ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.
ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. నేను "శృంగేరి శారదా పీఠం" వారి ప్రతినుఅనుసరించాను.
నాళీక నీకాశ పదాహృతాభ్యాం
నానా విమోహాది నివారికాభ్యాం
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
నాళీక - తామర పువ్వు
నీకాశ - వలె కనిపించు
పద ఆహృతాభ్యాం - పాదములను అంటిపెట్టుకునేవి
నానా - రకరకాల
విమోహ ఆది - వ్యామోహాలు మొదలైనవి
నివారికాభ్యాం - తొలగించేవి
నమత్ - నమస్కరించే
జన - జనుల
అభీష్ట తతి - కోర్కెలను అన్నింటినీ
ప్రదాభ్యాం - ప్రసాదించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
తామర పువ్వుల వంటి గురువు పాదాలను అంటిపెట్టుకున్న పాదుకలు రకరకాల వ్యామోహాలను తొలగిస్తాయి. నమస్కరించిన వారి కోర్కెలను అనంటినీ నెరవేర్చేవి. వాటికి నమస్సులు.
శమాది షట్క ప్రద వైభవాభ్యాం
సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం
రమా ధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
శమాది షట్క ప్రద - శమము మొదలుగా గల ఆరు లక్షణాలను ఇచ్చే
వైభవాభ్యాం - మహత్తు కలిగినవి
సమాధి - బ్రహ్మంతో ఐక్యత
దాన - ఇవ్వడం (అనే)
వ్రత - వ్రతాన్ని
దీక్షితాభ్యాం - దీక్షగా తీసుకున్నవి
రమా - లక్ష్మీ దేవి
ధవ - భర్త
అంఘ్రి - పాదాలు
స్థిర - నిలకడగా
భక్తిదాభ్యాం - భక్తిని ప్రసాదించేటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు (వివేక చూడామణిలో చెప్పబడిన) శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మోక్షప్రదమైన గుణాలను ప్రసాదించే మహత్తు కలిగినవి. శ్రద్ధగా ఉన్న వారికి బ్రహ్మపదాన్ని అందించడమే కర్తవ్యంగా ఉన్నవి. నారాయణుని పాదాల పట్ల భక్తిని నిలకడగా ఉంచగలిగినవి. వాటికి నమస్సులు.
నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి
సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యాం
నృపత్వదాభ్యాం నత లోక పంక్తేః
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
నృప ఆళి - అనేక రాజుల
మౌళి - కిరీటాల
వ్రజ - గుంపు (యొక్క)
రత్న కాంతి - రత్నాల కాంతి (యొక్క)
సరిత్ - నది (లో)
విరాజత్ - మెరిసేటి
ఝష కన్యకాభ్యాం - అందమైన చేపల వంటివి
నత - నమస్కరించిన వారికి
లోక పంక్తేః - లోకాలు అన్నింటికీ
నృపత్వదాభ్యాం - ఆధిపత్యం ఇచ్చేటివి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
అనేకమంది రాజుల కిరీటాలను ఒక చోట చేర్చగా వాటిలో ఉన్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే అంతటి వెలుగులో కూడా మెరిసేటి చేపల వంటివి గురువు పాదుకలు. అంటే ఎంతటి సిరులు, అధికారం కూడా గురువు చెప్పుల పాటి చెయ్యవు. ఆ గురువు పాదుకలకు నమస్కరించిన వారికి అనేక లోకాల ఆధిపత్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి గురువు పాదాలు. వాటికి నమస్సులు.
అనంత సంసార సముద్ర తార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
అనంత - అంతు లేని
సంసార - ప్రపంచం అనే
సముద్ర - కడలి (ని)
తార - దాటించే
నౌకాయితాభ్యాం - నౌకల వంటివి
గురుభక్తిదాభ్యాం - గురువు పట్ల భక్తిని ఇచ్చేటివి
వైరాగ్య - వైరాగ్యం అనే
సామ్రాజ్యద - సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళదాయకమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురుపాదుకలు అంతులేని సంసారం అనే కడలిని దాటించే నౌకలు. అవి గురువు పైన భక్తిని కలిగించి నిలుపుతాయి. అవి (నిస్సారమైన ప్రపంచం పై) వైరాగ్యం అనే సామ్రాజ్యాన్ని పొందడానికి పూజించదగినవి. వాటికి నా నమస్కారములు.
పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధి సంశోషణబాడబాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
పాప - పాపము (అనెడి)
అంధకార - చీకటి (కి)
అర్క - సూర్యుల
పరంపరాభ్యాం - వరుస వంటివి
తాపత్రయ - తాపత్రయము (అనెడి)
అహి + ఇంద్ర - అత్యంత శక్తివంతమైన పాముకు
ఖ + గ + ఈశ్వరాభ్యాం - ఆకాశంలో సంచరించే వాటికి (పక్షులకు) అధిపతి (గరుత్మంతుడు - గెద్ద) వంటివి
జాడ్య + అబ్ధి - అజ్ఞానం అనే సముద్రాన్ని
సంశోషణ - ఎండబెట్టేటి
బాడబాభ్యాం - భయంకరమైన నిప్పు వంటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురువు పాదుకలు పాపము అనే చీకటిని మొత్తంగా నాశనం చేసేటి వేలాది సూర్యులతో సమానం. అవి తాపత్రయాలు అనే పాముని చంపేటి గెద్ద వంటివి. అజ్ఞానం అనే కడలిని ఎండబెట్టేటి బలమైన నిప్పు వంటివి. వాటికి నమస్సులు.
కవిత్వ వారాశి నిశాకరాభ్యాం
దౌర్భాగ్య దావాంబుదమాలికాభ్యాం
దూరీకృతానమ్ర విపత్తతిభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
కవిత్వ - కవిత్వం (అనే)
వారాశి - కడలి (కి)
నిశాకరాభ్యాం - చంద్రుడి వంటివి (వన్నె తెచ్చెడివి)
దౌర్భాగ్య - దురదృష్టం (అనే)
దావ - మంట (కు)
అంబుద మాలికాభ్యాం - నీటి మాలల (కుండపోత వర్షం) వంటివి
దూరీకృత - దూరం చెసినవి
ఆనమ్ర - మొక్కెడి వారికి
విపత్ తతిభ్యాం - ఆపదల వరుసను
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు కడలికి చంద్రుడి వలె విద్యకు వన్నె తెచ్చెడివి. దురదృష్టం అనే మంటను ఆర్పేటి జడివానలు. మొక్కెడి వారికి వచ్చిన ఆపదలను అన్నింటినీ తొలగించెడివి. వాటికి నమస్సులు.
నతా యయో శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
యయోః - వేటికైతే
కదాచిత్ - ఎప్పుడో ఒక సారి మాత్రమే
నతా - మొక్కిన వారు
అపి - అయినా
హి - కచ్చితంగా
ఆశు - వెంటనే
దరిద్రవర్యాః - అత్యంత దరిద్రంలో ఉన్న వారు
శ్రీపతితాం - సిరులకు నెలవు
చ - మరియు
మూకాః - మూగవారు
వాచస్పతితాం - మాటలకు నెలవు (దేవ గురువు బృహస్పతి)
సమీయుః - వలే ఐనారో
తాభ్యాం - వాటికి
శ్రీ గురుపాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
ఎప్పుడో ఒక సారి మాత్రమే మొక్కినప్పటికీ వెంటనే దరిద్రులను నారాయణునితో (లక్ష్మీ దేవి భర్త), మూగవారిని బృహస్పతితో సమానంగా కచ్చితంగా చెయ్యగల గురువు పాదుకలకు నమస్సులు
కామాది సర్ప వ్రజ భఙ్జకాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం
బోధప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
కామ + ఆది - కామము మొదలైన
సర్ప వ్రజ - పాముల వరుస
భఙ్జకాభ్యాం - త్రుంచేవి
వివేక - ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే తెలివి
వైరాగ్య - అశాశ్వతమైన వాటి పైన కోరిక లేకుండుట
నిధి ప్రదాభ్యాం - (వివేకము, వైరాగ్యము అనే) నిధులను ప్రసాదించెడివి
బోధప్రదాభ్యాం - జ్ఞానాన్ని బోధించేవి
ద్రుత - వేగంగా
మోక్షదాభ్యాం - మోక్షాన్ని కలిగించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు పాములను (అరిషడ్వర్గం) నాశనం చేస్తాయి. వివేకం, వైరాగ్యం అనే గొప్ప సిరులను ప్రసాదిస్తాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, త్వరగా మోక్షాన్ని ఇస్తాయి. వాటికి నమస్సులు.
స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
స్వ - వాటిని
అర్చ - మొక్కడమే
పరాణాం - తమ కర్తవ్యంగా కలవారికి
అఖిల - అన్ని
ఇష్టదాభ్యాం - ఇష్టాలనూ నెరవేర్చేవి
స్వాహా - స్వాహా దేవి (కి)
సహాయః - తోడుగా ఉండెడి వాడిని (అగ్ని: ఆయన భార్య స్వాహా దేవి)
అక్ష - కన్నుగా కలవాడికి (శివుడికి)
ధురంధరాభ్యాం - సమానమైన శక్తి కలవాటికి
స్వాంత - హృదయం
అచ్ఛ - శుద్ధి
భావ - స్థితి
ప్రద - ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
వేటిని అర్చించడంలో మునిగిన వారికి అన్ని కోర్కెలూ నెరవేరుతాయో, శివుడికి ఉన్నంత శక్తి వేటికి కలదో, వేటిని పూజిస్తే మనస్సు నిర్మలమౌతుందో - ఆ గురువు పాదుకలకు నమస్సులు.
శ్రీ గురు పాదుకాభ్యాం నమః