Wednesday, June 30, 2010

ఒరు పొన్మాలై పొళుదు

"నిళల్ గళ్" అనే చిత్రంలోని "పొన్మాలై పొళుదు" అనే పాట వైరముత్తు అనే ప్రసిద్ధ తమిళ రచయిత వ్రాసిన తొలి చలనచిత్రగీతం. ఇళయరాజా ఇచ్చిన  బాణీ ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పాట ఎంతగానో నచ్చిన నాకు దీని అర్థం ఏమిటొ తెలుసుకోవాలనే కుతూహలం కలగడంతో సోదరుడు భాస్కర్ ని అడిగితే, ఆయన ఎంతో ఓర్పుగా వైరముత్తు ఆత్మకథలో ఈ పాట గురించి వ్రాసిన ఘట్టాన్ని మొత్తం అనువదించారు. అనువాదం చదివాక నాకూ ఆ కవి శక్తి ఏమిటో అర్థమైంది. పాటలో గొప్ప ఆశావాదం, ప్రకృతివర్ణన ఉన్నాయి. విన్నాక ఇళయరాజ, భారతీరాజ వంటి మహామహులు ముగ్ధులయ్యారుట.

ఈ పాటకి అనువాదం కాదు కానీ, ఆ బాణీకి తగిన స్ఫూర్తితో తెలుగులో ఏమైనా వ్రాద్దామనుకుంటూ పడుకోబోయాను. కానీ ఎందుకో వెంటనే వ్రాయాలనిపించి లేచి వ్రాస్తున్నాను. కచ్చితంగా ఇది వైరముత్తు పాటతో పోల్చదగినది కాదు. ఏదో చిట్టిచిట్టి భావాలకు అద్దం పట్టాను - అంతే.

చిత్రం: నిళల్ గళ్
సంగీతం: ఇళయరాజ
మూలం రచించినది: వైరముత్తు
గాయకుడు: బాలు



నా దైవం నువ్వే
ఎపుడూ, నా దైవం నువ్వే
ఆగకురా ఓ మనసా!
వీడకురా నీ ఆశ!

కాలం నేర్పిన పాఠమిది
జ్ఞానం చూపిన బాట యిది
మనసును నమ్మిన మానవుడే
చరితలు మార్చే నాయకుడు
నీ పలుకే నా ఉనికై, పయనించే వేళ...

అందలమొకటే జీవితమా?
అందిన సిరులూ శాస్వతమా?
మరణం ఆపని నీ యశమే
నిరతం నిలిచే యవ్వనము
అంతములేని సొంతమదే! అది నాకందించే...

గెలవకపోతేనేం, భయమా?
ఓటమి చూడనిదో జయమా?
మట్టిని తాకిన విత్తనమే
మానై పొందును చేతనము
రెమ్మ ఒడీ, కొమ్మ బడీ విడి సాగే వేళ...


ఈ పాట చదివిన వెంటనే నాకు అనిపించినదేమిటి అంటే, "ఈ పాటకు సినిమా మసాలా పడలేదు. మరీ ఉడకబెట్టి, ఉప్పూకారం చల్లిన కూరలాగా ఉంది". "సరే నిర్మలంగా వచ్చిన భావాన్ని ఎందుకు మార్చాలి ఇప్పుడు? మనం ఎలాగూ సినిమాకవులం కాదు కదా!" అని అనిపించి ఇలాగ వదిలేశాను.

పల్లవిలో "నా దైవం నువ్వే, మనసా!" అనడం నన్ను ఎరిగినవాళ్ళందరికీ కొంచెం జీర్ణించుకోవడం కష్టతరమైన విషయమే. ఎందుకంటే నేను దైవంతో ఎవరినీ/దేనినీ పోల్చను.నా దృష్టిలో, భౌతికమైనదేమైనా పరమాత్మకు ప్రతిరూపమవుతుందేమో కానీ, "ఏవార్థం" (నువ్వే) ఇవ్వదగినది కాదు. సినిమాలో ఇది ఒక యువకుడు కులమతాల గొడవలు లేకుండా ప్రపంచమంతా చక్కగా మారాలనే ఆశాభావంతో పాడతాడు. దానికి తోడు వైరముత్తు తన నాస్తికత్వాన్ని కొంచెం ప్రదర్శించాడు. సరే, సందర్భానుసారం అలాగే వ్రాద్దామని వ్రాశాను.

పల్లవిలో "ఆగకురా ఓ మనసా!" అంటూ మనసుని పుంలింగంలో సంబోధించడం వేటూరికి నేను అక్షరనివాళిగా సమర్పించుకుంటున్నాను. గోదావరి సినిమాలో ఆయన, "మనసా గెలుపు నీదేరా!" అనడం నాకు ఎంతగానో నచ్చింది. విశ్లేషించి చూసుకుంటే పాటలో చాలా వరకు సిరివెన్నెల శైలి కనబడుతోంది నాకు. అంటే ఆయనకు సమానంగా వ్రాశానని కాదు, నేను చెప్తున్నది శైలి గురించి. బహుశః నాకు సినిమాపాటల మీద ఇష్టం ఏర్పడటానికి కారణం ఆయనే కనుక ఇది జరిగి ఉండవచ్చును.

పాటలో ఏవార్థాలు (ఏ-కారం) ఎక్కువే పడ్డాయి. కానీ ఎక్కడా స్వరాలు/మాత్రలు కుదర్చడానికి వాటిని వాడలేదు అనే నా నమ్మకం. సరిచూసుకోవడానికి సంస్కృతంలోకి అనువదించుకుని/ఉన్న పద్యాలతో పోల్చి చూశాను. నాకు తప్పేమీ తోచలేదు. నువ్వే నా దైవం (త్వమేవ శరణం మమ), మానవుడే నాయకుడు/యశమే యవ్వనము (తన కోపమె తన శత్రువు), విత్తనమే-చేతనము (భూమ్యాం పతితం బీజమేవ వృక్షం భవేత్, అన్యత్ నైవ), పలుకే-ఉనికై (తవ ఆజ్ఞా ఏవ మమ జీవనం, అన్యత్ నాస్తి). ఏవార్థం గురించి ఇంత చాదస్తంగా ఎందుకు చూసుకుంటున్నాను అంటే, ఈ మధ్యన సినిమా పాటలు వినీ వినీ ఈ ఏ-కారం అంటే ఒక ద్వేషం ఏర్పడింది. ఆ మధ్యన ఎవరో, "ఏ?" అని అడిగారు ("ఏందుకు?" అని). "ఓరి నీ ఏ-కారం బంగారం కానూ, పదం లేకుండానే వాడి పారేస్తున్నారూ?" అనుకున్నాను. అంత విరక్తి కలిగింది.

Sunday, June 27, 2010

ముక్తపదగ్రస్తాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ముక్తపదగ్రస్తాలంకరము


లక్షణం: ఒక పాదం చివర వదిలిన పదాన్ని మరల రెండవ పాదం మొదటి పదంగాను, రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదం గాను, అలాగే మూడు, నాలుగు పాదాలు కూడా ఉంటే అది ముక్తపదగ్రస్తం అవుతుంది.

ముక్తము అంటే విడువబడింది, గ్రస్తము అంటే తీసుకోబడింది. ముక్తపదగ్రస్తము అంటే "విడిచిపెట్టిన పదాన్ని తిరిగి గ్రహించినటువంటి పద్యం". నాకు తెలిసినంతవరకు, ఇది ప్రతీపాదంలోనూ జరగాలని నియమం లేదు. ఈ అలంకారానికి ప్రత్యేకించి వివరణ అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ క్రింది ఉదహారణలో ముద్దగా దిద్దబడిన పదాలను చూస్తే విషయం అర్థమవుతుంది.

ఉదా: (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజ భూషణుడు)
సుదతీనూతన మదనా!
మదనాగతురంగ! పూర్ణమణిమయసదనా!
సదనామయగజరదనా!
రదనాగేంద్రనిభ! కీర్తి రస నరసింహా! (1)


ఉదా: (శ్రీవేంకటేశ్వర సుప్రభాతం రచన: అన్నన్ స్వామి)
లక్ష్మీ సువిభ్రమాలోక సుభ్రూవిభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం

ఉదా: (రచన:మల్లాది సాయికృష్ణ ప్రసాద్)  (2)
మారమ కనికరమా రమ
మారమణునకు చెప్పి మమ్ము మన్నింపనిచోన్


వాక్యాంతముక్తపదగ్రస్తము:

పాదం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి పాదంలో మొదట పదంగా వాడితే అది ముక్తపదగ్రస్తం. అలాగే వాక్యం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి వాక్యంలో మొదటి పదంగా వాడితే అది వాక్యాంతముక్తపదగ్రస్తము. (వాక్య: వాక్యం, అంత: చివర, ముక్త: విడిచిన, పద: పదం, గ్రస్తము: తీసుకోబడినది).

ఉదా: (వ్యాకరణాదర్శం, రచన: బూరుగుల గోపాలకృష్ణమూర్తి)
మారసుందర! సుందర! ధీరమూర్తి!
మూర్తిగతలోక! లోకప్రపూజితాంగ!
అంగ సంగత గంగ! గంగాంతరంగ!
విశ్వరక్షక! స్వామి శ్రీ వేంకటేశ!

ఇందులో "మూర్తి" అన్నది పాదానికే కాక, వాక్యానికి కూడా చివరన ఉంది. అదే పదంతో ఆ తరువాతి వాక్యం (పాదం కూడా) మొదలయింది. ఇక "లోక", "అంగ" (పూజితాంగ = పూజిత + అంగ), "గంగ" (గంగాంతరంగ = గంగ + అంతరంగ) కూడా వాక్యాలకు చివరన వచ్చి, ఆ తరువాతి వాక్యాలలో మొదట వచ్చాయి. అందుచేత ఇది వాక్యాంతముక్తపదగ్రస్తము.


వాక్యాంతముక్తపదగ్రస్తానికి చలనచిత్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు గుర్తున్నది ఇది ఒకటి:

ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
నలుగు పెట్టినకొద్దీ అలిగింది వయసు. వయసు అలిగినకొద్దీ వెలిగింది మనసు


(1) ఇక్కడి పద్యాలలోని పదాలను నేను సరిగ్గా విభజించానో లేదో తెలియడం లేదు. ఈ పద్యాలకు భావాలు మీకు పూర్తిగా అర్థమయితే వ్యాఖ్య ద్వారా నాకు వివరించగలరు.
(2) ఈయన నేను చదువుతున్న వ్యాకరణం పుస్తకానికి రచయిత.

Sunday, June 20, 2010

నన్ను పోలిన మనిషి

మన ఇళ్ళల్లో చాలా మంది, ఒక బిడ్డ పుట్టగానే వాడి పోలికలను పసిగట్టేస్తుంటారు. "ఆ ముక్కు చూడు, అచ్చం వాళ్ళ నాయినమ్మే" అని ఒకడంటే, "ఏడిశావు, వాడివన్నీ వాళ్ళ అమ్మమ్మ పోలికలే" అనేవాడు మఱొకడు. ice-creamలో ఆవకాయబద్దలాగా బిడ్డ పుట్టాడన్న ఆనందం పక్కనే, "మా పోలికలున్నాయని చెప్పే నాథుడెవడూ లేడా?" అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. "పూజారికి లేక పస్తులుంటుంటే భక్తుడొచ్చి పొంగలి అడిగాడు" అన్నట్టు మేనమామలు, మేనత్తలూ కూడా పోలికలలో వాటాకొస్తుంటారు. ఇన్నాళ్ళూ లోపల ప్రశాంతంగా ఉన్నాను, బయటకి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని ఆ బిడ్డకు అనిపిస్తుందేమో. దానికి ప్రతీకారంగా క్రమేపీ తన ఫ్యాన్సు అంచనాలకు అందకుండా పోలికలు మార్చేసుకుంటూ వెళ్తాడు/వెళ్తుంది. మొదట తండ్రి పోలిక అనిపించినవాడు, రెండు నెలలకు పూర్తిగా తల్లిపోలిక అనిపిస్తాడు. ఈ వేడుకంతా మా అన్నయ్యకు పిల్లాడు పుట్టినప్పుడు దూరం నుండి వీక్షించాను కానీ, మొదటిచెయ్యి అనుభవం  (first-hand experience) లేదు.

చిన్నప్పుడు "వీడికి మేనత్త పోలిక" అంటూ ఉండేవారు (ఆవిడా నా లాగే కొంచెం చామంచాయ, చాదస్తం - ఏ పని చేసినా (భోజనానికి కూర్చున్నా) మూడు సార్లు చెయ్యడం అలవాటు). ఇది పక్కన పెడితే, నాకు చిన్నప్పటినుండి ఎక్కడికి వెళ్ళినా, "అరే, అచ్చం మీలానే ఇంకోళ్ళను చూశానే" అనేవాళ్ళు తగుల్తూనే ఉన్నారు. మొదట్లో ఉత్సాహపడేవాడిని "హాయ్, నాలాగే ఇంకోడా? దొంగమొగుడు, రౌడీ అల్లుడు ఇత్యాది సినిమాల్లో చిరంజీవి లాగా నాకూ డూప్ ఉన్నాడు అన్నమాట" అనుకునేవాణ్ణి. (చిన్నప్పుడు మెము చిరంజీవి ఫ్యాన్సు. మా అమ్మమ్మ మాకు ఉత్తరం వ్రాసి చివర్లో, "చిరంజీవి దీపు బాగా చదువుకుంటున్నాడని ఆశిస్తున్నాను" అంటే, మా తమ్ముడు బనీన్ వేసుకుని, చొక్కా బటన్లు విప్పేసి, "చూడండిరా, అమ్మమ్మ కూడా చెప్పింది. నేనే చిరంజీవి. కావలిస్తే gang-leader సినిమాలో కూడా చిరంజీవి last తమ్ముడే, చూసుకోండి", అనేవాడు). క్రమేపీ ఆ ఉత్సాహం నిట్టూర్పుగానూ, ఆ నిట్టూర్పు చిరాకుగానూ, ఆ చిరాకు ఆందోళనగానూ మారాయి. అది ఏమిటి? ఎందుకు? ఎలాగ? అని అడక్కముండే చెప్పేస్తాను.

మొట్టమొదటిగా నాకు ఈ అనుభవం మంగలికొట్లో ఎదురయ్యింది. నేను వెళ్ళి క్యూ-బల్లపై ఈనాడు పత్రికలోని సినిమాశీర్షిక చదువుతూ కూర్చున్నాను. నా వంతు వచ్చేసరికి వెళ్ళి సింహాసనాధిరోహణం గావించాను. అక్కడ కత్తెర వెయ్యడానికి చెయ్యి లేపిన మంగలి ఒక్కసారి ఆగి, ఆ కుర్చి వెనక్కు తిప్పి, "బాబొ, మీకు మొన్ననే గాందా కట్టింగ్ సేసాను? మల్లీ ఇంత జుత్తెట్టొచ్చేసిందె?", అని అడిగాడు. మా ఎకనామిక్స్ క్లాసులోలాగా వెర్రిముఖమేసుకుని ఒకసారి వాడి మొహంకేసి చూశాను. "నువ్వెవరనుకుని అంటున్నావో కానీ, మా అమ్మ నన్ను కొడుతుందేమో అని భయమేసినప్పుడు తప్పితే నేను క్షవరం చేయించుకోను. నేను రెండు నెలలుగా అసలు మంగలినే చూడలేదు", అన్నాను. దానికి అతను, "ఓరోరె, ఐతే మీకులాంటోడికే నేను మొన్న కటింగ్ చేసానొ. ఆల్లు ఈ పక్కన సూరోల్ల యీదిలోనే ఉంటారు. మీరేడ ఉంటారేటి?" అంటూ ఇంక నా పుట్టుపూర్వోత్తరాలు, పూర్వతరాలు గురించి అడగడం మొదలు పెట్టాడు. అసలే కృష్ణుడికి నెమలిపించం పుట్టుకతో వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టు నా తలపైన జుత్తు దానంతట అదే నుంచుంటుంది. ఆశ్చర్యానికి లోనైన మంగలి ఏ కంగారు-లోనైన దాన్ని పురికొలుపుతాడేమో,"పురి విడిచిన నెమలి"-ని అవుతానేమోనని నా భయం సంగతి అటు ఉంచితే, అప్పటినుండి నాకు నా సరూపుణ్ణి చూడాలనే ఉత్సాహం మొదలైంది. అది ఎప్పుడూ జరుగలేదు.

ఆ తరువాత మేము తుని విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళాము. మధ్యలో ఏదో పని ఉండి తుని మళ్ళీ వెళ్ళాను. నా దారిని నేను పోతుంటే నాకు ఉడిపీ లక్ష్మీభవన్ కనబడింది. అది మా ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వుటేలు. మసాలదోశ మీద మనసుతో లోపలికి వెళ్ళాను. అక్కడ ఆ ఓనరు, "అప్పా, మీ నాన్నగారు రాలేదా?" అని అడిగాడు. చదువులకోసమని మా అన్నదమ్ములము అక్కడ ఉన్నాం తప్పితే మా నాన్నగారు తునిలో ఉన్నది తక్కువే. అందుచేత "ఇతనికి మా నాన్నగారు ఎలాగ తెలుసు", అనుకుంటూ, "రాలేదు. ఆయన ప్రస్తుతం బిసీగా ఉన్నారు" అని చెప్పి టోకెన్ కోసం నేను పదిరూపాయలు ఇచ్చాను. ఇస్తున్నానే కానీ మనసు వెనకాల ఎక్కడో, 'నాన్నగారు తెలుసంటున్నాడు. "మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేమప్పా" అని ఆ పది వెనక్కిచ్చేస్తాడేమో', అని అనిపించింది. కానీ, ఆల్-అవుట్ ఎడ్వర్టైస్మెంటులో కప్ప దోమని నాలుకతో కబళించినట్టు ఈ అప్ప నా చేతిలో ఉన్న పదినోటుని సంగ్రహించి టోకెన్ ఇచ్చాడు. సరే ఎవడిదో సొమ్ము మనకెందుకులే అనుకున్నాను. కాకపోతే చిక్కు ఎక్కడ వచ్చిందంటే, నేను దోశ తుంపుకుని చట్నీలో ముంచినప్పుడల్లా వాడు నా వంక చూసి చిరునవ్వులు చిందించడం మొదలెట్టాడు. ఆ దోశ వెనకాల ఇంకా మైసూరు బజ్జీ, సాంబార్వడ, పూరీ మొదలుగా కలిగిన పదార్థాలను తిందామనుకున్న నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించి సగం నిండిన మనసుతో (అంటే, కడుపు నిండింది అనుకోండి) బయటకు వచ్చేశాను. అక్కడికి నాకు నా సరూపుడంటే ఉత్సాహం పోయింది, చిరాకు వచ్చింది.

ఆ తరువాత వైజాగులో మా అన్నదమ్ములం ముగ్గురమూ ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ మరీ సినిమాలో చూసినట్టైంది. నాకు ఒకమ్మాయి ఎదురయ్యింది. ఆ అమ్మాయి గతంలో నాకు నచ్చిన మఱొక అమ్మాయిలాగా కనిపించడంతో ఒక్కసారి అలాగ కళ్ళార్పకుండా చూశాను. (తరువాత ఈ ప్రక్రియనే సైటు కొట్టడం అని పిలుస్తారని తెలుసుకున్నాను.) ఆ అమ్మాయి నా కళ్ళల్లో ఏం చదివిందో తెలియదు కానీ, నాకేసి చూస్తూ సిగ్గుపడటం మొదలెట్టింది. ఇంతలో నా ఆత్మా'రాముడూ', "ఏంటిది, నగర్రపౌరులు చూస్తున్నారు. ఒళ్ళు/కళ్ళు దగ్గరపెట్టుకో", అన్నాడు. నేను కాస్త తలతిప్పుకుని వెళ్ళిపోయాను. ఇంతలో అచ్చం మా అన్నయ్యలాగే ఉన్న ఒక వ్యక్తి నా కళ్ళెదురుగా వెళ్ళాడు. కాకపోతే అతనికి గెడ్డం ఎక్కువ ఉంది. మా అన్నయ్యకి, అతనికి కొంచెం ముఖకవళికల్లో భేదం ఉంది (సరిగ్గాచూస్తే గుర్తు తెలియడానికి వీలయినంత) అనుకుని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ అతను కారిడార్లోకి వెళ్ళాక నేను మా అన్నయ్యకి, తమ్ముడికి ఆ విషయం చెప్పాను. ముగ్గురం ఆలోచిస్తుండగా నా పక్కనుండి ఈ సరీ మరీ నాకు డూపులాగా ఉండేవాడు (పరిమాణంలో కూడా భేదం లేదు కానీ, కొంచెం గెడ్డం గీసుకుని నీట్ గా ఉన్నాడు) కనబడ్డాడు. ముఖమైతే shame to shame. అదే ఆవదం తాగి నవ్వుదామని ప్రయత్నించేవాడి ఫేసు. వాడూ నాకేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. "ఇది ఆసుపత్రా? మయసభా?", అనుకుని మేము ముగ్గురం ముక్కున వేలేసుకున్నాము.

ఇంతకీ ఈ గోలంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, నిన్న నేను మౌంటెన్ వ్యూలో, ప్యాసేజ్ టు ఇండియా బేకరీ అనే చోటుకు వెళ్ళాను. అక్కడ టోకెన్ ఇచ్చేవాడు కూడా, "మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందా?", అని అడిగాడు. నేను కొంచెం అనుమానంగా చూస్తూ, "లేదు", అన్నాను. వాడు, "మీ లాగే ఉండే ఒక పాప మా రెష్టారెంటుకు వస్తూ ఉంటుందండి", అన్నాడు. "ఆఖరికి నీ పోలికతో అమ్మాయి కూడా ఉందిరా శాండీ (నన్ను నేను పిలుచుకునే ముద్దుపేరు)", అనుకుంటుండగా, "Are you sure?", అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చి, "లేదు. ఆ అమ్మాయి నా కూతురే. వాళ్ళమ్మ మీద అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. నువ్వేమైనా ఫ్రీగా ఇంత ముద్ద పాడేస్తావా?", అని అడగాలనిపించింది. వాడు మళ్ళీ నా ముఖంలోకి డెంటిష్టు చూసినట్టు చూసి, "As it is. ఆ అమ్మాయి గలగలా మాట్లాడుతూ ఉంటుంది, చాలా చిలిపి పిల్ల.", అన్నాడు. ఇవి కచ్చితంగా నా పోలికలే. అందరూ నన్ను గలగల (పోనీ, లొడా లొడా) మాట్లాడుతున్నావని అంటారు. చిలిపిదనంలోనూ నాకు కొన్ని సెర్టిఫికేట్లు ఉన్నాయి. అప్పుడు నాకు కంగారు పట్టుకుంది. ఏవేవో ఆలోచనలు. "అమ్మోవ్, ఇదేమిటి పవిత్రబంధం (నాగేస్సర్రావుది) సినిమాలాగుంది? అసలే ఈవేళ పొద్దున్నే 'గాంధి పుట్టిన దేశమా ఇదీ?' అని పాడుకున్నాను కూడా. నేను నాలుగేళ్ళ క్రితం కూడా మౌంటెన్ వ్యూ వచ్చానాయె. ఇది కల కాదు కదా? ఇంకా నయం గరళ-ఫ్రెండ్ తో వచ్చుంటే గరళం తాగించేది. పెళ్ళాం తో వస్తే చెళ్ళుమనిపించేది. అన్నదమ్ములతో వస్తే అనుమానాలొచ్చేవి. friendsతో వస్తే బ్రతుకు facebook అయిపోయేది. మన అదృష్టం బాగుండి ఆ పిల్ల ఈ చుట్టు పక్కల లేదు. లేకపోతే విక్రమార్కుడు సినిమాలాగా అయ్యేదేమో!" - ఇలాగ అనేక ఆలోచనలు కలిగి ఆందోళన మిగిలింది. అప్పుడు వాడితో "అచ్చం నాలాగే ఉందా? ఉండే ఉంటుంది. మరి నా ఫేసు పరమబోరింగు ఫేసు కదా? ఎక్కడ పడితే అక్కడే ఉంటుందన్న మాట. నువ్వటు తిరుగమ్మ, కొంచెం అటు తిరుగు. అద్ది, అద్ది అలాగ నీ కంప్యూటర్కేసి చూడు. అలాగన్నమాట. నా లాగే ఉన్న అమ్మాయి. అచ్చం. మే బీ, ఆడం, ఈవ్-ల దగ్గర మొదలయిన వంశవృక్షంలో అందరికంటే పైకి ఉన్నది పొక్కునూరి వంశమేనేమో. అయ్యో! ఏది ఆ ఏప్లీస్ కాయేది? నేను ఇక్కడున్నాను ఏమిటి? అడవిలో ఉండాలి కదా? 'అహా నా డూపు అంటా, ఒహో నా డూపు అంటా, అహ నా డూపు అంట ఒహొ నా డూపు అంట, వాడు నేను సేమంట, నాకు మంట ఒళ్ళంత, ఢాం ఢాం ఢాం'" అని బ్రహ్మానందం స్టైల్లో అనాలనిపించింది. అయినా (వాడెదురుగుండా) నోరు మూసుకుని, భోజనం చేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఏమవుతుందో చూడాలి.

Saturday, June 19, 2010

యమకాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> యమకాలంకారము


లక్షణం: పౌనరుక్తేన ద్వయోర్వ్యంజేన యుగ్మయోః
అర్థం: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి, అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారము.

యమకం అంటే సంస్కృతంలో "జత" అని అర్థం. అదే అక్షరసమూహాన్ని రెండుసార్లు (లేక అంతకంటే ఎక్కువసార్లు) వాడుతున్నారు కాబట్టి యమకాలంకారం అయ్యింది.

వృత్త్యనుప్రాసలో అర్థం ప్రసక్తి లేదు. "అక్షరాలు పదే పదే వస్తున్నాయా? లేదా? ", అన్నదే ప్రశ్న. ఉదాహరణకి "భూషణములు సెవులకు బుధతోషణములనేక..." అని అన్నప్పుడు "షణములు" అనే అక్షరాల సమూహం మళ్ళీ వచ్చింది కానీ, "షణములు" అనే అక్షరసమూహానికి అర్థం ఏమీ లేదు. అలాగే,  "ష", "ణ, "మ", "ల" గుణింతాలలోని అక్షరాలు వరుసగా వచ్చాయి. లాటానుప్రాస అంటే అదే పదానికి తాత్పర్యభేదం ఉండాలి కానీ, అర్థభేదం ఉండకూడదు. యమకాలంకారానికి అర్థభేదం ఉండి తీరాలి.

ఛేకానుప్రాస అంటే అదే అక్షరసమూహానికి అర్థభేదం కలిగి, పక్కపక్కనే (అవ్యవధానంగా) రావాలి.  యమకాలంకారానికి పక్కపక్కన రావాలనే నియమం లేదు. అంటే, ఆ అక్షరసమూహం తిరిగి వచ్చేలోపు వేరే అక్షరాలు/పదాలు ఉండాలి.  ఉదాహరణకి "వంద వందనాలు" అన్నది ఛేకానుప్రాస అవుతుంది, "వందలకొలది వందనాలు" అన్నది యమకం అవుతుంది.


ఉదా: (చిత్రం:  సీతాకోక చిలుక, రచన: వేటూరి)
చుక్కా, నవ్వవే! నావకు చుక్కానవ్వవే

"ఓ చుక్కా, నవ్వవే" అంటే "ఓ నక్షత్రమా, నవ్వుమా!" అని. రెండోసారి "చుక్కానవ్వవే" అంటే "చుక్కాని + అవ్వవే" అని. పూర్వం నావికులు నక్షత్రాలను బట్టి దిశను గుర్తించేవారు. "చుక్కాని" అనేది పడవలో ఒక భాగం. నావకు దిశను చూపించడం దాని ఉపయోగం.  ఈ వాక్యంలో ప్రియుడిని తన జీవితానికి దిశను నిర్దేశించమని ఒక అమ్మాయి అడుగుతోంది. అందుకని కవి, రెండు వేర్వేరు ఉపమానాలతో అదే భావాన్ని వ్యక్తపరిచాడు. "చుక్కనవ్వవే" అనే అక్షరాలను తిరిగి వచ్చేలాగా వాడాడు కనుక, ఇది యమకాలంకారం అవుతుంది.


సినిమా పాటల్లో యమకాలంకారం విరివిగా వాడబడింది. నాకు తెలిసిన మరి కొన్ని ఉదాహరణలు.

ఉదా: (చిత్రం: శుభలేఖ, రచన: వేటూరి)
నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక

జడ-కుచ్చులు అంటే స్త్రీలు జడలోని అల్లిక. మెడకుచ్చులు = "మెడకు + ఉచ్చులు" .  అమ్మాయి జడలోని కుచ్చులు అబ్బాయి మెడను బంధిస్తున్నాయి (వాటి చక్కందనంతో కట్టిపారేస్తున్నాయి) అని భావం.

ఉదా: (చిత్రం: గమ్యం, రచన: సిరివెన్నెల)
విందడిగారే అందాలని, ముందుకు రారే అందాలని  (అందాలని: అందాలను(ద్వితీయావిభక్తి), అందాలి+ అని)
నిన్నొదిలి పోలేరమ్మ, ఓ పోలేరమ్మ (పోలేరమ్మ: పోలేరు + అమ్మ, పోలేరమ్మ (పేరు) )

ఉదా: (చిత్రం:  పౌర్ణమి, రచన: సిరివెన్నెల)
ఎపుడో కన్న తీపికల, ఎదురౌతుంటె దీపికల
శివనివేదనగవనివేదనగ పలికిన పదము పరేశ

ఈ ఉదాహరణలో వృత్త్యనుప్రాసకి, యమకానికి మధ్యలో భేదం సన్నగిల్లుతోంది. ఎందుకంటే,  "పికల"/"వనివేదనగ" అనే అక్షరసమూహానికి అర్థమే లేదు, ఇంక అర్థభేదమేమిటి?  అయినా దీనిని యమకంగా కొందరు చెప్పుకుంటారు. నా వరకు నాకు ఇది వృత్త్యనుప్రాస అనిపించింది.


సినిమావాళ్ళే ఇంతలా వాడారు అంటే మన పద్యకర్తలు విడిచిపెడతారా? పద్యకావ్యాలనుండి కొన్ని ఉదాహరణలు:

ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతం, రచన: పోతన)
(నరకాసురవధ)
లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితి? విటురా;
లే మాను మానవేనిన్,
లే! మా విల్లందుకొనుము లీలం గేలన్

"లే, మ " -- ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి. మఱొక్కటి:
(గోపికా వస్త్రహరణం)
మా, మా వలువలు ముట్టకు
మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు
మా మానసహరణ మేల మానుము కృష్ణా!

అది పోతన అంటే! తేనెల జలపాతం కదటండీ తెలుగు భాగవతం? అందుకే వేటూరి, "పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ్వాగోపాలుడు", అని అన్నాడు.


ఉదా: (విజయవిలాసం, రచన: చేమకూర వేంకట కవి)
మనసుభద్రమయ్యె మన సుభద్రకు

మీకు తెలిసిన యమకాలంకారప్రయోగాలు ఇంకా ఏమైనా ఉంటే వ్యాఖ్యల ద్వారా తప్పక తెలియజేయండి. ముఖ్యంగా నాకు తెలిసిన పద్యాలు తక్కువ. అందుచేత మీకు తెలిసిన పద్యాలు నాకు తప్పక తెలియజేయగలరు.

Sunday, June 13, 2010

లాటానుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> లాటానుప్రాసాలంకారము


లక్షణం: శబ్దార్థయోః పౌనరుక్త్యం యత్ర తాత్పర్య భేదవత్, సకావ్య తాత్పర్య విదాం లాటాను ప్రాస ఇష్యతే
అర్థం: శబ్దభేదం, అర్థభేదం లేకుండా అవే పదాలు తాత్పర్యభేదం కలిగి తిరిగి అవ్యవధానంగా ప్రయోగించటాన్ని లాటాను ప్రాస అంటారు

ఒక అలంకారం నేర్చుకునేటప్పుడు, ముందు నేర్చుకున్న అలంకారాలకీ దీనికీ గల వ్యత్యాసం గురించి ఆలోచించడం ముఖ్యం. అందుచేత మొదట లాటానుప్రాసకి, వృత్త్యనుప్రాసకి ఉన్న తేడా ఏమిటో చూద్దాము. వృత్త్యనుప్రాసలో "హల్లుల సమూహం" తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ హల్లు(ల)కు ఏ అచ్చు కలిసినా ఫరవాలేదు. "ఏకాకి కాకీక" లో ఐదు అక్షరాలు క-గుణింతంలోనివే. అది చాలు వృత్త్యనుప్రాసకి. "అర్థ భేదం ఉందా లేదా? పక్క పక్కనే వస్తున్నాయా లేదా?", వంటి విషయాల ప్రస్తావనే లేదు.

ఛేకానుప్రాసలో "అక్షరాల సమూహం" అన్నాము.
అంటే అవి "అర్థవంతమైన పదాలు కాకపోవచ్చును. ఉదాహరణకి "కర్నూలు నూలు" లో "నూలు" అన్నది మొదటి పదంలో భాగమైతే రెండో మాఱు పూర్తి పదం. ఇక్కడా అక్షరాలన్నాము తప్పితే హల్లులు అనలేదు. (అక్షరం = హల్లు + అచ్చు). "కోవెల కావలికాడు" అని అన్నామనుకోండి. అందులో కోవెల, కావలి - రెండింటిలోనూ అదే హల్లుల సమాహారం ఉంది (క, వ, ల). కాకపోతే అదే అక్షరసమూహం లేదు. అందుచేత అది ఛేకానుప్రాస కాదు. ఛేకానుప్రాసలో ఆ అక్షరసమూహం పక్కపక్కనే రావాలి, అర్థభేదం కూడా ఉండాలి.

లాటానుప్రాసలో "పదం" కలవాలి (అక్షరాల సమూహం కాదు). అంటే "ఆ రాధ ఆరాధన" అన్నది కుదరదు. "ఆ రాధ" అనే అక్షరాల సమూహం పక్క పక్కనే రెండుసార్లు వచ్చినా, అదే అర్థంతో రెండు సార్లు రాలేదు. అలాగే, "వగచి వగచి వేచా" అనే వాక్యంలో "వగచి" రెండుసార్లు ఒకే అర్థంతో వచ్చింది కానీ, ఆ మొదటి "వగచి" కి రెండో 'వగచి" కి తాత్పర్యభేదం లేదు. అందుచేత అది లాటానుప్రాస కాదు. తాత్పర్యభేదం అంటే ఏమిటి అనేది నిర్వచించడం కంటే ఉదహరించటం సులువు.


ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతంలోని ప్రహ్లాదోపాఖ్యానం, రచన: పోతనామాత్యుడు)
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ [పూర్తి పద్యం]

ఇక్కడ "కరములు" అనే పదం రెండు సార్లు పక్కపక్కనే అదే అర్థంతో వచ్చింది. కానీ తాత్పర్యంలో వ్యత్యాసం ఉంది. "కమలాక్షుణ్ణి అర్చించే కరములే నిజమైన కరములు" అని ఆ పాదంలోని భావం. మొదటి "కరములు" కి "చేతులు" అని తాత్పర్యం, రెండో "కరములు" కి "నిజమైన చేతులు" అని తాత్పర్యం. అందుచేత ఇది లాటానుప్రాస అవుతుంది. పోతన ఈ అలంకారాన్ని చాలా సందర్భాలలో వాడాడు.


ఉదా: (శ్రీమదాంధ్రమహాభాగవతంలోని కుచేలోపాఖ్యానం, రచన: పోతనామాత్యుడు)
హరిభజియించు హస్తములు హస్తములచ్యుతుగోరి మ్రొక్కుత, చ్చిరము శిరంబు చక్రథరు చేరిన చిత్తము చిత్తము [పూర్తి పద్యం]

ఇక్కడ కూడా మునుపుటి ఉదాహరణలాగే రెండోసారి "హస్తము/చిత్తము" అన్నప్పుడు నిజమైన/శ్రేష్ఠమైన హస్తము/చిత్తము అని అర్థం.


ఉదా: (కావ్యాలంకార సంగ్రహం, రామ రాజ భూషణుడు)
ఘనత నృసింహుజూడగల కన్నులు కన్నులు


సినిమాపాటల్లో ఈ అలంకారం నాకెప్పుడూ ఎదురవ్వలేదు. లీడర్ చిత్రంలో వేటూరి ఈ అలంకారాన్ని వాడిన పాట ఒకటి కారణాంతరాల వలన చిత్రంలో రాలేదని చిత్రదర్శకుడు శేఖర్ చెప్పారు. 

ఉదా: (చిత్రం: లీడర్, రచన: వేటూరి)
అనుభవాలను చెప్పి గుణగణాలను దిద్ది, అభయహస్తములిచ్చు అమ్మ అమ్మ


ఈ అలంకారానికి కూడా ఆ పేరు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పక చెప్పగలరు.

Friday, June 11, 2010

చిట్టికథ - అన్ని విద్యలనీ గౌరవించాలి

(ఈ కథకు మూలం ఏమిటో నాకు తెలియదు. పెద్దలనుండి విని చెప్తున్నదే. అందుచేత ఏమైనా తప్పులుంటే చెప్పగలరు. ఈ వ్యాసం ఏదో ఒక శాస్త్రాన్నో, విద్యనో, ఎవరో ఒక వ్యక్తినో, సమూహాన్నో విమర్శించడానికో, కించపరచడానికో వ్రాయలేదు. ఎక్కడైనా పొరబాటు కనిపిస్తే తప్పక తెలియజేయగలరు. నేను వెంటనే సవరిస్తాను.)

పూర్వం ఒక బ్రాహ్మడు పొరుగూరుకెళ్దామనుకున్నాడు. దానికి ఒక నది దాటాల్సివచ్చింది. ఆ నది మీద పడవ నడిపే వాడు (రేవుబోయ) ఒకడు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు అతడిని తన పడవలో నది దాటించమన్నాడు. ఆ బోయ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి పడవలో నది మీద సాగుతున్నారు.

 ఇంతలో బ్రాహ్మడు ఆ బోయని, "ఏమయ్యా, నువ్వు భాగవతం చదివావా?" అని అడిగాడు. ఆ బోయ, "అబ్బే నాకు చదవడం రాదు సాములు", అన్నాడు. దానికి ఆ బ్రాహ్మడు నివ్వెరబోయి, "అయ్యో, ఐతే నీ జీవితంలో సగభాగం వృథా చేసుకున్నావయ్యా", అన్నాడు. ఆ బోయ "అయ్యో" అన్నట్టు చూశాడు. అప్పుడు బ్రాహ్మడు, "పోనీ మహాభారతం విన్నావా?", అని అడిగాడు. "లేదు సాములు", అన్నాడు బోయ. దానికి ఆ బ్రాహ్మడు మరింత ఆశ్చర్యపోయి, "మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. మహాభారతంలో ఉన్నవన్నీ ఈ ప్రపంచంలో ఎక్కడో జరుగుతూనే  ఉంటాయి. అది వినకపోవడం నీ దురదృష్టం", అన్నాడు. మళ్ళీ బోయ కించిత్ బాధపడ్డాడు. ఆ తరువాత బ్రాహ్మడు, "కనీసం రామాయణం తెలుసునా?" అన్నాడు. అది కూడా తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు బోయ. దాంతో బ్రాహ్మడు "అయ్యయ్యో, అఙ్ఞానంతో నీ జీవితాన్ని నదికి, పడవకి అంకితం చేసుకోకు, ఇవన్నీ తెలియని జన్మ నిరర్థకం", అన్నాడు.

కొంతసేపు ఆగి ఆ బోయ "సాములు, మీకు ఈత వచ్చా?" అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మడు, "ఈతదేముందయ్య? అది నీళ్ళను ఈదడానికే పనికొస్తుంది. భవసాగరాన్ని ఈదడానికి పనికిరాదు", అన్నాడు. బోయ, "ఐతే గొప్పచిక్కొచ్చిపడింది సాములోరు. నది పోటెత్తుకుంది. ఇంకాసేపటిలో పడవ పగిలిపోతుంది. అప్పుడు నది ఈదుకొని దాటాలి. నాకు ఈత వచ్చు. మీకు రాదాయె!", అన్నాడు. ఒక్కసారిగా ఆ బ్రాహ్మడు "అమ్మో, ఇప్పుడెలాగ? నన్నెలాగైనా కాపాడు బాబు. నీకు దండం పెడతా!", అని ఆ బోయని వేడుకున్నాడు.

కథ అంతే! ఈ కథ వినగా నాకు స్ఫురించిన విషయాలు చెప్పదలుచుకున్నాను. అవి:

1. నిజంగా భవసాగరంలో చిక్కుకుపోయిన బోయని చూసి బ్రాహ్మడు జాలిపడితే, వాడికి పనికొచ్చే రెండు మంచిముక్కలు ("బాబూ, రామాయణంలోని నీతి చెప్తాను, విను" అనో, "హరినామస్మరణ మహత్మ్యం తెలుసుకో", అనో) చెప్తే బాగుండేది. అంతే కానీ, అవతలవాడి విద్యనో, వృత్తినో తక్కువ చేసి మాట్లాడటం తప్పు. ఎవరి ధర్మం వారిది. అన్నీ వృత్తులూ ఉండబట్టే ఈ భౌతికప్రపంచం సాగుతోంది కదా?

మనం కూడా ఇంజినీరింగు కాలేజీలలో చూస్తూ ఉంటాము, "అరే నీది ఫలానా బ్రాంచా? ఎందుకురా? కంప్యూటర్ సైన్సో, ఎలెక్ట్రానిక్సో తీసుకోవచ్చును  కదా?", అని అంటూ ఉంటారు. వాళ్ళల్లో, "సరే, నాకు ప్రోగ్రామింగ్ నేర్పుతావా?", అని అడిగితే నేర్పేవాళ్ళెంతమంది. అది కూడా ఈ బ్రాహ్మడి జాలి/విఙ్ఞానం వంటిదే!

