Friday, November 7, 2008

బాలాయనం ~ 1

చిన్నపిల్లల చేష్టలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కోరికలు అన్నీ సరదాగా, నవ్వుగా ఉంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ చెప్తాను.

~~
మా అన్నయ్య కొడుకు ఏడాది వయసులో బాగా కుస్తీ పట్టి "కావా" అనే పదాన్ని తెలుసుకున్నాడు. అంటే "కావాలి" కి షార్ట్ కట్ అన్నమాట. వాళ్ళ అమ్మ, నాన్న అన్నిటినీ "నీకు ఇది కావాలా?", అని అడిగితే, దానికి వాడు "కావా" అని చెప్తాడు. మొన్నవాళ్ళ మేనత్తకు బాగా చిరాకు తెప్పిస్తే, "ఏం? దెబ్బలు కావాలా?", అని అడిగింది. వాడు పాపం నిజంగానే ఏదో తినేది అనుకుని "కావా", అని ఆశగా ఎదురు చూసాడు.

~~
విశాఖపట్నం వెళ్దామని మా ఫ్యామిలీ అందరూ ట్రైన్ లో కూర్చున్నాము. అప్పుడు ఒక పిల్లడు, వాళ్ళ అమ్మ, అమ్మమ్మ ట్రైన్ ఎక్కారు. వాళ్ల నాన్న టాటా చెప్పి వెళ్ళడం చూసాక వాడు ఏడవటం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మమ్మ, "ట్రైన్ లో వెళ్ళాలంటే టికెట్ కావాలా? మీ నాన్న అది తీసుకురావడానికే వెళ్ళాడు?", అన్నారు. దానికి వాడు ఊఁ కొట్టి కొంతసేపటికి సైలెంట్ అయ్యాడు.
ఏదో పిచ్చా పాటి మాట్లాడుతూ నేను వాడిని పేరు, ఊరు అడిగాను. "నీ పేరు ఎంటిరా", అంటే "మై నేమ్ ఇస్ ప్రజేష్", అన్నాడు. "మీ నాన్న ఎం చేస్తూ ఉంటాడు", అన్నాను. దానికి వాడు "టికెట్ తెస్తున్నాడు", అన్నాడు. వారిని, నీకు ఎంత నమ్మకం రా మీ నాన్నమ్మ మాటల మీద అనుకుని ముక్కున వేలేసుకున్నాను. ఇక్కడ ఇంకో విశేషం ఉందండోయ్, వాడికి వాళ్ళమ్మ రామాయణం మొత్తం నేర్పించింది. ఎంత వరకు అంటే, "సంపాతి, లంకిణి" మొదలైనవాళ్ళు కూడా తెలుసును వాడికి!
~~
నా చిన్నప్పుడు (రెండు ఏళ్ళు అనుకుంటాను) నేను తెగ అల్లరి చేసేవాడిని. మా వదిన ఒకావిడ నన్నుఆట పట్టిస్తోంటే, నేను గోల చేస్తున్నాను. చూసి, చూసి మా అమ్మగారు నన్ను నాలుగు దెబ్బలు వేసింది. ఏడుస్తున్న నన్ను వదిలి మళ్ళీ వంటగదిలోకి వెళ్లారు. అప్పుడు వదిన ఆటపట్టించడానికి ముందుకు ఒంగి, "ఎరా రామకృష్ణ, మీ అమ్మ నీకు బొబ్బట్లు పెట్టినట్టు ఉంది? నాకు సగం పెట్టావా?", అంది. నేనెంత వేదవానో నాకే తెలియదు, ఇంక ఆవిదకేమి తెలుస్తూంది? నాలుగుని కరెక్ట్ గా రెండు భాగాలు చేసి, చెంప మీద రెండు దెబ్బలు వేసేసి వెళ్ళిపోయాను. అప్పుడు మొదలైంది, నేను మా చుట్టాలకి షాక్ ఇవ్వడం.

No comments: