాకో, సన్నివేశానికో ఎన్నో ముచ్చటైన పదాలను సృష్టించి "మజామ-జావళీలు" పాడారు.

వేటూరి కలం ఆగడం మనందరికీ ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో, భౌతికరూపంలో మనకు కనబడని, పైన చెప్పబడిన వారికి/వాటికి కూడా అంతే దుఃఖాన్ని కలుగజేస్తుందన్నది నా అభిప్రాయం. చెరుకుని సరిగ్గా వాడుకుంటే తీయని రసాన్ని ఇస్తుంది, పంచదారనిస్తుంది,  బెల్లాన్ని ఇస్తుంది. కానీ, అవన్నీ తీసెయ్యగా మిగిలిపోయిన చెత్తతో తయారయ్యే మద్యాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళెక్కువయిన మన చలనచిత్రపరిశ్రమ వలన, ప్రేక్షకుల వలన వేటూరి అనే మహానదిలో సుధాధారలన్నీ అడవుల్లోకి ప్రవేశించి మరుగున పడిపోతే, మలినలిప్తమైన పాయలు మాత్రమే అందరికీ కనబడుతున్నాయి. ఆ పాయల్లో కూడా అడుగున ఎక్కడో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలనో, అడవుల్లో ఉన్న సుధాధారల్నో వెతకాలనే కోరికా, తీరికా, ఓపికా ఎవరికీ లేదు కానీ, ఆ మహానదిని మొత్తంగా నిందించే సాహసం మాత్రం పుష్కలంగా ఉంది. అది వేటూరి దురదృష్టమేమో!

---
ఈ వ్యాసం ద్వారా వేటూరిని మన భాష, సంప్రదాయాలు, పూర్వకవులు, సంగీతం, ప్రకృతి మొ. వాటికంటే ఎక్కువగా చూపించాలన్నది నా ఉద్దేశం కాదు. నిస్సందేహంగా అవన్నీ వేటూరి కలానికి సిరాని అందించిన స్ఫూర్తిదాయకాలు. కాకపోతే, వేటూరి కలం ఆగిపోవడం వలన వేటిపై (చిన్నదో, పెద్దదోవేటు పడిందో చెప్పాలన్నదే నా ప్రయత్నం. పాఠకులలో ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే, వారు నన్ను క్షమించాల్సిందిగా నా మనఃపూర్వకమైన మనవి.

(1) ఇక్కడ నేను వాడిన ఉపమానం పద్యకర్తలకు అవమానంగా భావించరాదని నా మనవి. ఈ కాలంలో ఒక సామాన్యమైన తెలుగువాడికి పద్యాలను అర్థం చేసుకోవాలనే తపన కన్నా, వాటిని వెటకారం చెయ్యాలనే దురభిమానమో, అవి తనకు అర్థం కావనే భయమో ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆ ఉపమానం. పద్యకర్తల పట్ల, పద్యకావ్యాల పట్ల నాకే కాదు, వేటూరికి కూడా అపారమైన భక్తిప్రపత్తులున్నాయన్నది అందరికీ విదితమేనని నా నమ్మకం.

ఈ వ్యాసానికి స్ఫూర్తినిచ్చిన ఫణీంద్రకు నా కృతఙ్ఞతలు.

15 comments:

.C said...

ఎవరో అన్నట్టు "న భూతో..." అనే కానీ "న భవిష్యతి" అనే హక్కు మనకు లేదనే నా ఉద్దేశం. పైగా ఎవరూ ప్రకృతిని అంతలా వాడలేదంటే నేను ఒప్పుకోలేను. ఇది వేటూరి గారి నివాళి కనుక ఇదీ, తక్కిన కొన్ని అతిశయోక్తులూ అంగీకారాలే కానీ... అవి పూర్తిగా నిజాలు కాదని (నా ఉద్దేశంగా) చదువరులకు చెప్పటమే ఈ నా వ్యాఖ్యకి ప్రేరణ.

ఆ విధంగా చూస్తే చాలా చక్కగా, కవితాత్మకంగా, చమత్కారంగా, శ్రద్ధగా, సమగ్రంగా వ్రాసిన నివాళి ఇది! వేటూరి గారు తన విద్వత్తుతో, పాటలతో, చమత్"కృతు"లతో చిరస్మరణీయంగా ఉండిపోతారు.

ఆ "మహానది"ని, కవిత్వసౌందర్యనిధిని,సాహితీరసధునిని నిందించిన వాళ్ళలో నేనూ ఉన్నాను. కానీ అది నదీ సౌందర్యం తెలియక కాదు... తెలియటం వలన! విమర్శ తప్పని నేను అనుకోను. అందువలన నిన్ను బాధ పెట్టి ఉంటే తప్పే కానీ...

రవి said...

వేటూరిపై మీ అభిమానానికి అద్దం పట్టేలా ఉంది మీ వ్యాసం. రోజూ విని, పాడుకునే పాటలలో ఇంత వైవిధ్యమా? నమ్మశక్యంగా లేదు.

Phanindra said...

@సందీప్

వేటూరిపై నీకున్న అభిమానానికి అద్భుతమైన అక్షరరూపం ఇచ్చావ్.

@కిరణ్

వేటూరి మిగతా సినిమాకవుల కన్నా సందీప్ చెప్పిన ప్రయోగాలు ఎక్కువ చేశారన్నది బహుశా నిజమే కావొచ్చు. ఈ వ్యాసాన్ని ఆ కోణంలో చూడాలి తప్పితే ఇంకెవరూ రాయలేదని కాదు.