2. నిజంగా అంత భవసాగరాన్ని ఈదేటువంటి విఙ్ఞానం, స్థితప్రఙ్ఞత ఉన్నవాడే ఐతే అట్టి ప్రమాదంలో భగవంతుణ్ణి ధ్యానించాలి, ప్రాణభయం లేకుండా చెయ్యగలిగినదేదో తెలుసుకోవాలి, గత్యంతరం లేకపోతే పరమాత్ముడిపై ధ్యానాన్ని నిలిపి "నీవే దిక్కు" అనాలి (గజేంద్రమోక్షంలో లాగా) కానీ, వెంటనే కంగారు పడితే "చదివిందంతా నాలుకపైనే ఉంది, మనసులోకి వెళ్ళలేదు" అని అర్థం.

ఇది కూడా మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాము. కొంతమంది "ఆర్ట్ ఆఫ్ లివింగ్", "పర్సెనాలిటీ డెవెలప్మెంట్" వంటి కోర్సులు చేస్తూ ఉంటారు. వారికి శమము ఆ కోర్సులో ఉన్నంతసేపే ఉంటుంది కానీ, ఆ తరువాత కనబడదు. గతంలో నేను కూడా భగవద్గీత పదే పదే చదివుతూ, తలుచుకుంటూ ఉండేవాడిని కానీ చిన్న విషయాలకు కూడా కోపపడేవాడిని. ఒక రోజు మా తమ్ముడు నాతో అన్నాడు, "ఇంత చిన్న విషయాలకు కూడా కోప్పడితే ఇంక నువ్వు చదివిన భగవద్గీత నీకేమి మప్పిందిరా అన్నయ్య?", అని. అప్పటినుండి కొంత శాంతం అలవరుచుకున్నాను.

Saturday, June 5, 2010

దర్శకులు జంధ్యాల గారి తిట్లదండకం

నాకు జంధ్యాల అంటే అపారమైన గౌరవం, అభిమానం. హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో దాదాపు అన్నింటిలో హాస్యానికే పెద్దపీట వేశారు. అంతే కాక అటు విశ్వనాథ్ వంటి కళాతపస్వికి, ఇటు రాఘవేంద్ర రావు వంటి కమర్షియల్ దర్శకుడికీ కూడా సంభాషణలు (dialogues) వ్రాసి పెట్టారు. శంకరాభరణమైనా, వేటగాడైనా చెల్లింది వేటూరికే అంటారు కానీ, జంధ్యాలకి (గాయకుడు బాలుకి కూడా) చెల్లిందన్నది నిర్ద్వంద్వమైన నిజం.

జంధ్యాలగారు దర్శకత్వం వహించిన "ష్...గప్..చుప్" అనే చిత్రం చిత్రం పెద్ద హిట్టవలేదన్నట్టు గుర్తు. ఆ చిత్రానికి సాహిత్యం అందించినది వేటూరి, జొన్నవిత్తుల. ఇద్దరికిద్దరు చక్కని తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూ వ్రాసేవాళ్ళే! అందులోనూ జంధ్యాల, ఆయన చిత్రాల్లో సాహిత్యానికి చాలా ప్రాముఖ్యతను కల్పిస్తారు. అందుకే ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగుంటాయి. నాకు ప్రత్యేకించి నచ్చినవి మాత్రం సరదా పాటలే! "లోకాన రైలుబండి చికుచికు అంటుంది" అనే పాట మా ఇంటిల్లిపాదికీ ఇష్టం. అలాగే అందులో జంధ్యాల ఒక తిట్లదండకాన్ని ప్రయోగించారు. వ్రాసింది జంధ్యాలో, వేటూరో, జొన్నవిత్తులో తెలియదు కానీ, మంచి సరదాగా ఉంటుంది. అది ఇక్కడ వ్రాస్తున్నాను.

ఈ దండకానికి సందర్భం ఏమిటంటే, ఒక bankలో ఉద్యోగస్థులందరూ కలిసి రాజమండ్రి గోదావరి తీరానికి picnicకి వెళ్తారు. అక్కడ "పాపికొండల్లో తిరిగే కొండపాపులు" కొందరు వారిని gunలతో బెదిరించి వారిని ఆటపాటలతో అలరించమన్నప్పుడు వారందరూ చేసే విన్యాసమే ఈ దండకం. ఈ సరదాప్రయోగాన్ని మధ్యమధ్యలో కొన్ని ఆంగ్లపదాలను తగిలించి, "దండకం" అనే ఛందోరీతిలో, తమాషాగా వ్రాశారు. గతంలో ఆరుద్రగారు "దోమ" మీద, దండకం వ్రాస్తూ "నువ్వేమి ట్రాన్సిస్టరా? లేక దాన్సిస్టరా?" అని వ్రాయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది కూడా అదే పంథాలో ఉంటుంది.

ఈ ప్రయోగం సరదాకి మాత్రమే కాని మన సంస్కృతినో, ఛందస్సునో అవమానించడానికి కాదన్నది పాఠకులు గమనించాలి.


ఒరేయ్ త్రాపి, మహాపాపి, కురూపి, నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ,
ముండమోపి, జిరాఫీ, నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపి
అంకఛండాలుడా, బంకబధిరాంధుడా, పరమపాపిష్ఠ నికృష్ట దుష్టాత్ముడా,
నీ నీచరూపంబు చూడంగ పాపంబు, నీ కంఠనాళంబు కక్కోసు గొట్టంబు,
నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ పల్కులే చెత్త,
నీ జన్మ డ్రైనేజీ, నువ్వో దగుల్బాజీ, ఏబ్రాసి, ఛెప్రాసి, సన్నాసివీ
అశుద్ధస్వరూప అబద్ధప్రలాప, పింగు బొంగైన పింజారిగా,
కుత్తేకా బచ్చా, కొవ్వెక్కిన లుఛ్ఛ, పగిలేను నీ పుచ్చ, తీరేను నా కచ్చ, నీ చేతికేవచ్చు చిల్లిబొచ్చ నిక్కచ్చిగా
భ్రష్టాతిభ్రష్టా, పరాకాష్టకెళ్ళావు, దుష్టత్వమందున్ ముదనష్టుడా త్రాష్టుడా,
కుష్టుముష్టోడి అంగుష్టమా, వృద్ధక్షయరోగి ఉఛ్ఛిష్టమా
ఒరేయ్ పళ్ళపిచ్చి (?), అరేయ్ చిల్లిగోచి, నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను, పెంటచ్చిగా, పెన్-టచ్చిగా (pen-touchగా)
ఒరేయ్ పాచిముఖమా, నడుస్తున్న శవమా, వేడి ఇడ్లీలు పారేయుచున్, చద్ది సాంబారు తెగత్రాగు సోంబేరిగా
పెద్ద ఇడియట్టువి, చద్ది పెసరట్టువి, పిచ్చి టేష్టున్న శ్యాడిష్టువి,
గజ్జిపాదాల మరుగుజ్జువి, ఉఛ్ఛనీచాలు లేనట్టి రాస్కేలువి, తేలువి (?)
ఒరేయ్ అక్కుపక్షి, నిరక్షరకుక్షి, కుంఖాక్షి (?), ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా
నువ్వు చుంచెలుక గొద్దెవి, రాబందు రెట్టవి, బొద్దింక కేశానివి
సీంపంది మూతివి, గబ్బిలం తోకవి, ఏకాకి కాకీకవి, న్యూసెన్సు డాంకీవి, నో-సెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవి
మున్సిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి, ఎద్దు మొండానివి, సృష్టిమొత్తంబులో శుంఠవి,
ఒరేయ్ పేడతట్టా, అరేయ్ చెత్తబుట్ట, ఒరేయ్ గడ్డిపోచా, అరేయ్ నారపీచా
ఒరేయ్ తుప్పుమేకా, అరేయ్ పందితోకా, ఒరే వానపాము, ఇలా తొక్కుతాము
ఒరేయ్ గౌడుగేదె, ఇదే బడితపూజ, సెంటిమెంటన్నదే లేని ప్రెంటాసురా(?)
నిన్ను తిట్టంగ నేనెంతవాడన్ దురాత్మ, ఏడేడు లోకాలకే భాషలకె శోషొచ్చి మూర్ఛిల్లురా
మహాబండబూతులు తలల్వంచు నీ ముందు పాపాత్ముడా
రావరావో బోడివెధవా, రావ రావొ అంట్లవెధవా, రావ రావో చచ్చువెధవ (?)
వెధవన్నరెధవా, ముప్పావు వెధవా, పరిపూర్ణవెధవ
చావరా, చావరా, చావు చావు, థూ!


(?) అని ఉన్న చోట నాకు సరిగ్గా వినబడలేదు. మీకెవరికైనా అర్థమైతే తప్పకుండా టీకాతాత్పర్యసహితంగా చెప్పండి. ఈ దండకాన్ని సచిత్రంగా ఇక్కడ చూడవచ్చును.