.C said...

@Phani

nEnU alaagE choosaanu anE vraasaanu, sOdaraa! kaanii, nijamEnTanE daani paTla naa uddESamU cheppaanu.

.C said...

Mea culpa!

vErE evarU vraayalEru ani saandeep analEdu. prastutam unna vaaLLalO Sraddha taggutOndEmO annaaDani maLLee maLLee chooDagaa arthamaindi. I was a bit too trigger-happy, until a friend pointed it out. Thanks to the friend, and sorry to Sandeep and all fans of Veturi!

కొత్త పాళీ said...

మరో మంచి ముత్యం.
మొన్న టీవీలో అందాలే నా హారతిగా - అందించే నా పార్వతిగా అనే తునక చూపిస్తూ దానిమీద వేటూరి సొంత వ్యాఖ్య చూపించారు. పార్వతీ అమ్మవారు బహు సౌందర్యవతి, కానీ ఆ సౌందర్యం శివుడికోసమే .. పార్వతిని శృంగారదృష్టితో చూసేది శివుడొక్కడే అని.

rākeśvara said...

వేటూరికి చాలా మంచి నివాళి పట్టారు।
నేను ఆయనితో పోటో తీయించుకుందామనుకున్నాను।
అదృష్టం లేకపోయింది।

Prasad Samantapudi said...

సినిమాలకి పనిచేయటం అంటే ఎన్నో పరిమితులకి లోబడి పనిచేయటం అని చాలామంది అంటారు.
చాన్నాళ్ళక్రితం,ఓ సినీరచయితని ఈ పరిశ్రమకి కావల్సిన అర్హతలు ఏమిటి అని అడిగాను.దానికి ఆయన సమాధానం;
1.ఏదైనా మంచి సాహిత్యం చదివి ఉంటే,దాన్ని త్వరగా మర్చిపోవటం.
2.వేగంగా రాయగలగడం.
* * *
ఎలాంటి పరిమితులున్నా,ఎన్ని రకాల పాటలు,ఎంత గొప్పగా రాయవచ్చో, వేటూరి వారు చేసి చూపించారు.

* * *
మీ వ్యాసం చాలా బావుంది.

కామేశ్వరరావు said...

రాగాల పేర్లకి మరో ఉదాహరణ సాగరసంగమంలో "వేదం అణువణువున నాదం..." పాటలో అది "హంసానందీ" రాగమని చెప్పించడం.
అన్నట్టు, వేటూరిగారికి ఛందస్సు కూడా ఋణపడి ఉండాలండోయ్! భయపెట్టడానికే అయినా, "మసజసతతగ శార్దూలా!" అని హీరోగారి చేత పాడించి, తెలుగువాళ్ళందరికీ గణాలు తెలిసిన ఒకే ఒక వృత్తం శార్దూలంగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. :-)

Sandeep P said...

@అందరూ
మీ మంచి మాటలకి నెనర్లు అండి.

@ భైరవభట్ల గారు
అవునండి. సుందరాకాండ సినిమాలో "ఉత్పలమాలలకూపిరి పొస్తావా? చెంపకమాలలు సొంపులకిస్తావా?", అన్నారు. "ప్రేమించు పెళ్ళాడు" చిత్రంలో "ఆటవెలది ఆడుతూ రావే! తేటగీత తేలిపోనీవే" అన్నారు.

Unknown said...

Wow.

Vasu said...

మంచి నివాళి. వేటూరిని కలవాలని ఎన్ని సార్లు అనుకున్నానో. అయన పుట్టిరోజుకి వచ్చిన ఇంటర్వ్యూ లు చూసినప్పుడు ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు ఎలాగయినా చూడాలి అని అనుకున్నాను. ఇంతలోనే ఇలా..
ఆయన పాటలు ఏవి విన్నా ఆయన ఇక లేరని సంగతి గుర్తొచ్చి వినలేకపోతున్నా.

వేటూరిని ఏం సత్కరించుకున్నాం, ఏం గౌరవిన్చుకున్నాం మనం (తెలుగువాళ్ళం) అనిపిస్తుంది. బాలు, సుశీల, బాలమురళి కృష్ణ గారు, చెన్నై లో స్థిరపడడం తప్పేమీ కాదనిపిస్తోంది. కళాకారులని ఎలా గౌరవించాలో తమిళులు దగ్గర నేర్చుకోవాలి మన రాష్టం, ప్రభుత్వం.

అన్నట్టు "పిలిచిన మురళికి పలికిన మురళికి ఎదలో ప్రేమపరాగం - అది ఆనందభైరవి రాగం" కాదు "పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం - అది ఆనందభైరవి రాగం" అనుకుంటా

కన్నగాడు said...

నేనెక్కిన రైలు కొంచెం ఆలస్యంగా వచ్చిందిక్కడికి, ఆణిముత్యం లాంటి వ్యాసం. చెరుకు పోలిక అద్భుతంగా కుదిరింది.

Sandeep P said...

@కన్నగాడు, వాసు
మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలండి.

@వాసు
అవునండి, ఆ వాక్యం ఇప్పుడు సరి చేశాను. పొరబాటును చూపినందుకు కృతఙ్ఞతలు అండి.

Vinay Chakravarthi.Gogineni said...

chaala baagundi.