విశేషమేమిటంటే కవి ఎవరో కానీ శబ్దాలంకారాలని, ఉపమాలంకారాన్ని చాలా ఘనంగా వాడారు. "పెంటచ్చిగా, pen-touchగా" అని ఛేకానుప్రాస, "ఏకాకి కాకీకవి" మొ. వృత్త్యనుప్రాస నాకు బాగా నచ్చాయి. ఇంక జంధ్యాల చిత్రాల్లో ఉపమానాలకు లెక్కేముంది? wash-basinలో చేపలు పట్టుకునేవాడా, మిట్టమధ్యాహ్నం ఎండలో వేణ్ణీళ్ళతో స్నానం చేసి రగ్గు కప్పుకుని పడుకునేవాడా, జిగటవిరేచెనాలు పట్టిన జిరాఫీ మొ. ఆయన ఎన్నో వాడారు. పరమభయంకరమైన తిట్లను కూడా సరదాగా వినబడేలాగా చేశారు. మొత్తానికి ఎన్నిసార్లు విన్నా నవ్వొచ్చేటువంటి సరదాపాట ఇది.

ఛేకానుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ఛేకానుప్రాసాలంకారం


లక్షణం: భవేదవ్యవధానేన ద్వయోర్వ్యంజన యుగ్మయోః
అర్థం: రెండుగానీ, అంతకంటె ఎక్కువగానీ ఉన్న హల్లుల జంటలు అర్థభేదం కలిగి, వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఛేకానుప్రాసాలంకారమవుతుంది.

కనీసం రెండు "అక్షరాల సమూహం", "వేర్వేరు అర్థాలతో", "పక్కపక్కన (మధ్యలో మరేమీ ఉండకూడదు)" వాడితే అది ఛేకానుప్రాస అవుతుంది. ఉదాహరణలు చూద్దాము.


ఉదా: (చిత్రం: సప్తపది రచన: వేటూరి)

1. ఆబాలగోపాలమా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ తాండవమాడిన సరళి

ఇక్కడ "అచ్చెరువున" అనే పదం రెండుసార్లు మధ్యలో వేరే అక్షారాలు లేకుండా వచ్చింది. మొదటి అచ్చెరువున అన్న పదానికి "ఆ చెరువున" (త్రికసంధి) అని అర్థం. రెండోసారి అచ్చెరువున అన్నప్పుడు "ఆశ్చర్యంతో" (అచ్చెరువు అన్నది "ఆశ్చర్యాం" యొక్క వికృతిశబ్దం) అని అర్థం. అంటే ఆ వాక్యం భావం "కాళిందు చెరువులో ఉన్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూశారు" అని. ఇది ఛేకానుప్రాస.

ఇందులోనే "ఆబాలగోపాలమా బాలగోపాలుని" అన్నది ఛేకానుప్రాసలాగా కనిపిస్తున్నా - కాదు! ఎందుకంటే, "అబాలగోపాలము" "ఆ బాలగోపాలుని" మధ్యలో రెండు అక్షరాల భేదం ఉంది. ఇది వేరే (యమకం) అలంకారమవుతుంది. ఆ అలంకారాన్ని చర్చించుకునేటప్పుడు వివరిస్తాను.

2. మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

"ఆ రాధ" అంటే "రాధమ్మ" అని, "ఆరాధనాగీతి" అంటే ప్రేమగీతం అని అర్థం. ఇక్కడ "ఆ రాధ" అన్న అక్షరాల కలయిక రెండుసార్లు పక్కపక్కనే వచ్చింది. ఇది ఛేకానుప్రాస. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఈ రెండు "ఆరాధ" అనేది అర్థవంతమైన పదం కాదు. మొదటి సారి అది రెండు పదాల కలయిక అయితే, రెండో సారి అది ఒక పదంలో భాగం మాత్రమే! అయినా ఫరవాలేదు. అందుకే సూత్రంలో "రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలసమూహం" అన్నాం తప్పితే "పదం" అని అనలేదు.


ఉదా: (చిత్రం: సూత్రధారులు రచన: (బహుశా) సినారె)

1. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వంద వందనాలు

"వంద వందనాలు" అన్నప్పుడు మొదటి "వంద"కు "నూరు" అని అర్థం అయితే రెండో "వంద", "వందనములు" అనే పదంలోని భాగం. రెండింటి మధ్యనా వేరే అక్షరం లేదు కనుక ఇది ఛేకానుప్రాస.

2. సన్నాయి సొరమెక్కి చిన్నారి బసవన్న చెన్నార చిందాడ, కన్నార కన్నార?

ఇక్కడ మొదటి "కన్నార" కి "కన్ను + ఆర" అంటే "కళ్ళ నిండుగా" అని అర్థమైతే, రెండో "కన్నార"-కి "చూశారా?" (ప్రశ్నార్థకం) అని అర్థం. వాక్యానిలో భావం, "బసవన్నని కళ్ళ నిండుగా చూశారా?" అని.


ఉదా: (చిత్రం: సీతారాముకళ్యాణం రచన: (బహుశా) సముద్రాల రాఘవాచార్య)
సర్పభూషితాంగ, కందర్పదర్పభంగ

"కందర్పుడు" అంటే "మన్మథుడు". "దర్పము" అంటే "గర్వము" అని అర్థం. ఈ పదానికి అర్థం "మన్మథునికి గర్వభంగం చేసినవాడా" అని.


ఉదా: (చిత్రం: కోకిల రచన: వేటూరి)
ఈ పట్టుకోకట్టుకోవాలమ్మో, ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో

ఉదా: (చిత్రం: రాజకుమారుడు రచన: వేటూరి)
చుక్కలలో చక్కదనం దాచినదానా, ఎలాగైనా లాగెయ్-నా? ఏదో చెయ్-నా? దోచైనా?

ఈ ఉదాహరణ బహుశా సరైనది కాకపోవచ్చును. ఎందుకంటే "లాగైనా" కి "లాగెయ్-నా" కి తేడా ఉంది. కాకపోతే శబ్దాలంకారము అంటే శబ్దాన్ని ఎలాగ వింటాము అన్నదాన్ని బట్టి కాబట్టి ఛేకానుప్రాసకు ఉండాల్సిన స్ఫూర్తి దీనికి ఉంది అని నా నమ్మకం.


ఉదా: (పోతనామాత్యుల శ్రీమద్భాగవతం)
అరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము [పూర్తి పద్యము]

కవి కృష్ణపరమాత్ముడి శరీరాన్ని వర్ణిస్తున్నాడు. కృష్ణుడి మెడను (గళము) శంఖంతో పోల్చాడు. "కంబుసౌందర్య మంగళము" అంటే "శంఖం వంటి సౌందర్యము కలిగి శుభదాయకమైనది" అని అర్థం.


* ఈ అలంకారానికి కూడా ఈ పేరు ఎందుకు వచ్చిందో ఊహించగలుగుతున్నాను కానీ, గురువు/పుస్తకం ద్వారా తెలుసుకోలేదు. ఎవరైన విషయఙ్ఞులు ఉంటే తప్పక చెప్పగలరు.

Thursday, June 3, 2010

వృత్త్యనుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> వృత్యనుప్రాసాలంకారము


లక్షణం: ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే
అర్థం: ఒకటి, రెండు మొదలైన హల్లులను పెక్కుసార్లు ఆవృత్తి చేయుట వృత్త్యనుప్రాస అనబడును

వృత్త్యనుప్రాసాలంకరాము అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే వస్తూ ఉండటం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే హల్లు ప్రధానం కానీ, అచ్చు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానో ఈ క్రింది ఉదాహరణ తరువాత తెలుస్తుంది:

ఉదా: (చిత్రం: స్వాతికిరణం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
క్షాధ్వరశిక్షాదీక్షాక్ష! విరూపాక్ష! నీ కృపావీక్షణాపేక్షితప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష క్ష యను ప్రార్థన వినర!

ఇక్కడ "క్ష్"తో వృత్త్యనుప్రాస కూర్చబడింది. ఇక్కడ ముద్దగా (bold) దిద్దబడిన అక్షరాలన్నిటిలోనూ "క్ష్" ఉంది. చూశారా "క్ష్" వేర్వేరు అచ్చులతో కలిసి మళ్ళీ మళ్ళీ వచ్చింది. దక్ష లో "క్ష" గ ఉంటే "ఉపేక్షిత" లో "క్షి" ఉంది. అచ్చులు (అ, ఇ) వేరే అయినా హల్లు ఒకటే. అది చాలు వృత్త్యనుప్రాసకి.


వృత్త్యనుప్రాసలో వాడే అక్షరానికి ఏదైనా ఒక చోట, ముందు అక్షరంలో పూర్ణబిందువు (సున్నా) ఉంటే అది అన్ని చోట్లా ఉండాలి.  ఈ క్రింది ఉదాహరణ చూడండి:

ఉదా: (చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్యం, రచన: వేటూరి)
ఉత్తుంశబరిగిరిశృం, నిత్యనిస్సం, మంళాం, పంపాతరం, పుణ్యానుషం, మునిహృదయజలజభృం!

ఈ ఉదాహరణలో ముద్దగా చూపిన "గ"-ల ముందు అక్షరాల్లో పూర్ణబిందువు ఉంది.


వృత్త్యనుప్రాస ఒక అక్షరంతోనే కాక రెండు, లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలతో కూడా కలపచ్చును. మన తెలుగుసాహిత్యంలో ఏకంగా మూడు అక్షరాలతో వృత్త్యనుప్రాసను ప్రయోగించిన మహాకవులున్నారు.

ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా తగిలే లేమంచులా!

ఇక్కడ "చ", "ల" అనే రెండు హల్లులూ మళ్లీ మళ్ళీ వచ్చాయి. అందుచేత ఇది కూడా వృత్త్యనుప్రాస అవుతుంది - కాకపోతే రెండు అక్షరాలతో.


మరిన్ని ఉదాహరణలు:

ఉదా: (కీర్తన: కృష్ణం కలయసఖి సుందరం, రచన: శ్రీ నారాయణతీర్థులవారు)
కృష్ణం గత విషయ తృష్ణం, జగత్ప్రభ విష్ణుం, సురారిగణజిష్ణుం

ఉదా: (చిత్రం: సితార, రచన: వేటూరి)
జిలిబిలి పలుకు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కికి నగవు వపులు చిలికిన ఓ మైనా మైనా


శ్రీహరి అలంకారప్రియుడు కదా? మరి మన పోతనామాత్యుడు ఊరుకుంటాడా? శ్రీమదాంధ్రమహాభాగవతములో లేని అలంకారమంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో? అందులోని కొన్ని వెన్నముద్దలు.

సీ: (ప్రహ్లాదోపాఖ్యానం)
మందారకరందమాధుర్యమునదేలు ధుపమ్మువోవునే దనములకు [పూర్తి పద్యం]

తే: (కుచేలోపాఖ్యానం)
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు [పూర్తి పద్యం]

కం: (గజేంద్రమోక్షం)
అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!

పోతనామాత్యులు ఈ పద్యాన్ని నకారంతో ఒక అనుప్రాస, డకారంతో ఒక అనుప్రాస - రెండు తీగెలు అల్లుకుంటున్నట్టుగా అల్లుతూ వ్రాశారు. ఈ పద్యంలోని తరంగాల వేగాన్ని అందుకోలేక దాదాపు internetలో అందరూ (నాతో సహా) ఎక్కడో ఒక చోట తప్పు వ్రాశారు. ఇక్కడ ఉన్నదాంట్లో ఏమైనా తప్పుంటే సవరించగలరు.

ఈ పద్యంలో మరో విశేషం ఏమిటంటే ఒక కందపద్యం అనివార్యం అయిన చోట్ల తప్ప అన్నీ లఘువులతోనే వ్రాశారు.

కం: (రుక్మిణీకల్యాణం)
భూషణములు సెవులకు బుధ
తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్.

ఇక్కడ చూశారా? ప్రతీ పాదంలో రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరాలన్నీ "ష", "ణ", "మ", "ల" గుణింతాలనుండీ వరుసగా వచ్చాయి. అంటే నాలుగు అక్షరాలతో వృత్త్యనుప్రాస నడిపించాడు మహనీయుడు పోతన!


* ఈ అలంకారానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకూ నిర్దిష్టంగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే వ్యాఖల పెట్టెలో వ్రాయండి. అప్పుడు నేను వ్యాసాన్ని సరిచేస్తాను.
* ఈ క్రింది వ్యాఖ్యలలో కిరణ్ (.C)  చక్కని ఉదాహరణలని వివరణలనీ ఇచ్చాడు. తప్పకుండా చూడండి.
* శ్రీయుతులు వేదుల బాలకృష్ణమూర్తిగారు ఈ క్రింది లంకెల్లో లంకెబిందెలకంటే విలువైన పోతనపద్యాలను పొందుపరిచారు. సాహిత్యాభిలాషులు తప్పక చదవవలసినవి ఈ పద్యాలు: రుక్మిణీకల్యాణం; కుచేలోపాఖ్యానం.

తెలుగు వ్యాకరణం - అలంకారాలు

ఈ మధ్యన బొత్తిగా నేను తెలుగు వ్యాకరణం మరిచిపోతున్నాను అనిపించింది. అసలే వచ్చింది చిటికెడు. ఆ కాస్తా కూడా మరిచిపోతే ఇంకేముంది? అందుకే ఒకసారి వ్యాకరణం మళ్ళీ గుర్తుచేసుకుందాము అని "తెలుగు వ్యాకరణము" పుస్తకం చదువుతున్నాను. "బానే ఉంది. అది బ్లాగులో వ్రాయడం దేనికయ్యా?" అంటున్నారా? ఏమీ లేదండి, ఈ మధ్యన బ్లాగులు చూస్తుంటే కవిత్వం వ్రాయాలన్న తపన, ప్రఙ్ఞ, కనబడుతున్నంతగా భాష మీద పట్టు కనబడట్లేదు. సరే ఈ వ్యాకరణాంశాలన్నీ ఒక చోట వ్రాస్తే ఔత్సాహికకవులకు కూడా ఉపయోగపడతాయి కదా అని. నాకు తెలుగు ఆట్టే రాదు. సంస్కృతమైతే మరీ తక్కువ. అందుచేత తప్పులు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కడైనా నేను తప్పు వ్రాస్తే సవరించగలరు.

కవిత్వానికి సంబంధించి, ఛందస్సు గురించి ఇదివరకే సంకా రామకృష్ణ గారు మంచి వ్యాసాన్ని వ్రాశారు. అది చూస్తూనే నేను నెమ్మదిగా కందాలు, ఆ పైన గీతాలు, సీసాలు వ్రాశాను. ఈ రోజుకీ నాకు ఏమైనా సందేహం ఉంటే ఆ వ్యాసాన్నే చూస్తాను. కవిత్వానికి సంబంధించిన మరో చక్కని అంశం అలంకారాలు. అలంకారాల గురించి internetలో ఎక్కడా సమగ్రమైన వ్యాసాలు కనబడలేదు. అందుకే వాటి గురించి చర్చించాలని ఈ శీర్షిక మొదలుపెడుతున్నాను. వ్యాకరణం అనగానే అదేదో "మనకు పనికిరాదులే" అనుకునే వాళ్ళకు తెలియనిదేమిటంటే వారికి తెలియకుండానే రోజూ ఏవో అలంకారాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి క్రికెట్ ఆటగాడు బంతిని కొట్టిన తీరుని వర్ణిస్తూ, "ఆ బంతి ఇంక రాదు" అనుకుంటాము. నిజానికి ఆ బంతి వెనక్కొస్తుంది. కాకపోతే అతడు అంత బలంగా కొట్టాడు అన్నది వ్యక్తపరచడానికి మనం ఆ మాట అన్నాము. దీన్నే అతిశయోక్తి అలంకారం అంటారు. అలాగే మిగిలిన అలంకారాలు కూడా రోజూ మనం ఎక్కడో వింటుంటాము అన్నది తెలియడానికి నేను వీటికి ఉదాహరణలుగా తెలుగు (సినిమా) పాటలను చెప్తాను. చక్కని పద్యం దొరికితే మాత్రం చెప్పక మాననండోయ్. ఎంతైనా సినిమా పాట T20, పద్యం టెస్ట్ మ్యాచ్.

"అలంకారము" అంటే మీకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే "కవిత్వానికి అందం తెచ్చేదాన్ని అలంకారం అంటాము" (కావ్యశోభాకరాన్ ధర్మానలంకారాన్ ప్రచక్షతే). అలంకారాలు రెండు విధాలు - శబ్దాలంకారాలు (శబ్దం ప్రధానంగా ఉండేవి), అర్థాలంకారాలు (అర్థం ప్రధానంగా ఉండేవి). వీటిని వీలైనప్పుడు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. మీ విమర్శలు, సలహాలు, సూచనలు, వ్యంగ్యాలు, వెటకారాలు ఏమైనా ఉంటే నిస్సందేహంగా వ్యాఖ్యానించండి.